S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..65 మీరే డిటెక్టివ్

విచారంతో కృంగిపోయి పక్కమీద పడుకున్న రాజుని చూసి పుత్ర శోకంతో బాధపడే కౌసల్య చెప్పింది.
‘పాములాగా వంకరగా నడిచే కైకేయి మంచివాడైన రాముడి విషయంలో విషాన్ని నాటింది. ఇప్పుడు ఇక కుబుసం విడిచిన పాములాగా తిరుగుతుంది. రాముడ్ని అడవికి వెళ్లగొట్టాలనే కోరిక తీరిన ఈ కైకేయి ఇంటిలోని దుష్ట సర్పంలా ఇక మీదట నన్ను కావాలని భయపెడుతుంది. నా కొడుకుని ఆమెకి దాసుడిగా చేసినా బావుండేది. అప్పుడు రాముడు ఆమె చెప్పిన పని చేస్తూ, నగరంలో భిక్షాటన చేస్తూ ఇంట్లోనే ఉండేవాడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు కైకేయి ద్వారా రాముడ్ని అతని స్థానం నించి కిందకి పడతోసి రాముడి రాజ్యాన్ని భరతుడికి ఇచ్చావు. ఏనుగులా నడిచే, వీరుడైన ధనస్సుని ధరించే రాముడు సీతా, లక్ష్మణులతో కలిసి అడవికి వెళ్లాడు. సీతారామ లక్ష్మణులు ఎన్నడూ కష్టాలు అనుభవించలేదు. అలాంటి వాళ్లని నువ్వు కైకేయి ఇష్టం ప్రకారం అడవులకి పంపేసావు. అక్కడి వాళ్ల అవస్థలు ఎలా ఉన్నాయో? భోగాలు అనుభవించే వయసులో తినడానికి మంచి ఆహారం దొరకని చోటికి వెళ్లగొట్టావు. యువకులైన వాళ్లు దీనులై దుంపలు, ఫలాలు తింటూ ఎలా ఉంటారో కదా?
‘రాముడు భార్యతో, తమ్ముడితో కలిసి ఇక్కడికి వచ్చి నా శోకాన్ని తొలగించే శోభస్కరమైన కాలాన్ని నేను ఎన్నడైనా చూస్తానా? వీరులైన ఆ రామలక్ష్మణులు తిరిగి వచ్చారని వినగానే కీర్తిగల ఈ అయోధ్యలోని ప్రజలంతా సంతోషించి, చక్కటి జెండాలని ఎప్పుడు ఎగరేస్తారో? రామలక్ష్మణులు తిరిగి రాగానే వారిని చూసి ఈ పట్టణమంతా పౌర్ణమి నాటి సముద్రంలా ఉప్పొంగుతూ ఎప్పుడు ఆనందిస్తుందో? ఆజానుబాహుడు, వీరుడు ఐన రాముడు ఎద్దు ఆవుని ఎదుట ఉంచుకుని వచ్చినట్లుగా సీతని రథం మీద ఎదుట కూర్చోపెట్టుకుని ఎప్పుడు అయోధ్యకి వస్తాడో కదా? శత్రు భయంకరులైన నా కొడుకులు నగరంలో ప్రవేశిస్తూండగా వేల కొద్దీ ప్రజలు రాజమార్గంలో వారి మీద పేలాలు ఎప్పుడు చల్లుతారో కదా? అందమైన కుండలాలు ధరించి, కత్తులతో, భయంకరమైన ఆయుధాలతో పర్వతాల్లా ప్రకాశించే రామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశిస్తూండగా ఎప్పుడు చూస్తానో కదా? వారు కన్యలకి, బ్రాహ్మణులకి పూలు, పళ్లు పంచిపెడుతూ ఆనందంతో పట్టణానికి ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో కదా? దేవతల వంటి కాంతి గల, ధర్మాలు తెలిసిన రాముడు ఈ పధ్నాలుగు సంవత్సరాల్లో బుద్ధిలో, వయసులో అభివృద్ధి చెందుతాడు. ఐనా నా రాముడు మూడు సంవత్సరాల పిల్లవాడిలా ఆడుతూ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడో?
‘ఓ వీరుడా! క్రూరురాలినైన నేను పూర్వజన్మలో దూడలు పాలు తాగే ముందు వాటి తల్లుల స్తనాలని కోసేసాను. సందేహం లేదు. చిన్న దూడ పైన ఆవుకి ఎంత ప్రేమ ఉంటుందో నాకు నా కొడుకు మీద అంత ప్రేమ ఉంది. అలాంటి నన్ను కైకేయి బలవంతంగా నా కొడుకు నించి దూరం చేసింది. సద్గుణాలు కలవాడు, సర్వశాస్త్రాల్లో పండితుడైన నా ఏకైక కొడుకుని వదిలి నేను బతకలేను. నా ప్రియ కుమారుడ్ని చూడకుండా జీవించే సామర్థ్యం నాకు లేదు. ఎండాకాలంలో తీవ్రమైన కాంతి గల సూర్యభగవానుడు తన కిరణాలతో ఈ భూమిని కాల్చేసినట్లుగా పుత్రశోకం వల్ల కలిగే శోకాగ్ని పైకి లేచి నన్ను కాల్చేస్తోంది.’ (అయోధ్యకాండ సర్గ -43)
ఇలా దుఃఖించే కౌసల్యని చూసి, ధర్మంలో స్థిరమైన బుద్ధిగల సుమిత్ర ధర్మసమ్మతమైన మాటలని పలికింది.
‘పూజ్యురాలా! నువ్వు ఎందుకు దీనంగా విచారిస్తున్నావు? నీ కొడుకు రాముడు సకల గుణసంపన్నుడు. పురుషుల్లో శ్రేష్ఠుడు. మహాబలశాలైన రాముడు మహాత్ముడైన తండ్రి మాటని నిలబెట్టడానికి రాజ్యాన్ని వదిలి, గొప్పవాళ్లు ఎప్పుడూ చక్కగా ఆచరించే, మరణానంతరం కూడా మంచి ఫలాన్ని ఇచ్చే ధర్మమార్గంలో స్థిరంగా నిల్చి ఉన్నాడు. అలాంటి రాముడ్ని గురించి ఎన్నడూ విచారించక్కర్లేదు. సమస్త ప్రాణుల మీద దయగల దోషాల్లేని లక్ష్మణుడు రాముడి విషయంలో ఉత్తమమైన భక్తిని కలిగి ఉన్నాడు. అందువల్ల రాముడు ప్రయోజనం పొందుతాడు. సుఖాలకి అలవడ్డ సీత కూడా వనవాసంలోని కష్టాలని తెలిసి కూడా ధర్మాత్ముడైన నీ కొడుకు వెంట వెళ్లింది. ధర్మం, సత్యవ్రతం అనేవే ధనమని భావించిన నీ కొడుకు తన కీర్తి పతాకాన్ని ఈ లోకంలో ఎగరేస్తున్నాడు. అతనికి లభించని సత్ఫలితం ఏముంది?
‘రాముడి పరిశుద్ధమైన శీలం, ఉత్తమమైన మహత్యం తెలిసిన సూర్యుడు తన కిరణాలతో రాముడి శరీరాన్ని బాధించడు. ఇది తథ్యం. అడవుల నించి వచ్చే సమ శీతోష్ణపు, సుఖమైన గాలి మంగళకరమై రాముడ్ని అన్ని కాలాల్లోను సేవిస్తుంది. రాత్రి నిద్రించే రాముడ్ని చంద్రుడు తన కిరణాలతో తాకుతూ తండ్రిలా కౌగిలించుకుని ఆనందింప జేస్తాడు. పూర్వం రాముడు యుద్ధంలో దానవ రాజైన సహస్రముఖి కొడుకుని సంహరించినప్పుడు సంతోషించిన బ్రహ్మదేవుడు గొప్ప తేజస్సు గల రాముడికి దివ్యాస్త్రాలని ఇచ్చాడు. శూరుడు, పురుషుల్లో శ్రేష్ఠుడైన అలాంటి రాముడు అడవుల్లో ఉన్నా తన బాహుబలంతో నిర్భయంగా ఇంట్లో ఉన్నట్లుగా నివసించగలడు. ఏ రాముడి బాణాలకి గురైన శత్రువులు తప్పక నశిస్తారో ఆ రాముడికి ఈ భూమి అంతా వశం కాక ఎలా ఉంటుంది? రాముడిలో లక్ష్మి, వీరత్వం, శుభకరమైన బలం ఉన్నాయి. వీటితో కూడిన రాముడు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని వేగంగా తిరిగి వచ్చి తన రాజ్యాన్ని పొందుతాడు.
‘ఓ కౌసల్యా! రాముడు సూర్యుడికి సూర్యుడుగాను, అగ్నికి అగ్నిగాను, ప్రభువుకి ప్రభువుగాను, సంపదకి సంపదగాను, కీర్తికి శ్రేష్ఠమైన కీర్తిగాను, ఓర్పుకి ఓర్పుగాను, దేవతలకి దేవతగాను, ప్రాణులకి శ్రేష్ఠుడు గాను కాగల సమర్థుడు. అలాంటి రాముడు అడవిలో ఉన్నా, పట్టణంలో ఉన్నా ఏ లోటు ఉంటుంది? రాముడికి సీతతో కలిసి రాజ్యాభిషేకం జరుగుతుంది. అడవికి ప్రయాణమై వెళ్లే ఏ రాముడ్ని చూసి అయోధ్యలోని ప్రజలంతా విచారంతో కన్నీరు కార్చారో, నార చీరలు ధరించి వెళ్లే అపజయం ఎరుగని ఏ రాముడ్ని అనుసరించి రాజ్యలక్ష్మి కూడా సీతలా వెళ్లిందో అలాంటి రాముడు పొందలేనిది ఈ లోకంలో ఏముంది? విలువిద్యలో గొప్పవాడైన లక్ష్మణుడు స్వయంగా బాణాలు, ఖడ్గాలు, ఇతర ఆయుధాలు ధరించి రాముడి ముందు వెళ్తూండగా, ఆ రాముడికి దుర్లభమైంది ఏమి ఉంటుంది? రాముడు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చినప్పుడు నువ్వు తప్పక అతన్ని చూడగలవు. అందువల్ల విచారాన్ని, మోహాన్ని విడు. నేను నిజం చెప్తున్నాను. ఎవరి చేతా నిందించబడని ఓ కౌసల్యా! నీ కొడుకు వచ్చి నీ పాదాలకి నమస్కరిస్తూండగా ఉదయించిన చంద్రుడి లాంటి అతన్ని నువ్వు మళ్లీ చూస్తావు. రాముడు వచ్చి రాజ్యాభిషిక్తుడై, గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూండగా చూసి త్వరలోనే ఆనంద బాష్పాలు విడగలవు. రాముడికి ఎలాంటి అమంగళం కలగదు. అందుచేత నువ్వు శోకాన్ని, విచారాన్ని వదులు. సీతాలక్ష్మణులతో కూడిన నీ కొడుకుని త్వరలోనే చూస్తావు. ఓ కౌసల్యా! మిగిలిన వాళ్లందర్నీ నువ్వు ఓదార్చాల్సి ఉండగా నువ్వే ఇలా మనసుని వికలం చేసుకుంటున్నావేమిటి? రాముడి వంటి కొడుకుని కన్న నువ్వు ఇలా విచారించకూడదు. ఈ లోకంలో రాముడిలా సన్మార్గంలో ఉన్నవారు ఎవరూ లేరు. త్వరలో స్నేహితులతో కూడా వచ్చి నీ కొడుకు నమస్కరిస్తూండగా, అతన్ని చూసి నువ్వు వర్షాకాలంలోని మేఘాల్లా ఆనందాశ్రువులని వదులుతావు. వరాలని ఇచ్చే నీ కొడుకు త్వరలో అయోధ్యకి తిరిగి వచ్చి, మెత్తని, బలిసిన చేతులతో నీ పాదాలని తాకుతాడు. స్నేహితులతో కూడిన నీ కొడుకు నమస్కరిస్తూండగా మేఘాల వరస పర్వతాన్ని తడిపినట్లు అతన్ని మళ్లీ ఆనందాశ్రువులతో తడపగలవు’
మాటలతో ఉపచారం చేయడంలో నేర్పుగల, ఎలాంటి దోషాలు లేని సుమిత్ర ఇలా అనేక మాటలతో రాముడి తల్లైన కౌసల్యని ఓదార్చింది. సుమిత్ర మాటలు విన్నాక దశరథుడి భార్య, రాముడి తల్లైన కౌసల్య విచారం శరత్కాలంలో తక్కువ నీరు గల మేఘంలా వెంటనే ఆమె శరీరంలో లీనమై పోయింది. (అయోధ్య కాండ సర్గ -44)
అయ్యా! అది ఇవాళ్టి కథ. రేపు మళ్లీ 44వ సర్గలో కలుద్దాం’ హరిదాసు చెప్పాడు.
ఇంటి దగ్గర ఆ రెండు కాండలలు చదువుకుని వచ్చిన ఆశే్లష అమ్మమ్మ మీనమ్మ వెంటనే హరిదాసుతో చెప్పింది.
‘ఏమయ్యోయ్. ఇవాళ హరికథలో ఐదు తప్పులు చెప్పావు. ఇలా ఐతే ఎలా?’
ఆ తప్పులని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
గాయత్రీ మంత్రంలోని ఐదో బీజాక్షరం
ఏ సర్గలో వస్తుంది?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
త్రిశంకుడు అంటే అర్థం ఏమిటి?
త్రిశంకుడు అంటే మూడు పాపాలు చేసినవాడు. అవి 1.తండ్రిని ఎదిరించటం 2.పరభార్యని అపహరించటం 3.గోమాంసం తినటం
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.క్రూర గ్రహాలన్నీ చంద్రుడితో కలిసి ఉన్నాయి అని చెప్పిన చోట త్రిశంకువుని కూడా గ్రహంగా వాల్మీకి రాశాడు.. హరిదాసు దాన్ని సూర్యుడిగా తప్పు చెప్పాడు.
2.కోసల దేశ నక్షత్రం విశాఖ. కాని హరిదాసు పొరపాటుగా దాన్ని మూలగా చెప్పాడు.
3.కింద పడ్డ దశరథుడ్ని లేవదీయడానికి కౌసల్య కుడివైపు మళ్లింది. ఇది హరిదాసు చెప్పలేదు.
4.రాహువు మింగిన సూర్యుడిలా అనే ఉపమానాన్ని హరిదాసు తప్పుగా కేతువు మింగిన సూర్యుడిలా అని చెప్పాడు.
5.ప్రస్రవణ పర్వతం మీంచి ఏనుగు అని వాల్మీకి రాశాడు. ఆ పర్వతం పేరు హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి