S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాహ్యాసక్తి.. పటాటోప భక్తి

త్రికరణ శుద్ధిగ జేసిన పనులకు దైవము మెచ్చును, లోకము మెచ్చును.. అంటాడు తాళ్లపాక అన్నమయ్య.
త్యాగరాజ కీర్తనలకున్న అర్థం తెలిసి పాడితే చాలు. ఆ కీర్తనల్లోని రాగాలు భావంతో పాడేలా చేస్తాయి.
‘అంతా గాయకులే, అంతరంగమున ఆత్మానంద చిన్మూర్తితో పంతాలాడెడు పందెగాడు ఒక్కడూ లేడయ్యా’ అనేవారు, కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులనే సంగీతజ్ఞుడు.
త్యాగరాజ కీర్తనలకు వ్యాఖ్యానం రాసిన -కల్లూరి వీరభద్ర శాస్ర్తీగారి సోదరుడీయన. త్యాగరాజు తన కీర్తనల ద్వారా తెలుగు జాతికి సమర్పించిన సంగీత జ్ఞానం యొక్క లోతు ఎంత అని అనే్వషించాలంటే, ఆ కీర్తనల్లోని రాగతాళ సమన్వయాన్ని బాగా వొంటబట్టించుకోవాలి. నాలుగైదుసార్లు సినిమా పాటలాగా వినేసి ముక్కున పట్టేసి ఊదేసేవి కాదు.
వేదాంతిగా, తత్వవేత్తగా ఆయన్ని తెలుసుకోవాలంటే పెద్దల దగ్గర కూర్చుని అధ్యయనం చేయాలి. తెలిసి పాడాలి. త్యాగరాజు మన తెలుగువాడే సుమా! అని పైకి గట్టిగా అనటం తప్పించి, సాహిత్యం జోలికి లోతుగా వెళ్లి తెలుసుకుని పాడాలని సాధారణంగా అనిపించదు కొందరికి.
నిజాన్ని ముఖం మీద చెబితే కట్టుకున్న భార్య కూడా వినకపోవచ్చు. ఏకీభవించే అవకాశం లేకపోవచ్చు. అవతలి వారు ఏ మాత్రం ఉద్వేగపడకుండా చెప్పగలిగే తెలివి అందరికీ ఉండదుగాక ఉండదు. ఎదుటి వాళ్లు తిరగబడేలా కాకుండా కఠోర సత్యాన్ని కూడా మృదువుగా చెప్పటంలోనే వుంది మజా...
సత్యమే అనుకోండి. అయినా అంత పెళసరంగా చెప్పాలా? పరుషంగా చెప్పాలా? అని ఈసడించుకునే వారుంటారు.
సత్యాన్ని ప్రియంగా చెప్పడమే కాదు. చెప్పేది ఎదుటి వారి శ్రేయస్సు కోరి చెప్పినట్లుగా ఉండాలి.
సత్యాన్ని ప్రియంగా చెప్పాలనుకుని లోకాభిరామాయణాన్ని చెబితే ఎలా? ఆ మాట మేలు కలిగిస్తేనే పూలబాటవుతుంది.
ఎందుకొచ్చిందీ తలనెప్పి అనుకుని మనలో సాధారణంగా వుండే బలహీనతలను తనవిగా చేసుకుని, తప్పులన్నీ తనలోనే వున్నాయని తనకే ఆపాదించుకుని ‘మనసా’ అంటూ సంబోధన చేసుకుంటూ పాడుకున్నాడు. త్యాగరాజు - అందుకే పుణ్యపురుషుడయ్యాడు. సంస్కారవంతమైన వారికి తిన్నగా ఆయన సందేశం చేరి తీరుతుంది. సాధారణంగా పైకి కనిపించే మనుషులకూ, లోపల వారికున్న గుణాలకు సంబంధం వుండదు.
త్రికరణ శుద్ధిగా చేసే పనులు దిగ్విజయవంతవౌతా యనుకోకండి. పెద్దలు చెప్పిన మాటను నమ్మినంత మాత్రాన అన్నీ పనులు సవ్యంగా జరుగకపోవచ్చు. అందరూ ఇష్టపడతారనీ లేదు. ఆడిషన్ టెస్ట్ కోసం, ఆలిండియా రేడియోలో నేను పని చేసే రోజుల్లో లలిత సంగీతం పాడేవారెందరో వచ్చి వెళ్తూండేవారు. పాపం! తంబురా శృతిలో పాట కలవకుండా పాడేవారిని కూడా ‘మా వాళ్లు’ బాగా పాడుతున్నారని పైకి అభినందిస్తూ లోపల నవ్వుకునేవాళ్లు. పోనీ ముఖం మీద చెబితే తెలుసుకుని అర్థం చేసుకుని, ఆచరణలో పెడ్తారా? అంటే అనుమానమే. ‘స్వీయలోపమ్మెరుగుటే పెద్ద విద్య’ అని వేమన చెప్పనే చెప్పాడు. లోపం వారికి తెలియదు. చెపితే నచ్చదు. మునులైనా, యోగులైనా, మహర్షులైనా, జ్ఞానులైనా అందరూ వౌనస్వాములు కాదు. అవసరమైన సందర్భాల్లో హాయిగా మనసు విప్పి మాట్లాడేవారు. త్యాగయ్య వంటి వాగ్గేయకారులు మానసికంగా తమకు సంబంధం లేని వాటికి చాలా దూరంగా వుండేవారంతే - చెప్పవలసినవన్నీ వౌన వ్యాఖ్యలే. వారికి వౌనమే బలం. మాటను బలహీనతగా భావించి పొదుపుగా మాట్లాడేవారు - సంగీతం ఉండనే ఉంది. జీవితమంతా హాయిగా పాడుకునే బ్రతికారు.
అగర్‌బత్తీని వెలిగిస్తే చుట్టూ వాతావరణం ఎలా పరిమళిస్తుందో, పవిత్ర భావనలతో వున్న వ్యక్తుల వల్ల మొత్తం సమాజమే సుఖసంతోషాలతో నిండిపోతుంది. వారెంత దూరంలో వున్నా వారి ప్రభావం వుండి తీరుతుంది.
జరిగిన తప్పులన్నీ దిద్దుకోవడానికే ఒక జీవితం సరిపోదు. స్వధర్మాన్ని నిర్వహించే సమయం చిక్కదు. చేసిన తప్పులు దిద్దుకుంటూ దిద్దుకోలేక క్రిందా మీదా పడుతున్న వారు మనలో ఎంతమంది లేరు? సమయానికి తగ్గట్లు మనసుని నియంత్రించుకోక పోవడమే దీనికి కారణం. అది తెలిసిన కొద్దీ తప్పులు తగ్గుతూంటాయి. దైవానుసంధానికి దారి దొరుకుతుంది - ఇంతకంటే తపస్సు ఇంకేముంటుంది?
నేర్చుకోవలసిన విద్యలు లోకంలో ఎన్నో వుంటాయి. ఎంత నేర్చుకున్నా, ఎన్నాళ్లు సాధన చేసినా ఓ పట్టాన లొంగని విద్యల్లో సంగీత విద్య ఒకటి.
గురువుకూ శిష్యుడికి వుండే బలమైన బంధాన్ని బట్టే ఆ సంగీతం పెరుగుతుంది. శిష్యుడిలో వున్న బలహీనతనీ, లోపాలనూ ఒక్కొక్కటే తొలగిస్తూ కడిగిన ముత్యంలా చేయవలసిన బాధ్యత సద్గురువుదే. దీనికి శిష్యుడు సర్వదా సిద్ధుడై వుండాలి.
విద్వాంసుడై వెలుగులో కావాలంటే ఈ గురువొక్కడి వల్లనే సాధ్యం - అనే నమ్మకం లేకపోతే ప్రయోజనం సున్నా.
‘నేను ఇన్ని మెట్లు ఎక్కి పై అంతస్తుకు రాలేను. అశక్తుణ్ణి. అమ్మా! నన్ను ఎత్తుకుని పైకి తీసుకెళ్లి కాస్త అన్నం పెట్టు తల్లీ!’ అని పసిపిల్లాడు, మారాం చేస్తూ అడిగిన విధంగా ‘గురువును అర్థిస్తే తప్ప’ సంగీత విద్య అబ్బే అవకాశం లేదని అనుభవజ్ఞులు చెప్పే మాట.
‘నాకు కొంత తెలుసు. కాస్త మెరుగులు దిద్దండి’ అనే శిష్యులు గురువులకు ఎప్పుడూ బరువులే. వాళ్లు ప్రయోజనం అందుకునే లబ్ధీ చాలా తక్కువ.
నిజమైన సంగీత సద్గురువు త్యాగరాజే. ముగ్గురు సంగీతమూర్తులూ ఒకే వూళ్లో వున్నారు. ఎవరి ధోరణిలో వారు పాడుకుంటూ బ్రతికారు. ఎవరి శిష్యులు వారికున్నారు. ఒకరంటే మరొకరికి గౌరవమే. అన్యోన్యంగానే వుండేవారు తప్ప అసహనంగానీ, అహంకారంగానీ, మత్సర బుద్ధిగానీ ఎఱుగరు. కాబట్టే ప్రాతఃస్మరణీయులైయ్యారు. సంగీత లోకానికి ఆదర్శ పురుషులయ్యారు.
తమ జీవితాలను సంగీత మార్గంలో నడుపుకుని తరించారు. ఆ దారిని మనకూ చూపించారు.
తనకంటే గొప్ప వారిని అభినందించటం, తక్కువ వారిని ప్రోత్సహించి మాట్లాడటం సంగీతజ్ఞులకుండే ప్రాథమిక సద్గుణాలు.
ఇవి లోపించినంత కాలం వారి పాటకు పెరుగుదలంటూ వుండదు. వున్నట్లుగా కనిపిస్తుంది.
సంగీత మూర్తిత్రయమైన (శ్యామశాస్ర్తీ, త్యాగరాజు, దీక్షితులు) ముగ్గురికీ కీర్తికండూతి లేదు - రాజులతోనూ రాజాస్థానాలతోనూ పనిలేదు. ‘రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయమ’ని వాళ్లకు చాలా దూరంగానే బ్రతికారు.
రికార్డుల కోసమో, రివార్డుల కోసమో అర్రులు చాచలేదు. దేహి అనలేదు. ప్రొద్దునే్న లేచి రోజులెలా గడిచేదెలా? అని తాపత్రయం కొద్దీ అడ్డమైన వాళ్లను పొగిడి పబ్బం గడుపుకోవాలనే ఆశగానీ, చూస్తే ముద్దుగొలిపే సంసారపు లంపటంలో మునిగి, జీవితాల్ని క్రమబద్ధంగా గడుపుకోలేక పోవడంగానీ, మదంతో డబ్బు, పిల్లలు, స్థిర, చరాస్తుల్ని చూసుకుంటూ మురిసిపోవటం గానీ, ఎదుటివారి సంపదను చూసి నిరాశా నిస్పృహలతోనూ, ఈర్ష్యాసూయలతో కృంగిపోవడం గానీ, ముసలితనంతో మతితప్పి లేవలేని దయనీయ స్థితిలో జీవితాలను గడపవలసి వచ్చిన దశ గానీ ఈ మహానుభావులెరుగరు.
కోరికలే లేనివారికి కీర్తికాంక్ష ఎందుకుంటుంది? కర్ణాటక సంగీత పరిధిలోని రాగాలకు, రచనలకు స్పష్టమైన రూపాన్ని కల్పించిన మహనీయులు వారు. ముగ్గురిలోనూ శ్యామశాస్ర్తీ వయస్సులో పెద్దవాడు. ఈయన త్యాగయ్యను ఎంతో ఇష్టపడటమే కాదు, తన కుమారుణ్ణి (సుబ్బరాయశాస్ర్తీ) త్యాగయ్య వద్ద సంగీత విద్యాభ్యాసం కోసం పంపాడు.
త్యాగరాజుని చూడాలని చాలామందికి వుండేది. ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేని ఆ రోజుల్లో వ్యయ ప్రయాసలకోర్చి ఆయన్ని దర్శించిన వారిలో దక్షిణాదిలో 18వ శతాబ్దంలో మయూరానికి చెందిన ‘గోపాలకృష్ణ భారతి’ ఒకరు. జీవితాంతం బ్రహ్మచారిగా గడిపిన గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరుడు, సంగీతమే జీవితంగా గడిపిన వ్యక్తి. భారతి శిష్యుడైన యు.వి.స్వామినాథయ్యర్, త్యాగయ్యతో వీరిద్దరి సంభాషణను గ్రంథస్థం చేసిన మహనీయుడు. నందనార్ చరిత్ర రాశాడు. సినిమా కూడా తీశారు.
గోపాలకృష్ణ భారతికి త్యాగయ్యను చూసి తరించాలనే కోరిక చాలా బలంగా ఉండేదట. ఒక శుభ ముహూర్తంలో తిరువయ్యారు వెళ్లారు. ఆ సమయంలో శిష్యులతో త్యాగయ్య ‘అభోగి’ రాగకృతిని పాడుతున్నారుట. భారతిని చూడగానే త్యాగబ్రహ్మ కుశల ప్రశ్నలడిగి ‘ఏ ఊరు నుంచి వచ్చార’ని అడిగారుట.
‘నేను మయూరం గ్రామానికి చెందినవాణ్ణి’ అనగానే, ‘అలాగా! అయితే మీకు గోపాలకృష్ణ భారతి అనే మహావిద్వాంసుడు తెలుసా?’ అని ఆసక్తిగా అడిగేసరికి, భారతికి నోట మాటలేదు.
ఆనందాశ్రువులతో పులకించిపోయి.. ‘అయ్యా! నేనే, ఆ సామాన్యమైన సంగీతజ్ఞుణ్ణి’ అని ఎంతో వినమ్రంగా బదులిచ్చాడు.
అంతకు ముందే గోపాలకృష్ణ భారతి సంగీత సాహిత్య విద్యా పాండిత్యం గురించి విన్న త్యాగరాజ స్వామి గోపాలకృష్ణ భారతిని ప్రత్యక్షంగా చూడగలిగినందుకు పరమానంద భరితడైయ్యాడు.
సంగీతమే రూపుగా భావించబడే త్యాగరాజు వంటి వారే అలా భావిస్తే ఇంక చెప్పేదేముంది? త్యాగరాజస్వామి సాన్నిధ్యంలో వున్న భారతిని, ‘అభోగి’ రాగంలో మీరేదైనా రచన చేశారా? అని అడిగారుట. వౌనంగా వుండిపోయారు. ఆ రాగంలో అంతవరకూ సంగీత రచన చెయ్యలేదు. త్యాగయ్యను కలిసిన రోజు మరునాడు ప్రణతార్తిహరుని దేవాలయంలో స్వామి దర్శనం చేసుకున్న గోపాలకృష్ణ భారతి ఆ రాత్రికి రాత్రే ‘అభోగి’ రాగంలో ‘సభాపతిక్కు వేరే దైవం’ అనే కృతిని స్వరపరచి సిద్ధంచేసి మరుసటి రోజు త్యాగయ్యకు వినిపించాడు. త్యాగరాజు పరమానంద భరితుడైయ్యాడు.
త్యాగరాజ దర్శనంతో పులకాంకితుడైన గోపాలకృష్ణ భారతి ‘శివపరంగా’ త్యాగరాజ పంచరత్న కీర్తనల మాదిరిగా 5 శివస్తుతులు, నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ రాగాల్లో రచించి ప్రసిద్ధుడైయ్యాడు. గోపాలకృష్ణ భారతి కీర్తనలు 18వ శతాబ్దంలోనే ప్రసిద్ధమయ్యాయి. వసంత కోకిలం, సుబ్బులక్ష్మి, పట్టమ్మాళ్ లాంటి వారు పాడి గ్రామఫోను రికార్డులిచ్చారు. తమిళనాట గోపాలకృష్ణకు నీరాజనాలిస్తారు.
వారు సంగీత విద్యను విద్యా విత్తకరీ, భోగకరీ అనుకోలేదు. మోక్షకారక విద్యగానే భావించారు. అందుకే చిరస్మరణీయులయ్యారు.
లోకంలో కపటం లేని సంగీత విద్వాంసులు చాలా అరుదు.. అని చెబుతూ ‘ఎదలో నెంచుటొకటి, పయ్యెద కలిగినచోనొకటి, గొప్పతనముకై ఆస - కుత్సిత విషయ పిపాస మెప్పులకై బహులేసమిడి - ఉప్పతిల్లెదరు, త్యాగరాజ వినుత! అది కాదు భజన’ అంటారు త్యాగయ్య.
ఈ దౌర్భాగ్యం సంగీత రంగంలో వున్న వారికే ఒకపాలు ఎక్కువనిపిస్తుంది.
తనకంటే బాగా పాడే వారిని మెచ్చుకోలేరు. పోనీ వారిలోవున్న లోపాలు గ్రహించలేరు. తెలుసుకుందామనే జిజ్ఞాస లేకపోగా ఈర్ష్య, అసూయ, కక్ష, కార్పణ్యాలు పీడిస్తూంటాయి. అలాగే బ్రతికేస్తారు. తెలుసుకుందామనేసరికి జీవితమై పోతుంది.
‘జ్ఞాన ఖలుని లోని శారద’ వుండి ఏమి ప్రయోజనం? మనసులో ఏర్పడే ఆలోచనలు వ్యతిరేకంగా వుంటే, అవి మన మార్గాన్ని పూర్తిగా మార్చేస్తాయి. సక్రమంగా వుంటే దారి చూపిస్తాయి. భగవాన్ రమణమహర్షి ఓ కథ చెప్పారు. మన మనస్సు ప్రశాంతంగా మృదువుగా సున్నితంగా, చెదిరిపోకుండా మన మాట వింటే అది మిత్రుడు. మనసు స్వాధీనం తప్పితే, అది మనల్ని మించి, అధిగమించి ఒక్క దూకు దూకి మన గమ్యాన్ని, మార్గాన్ని పూర్తిగా మార్చేస్తుందంటూ చెబుతూ, ఒక ముసలావిడ చూడ్డానికి చాలా ఉత్తమురాలుగా, మర్యాదస్తురాలుగా, ధర్మాత్తురాలుగా, నెమ్మదస్తురాలుగా కనిపించేది. ఆమెను ప్రేమాస్పదురాలుగా చెప్పుకునేవారు. కానీ, ఆమె అంతరంగమంతా ద్వేషంతో ఉడికిపోతూండేది. ముఖ్యంగా తనని విమర్శించి నిందారోపణ చేసిన వారి మీద. ఒకరోజున ఆమెను పిచ్చికుక్క కరిచింది. ఆమెకు పిచ్చెక్కింది. ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ తెలివిగా మాట్లాడినపుడు డాక్టర్ ఒక కాగితం, కలం ఇచ్చి, ‘మీ చివరి కోరిక’ ఏమిటో రాయమన్నాడు. ఆమె వెంటనే ఆదుర్దాగా ఏదో రాసేస్తోంది. దాన్ని డాక్టర్ చూసి ‘ఏమిటి? ఏం రాస్తున్నారు?’ అని అడిగాడు. దానికి ఆమె ‘నేను ఎవరెవరిని కొరకాలో వాళ్లందరి పేర్లూ రాస్తున్నా’ అంది. ఆ మాటకు డాక్టర్‌కు మతిపోయింది.
ఆమెలో నిగూఢంగా దాగి వున్న క్రోదాగ్ని మొత్తం ఓ కుక్క కాటు దెబ్బతో బయటకు వచ్చింది.
ఇటువంటి ద్వంద్వ వైఖరి మనస్తత్వాలు మనుషుల్లో, వివిధ కోణాల్లో ముఖ్యంగా కళారంగంలో సర్వ సాధారణం. కొసరు వ్యక్తులు బాగానే వుంటారు. చివరకు సదరు వ్యక్తులే దెబ్బతింటారు. కళను అభిమానించే ప్రతివారికీ కళా హృదయముంటుందనుకోవటానికి వీలులేదు.

- మల్లాది సూరిబాబు 9052765490