S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుస్తకాల తోటలో....

తెలుగులో వివిధ రంగాలకు సంబంధించి కొన్ని చిన్న పత్రికలు నడుస్తున్నాయి. వారికి సామూహికంగా ఒకచోట స్టాళ్లు కేటాయించి, ఈ మహోత్సవాల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. సందర్శకులు తమకు పనికొచ్చే పత్రికల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఇందువల్ల లభిస్తుంది.
*
ఇది పుస్తక మహోత్సవాల వేళ.. 29వ విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 1న మొదలై 12న ముగిసింది. హైదరాబాద్‌లో జనవరి 18 నుండి 28 వరకు జరగనుంది. హైదరాబాద్‌లో వరుసగా ఇది 31వది. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు పుస్తకాలకు సంబంధించినంత వరకు విక్రయాలు మరింత భారీగా ఉంటాయని, ప్రచురణల్లో కొత్త పోకడలు కన్పించవచ్చనీ కొందరి అంచనా. పుస్తక ప్రియుల సంఖ్య నానాటికీ తగ్గుతోందా? అని కొందరిలో చర్చ జరుగుతోంది. ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థల ప్రతినిధులు ఈ అంశంపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా తెలుగు పుస్తకాల సంగతి. లోతైన రచనా పాటవం కలిగిన పుస్తకాలు తెలుగులో తక్కువగా వస్తున్నాయని, ముఖ్యంగా స్వతంత్ర రచనలు అంతగా రావడం లేదని, ఆలోచనలను ప్రేరేపించే రచనల్లో ఎక్కువగా అనువాద సాహిత్యమే ఉంటోందని అలాంటి ప్రచురణల్లో ముందుండే ప్రముఖ సంస్థల వారు నాతో అన్నారు. కంప్యూటర్ల యుగం వచ్చి, నెట్ (వలగూడు) వినియోగం పెరిగిన తర్వాత పుస్తకాల కొనుగోలు తగ్గిందన్న వాదాన్ని ఎంతవరకు అంగీకరించాలో తెలియడం లేదు. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుండీ ఇంగ్లీషు మీడియం చొచ్చుకొస్తున్నకొద్దీ చదువుల్లో తెలుగు వినియోగాన్ని తొలగించేస్తున్న మాట నిజం. ఈ ప్రభావం తరాలు మారేకొద్దీ స్పష్టమవుతుంది. ఇంకా పూర్తిగా ఆ పరిస్థితి నెలకొనలేదు. బహుశా మరో 5, 6 సంవత్సరాల్లోనే రెండు రాష్ట్రాల్లోని తెలుగు పాఠకుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుందేమో అనిపిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ 1వ తరగతి నుండి 12 వరకూ తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే తప్పనిసరి చేస్తామంటున్నాయి. ఒక మీడియంగా పాఠశాల విద్య నుండీ తెలుగును తొలగించేస్తున్నాయి. అంటే ఒక బోధనా భాషగా తెలుగు పనికిరాదనే నిర్ణయానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ వచ్చేసినట్లు స్పష్టవౌతోంది. వర్తమాన అవసరాలన్నిటికీ తెలుగును ఉపయోగించుకోవడం మానేస్తే ఆ మేరకు తెలుగు భాషాభ్యున్నతి ఆగిపోతుంది. వాడటం మానేసేకొద్దీ తెలుగు భాష వాడిపోతూనే ఉంటుంది. ఈ పరిస్థితి సృజనాత్మక సాహిత్యం తెలుగులో రావడాన్ని అడ్డుకుంటుంది. శాస్త్ర, సాంకేతిక జ్ఞానానికీ, వివిధ ఆధునిక రంగాల్లో విద్యకూ, అధ్యయనానికీ పనికొచ్చే సాహిత్య సృజన తెలుగులో పూర్తిగా ఆగిపోతుంది. వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కూడా అది దెబ్బకొడుతుంది. ఈ క్రమంలో తెలుగులో పుస్తకాలు కేవలం కవితలు, సామాజికాంశాల సాహిత్యానికి మాత్రమే పరిమితమవుతాయి. ఈ రకమైన పరిణామం ఇప్పటికే ప్రారంభమైంది. ఆంగ్ల పుస్తకాలు పూర్తిగా చోటునంతా ఆక్రమించేస్తాయి. ఈ మార్పుల్ని మనం గమనించాలి. మున్ముందు పుస్తక మహోత్సవాల్లో తెలుగు ప్రచురణల శాతం తగ్గిపోనుందన్న మాట. ఈసందర్భంలో మరికొన్ని అంశాలను కూడా మనం గమనించాలి.
సంక్షోభంలో గ్రంథాలయాలు
గ్రంథాలయాలు కొనే్నళ్లుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ప్రభుత్వాల అశ్రద్ధ ప్రధాన కారణం. గ్రంథాలయ పన్ను పేరిట పురజనుల నుండి కొనే్నళ్లుగా వసూలు చేసిన పన్నులు కోట్ల రూపాయలు ప్రభుత్వాల ఖజానాలోకి వెళ్లాయి. ఆ సొమ్మును ఇతర అవసరాలకు దారి మళ్లించి, గ్రంథాలయాల అభివృద్ధిని ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. ఆ సొమ్మును వెంటనే కొంతైనా విడుదల చేసి, ప్రతి ఏటా పుస్తక మహోత్సవాల సందర్భంగా విస్తృతమైన సాహిత్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు గ్రంథాలయాలకు నిధులను విడుదల చెయ్యాలి. ఇది రచయితలు తమ సాహిత్యాన్ని స్వతంత్రంగా వెలువరించడానికి వీలు కల్పిస్తుంది. రచయితలు స్వతంత్రంగా ప్రచురించే ప్రచురణలు అమ్మడానికి ఈ మహోత్సవాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉండాలి. తెలుగులో వివిధ రంగాలకు సంబంధించి కొన్ని చిన్న పత్రికలు నడుస్తున్నాయి. వారికి సామూహికంగా ఒకచోట స్టాళ్లు కేటాయించి, ఈ మహోత్సవాల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. సందర్శకులు తమకు పనికొచ్చే పత్రికల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఇందువల్ల లభిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటవుతున్న పుస్తక మహోత్సవాల్లో ప్రతిరోజూ నిర్ణీత సమయాల్లో సాహిత్య సభలు, చర్చా వేదిక, సాంస్కృతిక ప్రదర్శనలకు అవకాశం కలిగిస్తున్నారు. ఇది చాలా మంచిపని. కానీ ఇందుకు తగిన విధంగా, సమర్థంగా ముందస్తు ఏర్పాట్లు, యోజన చెయ్యడం లేదు. ఇందుకోసం మరింత శ్రద్ధతో ప్రత్యేకంగా కృషి జరగాలి.
తెలుగు ప్రచారానికి ప్రాధాన్యమివ్వాలి
పుస్తక మహోత్సవాల్లో ఇంగ్లీషు, హిందీ సహా ఇతర ఏ భాషల పుస్తకాలు అమ్మడానికీ అభ్యంతరం లేదు. కానీ తెలుగు పుస్తకాల, పత్రికల ప్రచారానికీ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రదర్శనశాలలు అద్దెల ద్వారా ఎంత బాగా లాభం సంపాదించగలమనే ధోరణికి స్వస్తి పలికి, మరింత మంచి సౌకర్యాల కల్పనపై శ్రద్ధ వహించాలి. మొన్ననే ముగిసిన విజయవాడ పుస్తక మహోత్సవం ఏ కారణాల వల్లనైతేనేమీ ఈ విషయంలో విమర్శల పాలైంది. ఈ లోపాలు ఎక్కడా పునరావృతం కాకుండా - రెండుచోట్లా - మరింత బాగా నిర్వహించేందుకు పోటీపడాలని తెలుగు పుస్తకప్రియులు కోరుకోవడం తప్పుకాదు కదా!

- డా. సామల రమేష్‌బాబు 9848016136