S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శత్రువు

ఏప్రిల్ 1945. వార్సా. బాంబుల దాడుల వల్ల మందుగుండు వాసన, కూలిన గోడలు గల భవంతులు, ప్రాణాలతో బయటపడ్డ అదృష్టవంతులు. ఇదీ ఆనాటి వార్సా నగరం.
వార్సాలోని కొంత కూలిన ఓ రాజభవంతిని బాధితుల పునరావాస కేంద్రంగా మార్చారు. అందులో ఎవరూ నమ్మలేని ఓ అద్భుతం జరిగింది. ఓ రోజు అక్కడికి వచ్చిన కాందిశీకుల్లో రూత్ ఒకరు. శామ్యూల్ మరొకరు. శామ్యూల్ తిరుగుబాటుదారుల్లో ఒకడు. అతని పేంట్లో దోపుకున్న రివాల్వర్‌ని రూత్ చూసింది. వార్సాని విడిపించడానికి తను దాంతో పధ్నాలుగు మంది శత్రువులని చంపానని చెప్పాడు. అక్కడికి వచ్చే వారంతా చాలా తుపాకులని చూసారు కాబట్టి దాన్ని కనపడకుండా దాచమని రూత్ సలహా ఇచ్చింది. రూత్‌కి ఓ చిన్న గది ఇచ్చారు.
రెడ్‌క్రాస్ వాలంటీర్ ఆమె వివరాలు రాసుకుంది. ఇరవై నాలుగు గంటలపాటు ప్రపంచాన్ని పాలించాలని లేదా లాటరీలో గెలిచాక దాన్ని ప్రపంచంలోని ప్రతీ వ్యక్తితో పంచుకోవడం తన కలలని రూత్ చెప్పింది. తనని హింసించిన జర్మన్ సైనికులని తన ముందుకు తెస్తే వాళ్లకి శిక్ష వేయటం కూడా తన కలని చెప్పింది.
ద్వేషాన్ని చంపుకోమని వారు ఆమెకి సలహా ఇచ్చారు.
రూత్ తన గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికి అకస్మాత్తుగా అలికిడి వినిపించి తల తిప్పిచూస్తే రక్తం కారే ఓ జర్మన్ ఎస్‌ఎస్ సైనికుడు కనిపించాడు. అతను నిలబడ లేక మంచం మీద కూలబడ్డాడు.
‘ఇంతసేపు నువ్వు ఎక్కడ దాక్కున్నావు?’ ఆశ్చర్యంగా అడిగింది.
‘నేను చాలా బలహీనంగా ఉన్నాను. నా భార్యకి నేను ఎక్కడ ఉన్నానో తెలియాలి. ఆమెకి ఓ ఉత్తరం రాసి పోస్ట్ చేయడంలో నాకు సహాయం చేయి’ అతను అర్థించాడు.
‘ఆమె వచ్చి నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? ఈ లోపలే నువ్వు పట్టుబడతావు’ రూత్ చెప్పింది.
చివరికి ఉత్తరం రాయడానికి అంగీకరించి పెన్, పేపర్లని తేవడానికి బయటకి వెళ్లింది. శామ్యూల్ గదిలోకి వెళ్లి అతని పెట్టెని వెదికితే రివాల్వర్ కనిపించింది. దాన్ని తీసుకుని వెళ్తూంటే అతను ఎదురుపడి ఆమె చేతిలోని తన రివాల్వర్‌ని చూశాడు.
‘నా గదిలో ఓ జర్మన్ సైనికుడు ఉన్నాడు. అతన్ని చంపడానికి’ ఆమె చెప్పింది.
ఆమె అబద్ధం చెప్తోందని ముందు అనుకున్నా చివరికి శామ్యూల్ ఆమెని అనుసరించాడు.
‘నువ్వు చాలామందిని చంపావు. ఇతన్ని నన్ను చంపనీ’ రూత్ అర్థించింది.
గదిలోకి వెళ్తే అక్కడ ఎవరూ లేరు. అతను అక్కడ నిమిషం క్రితం కనిపించాడని చెప్పినా శామ్యూల్ నమ్మలేదు. అతను రెడ్‌క్రాస్ డాక్టర్‌కి ఆ విషయం చెప్పాడు. ఆమెని వాళ్లు ప్రశ్నించి వెళ్లాక గదంతా వెదికినా అతను ఎక్కడా కనపడలేదు. అకస్మాత్తుగా అతని కంఠం వినిపించింది.
దయచేసి ఇప్పుడు ఉత్తరం రాస్తావా?’
‘నువ్వు ఎక్కడ దాక్కున్నావు?’ తల తిప్పి అతన్ని చూసి విస్మయంగా అడిగింది.
అతను డిక్టేట్ చేసినట్లుగా ఆమె ఉత్తరం రాసింది.
‘డియర్ ఫ్రీదా,
నేను వార్సాలో ప్రావెన్సీ పేలెస్ శిథిలాల మధ్య దాక్కున్నాను’
విల్‌హెల్మ్.
అతను చెప్పిన అతని భార్య అడ్రస్‌ని కవర్ మీద రాసింది.
రూత్ బయటకి వెళ్తూ విల్‌హెల్మ్ తప్పించుకోవాలని అనుకుంటే, అతని యూనిఫాం కనిపించకుండా బ్లాక్‌మార్కెట్‌లో ఓవర్ కోట్ కొని అరగంటలో తిరిగి వస్తానని, అంతదాకా ఆ గదిలోనే ఉండమని చెప్పి ఆ గదికి తాళం వేసి వెళ్లింది. కిటికీలోంచి కనపడే పోస్ట్‌బాక్స్‌లో దాన్ని పోస్ట్ చేయమని అతను కోరాడు. అతను చూస్తూండగా ఆమె ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసి, బ్లాక్‌మార్కెట్‌లో ఓ రివాల్వర్‌ని కొని తిరిగి తన గదికి వచ్చేసరికి అతను గదిలోనే ఉన్నాడు. తన భార్య ఉత్తరం చూసి ఒకటి, రెండు రోజుల్లో వస్తుందని చెప్పి, జర్మన్ భాషలో ఏదో అంటూంటే ఆమె అతన్ని రివాల్వర్‌తో వెనక నించి కాల్చింది. అతను మాయం అవడంతో భయపడి కెవ్వున అరవసాగింది.
* * *
సైకియాట్రిస్ట్ ఆమెని ప్రశ్నించాడు.
‘ఎలా ఉంది?’
‘బానే ఉన్నాను’
‘రూత్! నిన్ను మెంటల్ హాస్పిటల్‌కి పంపుతున్నాం’ సైకియాట్రిస్ట్ చెప్పాడు.
‘ఎందుకు? నేను ఆ జర్మన్ సైనికుడ్ని చూశాను, మాట్లాడాను అని చెప్పినందుకేనా? అది అబద్ధం కాని, భ్రాంతి కాని కాదు’ రూత్ చెప్పింది.
‘ఐతే అతని శవం ఏది?’
రూత్ దానికి జవాబు చెప్పలేక పోయింది. రూత్‌ని హాస్పిటల్‌కి తరలించడానికి కొద్దిగా ముందుగా ఒకామె అక్కడికి హడావిడిగా వచ్చింది.
‘నా భర్త విల్‌హెల్మ్ ఏడి? ఆయన ఇక్కడ దాక్కున్నానని ఉత్తరం రాసాడు’ కోట్ జేబులోంచి తనకి వచ్చిన రూత్ రాసిన ఉత్తరాన్ని తీసి చూపించింది.
‘ఆ ఉత్తరం నేనే రాసాను’ రూత్ చెప్పింది.
‘నీకు నా పేరు, ఎడ్రస్ ఎలా తెలుసు?’
‘మీ వారే చెప్పారు. అతని చేతికి గాయం అవడంతో నన్ను రాయమంటే రాసాను’
‘ఆరేళ్ల క్రితం అతను యుద్ధంలో మరణించాడని నాకు జర్మన్ అధికారుల నించి సమాచారం అందింది. మరి నీకు ఎలా కనపడ్డాడు?’ ఆవిడ ఆసక్తిగా అడిగింది.
‘ఫైర్ ప్లేస్ కింద సొరంగంలో దాక్కున్నానని చెప్పాడు’ రూత్ వెంటనే చెప్పింది.
సైకియాట్రిస్ట్ సూచన మేర వాళ్లు తవ్వి వెదికితే కూలిన సొరంగం శిథిలాల మధ్య ఓ అస్థిపంజరం కనిపించింది. దాని మెళ్లోని సైనిక పతకం మీద విల్‌హెల్మ్ హెస్లర్ అనే పేరు, అతని సైనిక నంబర్ కనిపించాయి!
తర్వాత రూత్‌కి పెళ్లై పిల్లలతో చాలాకాలం ఆనందంగా జీవించింది. ఆమెని అనేకసార్లు టీవీలో ఇంటర్వ్యూ చేసినపుడు ప్రతీసారి జరిగింది ఒకే విధంగా చెప్పింది. విల్‌హెల్మ్‌కి ఆమె మాత్రమే సాక్షి. ఆమె అబద్ధం చెప్పి ఉంటే, పదిహేనేళ్లల్లో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన దానికి పక్కకి వెళ్లేదని, కాబట్టి ఆమె మాట్లాడింది నిజం అని సైకియాట్రిస్ట్‌లు నిర్ధారించారు. సైకిక్ న్యూస్ అనే ఇంగ్లీష్ పత్రిక ఎడిటర్, పేరా సైకాలజిస్ట్ ఐన విలియం ఎఫ్ నిచ్ అది నిజమని, భ్రమ కాదని నిర్థారించాడు.
మరణించిన ఆరేళ్ల తర్వాత ఆ వ్యక్తి జీవించి ఉన్న మరో వ్యక్తికి కనపడటం ఎలా సాధ్యమైంది? అది భ్రమైతే అతని అస్థిపంజరం ఎక్కడుందో రూత్ ఎలా చెప్పగలిగింది? విల్‌హెల్మ్ భార్య పేరు, చిరునామా రూత్‌కి ఎలా తెలిసాయి? ఈ ప్రశ్నలకి జవాబులు దేవుడికే తెలియాలి.