S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ధర్మవృక్షం

ఇద్దరు ఫెడరల్ ఏజెంట్స్ తమ కార్లో ఖైదీ రాబర్ట్‌ని శాన్ క్వింటన్ జైలుకి తరలిస్తున్నారు. అకస్మాత్తుగా కారుకి ఎదురుగా ఓ జింక రావడంతో డ్రైవ్ చేసే ఏజెంట్ దాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. కారు రోడ్ పక్కన పల్లంలోకి దొర్లింది. తెరచుకున్న తలుపు లోంచి చేతికి బేడీలు గల రాబర్ట్ బయటకి వచ్చాడు. స్పృహ తప్పి బయటపడ్డ పోలీస్ ఆఫీసర్ జేబులని వెదికి బేడీల తాళం చెవిని, హోల్‌స్టర్‌లోని రివాల్వర్‌ని తీసుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ స్పృహలోకి వచ్చి లేవబోతూంటే రాబర్ట్ అతన్ని ఆ రివాల్వర్‌తో కాల్చి చంపాడు. తర్వాత కార్లోని గాయపడ్డ మరో పోలీస్ ఆఫీసర్ తలని తన కాలితో కదిపాడు.
‘నన్ను చంపద్దు’ అతను అర్థించాడు.
రెండు గుళ్లతో అతన్నీ చంపి రాబర్ట్ బేడీలని తాళం చెవితో విప్పతీసే ప్రయత్నం చేస్తూంటే తాళం చెవి గడ్డిలో పడిపోయింది. ఎంతసేపు వెదికినా ఆ చిన్న తాళం చెవి అతనికి కనపడకపోవడంతో నిస్పృహగా అటు, ఇటు చూశాడు. దూరంగా ఓ చోట పొగ కనిపిస్తే అటువైపు నడిచాడు. కొద్దిదూరం వెళ్లాక ఓ ఇల్లు, ఆ ఇంటి చినీలోంచి వచ్చే పొగ, దాని ఆవరణలో ఎండిపోయిన పెద్ద చెట్టు, దాని మీద కట్టిన ట్రీ హౌస్ కనిపించాయి.
ట్రీ హౌస్‌లో ఆడుకునే ఆరేళ్ల హెన్రీ ఆ చెట్టువైపు వచ్చే ఖైదీని చూడలేదు.
‘హెన్రీ.. హెన్రీ’ ఓ ఆడ కంఠం వినిపించింది.
వెంటనే రాబర్ట్ పక్కనే ఉన్న షెడ్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. ఇంట్లోంచి బయటకి వచ్చిన ముప్పై ఏళ్ల జూలియా కొడుకుని ఇంట్లోకి రమ్మని, అన్నం వడ్డిస్తున్నానని చెప్పింది. తర్వాత జూలియా షెడ్‌లోకి వచ్చి గుర్రం ముందు నీళ్ల బక్కెట్‌ని పెట్టి బయటకి వెళ్లింది. అక్కడ కారు వెనక దాక్కున్న రాబర్ట్‌ని ఆమె చూడలేదు. అతను ఆ బక్కెట్‌ని గుర్రం ముందు నించి తీసి తన దాహాన్ని తీర్చుకున్నాడు.
జూలియా ఇంట్లోకి వెళ్లేసరికి హెన్రీ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు. భోజనానికి మునుపు ఆమె బైబిల్‌లోని కొన్ని పేరాలని చదివాక ఇద్దరూ తినసాగారు.
‘అమ్మా! దేవుడు నిజంగా ఉన్నాడా?’ హెన్రీ ప్రశ్నించాడు.
‘ఉన్నాడు’
‘ఎక్కడ?’
‘న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ?’
‘నాకు కనిపిస్తాడా?’
‘కనిపిస్తాడు. కాని నేను నీకు కనిపించినట్లుగా కనిపించడు’ జూలియా చెప్పింది.
రాబర్ట్ షెడ్‌లోని కత్తులకి పదును పెట్టే యంత్రంతో బేడీలు కట్ చేసుకుని బయటకి వచ్చాడు. డోర్ బెల్ విని జూలియా తలుపు దగ్గరకి వెళ్తే బయట రాబర్ట్ నిలబడి ఉన్నాడు. నీరసంగా ఉన్న అతన్ని చూసి అడిగింది.
‘ఎవరు మీరు?’
‘నా కారుకి యాక్సిడెంటయింది. దారి తెలీక ఇటువైపు ఆరు గంటలు నడిచి వస్తున్నాను. ఆకలిగా ఉంది’ చెప్పాడు.
ఆమె అతనికి భోజనం పెట్టింది.
‘ఎక్కడికి వెళ్తున్నారు?’ ఆమె అడిగింది.
‘ఎక్కడికైనా. నేను ఎక్కడ ఉన్నాను?’ అడిగాడు.
‘్ఛరూకీ వౌంటెన్స్‌లో’
‘మీరు దేవుడ్ని చూసారా?’ హెన్రీ అడిగాడు.
‘దేవుడు లేడు’ రాబర్ట్ చిరుకోపంగా చెప్పాడు.
‘నువ్వాయన్ని విసిగించకు. వెళ్లి పడుకో’ జూలియా కొడుకుని కోప్పడింది.
‘ఇది నాకు సంబంధించిన విషయం కాకపోయినా అడుగుతున్నాను. మీరు ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా ఎందుకు ఉన్నారు?’ రాబర్ట్ అడిగాడు.
‘మా ఆయన పదేళ్ల క్రితం ఇక్కడ చాలా భూమిని కొన్నాడు. ఇక్కడికి ఇరవై మైళ్ల దూరంలో ఓ ఊరుంది. ఏడాది క్రితం ఆయన పోయారు. నేనే ఆ వ్యవహారాలని చూస్తున్నాను’
‘సారీ. ఇక్కడ సహాయానికి మీకు మగ దిక్కు అవసరం లేదా?’
‘అవసరం ఉంది కాని జీతం ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు’ జూలియా చెప్పింది.
‘నేను కొంతకాలం ఇక్కడ ఉండి మీకు సహాయం చేస్తాను’ రాబర్ట్ చెప్పాడు.
మరణించిన తన భర్త మేక్స్ దుస్తులని అతనికి ఇచ్చి, అతని దుస్తులను ఉతికేందుకు వేసింది.
‘రేపు నేను ఊరికి వెళ్లి సరుకులు తేవాలి. మీరు కూడా రావచ్చు’ జూలియా చెప్పింది.
హెన్రీ హడావిడిగా వచ్చి తల్లితో చెప్పాడు.
‘అమ్మా. నీకో వింత చూపిస్తా రా’
తల్లిని చెయ్యి పట్టుకుని బయటకి లాక్కెళ్లాడు. ట్రీ హౌస్ కట్టిన చెట్టుని చూపించాడు. ఓ కొమ్మకి చిగురు వచ్చింది.
‘ఇది నా చెట్టు’ హెన్రీ రాబర్ట్‌తో చెప్పాడు.
‘పదేళ్ల నించి ఈ చెట్టు మోడుగానే ఉంది. ఇందాక కూడా లేదు. అకస్మాత్తుగా ఇంత చిగురు ఎలా వచ్చిందో? ఈ ఓక్ వృక్షానికి ఓ చరిత్ర ఉందని విన్నాను. చెడ్డ వాళ్లని ఆ చెట్టుకి ఉరి తీస్తే ఉరి చక్కగా పడి మరణిస్తారని. అదే మంచి వాళ్లని తీస్తే ఉరి బిగుసుకోదు అని ఛెరూకీ రెడ్ ఇండియన్స్ నమ్ముతారు. దీన్ని వాళ్లు ధర్మవృక్షం అని పిలిచేవాళ్లు’ జూలియా ఆశ్చర్యంగా చూస్తూ చెప్పింది.
* * *
రాత్రి షెడ్‌లో పడుకోడానికి వెళ్లిన రాబర్ట్ కారు బోనెట్‌ని ఎత్తి కార్పొరేటర్ వైర్లని పీకేసాడు. పైన అటక మీద ఆడుకునే హెన్రీ దాన్ని చూసాడు.
మర్నాడు ఉదయం బయటకి వచ్చి ఆ చెట్టుని చూసి ఆశ్చర్యపోయారు. ఆ కొమ్మకి బాగా చిగురు వచ్చి, పూలు కూడా పూసింది.
‘దేవుడు తనున్నాడని చూపించాడు’ హెన్రీ చెప్పాడు.
కార్ స్టార్ట్ కాకపోవడంతో హెన్రీ చెప్పాడు.
‘ఈయనంటే నాకు ఇష్టం లేదు. ఈయనే కారు వైర్లని రాత్రి పీకాడు’
‘మీరు ఇంట్లోనే ఉండండి. నేను మూడు మైళ్ల దూరంలోని నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఆమె కార్లో వెళ్తాను’ చెప్పి జూలియా ఫోన్ చేయడానికి లోపలకి వెళ్లింది.
షెడ్‌లో అటక మీద ఆడుకునే హెన్రీ అలికిడై చూస్తే కింద రాబర్ట్ రివాల్వర్‌ని ఓ చోట దాస్తున్నాడు. దిగి దాన్ని తీసుకుని ‘అమ్మా! అమ్మా’ అంటూ ఇంట్లోకి పరుగెత్తి దాన్ని తల్లికి ఇచ్చాడు. రాబర్ట్ హెన్రీ వెంట పరిగెత్తాడు. జూలియా అతనికి రివాల్వర్ గురి పెట్టి అడిగింది.
‘నువ్వు కారు ప్రమాదంలో తప్పించుకున్న ఖైదీవి కదా? రేడియోలో నీ గురించి రాత్రి విన్నాను. షెడ్‌లో నీ బేడీలు కనిపించాయి. నువ్వు హంతకుడివి’
‘అవును’
‘ఐతే ఇక్కడ ఉండద్దు. నా గుర్రం తీసుకుని వెళ్లిపో’
వెంటనే రాబర్ట్ హెన్రీని ఎత్తి తనకి అడ్డు పెట్టుకుని చెప్పాడు.
‘రివాల్వర్‌ని టేబిల్ మీద ఉంచు. లేదా వీడి గొంతు పిసికేస్తాను’
ఆమె ఆ పని చేయగానే హెన్రీ ఒక్క దూకులో రాబర్ట్ చేతుల్లోంచి తప్పించుకుని, బల్ల మీది రివాల్వర్‌ని అందుకుని బయటకి పరిగెత్తాడు. దారిలో రివాల్వర్‌ని బావిలోకి విసిరేసి, నిచ్చెన ఎక్కి చెట్టు మీది ట్రీ హౌస్‌కి చేరుకున్నాడు. ఇది తెలీని రాబర్ట్ కూడా రివాల్వర్ కోసం వాడి వెంట పరిగెత్తి వాడ్ని పట్టుకోవడానికి నిచ్చెన ఎక్కాడు. అకస్మాత్తుగా రాబర్ట్ కాలు వేసిన కొమ్మ విరిగి కిందకి జారాడు. ఐతే నేల మీద పడకుండా మెడ చుట్టూ ఓ బలమైన చిగిర్చిన కొమ్మ చుట్టుకుని ఉరి తీయబడ్డాడు.
ఆ వృక్షం అకస్మాత్తుగా ఎలా కొన్ని గంటల్లో చిగురించింది? అదీ ఓ హంతకుడు వచ్చాకే. ఆ చెట్టు హంతకుడి రాకని ఎలా పసికట్ట గలిగింది? దాని కొమ్మలు అతన్ని ఎలా ఉరి తీయగలిగాయి? ఈ ప్రశ్నలకి జవాబు దేవుడికే తెలియాలి.