S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విశ్వం పుట్టుక

చప్పుడు లేని పేలుడు గురించి ఆలోచిస్తే అది ఎప్పుడు జరిగిందని ఒక ప్రశ్న. ఇదిగో, ఈ విషయం గురించి ఒక హోటేల్‌లో కూచుని ఇద్దరు సైంటిస్టులు మాట్లాడుకుంటున్నారట. వాళ్ల మాటలు విశ్వం ముగిసిపోవడం వేపు మళ్లాయి. దాని పుట్టుక చెప్పాపెట్టకుండా జరిగినట్టే. ముగింపు కూడా జరిగే వీలుందని వాళ్లు అనుకుంటున్నారు. పక్క బల్ల దగ్గర ఉన్న ఒక పెద్దమనిషి ఆత్రంగా లేచి వచ్చి వీళ్లను ‘అంటే విశ్వం ముగుస్తుందంటారా’ అని అడిగాడట. వాళ్లు ‘తప్పకుండా!’ అన్నారు. ‘సుమారు ఎప్పుడు జరగవచ్చు?’ అని పెద్దమనిషి ఆత్రంగా అడిగాడు. ‘కనీసం ఒక బిలియన్ సంవత్సరాల్లో’ అని జవాబిచ్చారు సైంటిస్టులు. ‘ఇంకా నయం. నేను మిలియన్ అంటారని భయపడ్డాను’ అంటూ వెళ్లిపోయాడట ఆ పెద్దమనిషి.
నిజానికి విశ్వం ఈ క్షణాన అంటే మీరు ఈ వాక్యం చదువుతున్న క్షణాన చెప్పాపెట్టకుండా ముగిసిపోయే వీలుందని కూడా అంటున్నారు. పై పేరాలో పెద్దాయన మిలియన్ సంవత్సరాలకు భయపడలేదు. మీరు కూడా ఇంచుమించు అదే పద్ధతిలో భయపడకుండా చదువుతూ పొండి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. చివరికి విశ్వం కూడా! (విశ్వంలో ప్రపంచం ఉన్నట్టుంది!) పోవలసింది పోతుంది. మనకు ఎందుకుగానీ, ఈలోగా మన తెలివి కాస్త పెంచుకుందాం.
పరిశోధకులు అందరూ కలిసి మొత్తానికి 13.7 బిలియన్ సంవత్సరాల నాడు విశ్వం పుట్టింది అని ఒక అంగీకారానికి వచ్చారు. నిన్నా, మొన్నా జరిగిన సంగతులు గుర్తులేని మనకు విశ్వం పుట్టిన తేదీ (!) గుర్తుండకపోతే ఫర్వాలేదు. ఎప్పుడో పాతకాలంలో, ఎందుకో తెలియకుండానే, ఎలాగో అర్థం కాకుండానే విశ్వం పుట్టింది. అప్పటికి సమయం అనే టైమ్ లేదు అని అర్థం చేసుకోవాలని కనుక గతాన్ని వదిలేసి మనం ముందుకు వెళదాం.
తెలిసింది చాలా తక్కువ. తెలియనిది చాలా ఎక్కువ. తెలిసింది అనిపించింది కూడా అనుకున్నంత బాగా తెలియదు. మొత్తానికి విశ్వం పుట్టుక ఈ రకంగా ఉంటుంది. ఇలాంటి మాటలు చెప్పడానికి కూడా ఎవరో పుట్టుక రాక తప్పదు. 1960 ప్రాంతంలో ఇద్దరు పరిశోధకులు కొన్ని అసాధారణమయిన విషయాలను అర్థం చేసుకున్నారట. కనీసం ఆ విషయాలు, ఆ 1960 మనకు ఆలోచనకు అందే దూరంలో ఉన్నట్టున్నాయి. పేలుడు జరిగిందన్న సంగతిని కూడా 1920 ప్రాంతంలో ఒక బెల్జియన్ పండితుడు సూచనగా చెప్పాడు. అతని పేరు జార్జెస్ లెమేత్రే. కానీ ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. 1960 తరువాత పట్టించుకున్నట్టున్నారు.
అది 1965 సంవత్సరం. ఆర్నో పెన్జియాస్‌తో బాటు రాబర్ట్ విల్సన్ బెల్ లేబొరేటరీస్‌లో ఒక పెద్ద సమాచార, ప్రసార ఆంటెనా గురించి తంటాలు పడుతున్నాడు. వాళ్లకు అందవలసిన సంకేతాలకన్నా ఎక్కువగా, వెనకట రేడియోలో వార్తల వెనుక నీళ్లు మరిగిన చప్పుడు లాగ ఏదో గోల వినిపించింది. వాళ్ల పని అసలు ముందుకు సాగలేదు. గోల మాత్రమే ప్రధానంగా వినిపిస్తున్నది. అది ఏడాదిలో అన్ని సమయాలలోను పగలు, రాత్రి తేడా లేకుండా ఆకాశంలోని అన్ని భాగాల నుంచి వస్తూనే ఉన్నది. కుర్ర పరిశోధకులు ఒక సంవత్సరం పాటు ఆ గోల రాకుండా చేయడానికి ప్రయత్నించారు. వాడుతున్న కరెంటు వ్యవస్థను కూలంకషంగా పరీక్షించారు. చేతనయిన మార్పులన్నీ చేసి చూచారు. వాడుతున్న ఆంటెనా డిష్‌లోకి ఎక్కి పగుళ్లు, నట్‌లు, బోల్ట్‌లు అన్నింటిమీదా టేపు అతికించారు. చీపుళ్లు, బ్రష్‌లతోపాటు గంపలోకి ఎక్కి స్వయంకృషితో దాన్ని శుభ్రం చేశారు. గంప నిండా పక్షుల రెట్ట పడి ఉందని, దాన్నంతా తొలగించామని వాళ్లు పరిశోధన పత్రంలో కూడా రాశారు. అసలు విషయం ఏమిటంటే గోల మాత్రం కొనసాగింది.
ఒకవేపు వీళ్లు తమ తంటాలు తాము పడుతూ ఉంటే అక్కడికి కేవలం ముప్పయి మైళ్ల దూరంలో ప్రిన్‌స్టన్ యూనివర్సిటీలో ఒక పరిశోధకుల బృందం సరిగ్గా అదే గోల కొరకు వెతుకుతున్నారు. వీళ్లు గోల అనుకుంటున్న ఆ చప్పుడును రాబర్ట్ డిక్ లీడర్‌గా ఉన్న బృందం వారు ప్రత్యేకంగా వెతుకుతున్నారు. 40వ దశకంలో రష్యా పరిశోధకుడు జార్జ్ గామోవ్ ఒక ఆలోచనను ప్రతిపాదించాడు. అంతరిక్షంలోకి నిజంగా లోతులకు చూడగలిగితే, పెద్ద పేలుడు జరిగినప్పుడు మిగిలిపోయిన కొంత కాంతి కిరణజాలం తప్పకుండా దొరుకుతుందని అతను ప్రతిపాదించాడు. దాన్ని కాస్మిక్ బ్యాక్‌గ్రౌండ్ రేడియేషన్ అన్నాడతను. పేలుడు జరిగి చాలా కాలమయింది. కిరణజాలం చాలాదూరం ప్రయాణించి ఉంటుంది. కనుక నఅది భూమిని చేరేసరికి మైక్రోవేవ్స్ అనే రూపంలోకి మారి ఉంటుందని కూడా అతను ఊహించి చెప్పాడు. ఆ మధ్యనే ప్రకటించిన ఒక పేపర్‌లో అతను ఆ కిరణాలను కనుగొనడానికి తగిన పరికరాన్ని కూడా సూచించాడు. ఆ పరికరం సరిగ్గా పెన్జియాస్, విల్సన్‌లు వాడుతున్న హోమ్‌డెల్‌లోని ఆంటెనా. దురదృష్టం ఏమంటే, వీళ్లిద్దరు గానీ లేక అటు ప్రిన్‌స్టన్ బృందంలోని వారు గానీ గామోవ్ ప్రకటించిన పత్రాన్ని పట్టించుకోనేలేదు. అసలు వాళ్లు దాన్ని చూడనే లేదు. బెల్ పరిశోధనశాల బృందం వారు తమకు అడ్డు తగులుతున్నది అనుకుంటున్న ఆ ‘వాయిస్’ గురించే గామోవ్ ప్రత్యేకంగా చెప్పాడు. ఈ రకంగా చూస్తే పెన్జియాస్, విల్సన్‌లు విశ్వం అంచులను అందుకోగలిగారని అర్థం. కనీసం అందులోని కనబడే భాగాన్నయినా పట్టేశారని అర్థం. అది ఇక్కడికి అంటే భూమికి 90 బిలియన్ ట్రిలియన్ మైళ్ల దూరం ఉంది. వాళ్లు విశ్వంలోకెల్లా అత్యంత ప్రాచీనమయిన కాంతికి సంబంధించిన ఫొటాన్‌లను ‘చూస్తున్నారు’. కాలం, దూరం కారణంగా ఆ కాంతి మైక్రోవేవ్ తరంగాలుగా మారింది. గామోవ్ ఊహిచిన పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ అలెన్ గుత్ అనే పరిశోధకుడు ఒక ఉదాహరణ రాశాడు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లోని నూరవ అంతస్తు నుండి కిందకు చూస్తే నేల కనిపించే పద్ధతిలాగ అది ఉందని గుత్ రాశాడు. ఇక్కడ నూరవ ఫ్లోర్ అంటే ఇప్పటి పరిస్థితి కింద నేల అన్నది బిగ్‌బ్యాంగ్ జరిగిన నాటి పరిస్థితి. బెల్ పరిశోధనా బృందం వారు పరిశోధనలు సాగిస్తున్నప్పుడు అప్పటివరకు కనుగొన్న అన్నిటికన్నా దూరమయిన గెలాక్సీలు ఈ అంతస్తుల లెక్కలో చూస్తే అరవయ్యవ అంతస్తు స్థాయికి మాత్రమే చేరి ఉంటాయి. ఇక క్వేజార్‌లు అనే అన్నిటికన్నా దూరమయిన నిర్మాణాలు ఇరవయ్యవల అంతస్తు దూరంలో వుంటాయి. కానీ వీళ్ల ఆంటెనా కారణంగా నిజంగా పేలుడు జరిగిన నాటి పరిస్థితి కూడా కళ్లకు కట్టింది. కాదు, చెవులకు వినిపించింది.
కానీ విల్సన్, పెన్జియాస్‌లకు ఇంకా ఆ సంగతి తెలియదు. వాళ్లు ప్రిన్‌స్టన్‌లోని డిక్‌కు ఫోన్ చేశారు. గోలను తొలగించడానికి సూచన ఏమయినా ఇమ్మని సలహా అడిగారు. డిక్‌కు మాత్రం ఒక్క క్షణంలో కుర్రవాళ్లు కనుగొన్నదేమిటో అర్థమయిపోయింది. అతను ఫోన్ పెట్టేశాడు. పక్కనున్న తన వారిని పిలిచి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. తమ కృషి ఇక అవసరం లేదని కూడా అన్నాడు. త్వరలోనే రెండు పరిశోధనా పత్రాలు వచ్చాయి. బెల్ బృందం వారు తమకు వినిపిస్తున్న గోల గురించి రాస్తే డిక్ మాత్రం అదేమిటో వివరిస్తూ రాశాడు. ఒకరికి దొరికింది అర్థం కాలేదు. మరొకరికి విషయం అర్థమయింది. కానీ వివరం అందలేదు. సైన్స్ పరిశోధనలు చిత్రంగా ఉంటాయి. ఇచ్చే బహుమతులు అంతకన్నా చిత్రంగా ఉంటాయి. గోల వద్దనుకున్న వారికి 1978లో భౌతిక శాస్త్రం నొబేల్ బహుమానాన్ని ఇచ్చారు. ప్రిన్‌స్టన్ పరిశోధకులకు సానుభూతి మాత్రమే మిగిలింది. బెల్ లాబోరేటరీస్ వారికి విషయం అర్థం కానేలేదు. పత్రికలలో తమ గురించి వచ్చేదాకా బహుమతి గురించి కూడా తెలియదు.
అంతరిక్షంలోని బ్యాక్‌గ్రౌండ్ కిరణజాలం గురించి మనం కూడా గమనించి ఉంటాము. టీవీలో అందని ఒక చానల్ పెట్టినప్పుడు తెలుపు, నలుపు చుక్కలు లేదా రంగు చుక్కలు ఎగురుతూ కనిపిస్తాయి. వాటి వెంట కొంత ఉస్సుమంటూ చప్పుడు కూడా వినిపిస్తుంది. ఏనుగు పద్ధతిలో చప్పుడు చేయకుండా జరిగిన పెద్ద పేలుడు నాటి మిగుళ్లు మనకు టీవీలో ఈ రకంగా దర్శనమిస్తాయి. టీవీ పని చేయడం లేదని, చానల్ అందడం లేదని అసంతృప్తికి గురయ్యే ముందు మనం విశ్వం పుట్టుక గురించి చూస్తున్నామని గుర్తు చేసుకుంటే మరింత బాగుంటుంది. బిగ్‌బ్యాంగ్ అన్నది లేదా పెద్ద పేలుడు, మహావిస్ఫోటనం అన్నది పేరుకు మాత్రమే అని మనం మరోసారి గుర్తు చేసుకోవాలి. ఒక్కసారిగా విశ్వం పుట్టి వ్యాపించింది. అలా ఎందుకు జరిగింది? జవాబు కొరకు చాలామంది ప్రయత్నించారు.

కె. బి. గోపాలం