S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తేనె పూసిన కత్తి

ఇంటికి రాకరాక ఓ అతిథి వచ్చారు..
మర్యాద మన ఇంటావంటా ఉంది కనుక.. కాస్త టీ పుచ్చుకుంటారా... కాఫీ కాయమంటారా.. అని ఆప్యాయంగా అడుగుతాం. ‘చక్కెర లేకుండా ఇవ్వమ్మా... మా దగ్గర సుగర్ ఫ్యాక్టరీ ఉందిగా’ అంటూ చమత్కారంగా తన ఇబ్బందిని చెప్పుకోవడం తెలుగువాకిట వినబడే మాట. గతంలో ఈ మాట అప్పుడప్పుడు వినిపించేది. ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటిలోనూ అదొక తప్పనిసరి మాటగా, అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఇంటా కనీసం ఓ మధుమేహ రోగి ఉండటం మామూలైపోయింది కనుక.
చాపకింద నీరులా నిండా ముంచేస్తున్న ‘చక్కెర’ వ్యాధి ఇప్పుడు మనల్ని చుట్టుముట్టింది. ఇది చేదు నిజం. మన జీవనశైలిలో మార్పు, ఆహారవిహారాల్లో మేలైన తీరు అలవాటు చేసుకోకపోతే అది మనల్ని అంతం చేసేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మన శరీరాన్ని నిస్తేజం చేసి ఒక్కో అవయవాన్ని అచేతనం చేసి, రోగ నిరోధక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి మనకు తెలియకుండానే నిండా ముంచేసే తేనెపూసిన కత్తి వంటిది ఈ మధుమేహం. అసలు మనకు ఆ వ్యాధి ఉందని తెలియకుండానే మనలో విస్తరిస్తుంది. తెలుసుకునేలోగా దెబ్బతీస్తుంది. తెలిసినా దానినుండి బయటపడటానికి లేదా అది పెట్టే బాధలు తగ్గించుకోవడానికి పెట్టే వ్యయం భరించడం సామాన్యులకు సాధ్యం కాదు. శరీరంలో మనం ఆహారం ద్వారా తీసుకుంటున్న పదార్థాల ద్వారా అందే చక్కెరను రక్తంలో ఎంత పరిమాణంలో ఉండాలో నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ పనితీరులో వచ్చిన మార్పులవల్ల మధుమేహం వస్తుంది. అధిక మోతాదులో చక్కెర రక్తంలో నేరుగా కలవడం, దానివల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం మామూలు. రెండు రకాలుగా వచ్చే మధుమేహం ఇప్పుడు చిన్నపిల్లలు, గర్భిణులు, ముఖ్యంగా మహిళల్లో విస్తృతమవుతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. భారత్ త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. అందుకే మధుమేహం ఎందుకు వస్తోందో, రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఏటా నవంబర్ 14న ‘ప్రపంచ మధుమేహ దినోత్సవం’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా మనం మెలకువ తెచ్చుకోవలసిన సందర్భం ఇది. ఎందుకంటే ప్రపంచంలో మధుమేహ వ్యాధి బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత్ డయాబెటిస్ రాజధానిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడంలో వ్యంగ్యం లేదు. భయపెట్టే నిజం అది. అందుకే మనం అప్రమత్తం అవ్వాల్సిన సందర్భం ఇది.
ఇదీ తాజా పరిస్థితి..
ప్రపంచంలో ప్రాణాలు తీస్తున్న వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ప్రమాదకర వ్యాధుల జాబితాలో ఇది తొమ్మిదవది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2015లో ప్రపంచం మొత్తంలో 415 మిలియన్ల మంది మధుమేహ రోగులు ఉన్నారు. వీరిలో 58 శాతం ఒక్క భారత్‌లోనే ఉన్నారు. 30 ఏళ్లలోపు వయసున్నవారు ఎక్కువగా ఇటీవలి కాలంలో డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహ రోగుల్లో 90 శాతం మంది టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్నారు. 8.3 శాతం మంది పెద్దలు, అంతే మొత్తంలో పిల్లలు, మహిళలు చక్కెర వ్యాధి బాధితులే. 2012 -15 సంవత్సరాల మధ్య మధుమేహ రోగుల సంఖ్య ఎంత పెద్దఎత్తున పెరిగిందో తెలుసుకుంటే అది మనల్ని ఎలా చుట్టుముట్టిందో అర్ధం అవుతుంది. 2012లో 1.5 మిలియన్ల మంది రోగులుంటే 2015 నాటికి 5 మిలియన్లకు పెరిగింది. మన దేశంలో 2010లో 50.8 మిలియన్ల మంది మధుమేహ రోగులుంటే 2015 నాటికి వారి సంఖ్య 65.1 మిలియన్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ సంఖ్య 69 మిలియన్లకు పైగా ఉంటుందని అంచనా. ఇదే రీతిలో నియంత్రణ లేకుండా డయాబెటిస్ విజృంభిస్తే 2030 నాటికి 100 మిలియన్ల మైలురాయిని దాటిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. లానె్సట్ వంటి సంస్థలూ ఆదే చెబుతున్నాయి. భారత్ చక్కెర వ్యాధితో సతమతమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఆ సంస్థ ప్రచురించిన నివేదిక ప్రకారం 15 రాష్ట్రాల్లో చక్కెర వ్యాధి విస్తృతంగా ఉందని తేలింది. ఈ నేపథ్యంలో మిగతా దేశాలకన్నా ‘ప్రపంచ మధుమేహ దినోత్సవ’ ప్రాధాన్యతను మనం గుర్తించి అప్రమత్తమవ్వాలి.
డయాబెటిస్ డే ఎందుకు?
మనం తీసుకునే ఆహారంలో చక్కెర, కొవ్వు, మాంసకృత్తులను అరిగేలా చేసి రక్తంలో ఎంత మేరకు చక్కెర నిల్వలు ఉండాలో క్లోమగ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్‌ను విడుదల చేసి నియంత్రిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తి తగిన మోతాదులో జరగకపోవడం వల్ల చక్కెర స్థాయి పెరిగి శరీరంలోని అన్ని వ్యవస్థలు పనిచేయడంలో మార్పు వస్తుంది. ఇది అనర్థాలకు దారి తీస్తుంది. అరికాళ్లు, కంటి నరాలు, హృదయం, మూత్ర పిండాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనిని నియంత్రించడానికి కృత్రిమంగా ఇన్సులిన్‌ను మనం తీసుకోవలసి వస్తోంది. ఆ కృత్రిమ ఇన్సులిన్‌ను కనిపెట్టి, అందుబాటులోకి తెచ్చిన ప్రఖ్యాత కెనడియన్ వైద్య శాస్తవ్రేత్త ఫ్రెడ్రిక్ బాంటింగ్ పుట్టిన రోజును ‘ప్రపంచ మధుమేహ దినోత్సవం’గా ప్రకటించారు. 1922లో ఆయన ఇన్సులిన్‌ను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణలో భాగస్వాములైన ఛార్లెస్ బెస్ట్, జాన్ జేమ్స్ రికర్డ్ మక్‌లియోజ్‌ల సేవలను ఆయన ఎప్పుడూ అందరికీ చెప్పేవాడు. ఇన్సులిన్‌ను కనిపెట్టిన అతడికి 32 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి వచ్చింది. ఆ బహుమతి మొత్తాన్ని తన పరిశోధనల్లో సహకరించిన ఆ ఇద్దరికీ ఆయన సమానంగా పంచిపెట్టడం విశేషం. మధుమేహ పీడితులకు ఇన్సులిన్ ఇప్పుడు ఒక వరం.
డయాబెటిస్‌లో రెండు రకాలున్నాయని అందరికీ తెలిసిందే. వీటిలో రెండో రకం రాకుండా నివారించుకోవచ్చు. వచ్చాక చికిత్సతో అదుపు చేయవచ్చు. మొదటి రకం డయాబెటిస్ రాకుండా చేయలేం. కానీ వస్తే చికిత్స ఉంది. ఈ విషయాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ), ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. ఐడిఎఫ్ సారథ్యంలోని 230 సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని 160 దేశాల్లో ఈ ప్రచార కార్యక్రమం విస్తృత స్థాయిలో నిర్వహిస్తారు.
ఇలా మారాలి
నిజానికి మధుమేహం మనదేశాన్ని కమ్మేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు రావడం, ఆహారపు అలవాట్లు, పనితీరులో శ్రమ తగ్గడం వంటివి దీనికి కారణం. ఇతర దేశాలతో పోలిస్తే వరివంటి ధాన్యాలతో కూడిన ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారపు అలవాట్లు ఒక కారణం. పీచు పదార్థాలు లేని ఆహారం తినడం మరో కారణం. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే పాశ్చాత్య ఆహార విషేషాలను ఆరగించడం అసలు సమస్య. పనితీరు, వేళలు, చేసే పనిలో పూర్వంతో పోలిస్తే పెనుమార్పులు రావడం, ఊబకాయానికి దారి తీస్తోంది. ఇవన్నీ చక్కెర వ్యాధికి చుట్టాలన్నమాట. శరీరానికి, మనసు వ్యాయామం లేకపోవడం, యాంత్రిక జీవనం మరో కారణం. వీటివల్ల మనవాళ్లలో చక్కెర వ్యాధి పెరగడానికి కారణం. ప్రపంచంలో చక్కెర వ్యాధి పీడిత దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో ఉందని చెప్పుకున్నాం కదా. మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అలాంటిదే. ఈ వ్యాధి నుంచి బయటపడటం చాలా తక్కువ. శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతినకుండా, జీవనకాలాన్ని మరికొంత పెంచుకోవడం సాధ్యమే. అయితే ఈ వ్యాధికి చికిత్స ఖర్చుతో కూడుకున్నది. అది పేదలకు కష్టసాధ్యమైన వ్యవహారం. అందుకే డయాబెటిస్ బాధితుల్లో ఎక్కువమంది సామాన్యులు, మధ్య తరగతి వారు ఉంటున్నారు. ఆయా వర్గాల్లో చాలామందికి ఈ వ్యాధి ఉందని తెలియనుకూడా తెలియదు. సగటున ఒక వ్యక్తి డయాబెటిస్ ఉందని తెలుసుకన్న తరువాత వివిధ పరీక్షలు, ఔషధాల వాడటానికి ఏడాదికి లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేయలసి వస్తుంది. అది దీర్ఘకాలంపాటు అయితే మొదటి ఐదేళ్లకు 4 లక్షలు, ఆ తరువాతి ఐదేళ్లకు పది లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ వ్యయం సంపన్నులు తప్ప ఇతరులు పెట్టలేనంత. చిట్కావైద్యంతోనే చిన్నవారు సర్దుకుపోతున్నారు. వైద్యచికిత్స తీసుకోకపోతే డయాబెటిస్ రోగులు తమ జీవనకాలాన్ని సగానికి సగం కోల్పోతారన్నది అంచనా. ఈ వ్యాధి వల్ల ఉత్పాదక, పనిచేసే శక్తి సన్నగిల్లిపోతుంది. మానసిక, సామాజిక సమస్యలూ ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే మధుమేహం రాకుండా చూసుకోవడమే ఉత్తమమార్గం. అలా చేయాలంటే మనం ఆహారం, పని, వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవాటు చేసుకోవాలి. అది ఎవరికోసమే చేయాల్సినది కాదు. శక్తివంతమైన కుటుంబం, దేశం కోసం ఎవరికివారు తెలుసుకోవలసిన, ఆచరించాల్సిన మార్పు. మార్పు ఎప్పుడూ మంచిదే.
తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి!
దేశంలోని పదిహేను రాష్ట్రాలలో మధుమేహ వ్యాధి తీరుతెన్నులపై ఈ ఏడాది జూన్ 17న ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక సర్వే నిర్వహించారు. దేశంలో 11.1 శాతం మంది డయాబెటిక్ తొలిదశకు దగ్గరగా ఉన్నారని, 12.6 శాతం మంది డయాబెటిక్ రోగులని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా మధుమేహ బాధితులు పెరుగుతున్నారని, జాతీయ స్థాయికి సమానంగా ఇక్కడ పరిస్థితి ఉందని తేలింది. లానె్సట్ నివేదిక కూడా అదే చెబుతోంది. భోజనానికి ముందు, తరువాత రక్తంలో చక్కెర స్థాయి 6.5 గా ఉంటే ఫర్వాలేదన్నది ఒక ప్రమాణం. అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగిందని తేలింది. మధుమేహానికి తోడు హైపర్ టెన్షన్ తోడైన బాధితుల సంఖ్య తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది. హృదయ సంబంధ వ్యాధులు తెలుగు రాష్ట్రాల్లో పెరగడానికి మధుమేహం ఒక కారణంగా చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంచనా ప్రకారం మధుమేహ రోగుల్లో 22 శాతం మంది పురుషులు, 19 శాతం మంది మహిళలు ఉన్నారు. మన రాష్ట్రాల్లో మధుమేహ నియంత్రణ వైద్యం ఖరీదుతో కూడుకున్నదే. ఇన్సులిన్ వాడకం మధ్య తరగతికి భారం. సామాన్యులకు సాధ్యం కాని వ్యవహారం. ప్రభుత్వాల నుంచి ఈ విషయంలో సహకారం తక్కువే. ప్రభుత్వ ఆస్పత్రులలో ఇన్సులిన్ అందుబాటులో ఉంచినా వాటిని వాడటం, ఇవ్వడం తక్కువే. అసలు ప్రభుత్వ ఆస్పత్రులలో ఇన్సులిన్ అందుబాటులో ఉంటుందన్నది చాలామందికి తెలియని విషయం.

అతివలూ జాగ్రత్త!

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది సరికొత్త నినాదాన్ని ప్రకటించింది. గత దశాబ్దంగా మధుమేహ బాధితుల్లో మహిళలు ఎక్కువగా పెరుగుతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం భవిష్యత్తు బాగుంటున్నది భావన. అదే భావనతో ఈ నినాదాన్ని రూపొందించారు. ‘విమెన్ అండ్ డయాబెటిస్-అవర్ రైట్‌టు హెల్దీ ఫ్యూచర్’ అన్నది 2017 వరల్డ్ డయాబెటిస్ డే స్లోగన్. రెండోరకం మధుమేహం బాధితుల్లో ఎక్కువగా మహిళలు ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 199 మిలియన్ల మంది మహిళలు చక్కెర వ్యాధి పీడితులు. 2040 నాటికి వీరి సంఖ్య 313 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో 60 మిలియన్ల మంది పునరుత్పత్తి దశలో ఉన్నవారే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఏడాదికి 2.1 మిలియన్ల మంది మహిళలు ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. మొదటిరకం మధుమేహం వల్ల ఎక్కువమంది మహిళలు గర్భస్రావానికి గురవుతున్నారు. అత్యవసర వైద్యం, ఔషధాలు వారికి అందుబాటులోకి తీసుకురావడం, అధునాతన సాంకేతిక వైద్య విధానాలను అందుబాటులోకి తేవడం, వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించడం, స్వయంగా స్వల్పస్థాయి చికిత్సలు చేసుకోగలగడం, విద్యావిధానంలో ఈ అంశాన్ని చేర్చడం వంటి ఆశయాలతో ఈ నినాదాన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకువస్తున్నారు.

పదేపదే ఒకే సిరంజి వాడకం!
ప్రపంచంలో మధుమేహ పీడుతుల్లో ఎక్కువ మంది టైప్2 డయాబెటిస్ బాధితులు. అదుపుతప్పితే వీరు ఇన్సులిన్ వాడవలసి వస్తుంది. సిరంజి, పెన్‌లతో ఇన్సులిన్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఖరీదుతో కూడుకున్నవి. తరచూ కొనలేనివారు ఒకే సిరంజ్ లేదా నీడిల్‌ను కనీసం ఐదుసార్లు వాడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇది ప్రమాదకరం. తెలిసినా రోగులు ఖర్చు తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నిజానికి భారతదేశంలో మధుమేహ రోగులు చాలా ఎక్కువ. అయినా ఇన్సులిన్ తీసుకునేవారు చాలా తక్కువ. ఖర్చు, అవగాహన, అందుబాటులో లేకపోవడం అందుకు కారణం. ఇన్సులిన్ వాడుతున్న రోగుల నుంచి సమాచారం సేకరించి ఓ నివేదికను ఇటీవల విడుదల చేశారు. కోల్‌కతాలోని ఎస్‌స్‌కెఎమ్ హాస్పిటల్, ఐపిడిఎమ్‌ఇఆర్‌కు చెందిన ప్రొఫెసర్ సుభాంకర్ చౌదరి చెప్పిన వివరాల ప్రకారం ఇన్సులిన్ వాడుతున్నవారిలో 55.8 శాతం మంది ఒకే సిరంజిని ఐదుసార్లు వాడుతున్నారు. నిజానికి ఫోరమ్ ఫర్ ఇంజక్షన్ టెక్నిక్ వారి ప్రమాణాల ప్రకారం సిరంజి పొడవు 6 ఎం.ఎం, పెన్ నీడిల్ పొడవు 4 ఎం.ఎం.కు మించదు. ఇవి చాలా సన్నగా ఉండటం వల్ల నొప్పి కూడా తెలియదు. కానీ కాస్తంత ఖరీదుతో కూడుకున్నవే. అందువల్ల పొదుపు చర్యల్లో భాగంగా రోగులు అలా చేస్తున్నారు. ప్రపంచం మొత్తంమీద ఇన్సులిన్ వాడుతున్నవారిపై 42 దేశాల్లో 400 కేంద్రాల నుంచి 14వేల మంది రోగుల అభిప్రాయాలు సేకరించారు. అందులో భాగంగా భారత్‌లో 20 కేంద్రాల నుంచి వెయ్యిమంది రోగులను అభిప్రాయాలు అడిగారు. వారిలో దాదాపు 60 శాతం మంది పదేపదే ఒకే సూది లేదా సిరంజిని వాడుతున్నట్లు చెప్పారు. మనదేశంలో 6.9 కోట్లమంది మధుమేహ రోగులు ఉంటే కేవలం 3 లక్షల మంది మాత్రమే ఇన్సులిన్ వాడుతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది.

-కృష్ణతేజ