S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాముని వారము - మాకేమి విచారము?

మహావైద్యనాథయ్యర్
(1844 - 1893)
తంజావూరుకు సమీపంలోని ‘వాయచెరి’ స్వగ్రామంలో జరిగిన ఆయన గాత్ర సంగీత కచేరీకి సుమారు ఇరవై వేల మంది హాజరై ‘మైకులు’ లేకపోయినా హాయిగా విని ఆనందించారు. అటువంటి దివ్యమైన శారీరం ఆయనది.
72 మేళకర్త రాగాలలో 72 చరణాలు రచించిన ఏకైక సంగీత విద్వాంసుడు. ఈ మహామేళ రాగమాలిక పాడేందుకు సుమారు 45 ని.లు పడ్తుంది. ‘్భరతరత్న’ శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఈ మేళ రాగమాలిక పాడి రికార్డు ఇచ్చారు.
భారతీయ సంగీత చరిత్రలో అతి దీర్ఘమైన సంగీత రచన.

రామభక్తి సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజులు ముగ్గురు. ఒకరు కాకర్ల త్యాగరాజు. మరొకరు బమ్మెర పోతరాజు. ఇంకొకరు కంచర్ల గోపరాజు.
‘కలియుగమున వరభద్రా/ చలమున నెలకొన్న రామచంద్రుని వర/ భక్తులనెల్ల వరుడనందగి/ వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్’ అని 18వ శతాబ్దంలో వాగ్గేయకారుడై రామభక్తుడై, సంగీత లోకం యావత్తూ కీర్తించే త్యాగరాజు ‘ప్రహ్లాద భక్తి విజయం’ సంగీత నాటకం ప్రారంభంలోనే కీర్తించాడు. భక్తులు భావాలు పంచుకుంటారనడానికి సాక్ష్యం ఈ మహానుభావులే.
చెవిని ఇల్లు కట్టుకుని ఎన్ని ఉపన్యాసాలు దంచినా, విని ఆచరించే వాడొక్కడున్నా చాలు. ఆ ఒక్కడివల్లా సమాజానికి కాసె్తైనా మేలు జరుగుతుంది. వినటానికీ, విన్నది ఆచరించడానికీ మధ్య ఎంతో వ్యత్యాసముంది. కొందరి జీవితాల్లో జరిగిన సంఘటనలు, వారి జీవితాలను మార్చేసిన సందర్భాలనేకం.
మహాత్మాగాంధీ చూసిన హరిశ్చంద్ర ‘నాటకం’ ఆయన జీవితానే్న మార్చేయలా?
భగవాన్ శ్రీరమణ మహర్షికి జరిగిన స్వీయానుభవమే ఆయన జీవిత గతిని ఓ మలుపు తిప్పేయలా? వ్యక్తుల సంస్కారాన్ని బట్టే యివన్నీ జరుగుతుంటాయి. సాధకుడికి ప్రశ్నలంటూ పుట్టకుండేట్లుగా ఉంటుంది, రమణుల జీవితం. పవిత్ర గ్రంథాలైనా, పరమ పురుషుల వాక్కులైనా, అర్థం చేసుకుంటూ ఆచరించగల నిశ్చల బుద్ధి కావాలి. అది లేకపోతే ఎందరు విదురులున్నా ప్రయోజనం సున్నా. ధృతరాష్ట్రుడితో సమానమే. ఆరోగ్యమైన నేపథ్యాన్ని ఎవరికి వారే సృష్టించుకోవాలి. ఒక అయస్కాంతం ఇనుప ముక్కను ఏం చేస్తుంది? మరొక అయస్కాంతంగా చేస్తుంది. ఋషుల వాక్కు కూడా అంతే.
యిటువంటి దివ్యమైన లక్షణాలు అలవడాలంటే ‘మనస్సు’ పవిత్ర భావనలతో నిరంతరం తేలియాడుతూండాలి. మహనీయుల బోధలు మనస్సులో మెదుల్తూ ఉండాలి. అలా చేసే పనులన్నీ తనకు శ్రేయస్సు కలిగించేలా మారిపోతాయి. వికటించవు. మనం చూసే దృష్టిని బట్టే సృష్టి.
భద్రాచల రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న స్వగ్రామం తెలంగాణలోని నేలకొండపల్లి. అక్కడ గోపన్న వంశస్థులు ఇప్పటికీ వున్నారు. లింగన మంత్రీ, అక్కమాంబా అతని తలిదండ్రులు. రఘునాథ భట్టర్ అనే గురువు ద్వారా ‘నారాయణ’ మంత్రోపదేశం, వైష్ణవ ప్రపత్తీ కలిగాయి.
యింట్లో ఇరవై నాలుగ్గంటలూ ఏవేవో సంకీర్తనా గోష్టులూ, సాధు సంతర్పణలూ, పురాణ శ్రవణాదులతో, ఆ కుటుంబం ఒక భక్తివాతావరణంలో వుండిపోయేది. ఏ గురువు దగ్గరా కూర్చుని నేర్చుకోకపోయినా గోపన్న పాడగలడు. పదిమందితో పాడించనూ గలడు. అంతేకాదు. ఆయన సహజ కవి కూడా.
మేనమామల పుణ్యమా అని గోల్కొండలో సింహాసన స్థితుడైన తానాషా కొలువులో చేరాడు.
రామదాసు జీవితచరిత్ర ఆధారంగా తీసుకుని రచించిన యక్ష గానాల్లోనూ, హరికథల్లోనూ, రంగస్థల నాటకాల్లోనూ అప్పటి సుల్తాను పాత్రని ఒకే ఒక్క ‘తానీషా’గా చిత్రించారు గానీ నిజానికి ఆ కాలంలో అంటే 1620 - 1687 మధ్య గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశస్థులయిన సుల్తానులు ఇద్దరు.
ఒకరు అబ్దుల్లా కుతుబ్షా, మరొకరు అబుల్ హసన్. ఇతనికే ‘తానాషా’ బిరుదుండేది. నిజానికి గోల్కొండ రాజులు మంచి పేరున్న మారాజులే.
‘నిత్యానందుడు’ లేక నిత్యమూ పరమాత్మ యందు లగ్నమైన మనస్సు కలవాడు’ అనే అర్థం వచ్చే ‘తానాషా’ అనే ఆప్యాయ బిరుదం పొందిన అబుల్ హసన్ కుతుబ్షా. మాదన్న గారిని మంత్రిని చేసి గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆదర్శప్రాయంగా మొగలాయిల నుంచి స్వతంత్రంగా తీర్చిదిద్దుకున్న సూఫీ వేదాంతియైన తానాషాకే శ్రీరామలక్ష్మణులు కనిపించి పైకమిచ్చి రసీదు అడిగారని యక్షగాన, హరికథా భాగవతార్‌ల ప్రగాఢ విశ్వాసం. స్వమతాభిలాషతోబాటు, పరమత సహనం మెండుగా ఉన్న ప్రభువులే గోల్కొండ నవాబులు.
ఎప్పుడో పోకల దమ్మక్క కట్టించిన శ్రీరాముని దేవాలయం గర్భగుడి పాడుబడి ఉండటం గమనించాడు. ఆలయోద్ధరణకు సంకల్పించాడు. రామదాసు నిరాడంబర జీవితాన్ని గమనించిన గ్రామీణులు ఐచ్ఛికంగా ధన సహాయం చేశారు. సొమ్ము కొంతవరకూ సమకూడింది. కానీ అప్పటి రాజకీయ అనిశ్చిత స్థితి, హిందూ దేవాలయాలపై మహమ్మదీయుల దురంతాలూ, ధనాన్ని కొల్లగొట్టేసి, ధ్వంసం చేసే మొగల్ పాలకుల దురాగతాలు గమనించిన రామదాసుకు ఆలయ పునరుద్ధరణ ఆగిపోతుందేమోనన్న భయం పట్టుకుంది. రామాలయ నిర్మాణానికి ప్రజల నుంచి సేకరించిన శిస్తు పైకాన్ని కూడా వాడటం నేరమై కూర్చుంది. గోల్కొండ రాజకీయ వాతావరణం క్రమంగా మారిపోవడం ఆరంభమైంది. హిందూ మంత్రులైన అక్కన్న మాదన్నల ఔన్నత్యాన్ని మహమ్మదీయ ప్రముఖులకు నచ్చలేదు. తానాషా హిందూ మంత్రుల చేతిలో కీలుబొమ్మైనట్లు భావించటం మొదలుపెట్టారు.
రామదాసు కాస్తా ఒంటరివాడై పోయాడు. ఆ రోజుల్లో వసూలు చేసిన శిస్తు ఎప్పటికప్పుడు ఖజానాకు తరలించే నియమం అంటూ ఏమీ లేదు. ఈ వెసులుబాటు వల్ల, ఆలయ నిర్మాణం పూర్తయిపోవాలన్న ఆకాంక్ష వల్లా, శిస్తు పైకం వాడవలసి వచ్చింది. ప్రభుత్వం దృష్టిలో అది నేరమేగా? కానీ పరమ భక్తుడైన రామదాసు నిజాయితీగా ఖర్చు చేసిన దాంట్లో ఒక్క చిల్లిగవ్వ సొంతానికి వాడుకోలేదనేది పరమ సత్యం.
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ అని నమ్మి బ్రతికాడు. అన్నీ ఆ రామచంద్రుడికే వదిలేశాడు.
జైల్లో మగ్గిపోయాడే కాని బెయిలు కోసం ఏడవలేదు. రాముడి కోసమే ఏడ్చాడు.
* * *
రామధ్యాన గాన తత్పరుడై ‘తాజేసిన మేలు దైవమెరుగవలె/ తాజెప్పుకోవలెనా/ తన మనసును వశము చేసుకున్న చాలు కాశీకి పోవలెనా!!’
జీవితానికి కావలసిన కనీస అవసరాలను వదిలేసి ఏ చెట్టు క్రిందనో ఉంటూ, ఏ తల్లి పెట్టినదో తింటూ చలి కాచుకోవడానికి ఎండలో నిలబడియో, చితుకులతో మంట వేసుకుని ముడుచుకుని కూర్చుండియో ఉండే సన్యాసిని కూడా ఆశాపాశం ఛస్తే వదిలిపెట్టదు.
మానసిక పరిశుద్ధత ప్రధానం. యిదివరకటి రోజుల్లో ఎవరికీ తెలియకుండా గుప్త దానాలు చేసేవారు. అది కూడా, ఎంతో వినయంగా సిగ్గుపడుతూ చేసేవారు.
385 ఏళ్ల క్రితం భద్రాచల రామదాసు భారతావనిలో పుట్టాడు. సంగీత వాగ్గేయకారులందరికంటే ముందు వాడు.
త్యాగయ్యగారి తల్లి ‘్భద్రాచల రామదాసు’ కీర్తనలు యింట్లో పాడుకుంటూండేది. త్యాగయ్య రామదాసు భక్తిశ్రద్ధలకు పరవశించి వినేవాడు. ఆయననే స్ఫూర్తిగా నిలుపుకున్నాడు. ఆయన ఉత్సవ సంప్రదాయ, దివ్యనామ కీర్తనలకు మార్గనిర్దేశనం చేసినవి రామదాసు కీర్తనలే. భద్రాచల రామదాసు కీర్తనలన్నీ చాలా వరకూ భజన గోష్టులలో బృందగానంగా పాడేవే.
లోకరీతిని గమనిస్తూ సమాజాన్ని చైతన్యపరిచే కీర్తనలలో ఈ కీర్తన ఒకటి. ‘కలకాలము తల్లి కరుణ భోజనమిడు/ కాలమందు జూడుడీ/ కులుకుచు పెంచిన కొడుకుల గుణములు/ కోడలొచ్చిన జూడుడీ!!’
‘తాజేసిన మేలు దైవమెరుంగ వలె, తా చెప్పుకోవలెనా?/ ప్రేమ కలిగినట్టి పెండ్లాము గుణమెల్ల/ పేదరికమున జూడుడీ/ కామించి బంధువుల కరుణారసం బెల్ల/ కలసిమెలసి చూడుడీ’
కాలానికి ఎటువంటి మార్పూ ఉండదు. క్రమం తప్పకుండా సూర్యచంద్రులు వాళ్ల విద్యుక్త ధర్మం నిర్వహించుకుంటూ పోతున్నారు. పరిణామాలన్నీ మనిషికే.
పెళ్లాం ఇంటికొచ్చేసరికి తల్లి పాత్ర చాలా చిన్నదై పోతుంది. ఆ రోజు వరకూ అమ్మ చేతి ముద్దలే తిన్న కొడుకుల గుణాల్లో మార్పు కనిపిస్తుంది.
‘అలరుచు తిరిగేటి అన్నల గుణమెల్ల/ అవిభక్తులు చూడుడీ/ చెలగుచు తిరిగేటి చెలికాని గుణము/ లేమి కలిగిన జూడుడీ’
జన్మము కలిగి జన్మ రాహిత్యము నకు గుణము కలిగితె మంచిది. ధనము కలిగితేను ధనమునకు తగినట్లు ధర్మమున్నను మంచిది.
హరిదాసుల నెల్ల నాదరించిన యట్టి/ ఆనందమిదె చూడుడీ/ వర రామదాసుని వాగ్వైఖరి విన్న/ వారలకే ఫలితము మనసా’
‘తా జేసిన మేలు దైవమెరుంగవలె/ తా జెప్పుకోవలెనా?’
ఈ తెలుగు గడ్డ మీద పది మంది చేత గొంతు కలిపి, ఒళ్లు మరిచి పాడే భజన సంప్రదాయానికి మూల పురుషుడైన భద్రాచల రామదాసుకు ఈ జాతి ఎప్పుడూ రుణపడే ఉంటుంది.
భద్రాద్రి రాముని సేవలో అందరికీ భాగం వుండాలనే మనస్తత్వం రామదాసుది.
కపటం లేకుండా పాడిన భక్తులకు ఆత్మవిశ్వాసాన్ని, కష్టాల నోర్చుకునే శక్తినీ ప్రసాదించినవి.. భద్రాచల రామదాసు కీర్తనలు - ఆంధ్రదేశంలో ఈ వేళ అటువంటి వాతావరణానికి చాలా దూరమై పోయాం. ఆ దివ్యమైన సంప్రదాయం మరిచిపోయే స్థితికి వచ్చేశాం.
భజన సంప్రదాయం ఆంధ్రదేశంలో సుస్థిరమవడానికి కారణం ఆ మహానుభావుడే. భద్రాచల రామదాసు తన జన్మస్థలమైన నేలకొండపల్లిలోని స్వగృహాన్ని ఒక గృహస్థుకు దానం చేసినట్లుగా ఆ గ్రామస్థులకు వ్రాసిన లేఖ ప్రతిని చూడండి (్భద్రాచలం దేవస్థానంలో భద్రపరిచారు) ఘంటం పట్టని వాగ్గేయకారుడు రామదాసు. ధాతువుకు, మాతువుకూ జత కలిపి జన హృదయాలలో నర్తింపజేసిన ధీరుడు.

- మల్లాది సూరిబాబు 9052765490