S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాయస న్యాయం

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
**
బారెడు పొద్దెక్కింది. రెండు రోజుల నుండి ముసురుపట్టి, ఈదురు గాలుల్లో పల్లెనంతా అతలాకుతలం చేస్తోంది. వరిగడ్డీ, తాటాకులు కప్పిన పాక అది. చూరుకు పేర్చిన తాటాకు కొసల్లోంచి వర్షపు నీరు ‘టప.. టప’మంటూ రాలుతోంది. నిద్రలోంచి బయటపడ్డాను. కాని లేవాలనిపించటంలేదు. టీ నీళ్లు కాసిన్ని కడుపులో పడితే కాని బద్దకం పోదు. బద్దకం వదుల్చుకుని టీ గినె్నని పొయ్యి మీదకి ఎక్కిస్తే గాని టీ తయారవదు.

ముసురుకి గుడిసె అంతా నెమ్ము చేరి చల్లగా ఉంది.
దుప్పటిని పూర్తిగా తల మీదకు లాక్కున్నాను. చల్లబడ్డ దుప్పటి చలిని ఆపలేక పోతోంది. ఒంటరి ప్రాణం. తడిసిన కట్టెలతో పొయి రాజేసి టీ కాచుకునేంత ఓపిక లేదు. రాఘవయ్య మేష్టారు ఎలా ఉన్నాడోనని అనుకున్నాను.
నిన్న రాత్రంతా, సుందరమ్మ ఇంట్లో, రిటైర్డ్ టీచర్ రాఘవయ్య ప్రక్కన కూర్చోవాల్సి వచ్చింది. ముసలి ప్రాణం. ఉన్నట్లూ కాదు, లేనట్లూ కాదు. ఎగపోత శ్వాసతో అప్పుడప్పుడు, లోతుకు పోయిన కనుగుంటల్లోంచి కళ్లు తెరుస్తున్నాడు. ఏదో చెప్పాలన్న ప్రయత్నం. పక్షవాతంతో ప్రక్కకు పోయిన క్రింది దవడ సహకరించడం లేదు. మెడ మీద కత్తి పడితే, నిస్సహాయంగా చూస్తున్న గొర్రెలా ఉంది ఆయన చూపు. తోలూ, బొమికెలు మిగిలిన ఆయన శరీరంలో డొక్క వీపుకంటుకుపోయింది. తులసీతీర్థం కూడా గుటక పడటంలేదు.
ఆయన ఆలనా పాలనా చూసే సుందరమ్మ కుటుంబం ఆయన్ని వాళ్లింట్లో పశువుల పాక ముందు, కాస్త పొడిగా వున్నచోట పడుకోబెట్టి ఇంటి తలుపులేసుకున్నారు. రాత్రి రెండో జాము వరకు అక్కడే కూర్చుని, ఏం చేయాలో తోచక ఇంటికి వచ్చాను. నిద్ర చాలకపోవటంతో కళ్లు మండుతున్నాయి.
పాక తలుపు ‘కిర్రు’మంది.
‘ఎవరూ?’ అని అరిచాను దుప్పటి తీయకుండానే.. నా గొంతు నాకే క్రొత్తగా ధ్వనించింది.
‘నేను డాక్టర్ తాతా’ రంగడి జవాబు. క్షణం ఆగి, ‘రాగవ తాత పోయిండు. అమ్మ నీకు చెప్పి రమ్మంది’
జవాబును ఆశించకుండానే తలుపైనా వేయకుండా, పరుగు లాంటి నడకతో రంగడు వెళ్లిపోయాడు.
ఎంతో కొంత వైద్యం, మూలికా చికిత్స, చిట్కాలు తెలిసిన నన్ను ఆ పల్లె ప్రజలంతా ‘డాక్టరు’ అంటూ అర్ధరాత్రి, అపరాత్రి తలుపు తట్టటం మామూలే!
ప్రతిఫలం ఆశించకుండా, నాకు తెలిసినంత మేరా వైద్యం చేస్తుంటాను. కనుక విపత్సమయంలో ఆ పల్లె వాళ్లందరూ, నా దగ్గరకు వస్తుంటారు. ఒక్కోసారి వైద్యానికి వచ్చి తమ కష్టమూ, సుఖమూ చెప్పుకుంటారు. ఏం చేయలేకున్నా, నా స్వాంతన, వేదాంతం వాళ్లకి కాస్త ఊరట నిస్తుంటాయి.
రంగడు సుందరమ్మ దంపతుల కొడుకు. పదేళ్లుంటాయి. చదువు వాడికి అంతగా అబ్బలేదు. ఈ సందర్భంలోనే సింగిల్ టీచర్ రాఘవయ్యను తనింట్లో ఉండమంది. ఇంటికి ఎదురుగా ఉన్న పసులకొట్టం పక్కన తడికల్తో చిన్న గది ఏర్పరచింది. దాంట్లో ఉంటూ, రంగడికి నాలుగు అక్షరం ముక్కలు నేర్పించమంది. రంగడికి చదువు అబ్బలేదు. కాని రాఘవయ్య మేష్టారు రీటయిరయ్యాక కూడా సుందరమ్మ ఆలనా పాలనలో తడికల గదిలో ఉండిపోయాడు.
అలా అని రాఘవయ్య మేష్టారు సుందరమ్మ ఇంటి మీదే అప్పనంగా వాలిపోలేదు. నా అంటూ ఎవరూ లేని రాఘవయ్య ఉద్యోగంలో ఉన్నంతసేపూ జీతం డబ్బులు, రీటయిరయ్యాక వస్తున్న పెన్షన్ డబుబలు సుందరమ్మనే ‘నామినీ’గా నమోదు చేయించాడు.
ఉద్యోగంలో ఉన్నపుడు జీతం డబ్బులు, ఇప్పుడు వచ్చే పెన్షన్ డబ్బులూ, మేష్టారు ‘రాజాలా’ బ్రతికేందుకు సరిపోతాయి. పిల్లికి బిచ్చం పెట్టని, ఎంగిలి చేత్తో కాకిని తోలని సుందరమ్మ అస్తమానం గొణుగుతూనే ఉండేది. తాను మేష్టారిని ఉచితంగా సాకుతున్నట్లు పల్లె అంతా తెలియాలని తాపత్రయపడేది. వేళకు సరిగా తిండి పెట్టకపోయేది. ఎన్నోసార్లు కంచంలో వడ్డించిన అన్నం, కూరలూ పాచిపోయి ఉండేవి. తినలేక, నా కళ్ల ముందరే అన్నం పళ్లేన్ని కుడితి గోళెంలోకి వంపి పళ్లెం కడుక్కునేవాడు.
సుందరమ్మ నోటిదురుసు మనిషి. ఆమె వాక్ప్రవాహానికి ఆమె భర్తే కాదు. మేం ఎవరమూ ఎదురుపడటానికి సాహసించేవారం కాదు.
రీటయిరయ్యాక కూడా రాఘవయ్య నడవగలిగినన్ని రోజులూ, ఆ పల్లెలో ఉన్న గ్రామీణ బ్యాంకు ముందున్న అరుగుల మీద కూర్చుని, బ్యాంకుకి వచ్చేవాళ్లకు డిపాజిట్ ఫారాలు రాస్తూనో, విత్‌డ్రాయల్ ఫారాలు రాస్తూనో సాయపడేవాడు. ప్రతిఫలంగా ఏమీ ఆశించక, వాళ్లిచ్చిన పండో, ఫలమో, కాయో, గసరుతోనో కాలం గడిపేవాడు.
నెల రోజులుగా రాఘవయ్య మేష్టారు కాలకృత్యాలకు కూడా అతికష్టం మీద లేవగలుగుతున్నాడు. ఒక్కోసారి నాకు నేనై, ఒక్కోసారి సుందరమ్మ కబురు పెడితేనో.. చూసి వస్తున్నాను.
నాకు తెలిసి, రాఘవయ్య మేష్టారికి జబ్బు అంటూ ఏమీ లేదు. తిండి కరువై, తిండిలేక పోవటంవల్ల ఒంట్లో శక్తి లేక రాఘవయ్యగారు రోజురోజుకీ నీరసపడిపోతున్నాడు. ముభావి. ఎవరితోనూ, తన కష్టం ఇది అంటూ చెప్పుకునే మనస్తత్వం కాదు. సుందరమ్మ నోటికి జడిసి మేము ఎవరమూ, ఏమీ చేయలేక పోతున్నాము.
ఓ రోజు ఆయన్ను చూడటానికి వచ్చిన నేను ‘మాస్టారూ! మీరేదైనా బలవర్థకమైన ఆహారం తీసుకోవాలండీ’ అన్నాను.
పేలవమైన నవ్వొకటి ఆయన ముఖం మీద కనిపించింది.
ఆ నిస్సహాయపు నవ్వులో ఎన్ని అర్థాలో...
సరిగ్గా అప్పుడే రంగు, అన్నం వార్చగా వంపిన గంజి ఉన్న పళ్లేన్ని రెండు చేతుల్తో పట్టుకుని వచ్చి ఆయన ముందుంచి వెళ్లాడు.
ఎప్పుడు వార్చిన గంజో అది.. చల్లబడి పైన ‘అట్ట’ కట్టింది. ఈగలు పళ్లెంపైన ఝుం అంటున్నాయి. ఒకట్రెండు ఈగలు అట్టకట్టిన గంజి మీద రెక్కలు అంటుకుని ఎగరలేక తపతపలాడుతున్నాయి.
చూడలేక ముఖం తిప్పుకున్నాను.
విధిలేక పళ్లెం వేపు చూసిన రాఘవయ్య కడుపులో త్రిప్పింది కాబోలు. బొళుక్కున వాంతి చేసుకున్నాడు.
ఆయన తిని ఎన్నాళ్లయిందో... వయనంలో పచ్చని పసరు తప్ప ఒక్క మెతుకు కనిపించలేదు.
సుందరమ్మ ఇంట్లోంచి ఏం జరిగిందంటూ ఎవ్వరూ బయటకు రాలేదు.
ఆయన గుడ్డలు శుభ్రపరిచి.. ఇక ఉండలేక ఇంటికి వచ్చాను. ఇంతో, అంతో ఆయనలో మిగిలి ఉన్న శక్తినంతా కల్లలోకి తెచ్చుకుని చూసిన చూపు, నిన్న మొన్నటి వరకు నన్ను వెంటాడుతూనే ఉంది.
తెరిచి వెళ్లిన ద్వారం గుండా పాకలోకి చలిగాలి ‘ఫెడీ’మని కొట్టింది.
బద్ధకం వదిలించుకుని, తలుపు దగ్గరగా లాగి సుందరమ్మ ఇంటి వేపు నడిచాను.
రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానకు గతుకుల వీధులన్నీ జలమయం అయ్యాయి. పాదం లోతు దిగబడుతున్న బురద నీరుతో దోవంతా రొచ్చురొచ్చుగా ఉంది.
రాఘవయ్య మరణానికి పరామర్శకని కాబోలు... సూర్యుడు మబ్బులు చీల్చుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
రాఘవయ్య పార్థివ శరీరం సుందరమ్మ పెంకుటిల్లుని ఆనుకుని ఉన్న పసుల కొట్టంలో, గడ్డిపరిచి, గుడ్డపై ఉంచబడి ఉంది. మాసిన చిరుగుల దుప్పటి పైన కప్పారు. గొడ్లకాపరి గొడ్లను మేతకు తీసుకువెళ్లాడు కాబోలు - కొట్టం ఖాళీగా ఉంది. పేడ, త్రొక్కిన గడ్డి, పసుల మూత్రం 0 బయటకంటే రొచ్చుగా ఉంది కొట్టం.
గ్రామ పెద్ద అప్పటికే వచ్చినట్లున్నాడు. నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నాడు.
అలికిడి విని సుందరమ్మ భర్త బయటకు వచ్చాడు. మేము ఆయన్ని అలా పిలవటం తప్ప. ఆయన పేరేంటో తెలియదు. ఎక్కడి నుండో ఇల్లరికం వచ్చాడట. బయట పులిలా గాండ్రిస్తాడు. కాని ఇంట్లో మాత్రం పిల్లి. ఎవరు వచ్చినా, ఏమడిగినా, ఈయన సుందరమ్మ వేపు చూస్తాడు. సుందరమ్మ జవాబు చెబుతుంది.
గ్రామ పెద్ద ఏదో అడగబోతున్నాడు. ఇంతలో సుందరమ్మ బయటకు వచ్చింది. లేని దుఃఖం తెచ్చుకుని, మేష్టారుని తాను ఎంత బాగా చూసుకునేదో చెబుతోంది. తన తండ్రి కంటే ఎక్కువ సేవ చేసానని, రోజూ తాము తినకున్నా, రంగడి కంటే ముందుగానే మూడు పూటలా వడ్డించేదాననని అంటోంది. ఆయనంటే ప్రాణమని, అపురూపంగా చూసుకునేవారమని చెబుతోంది.
ప్రొద్దునే్న చాయ బిస్కట్లు, పదకొండు గంటలకు పళ్లెం నిండా వేడి అన్నం, పచ్చడి, కూరా, పులుసు, నేయి, మజ్జిగ వడ్డించేవారం అంటోంది. రాత్రి కాగానే ఏడు గంటలకే కొట్టం గదిలోంచి పళ్లెం చేతబుచ్చుకుని వచ్చేవాడని, ఆకలికి తట్టుకునేవాడు కాదని అంటోంది.
సుందరమ్మ మాటల్లో ఏపాటి నిజం ఉందో నాకు తెలుసు. కర్ణాకర్ణిగా గ్రామ పెద్దకూ తెలుసు. ఆవిడ వాక్ప్రవాహానికి అడ్డుపడి కొట్టుకుపోవటం నాకు సుతరామూ ఇష్టంలేదు.
ఆవిడ మాటల చాతుర్యానికి నిశే్చష్టుడనై పోయాను.
ఆవిడ మాటలు వింటూంటే రాఘవయ్యగారికి ఓ స్వంత కూతురు అంటూ ఉంటే గనక, ‘ఆవిడ కూడా సుందరమ్మంత గొప్పగా చూసుకునేది కాదు’ అనిపించింది.
క్రొత్త సైనుగుడ్డ పూలూ, దండలు, ఆరు డప్పుల ఊరేగింపుతో, కర్పూరం ఉండలు, గంధం చెక్కలతో రాఘవయ్యకు స్వర్గలోక ప్రాప్తి లభించింది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని అయిన సరస్వతీ నదుల సంగమాన ఆయన అస్థికలకు పుణ్యలోక ప్రాప్తి కలిగింది.
దశదిన కర్మనాడు పల్లె యావత్తూ సుందరమ్మ ఇంట్లోనే చేయి కడిగింది. లడ్డూ, పాయసం, గారెలు, రెండు రకాల అన్నాలు, పప్పూ, గుమ్మడి కాయ దప్పళం, వీటన్నింటితో నిండిన విస్తరి, రాఘవయ్యను దహనం చేసిన చోటున ఉంచి పిట్టకు (కాకికి) పెట్టింది సుందరమ్మ.
ఎక్కడి నుంచో నాలుగు కాకులు కావుకావుమంటూ వచ్చాయి. విస్తట్లోని పదార్థాలన్నింటినీ, మెతుకు మిగల్చకుండా తిన్నాయి. విస్తట్లో మిగిలిన రెండు గారెల్ని నోట కరుచుకుని వెళ్లాయి.
ఆ దృశ్యం చూసిన వారంతా, రాఘవయ్య మేష్టారు, కడుపునిండా తిన్నాడని, సుందరమ్మ యెడ ప్రసన్నంగా ఉన్నాడని ఆమె దాతృత్వాన్ని వేనోళ్ల పొగిడారు. ఆమె మంచితనాన్ని మెచ్చుకున్నారు.
నాకు మాత్రం ఆ కాకుల మీద పీకల్దాకా కోపం వచ్చింది. తప్పుడు సంకేతాలిచ్చిన ఆ కాకుల్ని హత్య చేయాలనిపించింది. నాకు తెలుసు - రాఘవయ్యది ఆకలి చావు అని. గుప్పెడు మెతుకులకు ఆయన ప్రాణం పూటపూటకూ ఎంత అల్లాడేదో కూడా తెలుసు. తెలియందల్లా - కాకులు అలా తప్పుడు సంకేతాలు ఎందుకు ఇచ్చాయి? అని.

-కూర చిదంబరం.. 8885552423