S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..63 మీరే డిటెక్టివ్

తర్వాత సీతా, రామ, లక్ష్మణులు దీనంగా తమ చేతులని జోడించి రాజు పాదాలని తాకి, నమస్కరించి ఆయనకి ప్రదక్షిణం చేసారు. దశరథుడు అనుమతించాక ధర్మం తెలిసిన రాముడు, సీత దుఃఖంగా కౌసల్యకి నమస్కరించారు. లక్ష్మణుడు కూడా కౌసల్యకి నమస్కరించి, తన తల్లి సుమిత్ర పాదాలని తాకి నమస్కరించాడు. తనకి నమస్కరించే కొడుకు లక్ష్మణుడి తలని సుమిత్ర వాసన చూసి ఏడుస్తూ, అతని మంచి కోరుతూ చెప్పింది.
‘కుమారా! స్నేహితుల మీద నీకున్న ప్రేమ అపరిమితం. పరమాత్మ నిన్ను వనవాసం కోసమే సృష్టించినట్లున్నాడు. ఏమరపాటు లేకుండా అన్న రాముడ్ని అరణ్యవాసంలో కాపాడు. దోషాలు లేని ఓ కుమారా! కష్టాల్లో ఉన్నా, ఐశ్వర్యవంతుడైన ఈ రాముడే నీకు పరమగతి. పెద్దన్నని అనుసరించి ఉండటం ఈ లోకంలో సత్పురుషులు అంగీకరించిన ధర్మం. దానాలు చేయడం, దీక్ష వహించి యజ్ఞాలు చేయడం, యుద్ధాల్లో దేహ త్యాగం చేయడం అనేవి ఈ కులంలో ప్రాచీన కాలం నించి వచ్చే ఆచారం కదా? రాముడే దశరథుడు అని, సీతే నేనని, అడవిని అయోధ్య అని భావించు. నాయనా! సుఖంగా వెళ్లిరా’
రాముడితో బాగా స్నేహం చేసే లక్ష్మణుడితో సుమిత్ర ఇలా చెప్పి, ‘వెళ్లు, వెళ్లు’ అని మళ్లీ మళ్లీ చెప్పింది.
వినయం తెలిసిన సుమంతుడు రాముడికి నమస్కరించి మాతలి సూర్యుడితో చెప్పినట్లుగా చెప్పాడు.
‘గొప్ప కీర్తిగల ఓ రాజకుమారా! రామా! నీకు క్షేమం అవుగాక! రధాన్ని ఎక్కు. నువ్వు ఎక్కడికి వెళ్లాలని చెప్తావో అక్కడికి వెంటనే తీసుకు వెళ్తాను. నువ్వు పనె్నండు సంవత్సరాలు అడవిలో ఉండాలి కదా? కైకేయి ఆజ్ఞాపించినట్లుగా ఆ సంవత్సరాలని నువ్వు ప్రారంభించాలి’
అలంకరించుకున్న అందమైన సీత సంతోషంగా సూర్యుడిలా ప్రకాశించే ఆ రథాన్ని ఎక్కింది. తర్వాత రామలక్ష్మణులు కూడా బంగారంతో అలంకరించిన, మండే అగ్నిలా ప్రకాశించే ఆ రథాన్ని ఎక్కారు. ఆ అన్నదమ్ముల వినియోగం కోసం అనేక ఆయుధాలు, కవచాలు, డాలు, హస్త కవచాలు మొదలైన వాటిని రథంలో ఉంచి సుమంత్రుడు వాయువేగంతో నడిచే గుర్రాలని వేగంగా తోలాడు. చాలాకాలం అడవిలో నివసించడానికై రాముడు బయల్దేరగానే నగరమంతా శోకంలో మునిగిపోయింది. ప్రజలంతా తమ బలాన్ని కోల్పోయారు. అప్పుడు ఆ పట్టణంలో మదించిన ఏనుగులు కోపంతో చెలరేగాయి. గుర్రాలు సకిలించడం మొదలుపెట్టాయి. ఇలా గొప్ప ధ్వనితో ఆ పట్టణమంతా వ్యాకులం ఐపోయింది. పిల్లలు, ముసలి వాళ్లతో సహా ఆ పట్టణంలోని ప్రజలంతా, ఎండకి బాధపడేవాడు నీటి వైపు పరిగెత్తినట్లు విచారంగా రాముడి వైపు పరిగెత్తారు. ప్రజలంతా రాముడికి పక్కన, వెనక గుమిగూడి అతని వైపు తిరిగి కన్నీళ్లతో గట్టిగా ఇలా చెప్పారు.
‘ఓ సారధీ! గుర్రాలని కళ్లేలని లాగి మెల్లగా వెళ్లు. మేము రాముడి మొహాన్ని చూడాలి. ఇక మీద అది చూడటానికి మాకు వీలు కాదు. దేవతా కుమారుడి లాంటి కొడుకు అడవికి వెళ్తున్నా కౌసల్య హృదయం బద్దలు కాలేదు. నిస్సందేహంగా అది ఇనుముతో చేసినదే. సూర్యుడి కాంతి మేరుపర్వతాన్ని విడవనట్లుగా సీత ధర్మనిరతితో భర్తని విడవకుండా అతన్ని నీడలా అనుసరించి వెళ్తోంది. ఈమె ధన్యురాలు. ఓ లక్ష్మణా! ప్రియమైనవే మాట్లాడే, దేవతలతో సమానమైన నీ సోదరుడికి ఎల్లప్పుడూ సేవ చేస్తున్నావు. నువ్వు ఎంత అదృష్టవంతుడివి! నువ్వు రాముడ్ని అనుసరించి వెళ్లడమే గొప్ప సిద్ధి. ఇదే గొప్ప అభివృద్ధి. ఇదే స్వర్గ మార్గం కూడా’
ఇలా మాట్లాడుతూ ఇక్ష్వాకువంశ వర్థనుడు, తమకి ప్రేమపాత్రుడు ఐన ఆ రాముడ్ని అనుసరించి వెళ్లే ఆ ప్రజలు తమ కళ్ల నించి కారే కన్నీటిని ఆపుకోలేక పోయారు.
తర్వాత దీనమైన మనసుగల దశరథుడు ‘తమ ప్రియమైన కొడుకుని చూస్తాను’ అంటూ విచారించే స్ర్తిలతో కలిసి ఇంటి నించి బయటకి వచ్చాడు. ఆ స్ర్తిలంతా పెద్దగా ఏడవడంతో ఆ శబ్దం మహా గజాన్ని బంధించినప్పుడు ఏడుస్తున్న ఆడ ఏనుగులు చేసే ధ్వనిలా వినపడింది. తండ్రి దశరథుడు సహజమైన కళ గలవాడైనా, ఆ సమయంలో గ్రహణ కాలంలో రాహువు కమ్మిన పూర్ణచంద్రుడిలా క్షీణించాడు. అందమైన వాడు, ఊహించలేని ధైర్యం గల రాముడు ‘వేగంగా తోలు’ అని సారధిని ఆదేశించాడు.
ఒకే సమయంలో ‘తొందరగా నడుపు’ అని రాముడు, ‘ఆపు’ అని ప్రజలు చెప్పడంతో ఆ సారధి ఆ రెండు పనులు చేయలేక పోయాడు. రాముడు బయలుదేరిన సమయంలో ప్రజలు తొక్కిడితో రేగిన దుమ్ము వారి కన్నీళ్లు పడి అణగిపోయింది. రాముడి ప్రయాణ సమయంలో ఆ నగర వాసులంతా కన్నీళ్లు కారుస్తూ హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయి చాలా బాధపడ్డారు. చేపల తాకిడికి కదిలిన పద్మాల నించి నీళ్లు కారినట్లుగా, స్ర్తిల కళ్ల నించి విచారంతో కూడిన కన్నీరు కారింది. ప్రజలంతా ఒకే విధమైన మనసుతో విచారించడం చూసిన దశరథుడు బాధతో మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు. దుఃఖార్హుడై, క్షీణించిపోయే రాజుని చూసి ప్రజలు చేసిన కోలాహలం రాముడికి వెనక నించి వినిపించింది. ఆ ప్రజల్లో కొందరు ‘అయ్యో రామా!’ అని అరిచారు. మరి కొందరు ‘అయ్య రామమాతా!’ అని అరిచారు. ఇలా అరుస్తూ ఆ ప్రజలు అంతఃపురంలోని స్ర్తిలు కూడా ఏడ్చేట్లుగా చేశారు.
రాముడు వెనక్కి తిరిగి చూస్తే తన వెంట వచ్చే విచలితులైన తల్లిదండ్రులు కనపడ్డారు. ధర్మపాశంతో కట్టబడ్డ రాముడు తాడుతో కట్టబడ్డ గుర్రపు పిల్ల తన తల్లిని సరిగ్గా చూడలేనట్లుగా తన తల్లిదండ్రులని సరిగ్గా చూడలేక ఓర కంటితో చూశాడు. సుఖానికి అలవాటు పడినవారు, దుఃఖం అనుభవించటానికి తగని వాళ్లు, వాహనాలకి తగిన వారు ఐన తల్లిదండ్రులు కాలినడకన రావడం చూసి ‘తొందరగా నడుపు’ అని రాముడు సారధిని కోరాడు. పురుష శ్రేష్ఠుడైన రాముడు అంకుశంతో బాధించబడే ఏనుగులా బాధపడుతూ, దుఃఖాన్ని కలిగించే తల్లిదండ్రుల అవస్థని చూడలేక పోయాడు. ‘హా రామా! హా సీతా! హా లక్ష్మణా!’ అని ఏడుస్తూ, అరుస్తూ, రామలక్ష్మణ, సీతల కోసం విలపిస్తూ ఒళ్లు తెలీక అటు, ఇటు ఊగిపోతూ నాట్యం చేస్తున్నట్లున్న తల్లిని రాముడు మాటిమాటికీ చూశాడు. రాజు ‘ఆగు, ఆగు’ అని అరుస్తూండగా రాముడు ‘నడుపు, నడుపు’ అని అరిచాడు. అప్పుడు సుమంత్రుడి మనసు రెండు చక్రాల మధ్య పడినట్లు సంకటంలో పడింది.
సుమంత్రుడు రాముడి మాట ప్రకారం వెంట వచ్చే ప్రజల అనుమతి తీసుకుని గుర్రాలు పరిగెత్తుతున్నా ఇంకా వేగంగా పరిగెత్తేట్లుగా వాటిని తోలాడు. ప్రజలంతా రాముడికి ప్రదక్షిణం చేసి తిరిగి వెళ్లారు. కాని వారి మనసులు మాత్రం వెనక్కి మళ్లలేదు. కన్నీళ్లు తగ్గలేదు.
దశరథుడి శరీరం అంతా చెమట పట్టి, రూపం వాడిపోయింది. దీనుడైన ఆయన సుగుణాలతో కూడిన వారి మాటలు విని తన రథం వైపు, కొడుకు వైపే చూస్తూ భార్యా సహితంగా అక్కడే నిలబడ్డాడు (అయోధ్య కాండ సర్గ -40)
ఆ హరికథ విన్న శ్రోతల్లోని ఓ వృద్ధుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘హరికథని మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, మీతో సాక్షాత్తు రాముడే తన కథని పలికిస్తున్నాడని నాకు అనిపిస్తోంది. కాకపోతే మీరు చెప్పిన కథలో ఆరు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా వినండి. ఈ కథని మళ్లీ చెప్పినప్పుడు మీరీ తప్పులని చెప్పకపోతే సరి.’
ఆ తప్పులని మీరు పట్టుకోగలరా?
*
మీకో ప్రశ్న

దశరథుడు అంటే
అర్థం ఏమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
చక్రవర్తి రాజగోపాలాచారి రాసిన
రామాయణం పేరు?
-రాజాజి రామాయణం
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.‘గతంలో నేను ఎందర్నో తమ పిల్లల నించి వేరు చేసాను. లేదా ప్రాణులని చంపి ఉంటాను. అందువల్లే ఇది వచ్చి పడింది అనుకుంటున్నాను’ అని దశరథుడు రాముడితో చెప్పిన మాటలు హరిదాసు చెప్పలేదు.
2.తండ్రి బాధ పడటం చూసి లక్ష్మణుడు కూడా బాధపడ్డాడు’ అని హరిదాసు చెప్పాడు. కాని 39వ సర్గలో లక్ష్మణుడి ప్రసక్తే రాలేదు.
3.‘అడవిలో ఎన్ని సంవత్సరాలు ఉండాలో ఆ లెక్క ప్రకారం’ సీతకి కావాల్సిన దుస్తులు, అలంకారాలు తీసుకురమ్మని దశరథుడు కోశాధికారిని కోరాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
4.‘ భర్త లేని స్ర్తి వంద మంది కొడుకులున్నా కూడా సుఖంగా ఉండదు’ అని సీత కౌసల్యతో చెప్పిన మాటలని చెప్పడం హరిదాసు విస్మరించాడు.
5.రాముడు ‘మూడు వందల ఏభై మంది’ తల్లుల వంక చూశాడు. హరిదాసు మూడు వందలనే సంఖ్య తప్పుగా చెప్పాడు.
6.38, 39 సర్గలని హరిదాసు చెప్పాడు. కాని ఒక్క సర్గే చెప్పానని తప్పుగా చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి