S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వంతెన

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
ఆ రోజొక జాతీయ సెలవుదినం. అది రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ పురుషోత్తం గారిల్లు. కూతురు శే్వత, కొడుకు అవినాష్, కోడలు మిత్ర ముగ్గురికీ ఆ రోజు సెలవే. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కాబట్టి వారాంతపు సెలవుకాక మధ్య వచ్చిన ఈ రోజు ఎటైనా వెళ్లాలని చాలా ప్లాన్లు వేశారు. ఎందుకో ఏదీ కుదరక ఇంట్లో ఉండిపోయారు.
పురుషోత్తంగారు ఇదే అదను అనుకుంటూ టీవీలో వస్తున్న ‘మంచి కుటుంబం’ పాత సినిమా ముందు అందరినీ కూర్చోబెట్టి మధ్యలో ఆనందంగా బైఠాయించారు. భార్య పార్వతమ్మ పిల్లల అవస్థ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ కత్తిపీటతో సహా టీవీ ముందు చేరింది.
అవినాష్ సోఫాలో పడుకుని లాప్‌టాప్‌లో పని చేసుకుంటూ, శే్వత వాట్సప్ మెసేజ్‌లకు జవాబులు కొట్టుకుంటూ మధ్యమధ్య సినిమా చూస్తున్నారు. పురుషోత్తంగారు మాత్రం పూర్తిగా సినిమాలో లీనమయ్యారు.
కోడలు నటీనటుల పేర్లడుగుతూ కథలో కాస్త లీనమయింది. ‘ఆ రోజుల్లో సినిమాలెంత బావుండేవో చూడు’ అంది పార్వతమ్మ కోడలితో.
‘అవునత్తయ్యా! డైలాగులు ఓపిగ్గా రాశారు’ అంటూ మిత్ర ఫ్రిజ్‌లోంచి ఆవిడడిగిన కూరలు తీసిస్తోంది. పార్వతమ్మ వాటిని కళాత్మకంగా తరిగి పళ్లెంలో వేస్తోంది. వంటింట్లో కుక్కర్ కూత వేస్తోంది. కోడలు హాల్లోకీ, కిచెన్‌లోకీ లేడిపిల్లలా చెంగుచెంగున తిరుగుతోంది.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పార్వతమ్మ లేచి గబగబా చేతులు కడుక్కుని తలుపు తీసింది.
ఎదురుగా నిలబడ్డ సత్యాన్ని చూసి ఆనందపడుతూ ‘రా నాన్నా! రా!’ అంది వెనక్కి జరుగుతూ.
సత్యం పార్వతమ్మ పిన్నమ్మ కొడుకు. అనకాపల్లిలో బెల్లం వ్యాపారం చేస్తున్నాడు. అతని రాక అందరికీ ఉత్సాహాన్ని కలిగించింది. సత్యం ‘బావున్నారా బావగారూ!’ అనగానే, పురుషోత్తం లేచి సత్యాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు భుజం చుట్టూ చెయ్యి వేసి.
మంచినీళ్లు తాగుతూ పిల్లలు ముగ్గురినీ పేరుపేరునా పలకరించాడు సత్యం.
‘మరదలూ, పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు?’ పార్వతమ్మ అడిగింది.
‘పెద్దమ్మాయికి ఆంధ్రా యూనివర్సిటీలో డాక్టర్ సీటొచ్చింది’ సత్యం మాట వింటూనే అంతా సంతోషపడ్డారు.
‘శుభవార్త తెచ్చావురా!’ అంది పార్వతమ్మ ఆప్యాయంగా.
‘ఇంకేం! అదృష్టం పండిందన్నమాట. ఈ రోజుల్లో మెడిసిన్ చదువంటే కోట్లు ఖర్చు పెడుతున్నారు. బంగారు తల్లికి నా దీవెనలు’ అన్నాడు పురుషోత్తం.
‘కంగ్రాట్స్ మావయ్యా’ అన్నారు ముగ్గురు పిల్లలూ.
‘చిన్న సమస్య వచ్చింది బావగారూ! నా బిజినెస్ పార్ట్‌నర్ కూతురికి అక్కడే ఇంజనీరింగ్ సీటొచ్చింది. మన అమ్మాయిని కూడా తన దగ్గరే ఉంచుకుని చదివిస్తానన్నాడు. అతను కట్టుకోబోయే ఇల్లు యూనివర్సిటీకి దగ్గరే ఉంది. అయితే అది పూర్తి కావడానికి రెండు నెలలు పడుతుంది. పూర్తయ్యాక అతను వైజాగ్ మకాం మారుస్తాడు. అతని పిల్లని బంధువులింట్లో పెడుతున్నాడు ప్రస్తుతం.
నాకెందుకో హాస్టల్ అంటే కాస్త భయం. తిండీ, వాతావరణం బావుండవేమో అని. కాలేజీ పైవారం నుంచీ ప్రారంభం. మా పార్ట్‌నర్ ఇల్లు పూర్తయ్యేవరకూ అంటే ఈ రెండు నెలలూ రాణిని మీ ఇంట్లో ఉంచాలని నా కోరిక. అలా మిమ్మల్ని అడగాలనే వచ్చానక్కా!’ ఇద్దరి వైపూ చూస్తూ చెప్పాడు సత్యం. ఇంతలో శే్వత కాఫీ తెచ్చింది. ఓ అరగంట కబుర్లతో గడిచింది.
పురుషోత్తం భార్యవైపు చూసి ‘్భజనాలు వడ్డించెయ్యరాదూ ఆకలేస్తోంది’ అన్నాడు.
అంతా డైనింగ్ టేబుల్ సర్దడం మొదలుపెట్టారు.
‘పద! కాళ్లు కడుక్కో సత్యం’ అంది పార్వతమ్మ.
సత్యం తను తెచ్చిన కజ్జికాయలూ, జంతికలూ ఉన్న కవర్లతోపాటు జున్ను కాన్ కూడా తీసి ‘అక్కా జున్ను’ అని అందించాడు.
పిల్లల ముగ్గురూ ‘వావ్’ అన్నారు అప్రయత్నంగా.
సత్యం అప్పుడప్పుడూ రావడం, అనకాపల్లి నుంచి ఏదో ఒకటి తేవడం అందరికీ అలవాటే. సత్యం ఒక్కోసారి ఫ్యామిలీతో వచ్చి వైజాగ్‌లో షాపింగ్ చేసుకుని ఓ రాత్రి ఉండి తిరిగి వెళుతుంటాడు.
‘నేనేమీ ఇవ్వను. ఎప్పుడూ నువ్వివ్వడమే’ అంది పార్వతమ్మ కాస్త బాధగా.
‘ఇవన్నీ మాకు దొరికేవి కాబట్టి తెస్తానంతే అక్కా!’ అన్నాడు సత్యం నవ్వుతూ.
అందరితో కలిసి భోజనం చేసి ‘పనులున్నాయిక్కడ’ అంటూ వెళ్లిపోయాడు సత్యం.
పురుషోత్తం ఓ కునుకు తీసి లేచాక సత్యం చేసిన అభ్యర్థన విషయమై యోచించాడు. అతని కోరిక సబబుగానే ఉంది. ఓ రెండు నెలలు మాత్రమే కదా! ఆ మాత్రం అడిగే చనువుందతనికి. సహాయపడటం గౌరవంగా కూడా ఉంటుంది తమకి.
ఈ ఆడవాళ్లు ముగ్గురూ తల్చుకుంటే ఆ పిల్లని చూసుకోవడం ఏమంత కష్టమైన పనికాదు. అమ్మారుూ, కోడలూ ఏమంటారో! పార్వతి ఒక్కతే భారం అంతా మొయ్యలేదు. ఓ రెండు నెలలు ఓపిక పడితే మాట దక్కుతుంది.. అనుకున్నాడతను.
ఆ రాత్రి భోజనాల వేళ పురుషోత్తం ‘ఏవర్రా! సత్యం మావయ్య ఏమడిగాడో విన్నారు కదా! మీ ముగ్గురూ సంతోషంగా ఒప్పుకుంటేనే రాణీ ఇక్కడ ఉండగలుగుతుంది. సత్యం మనకి ఆప్తుడు. అతనికి ఈ చిన్న సాయం చెయ్యడం బావుంటుందని నాకనిపిస్తోంది’ అన్నాడు అందరివైపూ చూస్తూ. అంతా ఆలోచనలో పడ్డట్టుగా ఉండిపోయారు.
‘ఏవండీ! సత్యం నోరు తెరిచి అడిగినందుకైనా...’ అంది పార్వతమ్మ నిద్రపోయే ముందు భర్తతో.
‘ఉండు. వీళ్లేమంటారో చూద్దాం’ అన్నాడతను.
‘వాళ్ల పర్మిషనెందుకు?’ అందామె ఉక్రోషంగా.
‘ఇప్పటికే వీళ్ల ముగ్గురినీ బైటికి పంపుతూ ఎంతో అలసిపోతున్నావు. వాళ్లు కాస్త తోడుంటే నీకు తేలికగా ఉంటుంది.’
‘అవునదీ నిజమే! నాకు ఇదివరకటి బలం లేదిప్పుడు. ఈ మధ్య ఎగస్ట్రాపనంటే భయం కలుగుతోందండీ’ అంది బేలగా ఆమె.
‘రేపు మాట్లాడదాంలే పడుకో’ అనునయంగా అన్నాడతను.
మర్నాడుదయం అంతా కలిసి టిఫిన్ తింటుండగా పార్వతమ్మ కూతురితో ‘నాన్నా శే్వతా! రాణీని మనింట్లో పెట్టుకుందామె’ అంది బతిమాలుతున్నట్టుగా.
‘వద్దమ్మా! నా బెడ్రూమ్‌లో ఇంకొకరుంటే నాకు నచ్చదు. నేనేదో ఆఫీసు పని చేసుకుంటూ నా ఇష్టం వచ్చినంతసేపు మేలుకునుంటాను. రాణీ వస్తే నా ప్రైవసీ పోతుంది’ అంది శే్వత ఠక్కున ముందే ఆలోచించుకున్నట్టుగా.
పార్వతమ్మ ఖంగుతింది. ఆపై బుస్సున కోపం వచ్చింది. కూతుర్ని ఏమీ అనలేక ఆగిపోయింది అవమానాన్ని దిగమింగి.
‘ఏం వదినా!’ అంది మిత్రతో శే్వత ‘నువ్వూ చెప్పు’ అన్నట్టుగా.
‘అవునత్తయ్యా! మనవల్ల కాదు లెద్దురూ! మీరు ఇప్పటికే మా అందరికీ చెయ్యలేక సతమతమవుతున్నారు. మళ్లీ ఆ అమ్మాయిక్కూడా చేసి పెట్టాలంటే మీకే కష్టం’ అంది మిత్ర భర్తవైపు చూసి కళ్లతో మాట్లాడుతూ.
‘నీ చాదస్తంకానీ. నీ వల్ల కాదమ్మా! ఈ కోతులిద్దరూ నీకు హెల్ప్ చెయ్యరు. అనవసరంగా నీ నెత్తిన వేసుకుంటే ఉన్న ఈ కాస్త సుఖం కూడా పోతుంది నీకు’ అన్నాడు అవినాష్ అమ్మ మొహం వైపు చూడకుండా ఆమె గాజులు సర్దుతూ.
పురుషోత్తం అంతా వింటూ ఏమీ మాట్లాడకుండా చూస్తున్నాడు. వాళ్లు ముగ్గురూ వెళ్లిపోయాక ‘చూశారు కదా! వాళ్లను బెదిరించీ, బతిమాలే వయసు నాదీ కాదు. వాళ్లదీ కాదు. నా మీదే వేసుకునే ఓపికాలేదు’ అంది బాధగా పార్వతమ్మ భర్తతో.
అతను ‘సరేలే’ అన్నట్టు తలూపి నిట్టూర్చాడు. రెండు రోజుల తర్వాత సత్యం ఫోన్ చేశాడు బావగారికి. ఎత్తలేదు పురుషోత్తం. ఓ గంటాగి అక్కకి చేశాడు. పార్వతమ్మ కూడా ఎత్తలేదు. మర్నాడు సత్యం ఇద్దరికీ చెరోసారీ చేశాడు. సమాధానం లేకపోవడంతో సత్యానికి వారి భావం అర్థమయ్యి చిన్నబుచ్చుకున్నాడు. భార్య సుజాతకి ఈ సంగతి చెప్పి ‘హాస్టల్లో పెడదాంలే రాణిని. ఎంతమంది ఉండటంలేదు’ అన్నాడు పౌరుషపడుతూ.
‘పోనె్లండి. వాళ్లకేం ఇబ్బందులున్నాయో! అలా అని చెప్పలేక ఫోన్ ఎత్తడం లేదేమో! పార్వతొదినా, అన్నయ్యా ఎంతో మంచివాళ్లు. ప్రేమగలవాళ్లు. అంత హోదాలో ఉంటూ అంత ఆప్యాయంగా ఉండేవాళ్లని నేను చూడలేదు’ అంది సుజాత.
‘అదీ నిజమేలే’ అన్నాడు సత్యం. మర్నాడు కూతుర్ని తీసుకుని వైజాగ్ వెళ్లాడు. మెడికల్ కాలేజీకి దగ్గరగా ఉన్న ఓ హాస్టల్‌లో రూమ్ తీసుకుని రాణిని చేర్చాడు. కాలేజీలో కూడా చేర్చి అనకాపల్లి వెళ్లిపోయాడు.
* * *
సత్యం మళ్లీ ఫోన్ చెయ్యలేదు పురుషోత్తంకి. ఆ రోజు రెండుసార్లూ ఫోన్ ఎత్తకపోయినప్పటి నుంచీ మనసు మనసులో లేదు పురుషోత్తం దంపతులకి. చాలా మదనపడ్డారు. సత్యానికి ఏం చెప్పాలో తెలీక వౌనంగా ఉండిపోవడం ఇద్దరికీ బాధగానే ఉంది.
‘మా తమ్ముడు నోరు తెరిచి అడిగితే ఓ చిన్న సాయం చెయ్యలేకపోయాం. ఆ పిల్లని కొన్ని రోజులు మనింట్లో ఉంచుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదు. ఆ మాటకొస్తే అయిదేళ్లూ నా ఇంట్లో పెట్టుకోగల స్థోమత ఉన్నదాన్ని’ సోదర వాత్సల్యంతో నిష్టూరంగా అంది పార్వతమ్మ.
పురుషోత్తం సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాడు. మానవ సంబంధాలలో ఒకరికొకరు చేయూత నిచ్చుకోవడం అనేది ప్రధాన విషయం. తను గవర్నమెంట్ సర్వీస్‌లో ఉండగా ఎంతో మందికి ఉద్యోగపరంగా ఉపకారం చేశాడు. మనవాళ్లంతా ఆనందంగా ఉంటేనే మనమూ ఆనందంగా ఉంటాం. అందుకు మన వంతు ధర్మంగా సన్మార్గంలో ఏదో ఒకటి చెయ్యాలనుకునే తత్వం తనది. సహాయానికి మించిన ఆధ్యాత్మిక సాధన మరొకటి లేనేలేదు.
కానీ ఈ రోజు తానది చెయ్యలేకపోయాడు. సత్యం మనసును తప్పకుండా కష్టపెట్టుకునే ఉంటాడు. మనుషుల జీవితాల్లో వేగం పెరిగింది. ఇదివరకటి సమయం, స్తిమితం తగ్గాయి. మారిన పరిస్థితుల కనుగుణంగా మనుషులు బ్రతకటం తప్పనిసరి. అలా అని మనుషుల్ని దూరం చేసుకోకూడదు కదా!
ఇంట్లో వీలుకాని పరిస్థితి ఉండడం వల్ల తను సత్యం అడిగిన సాయం చెయ్యలేకపోయాడు. అయితే అతను మరోదారి చూసుకోలేని ఆర్థిక స్థితిలో లేడు. ఏ హాస్టల్‌లోనో వేసి ఉంటాడు. పది రోజులైనా సత్యం నుంచి ఫోన్ రాలేదు.
నేనే ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? అనిపించింది పురుషోత్తంకి. ధైర్యం సరిపోలేదు. ఏం మాట్లాడాలి? ఇబ్బందిగా తోచింది. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. వౌనంగా ఉండడం పెద్దమనిషి తరహా అనిపించుకోదు. ఏం చెయ్యాలిప్పుడు? భవన నిర్మాణంలో ఒకోసారి లోపం జరిగినపుడు సరిచేసే మార్గాలుంటాయి. మనుషుల మధ్య అవగాహనా లోపాల్ని కూడా అలాగే దిద్దుకోవాలి.
ఇలా ఆలోచించగా ఆలోచించగా అతనికి ఓ మార్గం స్ఫురించింది. వెంటనే సత్యానికి ఫోన్ చేసి రాణీని ఎక్కడ ఉంచిందీ, కాలేజీలో ఎప్పుడు జాయిన్ చేసిందీ వివరాలడిగాడు. సత్యం, బావగారు ఫోన్ చేసినందుకు ఆనందపడుతూ హాస్టల్ వివరాలు చెప్పాడు. ‘ఓసారి వెళ్లి రాణీని చూసొస్తానోయ్’ అన్నాడు పురుషోత్తం. ‘అలాగే బావా’ అన్నాడు సత్యం తేలికపడిన మనసుతో.
ఆ శనివారం సాయంత్రం సత్యం చెప్పిన హాస్టల్‌కి వెళ్లి రాణీని పిలిచి ‘మా ఇంటికి వెళదాం రామ్మా!’ అన్నాడు పురుషోత్తం.
తర్వాత వార్డెన్ దగ్గరికి వెళ్లి పర్మిషనడిగి రాణీని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. రమ్మనగానే చకచకగా బ్యాగ్‌లో బట్టలు సర్దుకొని నవ్వుతూ కారెక్కిన రాణిని చూస్తే ముచ్చటగా అనిపించిందతనికి.
పిల్లలు ఎదిగే మొక్కల్లాంటి వాళ్లు. వాళ్లకి కుటుంబంలోని వాళ్లంతా ప్రేమ అనే ఎరువుని అందిస్తే వాళ్లు ఏపుగా, ఆరోగ్యంగా పెరిగి ప్రేమ నిండిన మనుషులుగా తయారవుతారు. తిరిగి ఆ స్నేహాన్నీ, ఆప్యాయతనీ ఇతర్లకి పంచుతారు. అనుకుంటూ రాణీ చెప్పే కబుర్లు వింటూ ఇంటికి తీసుకొచ్చాడతను. కారు పార్క్ చేసి రాణిని తీసుకుని కాలింగ్ బెల్ కొట్టాడు.
పనమ్మాయి తలుపు తీసింది. ‘ఎవరొచ్చారో చూడండి’ అంటూ లోపలికొచ్చాడు పురుషోత్తం.
టీవీ ముందు కూర్చున్న శే్వతా, అవినాష్, మిత్రా ‘వావ్’ అంటూ అరిచి సరదా పడ్డారు. కూరలు కొనుక్కుని వస్తున్న పార్వతమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది.
డాక్టర్ కోర్స్ చదువుతున్న రాణిపై పిల్లలు ముగ్గురూ గౌరవంతో కూడిన ప్రేమను చూపించారు. నలుగురూ ఎడతెరిపి లేకుండా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రాణి కూడా కలుపుకోలు పిల్లే. తన కాలేజీ ర్యాగింగ్ గురించి చెబుతూ అందరినీ నవ్వించింది. రాత్రి పదకొండు వరకు అంతా కబుర్లు చెప్పుకున్నారు. రాణి శే్వత గదిలో పడుకుంది. వాళ్లిద్దరూ మరో గంట ముచ్చట్లేసుకున్నారు.
మర్నాడు ఆదివారం. పార్వతమ్మ స్పెషల్ టిఫిన్ చేసి, లంచ్ కూడా ప్రత్యేకంగా చేసింది. ఉదయం నుంచీ రాత్రి వరకూ టీవీలో నచ్చిన సీడీలు వేసుకుని చూస్తూ గడిపారు పిల్లలు నలుగురూ. సోమవారం ఉదయమే లేచి తయారయింది రాణి. ‘నీకెప్పుడు రావాలంటే అప్పుడొచ్చెయ్యి నాన్నా ఈ అత్త దగ్గరికి’ అంది పార్వతమ్మ మేనకోడలికి కాఫీ కలిపిస్తూ.
‘నెలకోసారి వస్తా’ అంది రాణి.
అందరికీ చెయ్యి కలిపి బయలుదేరుతూ.
ఆ పిల్లకి నన్నింత ఆదరణగా చూసే కుటుంబం ఉంది వైజాగ్‌లో, అన్న భావన కొత్త ఉత్సాహాన్నిస్తోంది. పురుషోత్తం ఆమెను కారులో కాలేజీలో దింపేసి వచ్చాడు.
మధ్యాహ్నం భోజనం చేశాక ఎదురుగా సోఫాలో వాలి భర్తతో అంది పార్వతమ్మ.
‘నాకైతే మా సత్యంగాడికి ఫోన్‌చేసే ధైర్యమే లేకుండా పోయింది. వాడితో స్నేహం పోయిందనే అనుకున్నాను. వాడి మొహం నేనింక చూడలేననుకున్నాను. మీకు భలే మంచి ఆలోచనొచ్చింది. ఇలా రాణీ అప్పుడప్పుడూ వచ్చిపోతుంటే బావుంటుంది సుమీ!’ భర్తకు కృతజ్ఞతలు తెలియజేసిందామె ప్రేమగా.
పురుషోత్తం నవ్వి ఊరుకున్నాడు. ఆమె కూడా తృప్తిగా నవ్వి ‘ఎంతైనా ఇంజనీరనిపించుకున్నారు. కూలిపోతున్న బంధుత్వాన్ని రిపేర్ చేసి నిలబెట్టేశారు సుమా!’ అంటూ ఆరిన బట్టల కోసం మేడపైకెళ్లిందామె.

-అల్లూరి గౌరీలక్ష్మి 9948392357