S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనుకోని అతిథి

‘అతను వచ్చాడు’ కిటికీలోంచి బయటకి చూసిన వృద్ధురాలు చెప్పింది.
‘అయ్యో! జీవించి ఉన్న ఏకైక బంధువు. ఇప్పుడు ఆస్థి మొత్తం అతనికే ఇవ్వాలి అనుకుంటాను’ ఆవిడ భర్త బాధగా చెప్పాడు.
‘ఆవిడని మనం గత ఇరవై ఏళ్లుగా కనిపెట్టి ఉన్నాం. మనకి ఆవిడ కొంత ఇవ్వడం సబబు’ ఆ వృద్ధురాలు చెప్పింది.
‘మనకి కొంత ఇస్తానని ఆవిడ చెప్పింది. అదీ చాలా తక్కువే. నేను వేసుకున్న ఈ డ్రెస్ పదేళ్లది. మళ్లీ ఇంకోటి కొనిపెట్టనే లేదు. ఆవిడ దగ్గర ఇరవై ఏళ్లుగా పనిచేస్తే నాకు మిగిలినవి చిరిగిన బూట్లు’ వృద్ధుడు నిరసనగా చెప్పాడు.
‘నిజమే. కాని మనం ఇంకో ఉద్యోగం చేసేంత ఆరోగ్యవంతులం కాము’
బెల్ మోగింది. ఆ వృద్ధుడు తలుపు తెరిచి అవతల నిలబడ్డ యువకుడ్ని అడిగాడు.
‘మీరు కింబల్ హోవర్డీనా?’
‘ఇంకెవరు అనుకున్నావు? బిల్ కలెక్టర్ అనుకున్నావా? నువ్వెవరు?’ ఆ వ్యక్తి చిరాగ్గా అడిగాడు.
‘నా పేరు గ్లింకోస్. మీ మేనత్త రాసిన ఉత్తరాన్ని నేనే పోస్ట్ చేశాను’
అతను చుట్టూ చూసి మొహం చిట్లించి చెప్పాడు.
‘ఇక్కడంతా చెత్తకుండీలా ఉంది. చెత్తని బయట చూశా తప్ప ఇంట్లో ఎప్పుడూ చూడలేదు’
అతని కళ్లు అమ్మడానికి ఏమైనా ఉన్నాయా అని అక్కడి వస్తువులని నిశితంగా పరిశీలించాయి.
గ్లింకోస్ తనని, తన భార్యని సేవకులుగా పరిచయం చేసుకున్నాక అడిగాడు.
‘మేడ మీది మీ మేనత్తని వెళ్లి పలకరిస్తారా?’
‘ఆవిడ పది నిమిషాల్లో చచ్చిపోతోందా?’
ఆ ప్రశ్నకి దంపతులు ఇద్దరూ తెల్లబోయారు.
‘నేను వెయ్యి మైళ్లు ప్రయాణించి వచ్చాను. బ్రాందీ ఉందా?’
అతను బ్రాందీ తాగుతూ చెప్పాడు.
‘నలభై ఏళ్ల క్రితం నా ఐదో ఏట ఓసారి ఇక్కడికి వచ్చాను. అప్పుడు బావుండేది. నాకు తెలిసి ఆవిడ దగ్గర చాలా డబ్బుండాలి. కాని ఇక్కడి వాతావరణం చూస్తూంటే సెంట్ కూడా ఉన్నట్లు లేదు. అవునా?’
‘అది మీరు ఆవిడనే అడగాలి’ గ్లింకోస్ చెప్పాడు.
అతను బ్రాందీని పూర్తి చేసి మెట్లెక్కి ఆవిడ గదిలోకి వెళ్లాడు.
‘నేను కింబల్‌ని. నలభై ఏళ్ల తర్వాత నాకు ఎందుకు కబురు చేసావు?’ అడిగాడు.
‘నిన్ను చూడాలని’
‘ఆ అవసరం లేదు’
‘ఈ ఇల్లు, ఇంట్లోనివన్నీ నీవే. నీ పేరు విల్లు రాసాను’
‘ఈ చెత్తిల్లు కాక ఇంకేమైనా ఉందా? డబ్బు?’ అడిగాడు.
‘చాలా తక్కువ ఉంది. షేర్లలో పెట్టాను. వాటి గురించి నాకు పెద్దగా తెలీక నష్టపోయాను. నెలకి సరిపడే ఆదాయమే వస్తుంది’
ఆవిడ కళ్లు మూసుకుని రొప్పసాగింది. కొద్దిసేపటికి ఆ రొప్పు ఆగిపోయింది.
‘ఈవిడ పోయిందా?’ కింబల్ ప్రశ్నించాడు.
‘లేదు. అలా మట్లాడే హక్కు మీకు లేదు. ఆవిడ మీ మేనత్త’ గ్లింకోస్ కోపంగా చెప్పాడు.
‘నేను ఈ ముసల్దాని మీద ప్రేమతో ఇంత దూరం రాలేదు. నాకు డబ్బవసరమై వచ్చాను. నేను జూదగాడ్ని. నాలుగు రోజుల క్రితం ఓ రాత్రి ఓ చెడ్డవాడితో జూదం ఆడాను. వాడు చాలా చెడ్డవాడు. వాడికి నేను ఓ మార్కర్‌ని ఇచ్చాను. మార్కర్ అంటే తెలుసా? ఎల్లుండికల్లా చెల్లాస్తాననే మాట. చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా? వాడి మనుషుల్ని, చావుని తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. ఈవిడ ఎప్పుడు చస్తుంది?’
‘అది డాక్టర్ కూడా చెప్పలేదు’
‘నాకు వెంటనే పదివేల డాలర్లు అవసరం. అంత వచ్చేందుకు అమ్మడానికి ఇంట్లో విలువైనవి ఏమైనా ఉన్నాయా?’
‘మీరు ఆవిడనే అడగాలి. ఇంకో గంట తర్వాత ఆవిడ లేవచ్చు’
గ్లింకోస్ భార్య అతనికి ఓ సేండ్‌విచ్‌ని చేసిచ్చింది. తిన్నాక అతను వెళ్లి పడుకున్నాడు.
‘ఆవిడ విల్లు ద్వారా అపాత్రదానం చేస్తోంది. ఆవిడ బదులు కింబల్ పోయినా బావుండును’ భార్య చెప్పింది.
‘కాని బతికే ఉన్నాడుగా?’
‘ఒకవేళ... ఒకవేళ అతను పోతే...’
భార్య మనసులోని ఉద్దేశాన్ని గ్రహించిన గ్లింకోస్ వెంటనే చెప్పాడు.
‘ఆపు. మనం డబ్బు కోసం మనిషిని చంపే వీధి రౌడీలం కాము. అలాంటి వాళ్లు నగరంలో చాలామందే ఉన్నారు’
‘మూర్ఖుడా! వృద్ధాప్యంలోని మన భవిష్యత్ గురించి, ఇతన్ని వదిలించుకునే అవకాశం గురించి ఆలోచించు’
‘జీవితంలో మనం ఇతరుల చేత ఎన్నోసార్లు వాడుకోబడ్డాం. ఇది మనకి కొత్తకాదు’
వారిద్దరూ ఆ తర్వాత వౌనంగా ఉండిపోయారు. గంట తర్వాత నిద్ర లేచిన కింబల్ వెండి టీ సెట్‌ని చూపిస్తూ అడిగాడు.
‘ఇది నిజంగా వెండేనా?’
‘దాన్ని అమ్మితే పది వేల డాలర్లు రావు. వందలోపే వస్తుంది’ గ్లింకోస్ చెప్పాడు.
‘మా తాతగారి ద్వారా వారసత్వంగా వచ్చిన లక్షల డాలర్లు ఈవిడ నాశనం చేస్తుందనుకోలేదు. కనీసం పది లక్షల డాలర్లు బేంక్‌లో ఉంటాయని అనుకున్నాను. రాగానే పదివేల డాలర్లు దొరుకుతాయని ఆశ పడ్డాను’
‘నలభై ఏళ్లల్లో చాలా జరగచ్చు’
డోర్ బెల్ మోగింది. కొద్దిసేపటికి గ్లింకోస్ భార్య వచ్చి చెప్పింది.
‘మిస్టర్ కింబల్. మీ కోసం ఇద్దరు మిత్రులు వచ్చారు’
వెంటనే అతని మొహం పాలిపోయింది.
‘ఓ గాడ్! వాళ్లు నన్ను కనుక్కున్నట్లున్నారు!’
‘ఎవరు వాళ్లు?’ గ్లింకోస్ అడిగాడు.
‘నేను మార్కర్ రాసిచ్చిన చెడ్డ వ్యక్తి పంపిన మనుషులు. అప్పుని వసూలు చేసుకోడానికి వచ్చి ఉంటారు. ఇవ్వకపోతే చంపేస్తారు. మార్కర్ అంటే అదే’
‘మీరు ఇక్కడికి వచ్చినట్లు వాళ్లకి ఎలా తెలుసు?’
‘ఎవరు చూడకుండా, నేను సూట్‌కేస్ కూడా తీసుకోకుండా బయలుదేరాను.. అర్థమైంది. నీ ఉత్తరాన్ని నా గదిలో వదిలి వచ్చాను. వాళ్లు నా గదిని వెతుకుతారని అనుకోలేదు’ కింబల్ నిస్పృహగా చెప్పాడు.
‘పోలీసులని పిలవనా?’ గ్లింకోస్ భార్య అడిగింది.
‘వాళ్లేం చేయగలరు? వచ్చిన వాళ్లు ఏ చట్టాన్ని అతిక్రమించడం లేదు. ఆ డబ్బుని చెల్లించకుండా ఈ ఇంట్లోంచి నేను ప్రాణాలతో బయటకి వెళ్లలేను’
కింబల్ చకచకా మెట్లెక్కి పైకెళ్లి, మేనత్త భుజాలు పట్టుకుని కుదిపి లేపి చెప్పాడు.
‘నన్ను చంపడానికి ఇద్దరు మనుషులు వచ్చారు. వాళ్లకి పది వేల డాలర్లు ఇవ్వాలి. వెంటనే ఇవ్వు. నువ్వు పోయాక నెల తర్వాతో, సంవత్సరం తర్వాతో కాదు’
‘నా దగ్గర లేదు. ఉన్నా కూడా ఇవ్వను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వింత దుర్మార్గుడివని కూడా అనుకోలేదు’ ఆవిడ కోపంగా చెప్పింది.
వెంట వచ్చిన గ్లింకోస్ అతని చేతిని పట్టుకుని లాగి కిందకి తీసుకెళ్లబోయాడు.
‘నీ ఇంట్లో నీ ఏకైక వారసుడ్ని చంపడం నీకే అప్రతిష్ట. ఆ తర్వాత డబ్బు ఎవరికీ చెందదు’ కింబల్ అరిచాడు.
ఆవిడ బాధగా కళ్లు మూసుకుని, కొన్ని క్షణాల తర్వాత కళ్లు తెరిచి గ్లింకోస్ వంక చూసి చెప్పింది.
‘ఇతనికి బంగారు నగలు ఇవ్వండి’
‘కాని అవంటే మీకు ప్రాణం కదా? పోలీసులకి ఫోన్ చేస్తాను’ గ్లింకోస్ సూచించాడు.
‘అతనికి నగలు ఇవ్వు’ ఆవిడ కఠినంగా చెప్పింది.
ఇద్దరూ కిందకి నడిచారు. కింబల్ తనకి ఇచ్చిన పెట్టెని తెరచి చూస్తే, నల్లటి వెల్వెట్ బట్ట లైనింగ్ గల పెట్టెలో ఉంగరాలు, బ్రేస్‌లెట్స్, వజ్రాల నెక్లెస్‌లు, పెండెంట్స్ మెరుస్తూ తమని చీకటి ఖైదు నించి విడుదల చేయమన్నట్లుగా కనిపించాయి.
‘నాకు తెలుసు. అంత డబ్బు వృధా చేయదని నాకు తెలుసు’ సంతోషంగా చెప్పి కింబల్ ఆ పెట్టెతో ముందు గదిలోకి వెళ్లిపోయాడు.
* * *
మర్నాడు కింబల్ ఆ ఇంట్లోంచి బయటకి వెళ్లిన గంటలో కాల్చి చంపబడ్డాడు. ఆ వార్తని వినగానే గ్లింకోస్ తన భార్యతో చెప్పాడు.
‘నీకో రహస్యం చెప్పలేదు. మన భవిష్యత్ కోసం ఆ నగల్ని నేను దొంగిలించి నకిలీ నగల్ని చేయించి ఆ పెట్టెలో ఉంచాను. చెడ్డ మనుషులు తమని కింబల్ మోసం చేసాడని చంపేస్తారనే అనుకున్నాను’
అతని భార్య ఆనందంగా నిట్టూర్చి చెప్పింది.
‘ఆవిడ విల్లు ప్రకారం వారసులు లేకపోతే ఆస్థి మొత్తం మనదే అవుతుంది.’
*
(స్టీఫెన్ వస్లిక్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి