S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అద్భుతం

కష్టం, బాధ, నొప్పి ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి పని చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా - సృజనకారులు - అంటూ చెప్పిన ‘ఓ చిన్న మాట’ అద్భుతంగా ఉంది. అక్షరాలోచనల్లో ‘పుస్తకం తెరిస్తే’ కవిత మాకు బాగా నచ్చింది. అలాగే నానీలు కూడా. అనురాగం లేని మనసున సుజ్ఞానం రాదంటూ అమృతవర్షిణిలో చక్కగా వివరించారు. కుంచెం తేడాగా కార్టూన్లు నవ్వించాయి. పైన ఐదు, కింద రెండు కళ్లున్న క్రాబ్ కాని క్రాబ్ హార్స్ షూ క్రాబ్ విషయాలు తమాషాగా ఉన్నాయి. మెదడు, హృదయంపై ఒత్తిడి తగ్గడానికి ఏడుపు మంచి మార్గం అని తెలుసుకొని ఆశ్చర్యపోయాం.
-వి.లంబకర్ణ (నాగవనం)
ఆకలి రాజ్యం
‘ఆకలి రాజ్యం’లో కవర్‌స్టోరీలో విషయాలు చదువుతుంటే చాలా ఆశ్చర్యం కలిగింది. ఆకలి కేకలు విన్పిస్తున్న దేశాల్లో మన భారత్ కూడా ఉంది. ఆహార ఉత్పత్తి ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రధాని మోదీ చాలా కసరత్తు చేస్తున్నారు. ఆయన కృషి వల్ల ఆకలి కేకలు విన్పించవు.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
ఎప్పుడూ విలువైనదే
కష్టపడి సంపాదించింది ఎప్పుడూ విలువైనదే. అక్రమార్జన అన్యాయమే అని చెప్పిన కథాసాగరం కథ ‘శ్రమజీవి రొట్టెలు’ మంచినీతిని చెప్పింది. ఎరుపు, ఆకుపచ్చ రంగుల భేదాన్ని గుర్తించలేని వర్ణ అంధత్వం (కలర్ బ్లైండ్‌నెస్) వల్ల హంతకుడు పట్టుబడటం వస్తువుగా క్రైం కథ ‘మధ్య గుండీ’ ఆసక్తికరంగాన, ఉత్కంఠభరితంగాను ఉండి అలరించింది. ఈ విదేశీ క్రైం కథల్లో విభిన్న కానె్సప్ట్‌లు, రకరకాల వాతావరణాలతో కొత్తగా ఉండి ఆకర్షిస్తున్నాయి. అనుచరత్వం నుంచి నాయకత్వంలోనికి పరిణమించాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. నాటి నేటిని, నేటి రేపటిని కూడా చూడగలగాలి అంటూ వాసిలి చెప్పిన విషయాలు బాగున్నాయి.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)
దేవుడిచ్చిన వరం
ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి కళాకారుడు.. ఇరువురు కలిస్తే ఆ స్నేహితుడి ద్వారా ఎంత మంచి జరుగుతుందో? ఆ వర్ణచిత్రం పేరు ‘దేవుడిచ్చిన వరం’ ఈ చిత్రకారుడికి ఆ స్నేహితుడే దేవుడిచ్చిన వరం. హైదరాబాద్ బావర్చి బిర్యానీ అంత గొప్పగా!
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
బంతి
మనిషి బంతిలాంటి వాడే. ఆ విషయం అతడు అర్థం చేసుకోవడంలో ఆలస్యం అవుతుందంటూ కందుక క్రీడతో మనిషి జీవితాన్ని పోల్చి చెప్పిన ‘సండే గీత’ చాలా బాగుంది. తైపీకి సమీప జియో పార్కులో నాలుగు వేల ఏళ్లనాటి బండరాయి గాలి తాకిడికి అరిగిపోయి ఇప్పుడు ఎలిజబెత్ రాణి తలలాగ కనిపించడం అద్భుతమే. సోఫాలో ఠీవిగా కూచుని పోజులు కొడుతున్న భల్లూకం ఫొటో భలేగా ఉంది. మత్తుదారిలో చిత్తవుతూ చేజార్చుకోకూడదు భవిత అని చెప్పిన ‘దారి మార్చుకో’ కవిత బాగుంది. నమ్మండి ఇది నిజం అంటూ చెప్పిన హత్యలు చేసే వజ్రాల హారం కథ బాగుంది. నిజంగా నమ్మలేనట్టుంది.
-బి.సోనాలి (సూర్యారావుపేట)
పల్లె
గోపాలంగారు పల్లెను చేరుకోడానికి పడిన కష్టాలు, పల్లె పాలు, పల్లె చింతచిగురు రుచులు చూపించిన వైనం భేష్షుగ్గా ఉన్నాయి. వజ్రాల హారం ధరించిన మైఖేల్ మేనత్త, తర్వాత ఆమె పనిమనిషి మరణించడం, మైఖేల్‌కి ఆస్తి సంక్రమించడం, అతడా హారాన్ని ప్రేయసికివ్వడం, ఆమె దానిని ధరించి మరణించడం సహజంగానే మైఖేల్‌ని హంతకునిగా నిర్ణయించడం - హారం హత్యలు చేయడం విస్మయకరంగా ఉంది. ‘కుంచెం’ తేడాగా కార్టూన్లలో నెగెటివ్ భావం తొణికిసలాడింది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ అగ్ని పర్వతాల హారం ఫొటోలు చాలా బాగున్నాయి.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)
వర్షించింది
ప్రస్తుత ప్రపంచం ఒక ఆకలి రాజ్యం అన్నది ఒక నగ్నసత్యం. ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మందికి కడుపు నిండా తిండి లేదని తెలిసి కడుపు తరుక్కుపోయింది. హృదయం వర్షించింది. తిండిలేక ఊరు దాటి దేశం దాటి వలసపోయి నానా అగచాట్లు పడటం దారుణమే. ఆహార భద్రత డబ్బు లేనందున కాగితాలకే పరిమితం అయింది. అదే అసలు విషాదం. ప్రపంచవ్యాప్త ప్రజాహిత సంస్థలు చేరుూ చేరుూ కలిపి అన్నార్తులను ఆదుకోవాలి. యంత్ర సాయం లేకుండా చేతులతోనే మన వారు భారీ నౌకలు చేసేవారని తెలిసి ఆశ్చర్యపోయాం. మనవాళ్లు తమ మెదడులోనే కచ్చితమైన లెక్కలు కట్టుకొని నౌకల్ని తీర్చిదిద్దగలగడం అద్భుతం.
-కె.సుధీర్ (శ్రీనగర్)
నేర్చుకోవాల్సినవి
‘సండే గీత’లో -బంతి/ కందుక’ క్రీడ అంటూ బంతిని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయని, మనిషి కూడా రబ్బరు బంతిలా ఎందుకు మారకూడదంటూ చక్కటి విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు. ఓ చిన్న మాటలో ‘నొప్పి’ అంటూ ప్రతి మనిషి జీవితంలో కష్టం, బాధ, నొప్పి ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి పని చేస్తూ ఉండాలంటూ చక్కగా తెలియజేశారు. కవర్‌స్టోరీ ‘ఆకలి రాజ్యం’లో ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మందికి కడుపు నిండటం లేదని తెలుసుకొని ఆశ్చర్యపోయాం.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)