S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంక్రాంతి పాట... వెండి తెరపై సయ్యాట

తెలుగు వారికి ప్రాణప్రదమైన పండుగ సంక్రాంతి. జనవరి 13, 14, 15 తేదీలలో వచ్చే ఈ పండుగ వాతావరణం నెల రోజుల ముందే నెలకొంటుంది. ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చి రైతన్నలకు సిరులు చేకూర్చే శుభ సమయం. తెలుగింటి ఆడపడుచులు లోగిళ్ళను గొబ్బెమ్మలతో అలంకరించి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలకటం, కోయిల కుహు..కుహు.. గీతాలు, భోగి మంటలు, అటు హరిదాసులు, ఇటు బసవన్నలు తమ విన్యాసాలతో జనావళికి సర్వ శుభములు చేకూరాలని కోరటం, కొత్త దంపతుల సరాగ రాగాలు ఇవన్నీ మన కళ్ళముందు కదలాడుతాయి.
తెలుగు సినిమాల్లో మన కవులు ఆ మనోహర దృశ్యాలను ఏ విధంగా కవితాత్మకంగా వ్రాశారో చూద్దాం.
1952లో సంక్రాంతి పండుగ సందర్భంగా సి.పుల్లయ్య దర్శకత్వంలో ‘సంక్రాంతి’ అనే సినిమా విడుదలైంది. అందులో ‘క్రాంతి, ఈనాడు, మకర సంక్రాంతి’ అనే వీధి భాగవతాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాశారు. అదే చిత్రంలో ఆయన రాసిన మరోపాట ‘జేజేలమ్మ జేజేలు సంక్రాంతి లక్ష్మీకి జేజేలు’ అనే గీతాన్ని పి.లీల పాడగా నటి శ్రీరంజనిపై చిత్రీకరించారు. 2005లో అదే ‘సంక్రాంతి’ టైటిల్‌తో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఓ చిత్రం వచ్చింది. అందులో సంక్రాంతి సంబురాల సందర్భంగా సంగీత దర్శకుడు ఎస్.ఎ రాజ్‌కుమార్ రాసిన ‘డోలీ డోలీ డోలీరే..’ అనే బృంద గీతాన్ని శంకర్ మహదేవన్ బృందం పాడగా కథానాయకుడు వెంకటేష్ బృందంపై చిత్రీకరించారు. అప్పట్లో వచ్చిన ‘దళపతి’ డబ్బింగ్ చిత్రంలోను గత సంక్రాంతికి శర్వానంద్ హీరోగా వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రంలోనూ సంక్రాంతి వేడుకలను గీతపరంగా నయనానందకరంగా చిత్రీకరించారు.
‘పల్లెటూరు’ చిత్ర ప్రారంభంలో సంక్రాంతి పండుగ వాతావరణాన్ని నేత్ర పర్వంగా తమ కవితతో రూపం కల్పించారు జంటకవులు సుంకర-వాసిరెడ్డి. ఘంటసాల సంగీత సారథ్యంలో ఆ గీతాన్ని ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, టి.జి కమలాదేవి బృందం ఆలపించారు. ఆ గీతం.. ‘వచ్చిందోయ్ సంక్రాంతి.. ఇచ్చేను ఘనకాంతి..’. సంక్రాంతి గీతాల్లో మకుటాయమానంగా చెప్పుకోదగినది ‘ఉండమ్మా.. బొట్టు పెడతా..’ చిత్రంలోని ‘రావమ్మా మహాలక్ష్మి రావమ్మా..’ గీతం దేవులపల్లి కృష్టశాస్ర్తీ రచన, కె.వి. మహదేవన్ సర్వ రచన, బాలూ గానం, ధూళిపాళ అభినయం. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరపై అద్భుత దృశ్యం ఆవిష్కరించబడినది. ఆ మనోజ్ఞ గీతం..
పల్లవి: రావమ్మా.. మహాలక్ష్మి రావమ్మా
రావమ్మా.. మహాలక్ష్మి రావమ్మా..
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి =రావమ్మా=
చరణం: గురువిందా పొదకిందా- గొరవంకా పలికే
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికే!
తెల్లారి పోయింది! పల్లె లేచింది!
పల్లియలో ప్రతి ఇల్లూ కళ్ళు తెరిచింది
‘కృష్ణార్పణం’ = రావమ్మా =
చరణం 2: కడివెడు నీళ్ళు జల్లి గొబ్బిళ్ళో.. గోబ్బిళ్ళో..
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో..గొబ్బిళ్ళో..
ముత్యాల ముగ్గుల్లో! ముగ్గుల్లో..గొబ్బిళ్ళో..
రతనాల ముగ్గుల్లో! ముగ్గుల్లో..గొబ్బిళ్ళో..
‘కృష్ణార్పణం’! = రావమ్మా =
చరణం 3: పాలిచ్చె గోవులకు పసుపూ - కుంకం
పనిచేసే బసవన్నలకు ప్రతీపుష్పం
గాదెల్లో ధాన్యం! కావిళ్ళా భాగ్యం
కష్టించే కాపులకూ- కలకాలం సౌఖ్యం
కలకాలం సౌఖ్యం
‘కృష్ణార్పణం’ = రావమ్మా =
‘ఇంటికి దీపం ఇల్లాలే’ చిత్రంలో ఆచార్య ఆత్రేయ మరో అడుగు ముందుకేశారు. సంక్రాంతి పండుగ అంటే పేకాటరాయుళ్ళకు, కోడిపందాలకు, మందు బాబులకు కాలక్షేపానికి లోటు ఉండదు. అయితే ఈ పండుగ నాడు వాటికి దూరంగా ఉండాలంటూ రకరకాల వ్యసనపరుల పాత్రల ద్వారా హితవు చెప్పారు.
ఆమె: పొంగి.. పొంగి వచ్చినది సంబరాల సంక్రాంతి
సంపదలు పెంపు చేయు సంక్రాంతి
అతడు: అహ..సంపదలు
పెంపుచేయు సంక్రాంతి
చరణం: పాటుపడి రాటుపడి
పండించే రైతులంతా
పండుగ నాడు ప్రమాణాలు
చెయ్యాలి- అహ..
పాడు గుణమొకటైనా
విడవాలి! = పొంగి =
‘తల్లిదండ్రులు’ చిత్రంలో డా.సి. నారాయణరెడ్డి సంక్రాంతి పండుగ వేళ గొబ్బిళ్ళకు ఉన్న ప్రాధాన్యత, పవిత్రతను విశే్లషిస్తూ ఓ గీతం వ్రాశారు. ఘంటసాల స్వర రచనతో ఎల్.ఆర్. ఈశ్వరి గొంతులో పల్లవించిన...
‘గొబ్బియళ్ళో.. గొబ్బియళ్ళో..’
అన్న పల్లవి గల గీతంలో...
‘ముద్దులగుమ్మ, బంగరు బొమ్మ
రుక్మిణమ్మకు
కన్నతల్లి, కల్పవల్లి సీతమ్మ తల్లికి
గొబ్బిళ్ళు..’ అంటూ పురాణకాలంను ప్రస్తావించి దేశపరంగా..
‘పాడి పంటలు తులతూగే
మా భారతమాతకు
శాంతి, సౌఖ్యం ధర్మం నిలిపే
స్వతంత్య్రలక్ష్మికి గొబ్బిళ్ళు..’ అంటూ కీర్తించారు.
‘మంచి రోజులొచ్చాయి’ చిత్రంలో సంక్రాంతి పండుగ కాలంలో కథానాయకుడు దుష్టులపై విజయం సాధించిన సందర్భంగా తోటి రైతులతో కలిసి సమకాలీన సమాజ వ్యవస్థపై వ్యంగ్యంగా విసురుతున్నట్టు రచన చేశారు కొసరాజు. టి.చలపతిరావు స్వరకల్పనలో ఘంటసాల బృందగానంతో అక్కినేని అభినయంతో రూపొందిన గీతం..
‘ఈనాటి సంక్రాంతి అసలైన పండుగ
సిసలైన పండుగ
కష్టజీవులకు అది ఎంతో
కన్నుల పండుగ’
ఈ పల్లవి గల గీతంలో...
‘ఉన్నవాళ్ళ పెత్తనం ఊడిపోతుందని,
ఇక గుడిసె కాపురాలు ఉండబోవని
సోషలిజం వచ్చే రోజు దగ్గరుందని...’
ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు.
ఏమయినా ఈ సంక్రాంతి లక్ష్మి ‘కష్టజీవుల కలలు పండించాలని, రైతన్నలకు సర్వశుభాలూ చేకూర్చాలని కోరుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.

ఎస్.వి.రామారావు