S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్రంథాలయ ఉద్యమ దీపిక

వందేళ్లు పూర్తి చేసుకున్న సూర్యాపేట ‘విజ్ఞాన ప్రకాశిని’
*

విద్యార్థులకు విద్యా దిక్సూచి... నిరుద్యోగుల పాలిటి ఉద్యోగ సోపానం... అక్షరాస్యులకు జ్ఞానామృతమై... నేడు వేలాది పుస్తకాలతో విజ్ఞాన సుగంధాలను విరజిమ్ముతున్న సూర్యాపేట గ్రంథాలయం... మాడపాటి ఆశయం, పువ్వాడలో పురిదాల్చి తెలంగాణా ప్రాంతంలోనే మూడవదిగా పురుడుపోసుకుంది.
హైదరాబాద్ వేదికగా శ్రీకృష్ణదేవరామాంధ్ర భాషా నిలయం, హన్మకొండలో శ్రీ రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం అంతకు ముందే వెలిసినప్పటికీ...‘ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని’గా అవతరించి తెలంగాణలో గ్రంథాలయోధ్యమాన్ని రాజేసింది. చదువుకున్నోళ్లలో చైతన్య దివిటిని వెలిగిస్తూ ‘శత’ వసంత సంబురానికి ముస్తాబు అయ్యింది.
విజ్ఞానం- వికాసం- లోకజ్ఞానం
నిద్రాణమై ఉన్న వ్యవస్థను మేల్కొలిపేందుకు విజ్ఞానం- వికాసం- లోకజ్ఞానం అనే లక్ష్యాలతో గ్రంథాలయానికి అంకురార్పణ జరిగింది. స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణం. నలుగురు చేరి మాట్లాడుకుంటే నిజాం నవాబు తొత్తులు కనె్నర్ర జేస్తుండేవారు. ఆ సమయంలోనే సూర్యాపేటలో కొందరు ఒకట్రెండు పత్రికలతో పాటు కొన్ని పుస్తకాలను తెప్పించి యువతకు చేరవేసేవారు. ఈ పరిస్థితుల్లో స్ధానిక బడిపంతులు పువ్వాడ వెంకటప్పయ్య గ్రంథాలయ ఏర్పాటుకు ప్రతీన బూనారు. కోదాటి లక్ష్మినరసింహారావు, రామకృష్ణారావు, కనె్నగంటి వీరాచారి, యామా కన్నయ్య, నకిరేకంటి రామలింగయ్య తదితరుల సహకారంతో 1917 పింగళి నామసంవత్సరం అక్టోబర్ 25న విజయదశమి పర్వదినం రోజున ప్రారంభించారు. పాత ధర్మశాల(సత్రం)లో ఒకట్రెండు పత్రికలో కొనసాగుతున్న గ్రంథాలయంపై అనుమతి లేమి పేరిట పోలీసు దాడితో మూసివేతకు గురైంది. గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటిని పట్టుకెళ్లారు. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో రెండు గ్రంథాలయాలు కొనసాగుతున్నప్పటికి సూర్యాపేట పైనే తొలి దాడి ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన మాడపాటి హన్మంతరావు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వుతో పునఃప్రతిష్ఠకు నోచుకున్నట్లయింది.
నిర్భంధాన్ని అధిగమించిన వేళ..
ఆంధ్రావిజ్ఞాన ప్రకాశినికి పదేళ్లు నిండిన తరుణంలో రెండవ గ్రంథాలయ మహాసభలను సూర్యాపేట వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు. 1926లో జూన్ 22,23,24 తేదీలను ముహూర్తంగా ఖరారుచేశారు. నిజాం సేనలు మహాసభ నిర్వహణను అడ్డుకున్నారు. జిల్లా అదాలత్‌కు వారం ముందే విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్వాగత సమితి సభ్యుడిగా కొనసాగుతున్న వెంకట నర్సయ్య హైదరాబాద్‌కు వెళ్లి హైకోర్టులో దావా వేశారు. అప్పటి ప్రముఖ న్యాయవాది కాశీనాథరావు వాదనతో ఏకీభవించిన కోర్టు జోక్యం తగదని తీర్పు వెలువరించినప్పటికీ అనుమతి నిరాకరణకు గురయినది. పట్టు వీడని సభ్యులు మళ్లీ ప్రయత్నించి ప్రభుత్వ అనుమతిని పొందడంతో రెండేళ్ల అనంతరం 1928 మే మాసంలో మహాసభలను ఘనంగా నిర్వహించారు.
బేజాప్తా (్ధక్కరణ)
ఆంగ్లేయులకు తొత్తుగా మారిన నైజం సర్కారు రాక్షస పాలన రుచించని వారు సూర్యాపేట గ్రంథాలయం వేదికగా బేజాప్తా (్ధక్కరణ) కార్యక్రమాలను నిర్వహించుకునే వారు. గ్రంథాలయానికి పక్కనే ఉన్న భువనగిరి లక్ష్మినారాయణ నివాసంలో జాతీయ పండుగలు, దేశ నాయకుల జన్మదిన వేడుకలు, జాతీయ గేయ పఠనం, పతాకావిష్కరణ వంటి కార్యక్రమాలు గోప్యంగా జరిగేవి. అణిచివేతపై ఇష్టాగోష్టి నిర్వహించేవారు. ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలు, పత్రికలను ఇచ్చి పుచ్చుకుంటూ పండుగల సందర్భంలో ‘గ్రంథాలయ భిక్ష’ పేరున విరాళాలు, పుస్తకాలు పోగుచేసేవారు. అలా గ్రంథాలయం యువతలో విప్లవాన్ని రాజేయడంతో ‘‘నైజాం సర్కారోడా నాజీల మించినవురో’’ అంటూ చుట్టుముట్టు సూర్యాపేట నట్టనడుమ నల్లగొండ, నీవుండేది హైద్రాబాదు.. దాని పక్కన గోల్కొండ, గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడుతాం కొడుకో నైజాం సర్కారోడా’’ అంటూ యువ కిశోరం యాదగిరి విప్లవగానం చేస్తే అంతకు మించి ధర్మభిక్షం అగ్నికీలగా అవతరించారు. గ్రంథాలయోద్యమ స్ఫూర్తితో అనతికాలంలోనే తెలంగాణ సాయుధ పోరాటం రాజుకుంది.
నూతన భవనం
గ్రంథాలయ విశిష్టత వినతికెక్కడంతో 1956 మే 22న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బూర్గుల రామకృష్ణారావు మంత్రి మండలిలో సహయ మంత్రిగా పనిచేసిన ఎంఎస్. రాజలింగం సహకారంతో విశాలమైన స్థలాన్ని సేకరించుకోవడం జరిగింది. అప్పట్లో ఆవిర్భవించిన వర్తకసంఘం ఆధ్వర్యంలో నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తిచేసి 1960 ఏప్రిల్ 24న మాడపాటి హన్మంతరావుచే ప్రారంభింపజేశారు. ఆ కొంతకాలానికి ‘శ్రీ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథనిలయం’ జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోకి వెళ్లింది. 1975లో ప్రథమశ్రేణి గ్రంథాలయంగా రూపాంతరం చెందింది. కాలక్రామేణా ఈ భవనం శిథిలావస్థకు చేరుతుండడం, సరిపోక పోవడంతో అభివృద్ది కమిటీ అధ్యక్షుడు యానాల యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టి 2007 డిసెంబర్ 6న శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టి దాతల దాతృత్వంతో ఏడాదిలో అన్ని వసతులు ఉన్న సుందర భవనాన్ని పూర్తి చేయడం జరిగింది.
3,295 సభ్యత్వాలు
గ్రేడ్-1 శాఖ గ్రంథాలయంగా పాఠకులకు విజ్ఞానాన్ని పంచుతూ పాఠకుల ఆదరణను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 3,295 సభ్యత్వాలు కలిగి నిత్యం ఐదారు వందలమంది పాఠకులతో వెలుగొందుతోంది. గ్రంథాలయంలో మొత్తం 19,818 పుస్తకాలు ఉండగా అందులో 14,317 తెలుగు పుస్తకాలు, 3,479 ఆంగ్లం, 1,346 హింది, 675 ఉర్దు పుస్తకాలు ఉన్నాయి. పద్నాలుగు తెలుగు దినపత్రికలు నిత్యం వస్తుండగా ఒక ఉర్దు పత్రికతో పాటు మూడు ఇంగ్లీష్ పత్రికలు వస్తాయని గ్రంథపాలకుడు మల్లేల రామారావు ‘ఆంధ్రభూమి’కి వివరించారు. పదిహేను మాసపత్రికలు, నాలుగు పక్ష పత్రికలు, మూడు వార పత్రికలు కూడా గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయి.
*
ఆ విజ్ఞానమే..
ఈ స్ధాయికి ఎదిగేలా చేసింది
చదువుకునే రోజుల్లో రోజు గ్రంథాలయానికి వెళ్లి గంటల పాటు పుస్తకాలు చదివే వాణ్ని. ఆ అలవాటే పుస్తక పఠనాన్ని ఇష్టంగా మార్చింది. గ్రంథాలయాల ద్వారా విజ్ఞానం వికసించి మేధస్సు పెంపొందుతోంది. అలా నా ఉన్నతికి సూర్యాపేట గ్రంథాలయం తోడ్పాటునందించింది. అక్కడ నేర్చుకున్న జ్ఞానమే నన్ను ఈస్ధాయికి ఎదిగేలా చేసింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సూర్యాపేట గ్రంథాలయం శత వసంతాలు పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమైన విషయం. ఈ గ్రంథాలయ అభివృద్దికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తా. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తా.
-గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
విద్యుత్‌శాఖ మంత్రి
*
గ్రంథాలయ
చరిత్రను చాటుతాం
తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిలుదిన సూర్యాపేట గ్రంథాలయ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయ సంస్థకు తొలి చైర్మన్‌గా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నా. త్వరలోనే గ్రంథాలయాన్ని ఈ-గ్రంథాలయంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నా. గ్రంథాలయాల అభివృద్దికి అందరూ సహకరించాలి.
-నిమ్మల శ్రీనివాస్‌గౌడ్
జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్

చిత్రాలు..వందేళ్ల క్రితం ప్రారంభమైన
గ్రంథాలయ శిలాఫలకం
*గ్రంథాలయ పాత భవనం
*-గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
విద్యుత్‌శాఖ మంత్రి
*

ఇల్లెందుల గోపీనాథ్ .సూర్యాపేట