S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..69 మీరే డిటెక్టివ్

శోకంతో కృశించిన గుహుడు తనని వెనక్కి వెళ్లమన్న రాముడితో స్నేహపూర్వకంగా చెప్పాడు.
‘నేను నీతో ఉన్న స్నేహంతో సంకోచం లేకుండా ఏ మాటలు చెప్తున్నానో వాటిని ‘మన భక్తుడు కదా’ అని నువ్వు క్షమించాలి. నీ వియోగంతో, పుత్రశోకంతో బాధపడే అయోధ్యా నగరానికి నువ్వు లేకుండా ఎలా తిరిగి వెళ్లగలను? అప్పుడు రాముడున్న రథాన్ని చూసిన ప్రజలు అంతగా దుఃఖించారు. ఇప్పుడు రాముడు లేని రథాన్ని చూసి వారి హృదయాలు బద్దలైపోవచ్చు కూడా.
‘యుద్ధంలో వీరుడు మరణించి, సారధి మాత్రమే మిగిలి ఉన్న తమ రథాన్ని చూసి సైన్యం దుఃఖించినట్లుగా, నువ్వు లేని ఈ రథాన్ని చూసి నగరం దుఃఖిస్తుంది. పాప రహితుడవైన ఓ రామా! ఇందువల్ల నువ్వు లేకుండా నేను అయోధ్యకి తిరిగి వెళ్లలేను. నేను నీ వెంటే అరణ్యానికి రావడానికి అనుమతించు. నేను ఇంత ప్రార్థించినా నన్ను విడిచిపెడితే నేను రథంతో సహా వెంటనే ఇక్కడే అగ్నిలోకి ప్రవేశిస్తాను. ఓ రామా! అడవిలో నీ తపస్సుకి విఘ్నం కలిగించే జంతువులని రథంతో నివారిస్తాను. నేను నీ అనుగ్రహంతో నీ రథాన్ని నడిపే ఆనందాన్ని పొందాను. ఇప్పుడు నీ అనుగ్రహంతో వనవాస ఆనందాన్ని కూడా పొందాలని కోరుతున్నాను. నన్ను అనుగ్రహించు. నేను అరణ్యంలో నీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు కూడా ప్రేమగా ‘నువ్వు నా దగ్గరే ఉండు’ అని చెప్పగా వినాలని అనుకుంటున్నాను. ఓ వీరుడా! నువ్వు అడవిలో నివసించేప్పుడు ఈ గుర్రాలు నీకు సేవ చేసినట్లైతే వాటికి కూడా ఉత్తమ గతి లభిస్తుంది. నేను అన్ని విధాలా అయోధ్యనైనా, దేవలోకాన్నైనా విడిచి అడవిలో నివసిస్తూ, నీకు తల వంచి నమస్కరిస్తూ సేవ చేస్తాను. కుబేరుడి రాజధానైన అమరావతిలోకి పాపాత్ముడు ఎలా ప్రవేశించలేడో అలా నువ్వు లేకుండా నేను అయోధ్యలోకి ప్రవేశించలేను. వనవాసం పూర్తయ్యాక ఇదే రధం మీద నిన్ను అయోధ్యకి తీసుకెళ్లాలనేదే నా కోరిక. అడవిలో నీ సన్నిధిలో ఉంటే నాకు పధ్నాలుగు సంవత్సరాలు క్షణాల్లా గడిచిపోతాయి. అలా కాకపోతే వంద సంవత్సరాల్లా అనిపిస్తుంది. సేవకుల మీద ప్రేమగల ఓ రామా! నా ప్రభువు కొడుకువైన నువ్వు వెళ్తున్న దారిలోనే నేను వెళ్లాలని అనుకుంటున్నాను. నీ భక్తుడ్ని, సేవకుడ్ని, నీ మర్యాద కాపాడేవాడిని. అలాంటి నన్ను పంపించద్దు’
సేవకుల మీద జాలిగల రాముడు ఇలా మాటిమాటికీ అనేక విధాలుగా ప్రార్థించే దీనుడైన సుమంత్రుడితో చెప్పాడు.
‘ప్రభువుల మీద ప్రేమ గల ఓ సుమంత్రా! నీకు నా పైన ఉన్న గొప్ప భక్తి నాకు తెలుసు. నిన్ను ఇక్కడ నించి పట్టణానికి ఎందుకు పంపిస్తున్నానో విను. అయోధ్యకి తిరిగి వెళ్లిన నిన్ను చూస్తే, ధార్మికుడైన రాజు కోసం ఇతను అబద్ధం చెప్తున్నాడు అనే అనుమానం పోయి మా పినతల్లి కైకేయికి రాముడు అడవికి వెళ్లాడనే నమ్మకం కలిగి, నేను వనవాసానికి వెళ్లానని సంతోషిస్తుంది. విశాలమైన రాజ్యాన్ని భరతుడు పొందడం నాకు ముఖ్యం. నువ్వు రథం మీద నగరానికి వెళ్తే నాకు, రాజుకి కూడా ఇష్టమైన పని చేసిన వాడివి అవుతావు. నీకు ఏమేం చేయమని చెప్పానో వాటన్నిటినీ అలా చేయి’
ధైర్యవంతుడైన రాముడు సుమంత్రుడ్ని మాటిమాటికీ ఓదార్చి గుహుడితో చెప్పాడు.
‘గుహుడా! నేనిప్పుడు జనాలున్న అడవిలో ఉండకూడదు. ఆశ్రమంలో మాత్రమే నివసించాలి. కాబట్టి దానికి తగిన ఏర్పాటు చేయాలి. మునులకి అలంకారమైన నియమాలని పాటిస్తూ నా తండ్రి, సీత, లక్ష్మణుల మంచి కోరే నేను జటాధారినై వెళ్తాను. వేప పాలు తీసుకురా’
గుహుడు వెంటనే ఆ పాలని తెచ్చివ్వగానే రాముడు ఆ పాలతో తనకి, లక్ష్మణుడికి జటలు కట్టాడు. ఆజానుబాహువైన ఆ పురుష శ్రేష్ఠుడు జటాధారి అయ్యాడు. నార చీరలు కట్టి, జటలని ధరించిన రామలక్ష్మణులు ఋషుల్లాగా కనపడ్డారు. లక్ష్మణుడితో కలిసి అగస్త్య మహర్షి ప్రతిపాదించిన వానప్రస్థ మార్గాన్ని అవలంబించి ఆ వ్రతాన్ని పాటిస్తున్న రాముడు మిత్రుడైన గుహుడితో ఇలా చెప్పాడు.
‘గుహుడా! సైన్యం, ధనాగారం, కోట, దేశం. వీటి విషయంలో ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా ఉండు. రాజ్యాన్ని పాలించడం కష్టమని పెద్దలు చెప్తారు కదా’
రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి, వడిగా ప్రవహించే ఆ గంగానదిని దాటాలని భార్య, లక్ష్మణులతో నది ఒడ్డున ఉన్న పడవ దగ్గరకి కలత చెందకుండా వేగంగా వెళ్లాడు. అక్కడ లక్ష్మణుడితో చెప్పాడు.
‘లక్ష్మణా! నావ నిలిచి ఉంది. దాన్ని మెల్లగా ఎక్కు. తర్వాత ఉత్తమమైన మనసుగల సీతని కూడా చేయి పట్టుకుని ఎక్కించు’
బుద్ధిమంతుడైన లక్ష్మణుడు అన్న చెప్పిన ప్రకారం ముందుగా తను ఎక్కి తర్వాత సీతని ఎక్కించాడు. తేజశ్శాలైన రాముడు కూడా పడవని ఎక్కాక బోయరాజైన గుహుడు ‘నావని అవతలి ఒడ్డుకి చేర్చండి’ అని తన బంధువులని ఆజ్ఞాపించాడు.
గొప్ప తేజస్సు గల రాముడు ఆ పడవని ఎక్కాక తన హితాన్ని కోరుతూ, సాధారణంగా నావని ఎక్కినప్పుడు బ్రాహ్మణ, క్షత్రియులు జపించే మంత్రాన్ని జపించాడు. తర్వాత రాముడు, సీతా, లక్ష్మణుడు శాస్త్రప్రకారం ఆచమనం చేసి, ఆనందంగా ఆ నదికి నమస్కరించారు. రాముడు సుమంత్రుడికి, సైన్యంతో కూడిన గుహుడికి వీడ్కోలు చెప్పి పడవలో కూర్చుని నావని నడపమని నావికుల్ని ఆదేశించాడు.
చుక్కాని పట్టేవాడు దాన్ని చక్కగా పట్టుకోగా, మంచి తెడ్లతో తోయబడ్డ ఆ పడవ వేగంగా నదిని దాటింది. ఎలాంటి నిందలు ఎరగని సీత పడవ గంగానది మధ్యకి చేరాక చేతులు జోడించి గంగానదితో చెప్పింది.
‘ఓ గంగాదేవి! ధీమంతుడైన దశరథ మహారాజు కొడుకు రాముడ్ని రక్షించు. రాముడు తమ్ముడితో, నాతో కలిసి తండ్రి ఆజ్ఞ ప్రకారం పధ్నాలుగు సంవత్సరాలు పూర్తిగా అరణ్యవాసం చేసి మళ్లీ వస్తాడు. అందగత్తె ఐన ఓ గంగా! అప్పుడు కోరికలన్నీ నెరవేరిన ఆనందంతో నేను క్షేమంగా తిరిగి వచ్చి నిన్ను పూజిస్తాను. మూడు మార్గాల్లో ప్రవహించే నువ్వు బ్రహ్మలోకాన్ని కూడా చూస్తున్నావు కదా. ఈ లోకంలో సముద్రుడి భార్యగా భావించబడే మంగళకరమైన ఓ గంగా, నీకు నమస్కరించి ప్రార్థిస్తున్నాను. రాముడు సుఖంగా తిరిగి వచ్చి రాజ్యాన్ని పొందాక నీ సంతోషానికై బ్రాహ్మణులకి లక్షలాది గోవులని, వస్త్రాలని, మంచి అన్నాన్ని ఇస్తాను. వనవాసం నించి తిరిగి వచ్చిన తర్వాత నేను నియమంగా నీకు వెయ్యి కుండల కల్లు, మాంసంతో కూడిన అన్నాన్ని సమర్పించి పూజిస్తాను. నీ తీరాల్లో నివసించే సమస్త దేవతలని, తీర్థాలని, దేవాలయాలని కూడా పూజిస్తాను. ఓ పుణ్యాత్మురాలా! పాపరహితుడు, బలమైన చేతులు గల రాముడు నాతోను, తమ్ముడితోను కలిసి వనవాసం నించి తిరిగి వచ్చి మళ్లీ అయోధ్యలోకి అడుగు పెట్టుగాక’
సీత ప్రార్థిస్తూండగానే పడవ ఉత్తర తీరాన్ని చేరింది. శత్రు భయంకరుడు, మనుషుల్లో శ్రేష్ఠుడైన రాముడు పడవలోంచి భార్య, తమ్ముళ్లతో కలిసి నడిచి వెళ్లాడు. ఆజానుబాహువైన రాముడు లక్ష్మణుడితో చెప్పాడు.
‘జనులున్న ప్రదేశంలోనైనా, జనం లేని ప్రదేశంలోనైనా రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇదివరకు ఎన్నడూ చూడని ఈ నిర్జన అరణ్యంలో మనం రక్షణ విషయంలో తప్పక జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మణా! నువ్వు ముందు నడు. సీత వెనక నడుస్తుంది. నేను నిన్నూ, సీతని రక్షిస్తూ మీ వెనక నడుస్తాను. మనం ఇక్కడ ఒకర్నొకరు రక్షించుకోవాలి. ఏ పనైనా చెయ్యి దాటిపోతే మళ్లీ దాన్ని సరి చేయడం తేలిక కాదు కదా. వనవాసంలోని కష్టాల గురించి ఇక మీదట సీతకి అర్థం అవుతుంది. ఈ అడవిలో ప్రజలు కాని, పొలలు కాని, ఉద్యానవనాలు కాని ఉండవు. మిట్టపల్లాలు, లోతైన లోయలు ఉంటాయి. అలాంటి అడవిలోకి ఈ రోజు సీత ప్రవేశిస్తోంది.’
లక్ష్మణుడు రాముడి ఆదేశం ప్రకారం ముందుగా నడిస్తే, రాముడు సీత వెనక నడిచాడు.
దీనుడైన సుమంత్రుడు గంగ అవతలి ఒడ్డుకి త్వరగా చేరిన రాముడు కనడేదాకా చూస్తూనే ఉండి, తర్వాత దృష్టి మరల్చి విచారంగా కన్నీరు కార్చాడు.
మహాత్ముడు, వరాలని ఇచ్చేవాడు, లోకపాలకులతో సమానమైన వాడైన రాముడు గంగానదిని దాటాక నడిచి వెళ్తూ ఉత్తమమైన పంటలు గల పొలాలని, ఐశ్వర్యంతో సమృద్ధమై, సంతోషించే జనులు గల వత్స దేశాన్ని చేరాడు.
ఆకలిగొన్న రామలక్ష్మణులు అక్కడ పందిని, ఋష్య మృగాన్ని, దుప్పిని, నల్ల చారల దుప్పిని చంపి వాటి పరిశుద్ధమైన మాంసాన్ని తీసుకుని త్వరగా తిని సాయంకాలం కాగానే రాత్రి ఉండటానికి ఓ చెట్టు మొదటికి చేరుకున్నారు. (అయోధ్యకాండ 52వ సర్గ)
ఇంటికి వచ్చాక ఆశే్లష తను విన్న ఆనాటి హరికథని తల్లి శారదాంబకి చెప్పాడు. ఏకసంథాగ్రాహి ఐన తన కొడుకు తప్పు చెప్పడని తెలిసిన ఆవిడ హరిదాసు ఆరు చోట్ల కథని తప్పుగా చెప్పాడని వాటిని వివరించింది. ఆ తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
‘రామ’ పేరు ఉచ్ఛారణని కవులు
ఎలా చమత్కరించారు?
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.గుహుడు లక్ష్మణుడితో ‘గొప్ప చతురంగ సేన వచ్చినా మేం ఎదిరించగలం’ అని కూడా చెప్పాడు. అది హరిదాసు చెప్పలేదు.
2.మర్నాడు నిద్ర లేచాక రాముడు లక్ష్మణుడితో చెప్పిన అందమైన మాటలు ‘పూజ్యురాలైన రాత్రి గడిచింది’ని హరిదాసు చెప్పలేదు.
3.రాముడు సుమంత్రుడితో ‘కౌసల్యకి నేను, లక్ష్మణుడు, సీత పాదాలకి నమస్కరించినట్లు చెప్పు’ అని చెప్పాడు. రాముడి మంచి లక్షణం తెలియచేసే ఈ ముఖ్యమైన మాటలని హరిదాసు చెప్పడం విస్మరించాడు.
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
రామదాసు జపించిన రామమంత్రం ఏమిటి?
శ్రీరామ జయ రామ జయజయ రామ. 13 కోట్లసార్లు జపించాక
ఆయనకి రామదర్శనం జరిగింది.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి