S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పథకం

అనేక విధాలుగా ఆలోచించాక కెమ్మెరర్ తన బాస్ జాక్‌ని గొంతు పిసికి చంపడం మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. అది నిశ్శబ్దంగా జరిగిపోతుంది అని అనుకున్నాడు. రివాల్వర్ ఐతే పేలుడు చప్పుడు విన్పిస్తుంది. పైగా తను రోజూ ఉదయం ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల జాక్ కన్నా బలవంతుడు. జాక్ తనకన్నా అడుగున్నర పొట్టి కాబట్టి ఎదిరించలేడు.
ఆ సోమవారం ఉదయం కెమ్మెరర్ తను పేయింగ్ గెస్ట్‌గా ఉన్న గదిలో రోజూలా ఆరున్నరకి నిద్ర లేచి రేడియోని ఆన్ చేశాడు. అతనికా గదిని అద్దెకి ఇచ్చిన ఫైలింగ్ కుటుంబానికి డబ్బవసరం కాబట్టి ఆ రేడియో శబ్దం తమకి డిస్టర్బెన్స్ అని అభ్యంతరం చెప్పరు. ఓ రేడియో స్టేషన్ నించి ఆ సమయంలో ఎక్సర్‌సైజ్‌లని చేయించే కార్యక్రమం ప్రసారం అవుతూంటుంది. అది ఇంకా ఆరంభం కాలేదు. ఉదయం ఆరు నలభై ఐదుకి మొదలవుతుంది. ఎనౌన్సర్ చెప్పే ఒన్.. టూ.. త్రీ.. ఫోర్‌లని వింటూ కెమ్మెరర్ బస్కీలు తీస్తాడు.
అతనా ఉదయం చకచకా డ్రెస్ చేసుకుని కిటికీలోంచి ఫైర్ ఎస్కేప్ మెట్ల మీదకి చేరుకుని మేడ మీదికి వెళ్లాడు. రెండిళ్ల రూఫ్‌ల మీదకి దూకి వాటిని దాటి, ఓ నాలుగంతస్థుల ఇంటి వెనక ఫైర్ ఎస్కేప్ మెట్ల మీంచి రోడ్ మీదకి దిగాడు. ఎప్పటిలా ఆ సమయంలో, ఆ చలిలో అంతా నిర్మానుష్యంగా ఉంది.
అతను ఆ కాలనీలోని రంగుల్లేని, టులెట్ బోర్డులు వేలాడే ఇళ్లని నిరసనగా చూశాడు. త్వరలో తనకి డబ్బు అందగానే మొదటగా ఆ ప్రాంతం నించి ఖాళీ చేయాలని అనుకున్నాడు.
జాక్ మెటల్ వర్క్స్ ఆఫీస్ అక్కడికి ఏడు నిమిషాల నడక దూరంలో ఉంది. ప్రతీరోజూ జాక్ ఆఫీస్‌కి ఉదయం ఆరున్నరకి చేరుకుంటాడు. అక్కడ పావుగంట సేపు ఆఫీస్ కాగితాలు చూసుకుని వేన్‌లో న్యూయార్క్ చుట్టుపక్కల ఉన్న లాంగ్ ఐలెండ్, న్యూజెర్సీ, కనెక్టికట్లలోని ఓ చోటికి వెళ్లి పాత ఇనుముని కొంటాడు. ముప్పై ఏళ్లల్లో అతను చక్కటి వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అరవై నాలుగేళ్ల జాన్‌కి వారసులు లేకపోవడంతో తన వ్యాపారాన్ని కెమ్మెరర్‌కి, తన ఫౌండ్రీలో పనిచేసే మరో ఇద్దరికి చెందేలా విల్లు రాశాడు. తను చేసే పని వల్ల తాము త్వరగా వారసులైన సంగతి మిగిలిన ఇద్దరికీ తెలీదు. దాంతో వాళ్లు తనకి కృతజ్ఞతలు కూడా తెలియజేయలేరు అనుకున్నాడు.
ఆ పాత భవంతిలోకి నడుస్తూ చేతులకి గ్లవ్స్‌ని తొడుక్కున్నాడు. రెండో అంతస్థులోని ఆఫీస్ గదిలోకి నడుస్తూంటే పాత చెక్క మెట్లు కిర్రుమని శబ్దం చేశాయి. జాక్ ఆ చప్పుడు విని, చేసే పనిలోంచి తలెత్తి గుమ్మం వైపు చూశాడు. కెమ్మెరర్‌ని చూడగానే చేతిలోని ఇంక్ పెన్‌ని బల్ల మీద ఉంచి అడిగాడు.
‘హలో, గుడ్‌మార్నింగ్. ఇవాళ ఇంత త్వరగా ఆఫీస్‌కి ఎందుకు వచ్చావు? మన వ్యాపారం అభివృద్ధి చేయాలని అనుకుంటున్నావా?’ నవ్వుతూ అడిగాడు.
కెమ్మెరర్ ముందుగా అనుకున్న జవాబుని చెప్పాడు.
‘నాకు మెలకువ వచ్చాక మళ్లీ నిద్ర పట్టలేదు మిస్టర్ జాక్. అందుకని వచ్చాను’
ముందుగా కెమ్మెరర్ తన ఆఫీస్ గదిలోకి వెళ్లి రేడియోని ఆన్ చేశాడు. ఏ కారణం చేతైనా కార్యక్రమంలో మార్పు ఉంటే అది ముందే తెలుసుకోవాలి. రేడియో అనౌన్సర్ కంఠం వినిపించింది.
‘అంతా సిద్ధంగా ఉన్నారా?’
‘నీకు కొత్తగా రేడియో పిచ్చి ఏమిటి?’ జాక్ గట్టిగా అడిగాడు.
కార్యక్రమంలో మార్పు లేదు అనుకుని బయటకి వచ్చాడు. తన వైపు వస్తున్న అతన్ని చూసి జాక్ అర్థంకాక అడిగాడు.
‘ఏమిటి?’
‘ఏం లేదు’
కెమ్మెరర్ కళ్లల్లోని కఠినత్వాన్ని, మొహంలోని నిశ్చయాన్ని ఆయన గుర్తించాడు. కెమ్మెరర్ ముందుకి వంగి జాక్ మెడ చుట్టూ చేతులని ఉంచి పిసకసాగాడు. వృద్ధుడు జాక్ బలహీనుడు కాబట్టి ఎక్కువగా తిరగబడలేక పోయాడు. ఆయన అరిచే ప్రయత్నం చేశాడు కాని అది మూలుగ్గా బయటకి వచ్చింది. ఆయన కళ్లల్లోని ఆశ్చర్యాన్ని కెమ్మెరర్ గుర్తించాడు. ఆయన కాళ్లు, చేతులు తీవ్రంగా కొట్టుకోసాగాయి. ఆయన వేళ్లు కెమ్మెరర్ చొక్కా జేబుని పట్టుకున్నాయి. అతని జేబులోని ఎర్ర రంగు ఇంక్ గల పార్కర్ పెన్ కింద పడి ఆయన ప్రాణాలు వదిలే సమయంలోనే పగిలి ముక్కలైంది.
కెమ్మెరర్ ఆయన నిర్జీవ శరీరాన్ని కుర్చీలో కూర్చోబెట్టి, గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. తర్వాత వంగి ఆ పెన్ ముక్కలని ఏరాడు. ఒకవేళ కొన్ని ముక్కలు తనకి దొరక్క, అవి గదిలో ఏ మూలో దాక్కుని ఉంటే? తెలివైన డిటెక్టివ్‌లు ఇలాంటి ఆధారాల కోసమే వెదుకుతూంటారు.
కెమ్మెరర్ లేచి ఓసారి నేలంతా జాగ్రత్తగా చూశాడు. ఎదురుచూడని ఈ సంఘటనకి అతనిలో స్వల్పంగా వణుకు బయలుదేరింది.
జాక్ రాస్తూ బల్ల మీద ఉంచిన పెన్ మీద అతని దృష్టి పడింది. అది అచ్చం తన పెన్ లాంటిదే. ఆయన తనకి, మిగిలిన వర్కర్స్‌కి ఒకే షాప్ నించి ఒకేసారి వాటిని కొన్నాడు. దాన్ని అందుకుని కెమ్మెరర్ మూతపెట్టి, జాక్ వేలిముద్రలు పోయేలా తుడిచి తన జేబులో ఉంచుకున్నాడు. జాక్ తన పెన్‌లో ఎప్పుడూ ఆకుపచ్చ రంగు ఇంకునే పోసి వాడుతూంటాడు. రేడియో ఎనౌన్సర్ కంఠాన్నిబట్టి కార్యక్రమం చివరికి వచ్చేస్తోందని గ్రహించాడు.
నేల మీద తన పెన్‌లోని నల్ల ఇంకు కారడం చూశాడు. దాన్ని తను సరిదిద్దలేడని కెమ్మెరర్ భావించాడు. అది ఎవరి పెన్ ఐనా కావచ్చు. మరణానికి ముందు జాక్ ఆకుపచ్చ రంగు ఇంక్‌తో రాస్తున్నాడని గ్రహించగానే పోలీసులు ముగ్గురు ఉద్యోగస్థుల పెన్‌లని తప్పక తనిఖీ చేస్తారు. ఈలోగా తను అందులో నల్ల ఇంకుని పోయాలి.
రేడియోని ఆఫ్ చేసి, డయల్ ముల్లుని ఆ స్టేషన్ నించి మరో స్టేషన్‌కి మార్చి ఆఖరిసారి జాక్ నిజంగా పోయాడో లేదో పరిశీలించి చూసి మెట్ల మీంచి కిందకి నడిచాడు. నాలుగు నిమిషాల్లో తన వీధికి చేరుకున్నాడు. దారిలో గ్లవ్స్‌ని జేబులోంచి తీసి చెత్తబుట్టలో పారేశాడు. రెండు నిమిషాల్లో మళ్లీ మెట్ల మీంచి రూఫ్ మీదకి చేరుకున్నాడు. మళ్లీ ఇళ్ల కప్పుల మీంచి తన ఇంటి కప్పు మీదకి చేరుకుని ఫైర్ ఎగ్జిట్ మెట్ల మీంచి రెండో అంతస్థులోని కిటికీ లోంచి తన గదికి చేరుకున్నాడు. ఎవరూ తనని చూడనందుకు సంతోషపడ్డాడు.
‘ఈ ఎక్సర్‌సైజులని మీకు అందించింది...’ రేడియోలో ప్రకటన వినిపిస్తోంది.
తను చేయాల్సింది త్వరగా ముగించాలి అనుకున్నాడు. జాక్ మెటల్ వర్క్స్‌ని శుభ్రం చేయడానికి రోజూ ఉదయం ఏడుకి పనివాడు వస్తాడు. పోలీసులు అడిగితే అతను ముగ్గురు ఉద్యోగస్థుల చిరునామాలని ఇస్తాడు. కొద్దిసేపట్లో పోలీసులు తన గదికి తప్పక రావచ్చు. ముందు బాత్‌రూంలోకి వెళ్లి పెన్ కేప్‌ని తీసి స్క్రూ విప్పి కిటికీలోంచి అందులోని ఆకుపచ్చ ఇంక్‌ని బయట పారపోశాడు. తర్వాత పెన్‌ని నీళ్లతో శుభ్రంగా కడిగి తన బల్ల మీద ఉన్న నల్ల ఇంకుని అందులో నింపాడు. తర్వాత దినపత్రిక మీద రాసి చూసాడు. అది బాగా రాసింది. దినపత్రికలోని రాసిన భాగాన్ని నలిపి టాయ్‌లెట్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు.
ఆకుపచ్చ రంగు ఇంకు మరకలు తన గదిలో ఎక్కడా లేవని నిర్థారణ చేసుకున్నాక తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్ కోసం బయటకి నడిచాడు.
‘గుడ్‌మార్నింగ్ మిస్టర్ కెమ్మెరర్. ఎక్సర్‌సైజ్ చేసేసారా? ఆకలిగా ఉందా? బ్రేక్‌ఫాస్ట్ రెడీ’ మిసెస్ ఫైలింగ్ నవ్వుతూ ఆహ్వానించింది.
తనలో ఎలాంటి ఆందోళనా లేదని, సహజంగా ఉన్నాడని, లేదా ఆవిడ గుర్తించి ప్రశ్నిస్తుందని అనుకున్నాడు. కారణం బహుశ తను ఈ పథకాన్ని చాలాకాలంగా వేస్తూండబట్టి అవచ్చు. అంతా దాని ప్రకారమే జరిగిపోయింది కాబట్టి తనని పట్టించే ఆధారాలేమీ పోలీసులకి దొరకవు.
* * *
డోర్‌బెల్ మోగింది. వెళ్లి తలుపు తెరచిన మిసెస్ ఫైలింగ్ వచ్చి ఆశ్చర్యంగా చెప్పింది.
‘మిస్టర్ కెమ్మెరర్. పోలీసులు మీ కోసం వచ్చారు!’
మిస్టర్ ఫైలింగ్ ఎలాంటి తడబాటు లేకుండా బ్రేక్‌ఫాస్ట్‌ని తాపీగా తినసాగాడు.
ఆవిడ వెంట లోపలకి వచ్చిన యూనిఫాంలోని పోలీస్ ఆఫీసర్ అడిగాడు.
‘ఉదయమంతా మీరు ఇక్కడే ఉన్నారా?’
‘ఏమిటి మీ ఉద్దేశం? అది మీకు ఎందుకు అవసరం? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు?’ కెమ్మెరర్ విభ్రాంతిని నటిస్తూ అడిగాడు.
‘ఎక్సయిట్ అవకండి మిస్టర్ కెమ్మెరర్. మీ బాస్ జాక్ ఆరుంముప్పావుకి గొంతు పిసికి చంపబడ్డాడు’ అతను మృదువుగా చెప్పాడు.
‘గుడ్ గాడ్! నో...’ అతను ముందుగా రిహార్సల్స్ వేసుకున్నట్లుగానే బాధగా చెప్పాడు.
‘అరె పాపం! కాని మిస్టర్ కెమ్మెరర్‌కి, దానికి ఏం సంబంధం లేదు. అతను ఆ సమయంలో రోజూలానే తన గదిలో ఎక్సర్‌సైజ్ చేస్తున్నాడు. అతని గదిలోంచి మాకు రేడియో వినిపించింది’ మిస్టర్ ఫైలింగ్ శాంతంగా చెప్పాడు.
‘కాని మీరు అతని కంఠం విన్నారా? లేక రేడియో మాత్రమేనా?’
‘రేడియోనే’
‘అదేం ప్రశ్న?’ కెమ్మెరర్ చురుగ్గా చూస్తూ అడిగాడు.
‘నాకు కావాల్సింది మీరు చూపిస్తే ఎవర్నీ మేం అడక్కుండా వెళ్లిపోతాను’ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
‘ఏం చూపించాలి?’
‘మీ ఫౌంటెన్ పెన్’
‘నా పెన్నా? దేనికి? సరే. అలాగే’
అతను తన గదిలోకి వెళ్లాడు. ఆఫీసర్ అతన్ని అనుసరించాడు. తను దాన్ని ఇవ్వగానే మూత తెరిచి తన నోట్‌బుక్‌లో రాసి చూసాడు. అతని మొహంలో కొద్దిగా నిరాశ కనిపించింది.
‘ఇది మీ పెనే్న. జాక్ పెన్ అయి ఉంటే ఆకుపచ్చ రంగు ఇంక్ ఉండేది. అతన్ని చంపాక అతని పెన్‌ని దొంగిలించాడని నా అనుమానం. ఎందుకంటే హంతకుడి పెన్ అక్కడే బద్దలైంది.’
ఆ ఇంటి డోర్ బెల్ మోగింది. ఇద్దరూ హాల్‌లోకి వచ్చారు. మిసెస్ ఫైలింగ్ తలుపు తెరవగానే లోపలకి నైట్ గౌన్‌లో ఉన్నపళంగా విసురుగా వచ్చిన పక్కింటావిడ తన చేతిలోని దిండు గలీబుని చూపిస్తూ కోపంగా గట్టిగా చెప్పింది.
‘నేను మిసెస్ గైలీని. కింది ఫ్లేట్‌లో ఉంటాను. నా బాల్కనీలో కుర్చీలోని దిండు గలీబు మీదకి ఆకుపచ్చ రంగు ఇంక్‌ని ఎందుకు చల్లారో తెలుసుకోవచ్చా?’
ఆ దిండు గలీబుని ఆవిడ ఎత్తి పట్టి చూపిస్తే దాని మధ్య ఇంకా ఆరని ఆకుపచ్చ ఇంక్ మరకలు కనిపిస్తున్నాయి.

(ఏంథోని క్లెమెన్స్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి