S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరీక్షా సమయం

ఎన్ని చిక్కులో.. అన్ని చిట్కాలు
*
విద్యార్థులకు ఎంతో కీలకమైన పరీక్షల కాలం రాబోతోంది. సాధారణంగా మార్చి వచ్చిందంటే చాలు విద్యార్థులకు పరీక్షా సమయం ముంచుకొచ్చినట్లే. ఇన్నాళ్లు చదివి నేర్చుకున్న పాఠాలు, విషయాలను పేపరు మీద పెట్టి మంచి మార్కులు సంపాదించే సమయం. కానీ, ఈ సమయంలో ఎంత చదివినా ఎక్కడో ఏదో వదిలేశామనే భావన విద్యార్థుల్లో ఉంటుంది. పరీక్ష ఎలా రాస్తామో? అనే ఆందోళనా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలా చదవాలి..? పరీక్షలు ఎలా రాయాలి..? ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలి..? అనే విషయాలను తెలుసుకుందాం.
గెలవాలంటే...
చెట్టు నుంచి కాయలు రాలడాన్ని అందరూ చూశారు. కానీ న్యూటన్ మాత్రమే దాని గురించి ఆలోచించాడు. ఫలితంగా గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రపంచానికి తెలిసింది. రైల్వేస్టేషన్‌లో ఎదురైన ఓ చిన్న సంఘటన గాంధీజీలోని పోరాట యోధుణ్ణి తట్టి లేపింది. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహాల సత్తా చాటింది. ఒక్క సంఘటన చాలు... ఆలోచన రేకెత్తడానికి, ఆసక్తి పురిగొల్పడానికి.. మనిషి శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలియడానికి. దీనికి వయసు, స్థాయి, చదువుతో సంబంధం లేదు. స్వేచ్ఛగా ఆలోచించడం, కలలు కనడం, చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకోవడం, అవసరాన్ని గుర్తించడం, భవిష్యత్తుని ఊహించడం... మనిషికున్న గొ ప్ప లక్షణాలు. చదువు.. చుట్టూ ఉన్న వాతావరణం.. ముందు తరాలు.. వాటికి ప్రేరణనిస్తే.. మన ఆలోచనలు, ఆసక్తి, పట్టుదల ఆ కలలకు రెక్కలు తొడిగితే, వయస్సుతో, పట్టాలతో పని లేదు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, సివిల్స్, గ్రూప్స్, పరీక్ష ఏదైనా గెలుపు తలుపు తడుతుంది.
యాక్టివ్ లెర్నింగ్
నిత్యం మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవాలి. రోజువారీ జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలి. అవసరమైన అంశాలను నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు మార్కెట్ తీరును తెలుసుకుంటూ ఉండాలి. తెలిసిన విషయాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం మానేస్తే జీవితంలో ఎదగలేము. నవీన శకంలో కొత్త పంథాతో ముందుకు పోవాలంటే మాత్రం యాక్టివ్ లెర్నింగ్ తప్పనిసరి. వీలైనప్పుడల్లా సెమినార్స్, వర్క్‌షాపులకు హాజరు కావడం ప్రయోజనకరం. అలాగే వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
సమీక్ష అవసరం
రాయబోయే పరీక్షలకు సంబంధించి చదివిన దాన్ని పరీక్షించుకోవడం ద్వారా సబ్జెక్టుల వారీగా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుస్తుంది. పరీక్షల ప్రస్థానంలో కనీసం రెండు దశల్లో ఈ ప్రక్రియ జరగాలి. దీని ఆధారంగా సన్నద్ధ విధానాన్ని రూపొందించుకోవచ్చు. చాలా మంది అభ్యర్థులు ఈ ప్రక్రియను పాటించక పోవడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి.
ఈ తప్పులు చేయొద్దు
* పోటీ పరీక్షలు రాసే వారు ప్రశ్నపత్రం సరళిని తెలుసుకోవడానికి పరీక్ష రాసి ఒక అవకాశాన్ని కోల్పోవద్దు.
* ఒక సబ్జెక్ట్ పైనే దృష్టి పెట్టకుండా అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యాన్ని ఇచ్చి అధ్యయనం చేయాలి.
* కష్టంగా ఉందని ఏ సబ్జెక్ట్‌నూ నిర్లక్ష్యం చేయకూడదు.
* ఫలానా అంశం నుంచే ప్రశ్నలు వస్తాయని అనుకోవద్దు. నిపుణుల విశే్లషణలు కేవలం అంచనాలే.
* మాదిరి పరీక్షలను వీలైనన్ని సార్లు రాయండి.
* నమూనా పరీక్ష సమాధానాలు చెక్ చేసుకున్నప్పుడు జరిగిన తప్పులకు సంబంధించి నోట్స్ రాసుకోండి.
* సరైన వ్యూహ రూపకల్పన అవసరం. సిలబస్‌ను స్థూలంగా గమనించి, దానిలోని తాజా ధోరణులను అర్థం చేసుకోవాలి.
* సిలబస్‌లోని ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి.
* విద్యార్థులు పాఠ్య పుస్తకంలోని ప్రతి వాక్యాన్ని వీలైనన్నిసార్లు చదవాలనే అపోహతో ఉంటున్నారు. ఈ విధానాన్ని వదిలిపెట్టి ఆ పేజీలోని సారాంశం ఏమిటి అన్నది సంపూర్ణంగా గ్రహించాలి. దాన్ని ప్రశ్నల రూపంలో తయారుచేసుకుని అభ్యాసం చేసినప్పుడే మంచి మార్కులు సాధించవచ్చు.
* ప్రతి పాఠ్యాంశంలో గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను ఆధారం చేసుకుని ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అంచనా వేసుకుంటూ చదవాలి.
పునశ్చరణే ప్రధానం
* కొత్తవి నేర్చుకునే క్రమంలో పాతవి మరిచిపోకుండా చూసుకోవాలి.
* ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి క్రమం తప్పకుండా రివిజన్ చేయాలి.
* పాత పాఠాలు ఎంత బాగా గుర్తుంటే కొత్తవి అంత బాగా వస్తాయని గుర్తుంచుకోవాలి.
* మొదట ఏ పుస్తకంలో చదివామో చివరి వరకు అదే పుస్తకంలో చదవాలి. పుస్తకాలు మారిస్తే రివిజన్ వల్ల ఉపయోగం తక్కువ.
ఆందోళన వద్దు
పరీక్షకు ముందు అభ్యర్థులు అనవసర ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. పరీక్షల్లో గట్టెక్కుతామో లేదో అని మథన పడుతుంటారు. ప్రశ్నల సరళి, పరీక్షకు పోటీ పడుతున్న అభ్యర్థుల గురించి ఆలోచిస్తుంటారు. పరీక్ష రాసే వారి సంఖ్యను, వారి సన్నద్ధ సరళిని పట్టించుకోవద్దు. పరీక్షా సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే మీ ప్రదర్శన అంత మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. సులువైన ప్రశ్నలను, విభాగాలను ముందుగా పూర్తి చేయాలి.
పుస్తకాల ఎంపికలో జాగ్రత్త
పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలి. సిలబస్ స్వరూపం ఆధారంగా పుస్తకాల ఎంపిక అవసరం. కొన్ని సందర్భాల్లో ఈ విషయంలో జరిగిన పొరపాటు అపజయానికి దారి తీస్తుంది.
పరీక్ష ముందు రోజు..
* అభ్యర్థులు పరీక్ష ముందు రోజే హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. పరీక్ష హాలు వివరాలను తెలుసుకోవాలి.
* పరీక్ష సమయానికి కనీసం గంట ముందు పరీక్ష హాలుకు చేరుకోవాలి.
* ఓఎంఆర్ షీటులో ఇచ్చిన సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి.
* ఏకాగ్రత దెబ్బతినే అంశాలను ఆలోచించకూడదు.
వైఫల్యం తప్పేమీ కాదు
విజయం అంటే ఒక వైఫల్యం నుంచి మరో వైఫల్యానికి ఉత్సాహాన్ని కోల్పోకుండా చేసే ప్రయాణం. ఏ పరాజయమూ శాశ్వతం కాదు. ఫలితం ప్రతికూలమైనప్పుడు మనసు పరిపరి విధాల పోతుంది. ఎవర్ని నిందించాలన్న అంతర్మథనం మొదలవుతుంది. కానీ వైఫల్యానికి కారణమైన ప్రతి నిర్ణయం అభ్యర్థిదే. సరైన వ్యూహం ఎంచుకోలేక పోయినా, సరైన ప్రమాణాలున్న శిక్షణ తీసుకోలేక పోయినా ఇలా తప్పు ఏదైనా అభ్యర్థిదే. కాబట్టి వైఫల్యాన్ని యథాతథంగా స్వీకరించడం మేలు. ఓటమిని అంగీకరించడం తర్వాత సాధించబోయే విజయానికి సోపానం.
ఆన్‌లైన్ పరీక్షలో నెగ్గాలంటే...
ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం. అన్నీ విభాగాల మాదిరిగానే చదువు, పోటీ పరీక్షలు కూడా ఆన్‌లైన్ మయమై పోతున్నాయి. ఇప్పటికే ఆర్‌ఆర్‌బి, ఎంసెట్, బిట్‌శాట్, ఐబీపీఎస్ వంటి పోటీ పరీక్షలు ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌గా రూపాంతరం చెందాయి. ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే...
ప్రిపరేషన్ సమయంలో
* అభ్యర్థికి ఆన్‌లైన్ పరీక్ష విధానంపై అవగాహన అవసరం. ఎగ్జామ్ ఇన్‌స్ట్రక్షన్స్, బుకింగ్ షెడ్యూల్, దరఖాస్తు విధానం, ఎగ్జామ్ ప్యాటర్న్, సెంటర్స్ వంటి విషయాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. లేకుంటే పరీక్ష రోజు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
* కంప్యూటర్‌పై కనీస పరిజ్ఞానం పెంచుకోవడంతోపాటు రోజూ కొంత సమయం ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. దీనివల్ల భయం పోవడమే కాక పరీక్ష సమయంలో ఎలాంటి ఆందోళన ఉండదు. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయవచ్చు.
* వీలయినన్ని ఎక్కువగా మాక్‌టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన ఏర్పడటమేగాక పరీక్ష విధానం తెలుస్తుంది. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అర్థమవుతుంది. తరచూ ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని మెయిన్ ఎగ్జామ్‌కు హాజరుకావచ్చు.
* ప్రాక్టీస్ చేసేటప్పుడు సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సెక్షన్ల వారీగా టైం కేటాయించుకుని నిర్ణీత సమయంలోనే పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేయడం వల్ల మెయిన్ ఎగ్జామ్‌లో కూడా అదే అలవాటు పడుతుంది.
* ప్రాక్టీస్ సమయంలోనే ప్రశ్నను వేగంగా చదివి అర్థం చేసుకుని తక్కువ సమయంలో కచ్చితమైన సమాధానం గుర్తించేలా సాధన చేయాలి. లేకపోతే ప్రశ్న పెద్దగా, క్లిష్టంగా ఉన్నప్పుడు సమయం వృథా అవడమేకాక చివర్లో సమయం సరిపోక ఇబ్బంది పడేలా చేస్తుంది.
* మేథమెటిక్స్, డేటా అనాలసిస్ వంటి సబ్జెక్టులు రాసేటప్పుడు పెన్ - పేపర్ అవసరం లేకుండా ప్రాక్టీస్ చేసే సమయంలోనే పట్టు సాధించాలి. తద్వారా వీలైనంత ఎక్కువ స్కోర్ చేయొచ్చు.
పరీక్ష సమయంలో
* పరీక్ష రాయడం ప్రారంభించే ముందు తప్పనిసరిగా 10 నిమిషాలు గైడ్‌లైన్స్ చదవాలి. దీనివల్ల పరీక్ష విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలు తెలుస్తాయి.
* పరీక్ష సమయంలో సెల్‌ఫోన్, ఫేస్‌బుక్, ఈ-మెయిల్, ఫ్రెండ్స్, సినిమాలు వంటి ఇతర ఆలోచనలు లేకుండా పరీక్షపైనే దృష్టి కేంద్రీకరించాలి. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. అలా అయితేనే మంచి స్కోర్ సాధించగలరు. ఆలోచనలు మారితే తప్పు సమాధానం గుర్తించే ప్రమాదముంది.
* పరీక్ష రాసేటప్పుడు టైం కీలక పాత్ర పోషిస్తుంది. చాలా తెలివిగా ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. పేజీ పై భాగంలో కనిపించే కౌంట్‌డౌన్ డిస్‌ప్లే గమనిస్తూ పరీక్ష రాయాలి. దీనివల్ల ఏ సెక్షన్‌కు ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసుకుని జాగ్రత్త పడొచ్చు.
కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు
* పరీక్ష సమయానికి ముందే పరీక్ష హాలుకు చేరుకుని నెట్ కనెక్షన్, కంప్యూటర్‌ను చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే యాజమాన్యానికి తెలియజేయాలి. వైర్‌లెస్ ఇంటర్నెట్ కంటే కేబుల్ నెట్ కనెక్షన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
* పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి నావిగేషన్ బటన్‌లను (బ్యాక్, హోం, ఫార్వార్డ్, రీఫ్రెష్, రీలోడ్) వినియోగించకూడదు.
* అవసరం లేని ప్రోగ్రామ్స్‌ని (ఫేస్‌బుక్, ఈ-మెయిల్, మెసెంజింగ్ యాప్) క్లోజ్ చేయాలి.
* పేజీ పూర్తిగా లోడ్ అయ్యే వరకు వేచి ఉండాలి. పేజీ పూర్తిగా లోడ్ కాకుండానే పరీక్ష రాయడం ప్రారంభిస్తే కొన్ని ప్రశ్నలు మిస్ అయ్యే అవకాశం ఉంది.
* పరీక్ష రాసేటప్పుడు టెక్నికల్ సమస్యలు ఎదురైతే వెంటనే ఇన్విజిలేటర్‌కు తెలియజేయాలి.
* ప్రతీ ప్రశ్నకు సమాధానం క్లిక్ చేశాక సేవ్ చేయడం మరచిపోవద్దు.
* పరీక్ష రాయడం పూర్తిగా అయిపోయాక అన్నీ ప్రశ్నలను ఒక్కసారి చెక్ చేసుకొని అప్పుడు సబ్‌మిట్ బటన్ నొక్కాలి. మధ్యలో సబ్‌మిట్ బటన్ నొక్కరాదు.
* సబ్‌మిట్ చేసేటప్పుడు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా కొంచెం ముందుగానే సబ్‌మిట్ చేయాలి. సబ్‌మిట్ చేశాక కన్ఫర్మేషన్ పాస్‌వర్డ్ వచ్చేవరకు వేచి ఉండాలి. కన్ఫర్మేషన్ పాస్‌వర్డ్ రాకపోతే సబ్‌మిట్ కాలేదని అర్థం. వెంటనే ఇన్విజిలేటర్‌కి తెలియజేసి సరిగా సబ్‌మిట్ అయ్యేలా చూసుకోవాలి.
ఒత్తిడిని తరిమికొట్టు.. గెలుపును ఒడిసిపట్టు
పరీక్షల వేళ ఒత్తిడిని అధిగమించడం ఎలా? మంచి ర్యాంకు సాధించడం ఎలా? ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి? రోజులో ఎన్ని గంటలు చదవాలి? ప్రశ్నపత్రాన్ని పూరించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పరీక్షకు హాజరయ్యే రోజు ఎలా ఉండాలి? - ఒక్కటేమిటి.. విద్యార్థులకు ఎదురయ్యే ఇలాంటి ప్రశ్నలు ఎన్నో.. ఎనె్నన్నో..! ఆ సవాళ్లకు సవాలక్ష వివరణలు. పరీక్షల వేళ ఈ ‘ప్రశ్నల’ దూకుడు రాకెట్ వేగాన్ని మించి విద్యార్థుల మెదళ్లలో- వారి ప్రమేయం లేకుండానే దూరిపోతుంటాయి. ఎదురుగా కొండలా కనిపించే సిలబస్‌లో ఏయే ప్రశ్నలు వస్తాయో? ఏ చాప్టర్ నుంచి ప్రశ్నలు మిసైల్స్‌లా మీదపడతాయోనన్న గందరగోళంలో ఉన్న విద్యార్థులను- అనేక సందేహాలు మరింతగా అయోమయానికి గురిచేస్తుండటం ఏటా జరిగేదే. ముఖ్యంగా టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థుల లక్ష్యంగా ఏటా సాగే ఈ ధోరణి ఈసారి కూడా అప్పుడే మొదలైపోయింది. ఈ ఏడాది మరో ఆసక్తికర విశేషం ఏమిటంటే - సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ సైతం విద్యార్థులను విజయపథం వైపు నడిపించేందుకు నడుం బిగించడం. విద్యార్థులను కర్తవ్యోన్ముఖులను చేసేందుకు ఆయన చొరవ అభినందనీయం.
నిజానికి పరీక్షలను కఠినంగా ఎందుకు భావించాలి? కనిష్ఠంగా 35 మార్కులు వస్తే చాలన్న విధానం ఎంతమేరకు సమంజసం? ఏడాది వ్యవధి.. ప్రతి సబ్జెక్టుకూ 100 మార్కులు... వీటికి జవాబులు రాసేందుకు, సన్నద్ధం చేసేందుకు ఏడాది పొడవునా ఉపాధ్యాయులూ బోధిస్తూనే ఉంటారు. ఆ మేరకు విద్యార్థులూ పాఠ్యాంశాలను అభ్యసిస్తూనే ఉంటారు. నూటికి నూరు మార్కులు రాకపోయినా కనీసం దరిదాపుల్లోనైనా విద్యార్థులందరూ ఎందుకు ఉండలేకపోతున్నారు? లోపం ఎక్కడుంది? అని ప్రశ్నించుకుంటే చాలా కారణాలు
ఒకదాని వెంట మరొకటి కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉంటాయి. ఒకే తరగతి గదిలో మంచి ర్యాంకులు సాధించిన వారు, కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించలేని వారు కూడా ఉంటారు.
లక్ష్యం ‘నూటికి నూరు’ అయితేనే.. ఆ దిశగా కృషి జరిగితేనే.. ఫలితం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ‘35 మార్కుల ’ మైలురాయి దాటితే చాలన్న భావన దశాబ్దాల తరబడి ప్రతి ఏటా ఎక్కువ శాతం విద్యార్థుల మెదళ్ళలో తిష్ఠ వేసుకోబోట్టే - ఈరోజు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇక్కడో క్రికెట్ మ్యాచ్‌ను ఉదాహరణగా తీసుకుందాం. క్రికెట్ గురించి చెప్పేదేముంది? ప్రతి భారతీయుడి గుండెచప్పుడు అది. మాటలు పూర్తిగా రాని పసివాడి నుంచి వయోవృద్ధుడి వరకూ ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయి ఆసక్తిని కనబరచే క్రీడ. చావోరేవో తేల్చుకోవాల్సిన ఓ మ్యాచ్. ప్రత్యర్థి స్కోర్ 300 పరుగులు. భారత్ లక్ష్యం 301 పరుగులు. ఆటగాళ్ల ప్రతిభకూ, దేశ ప్రతిష్ఠకూ అగ్నిపరీక్ష లాంటి మ్యాచ్ అది. గెలిచి తీరాల్సిందే అనుకుంటే 301 పరుగులు సాధించాల్సిందే. 300 మార్క్‌ని దాటాల్సిందే. ఇక్కడ కనీస పాస్‌మార్కులు లేవు. పదిమంది క్రీడాకారులు పంచుకున్నా, ఒక్కడే 301 పరుగులు సాధించినా విజయం తథ్యం. లక్ష్యం వైపు వేసే తొలి అడుగు తొలి ఓవర్ నుంచే మొదలుపెట్టాలి. క్రీజ్‌లో ఉన్న క్రీడాకారుడికి ప్రతి బాల్, ప్రతి ఓవర్ ఎంత ముఖ్యమో.. పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థికి ప్రతి క్షణమూ కీలకమే. విద్యా సంవత్సరం మొదలైన తొలి క్షణం నుంచే ప్రతి విద్యార్థి సరిగా దృష్టిపెడితే ‘35 మార్కుల మైలురాయి’తో పనేముంది? క్రికెట్‌లో ఒక క్రీడాకారుడు విఫలమైనా మరొకరు దాన్ని భర్తీచేసి విజయపథాన నడిపించొచ్చు. లక్ష్యం గురించి చెప్పుకునేప్పుడు ఈ ఉదాహరణ సరిపోతుందేమో కానీ, విద్యార్థులు ఎదుర్కొనే ‘పరీక్ష’లో మాత్రం మరొకరి సహకారం క్షమించరాని నేరమే. విలువైన ఓ ఏడాదిని కోల్పోవడమే కాదు, కెరీర్‌లో ‘రనౌట్’ అయినట్టే.
సన్నద్ధత ఇలా..
ర్యాంకులు, మార్కులు, గ్రేడ్‌లే పరమావధిగా మారిన ప్రస్తుత పోటీ ప్రపంచంలో అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకుంటూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలి. మంచి ర్యాంకు రాకపోతే నలుగురిలో చులకనవుతామనో, తల్లిదండ్రులు ఏమనుకుంటారనో అన్న సందేహాల చెర నుంచి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో బయటపడాలి. ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా ఆత్మన్యూనతను లోనుకారాదు. ఒత్తిళ్లతో తీవ్ర నిరాశకు లోనై కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఈ తరహా పరిస్థితులు రాకుండా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో టీచర్లు, పేరెంట్స్ ధైర్యం నింపాలి. సవాళ్లను అధిగమించేందుకు విద్యార్థులు తమ మనోభావాలను ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో నిర్మొహమాటంగా పంచుకోవాలి. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరమైతే విద్యారంగ, మానసిక నిపుణుల సలహాలను పాటించాలి. ఒత్తిడి వల్ల విద్యార్థుల్లో నిరాశ పెరగడమే కాదు, రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలను తల్లిదండ్రులు గుర్తించాలి. తమ పిల్లలు కుంగుబాటుకు లోనవకుండా చదువుకునే పరిస్థితులను తల్లిదండ్రులు కల్పించాలి. ‘చదువు.. చదువు..’ అంటూ రోజంతా వారిని ఇబ్బంది పెట్టకుండా కాస్త విరామం ఇస్తుండాలి. సులభమైన పద్ధతులను పాటిస్తే పాఠ్యాంశాలు విద్యార్థులకు గుర్తుంటాయి. కార్పొరేట్ చదువులంటే పిల్లల్ని ర్యాంకుల పేరిట హింసించడం కాదని అటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఇటు తల్లిదండ్రులు తెలుసుకోవాలి. గెలుపును ఆస్వాదించేలా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలి.
పిల్లలు చదువుకునే చోట పెద్దలు సెల్‌ఫోన్లు, టీవీ, కంప్యూటర్లను వాడకుండా ఉండడం మంచిది. చదువుపై పిల్లల ఏకాగ్రతను దెబ్బతీయకుండా పేరెంట్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుకునే వేళలో పిల్లలకు ఇంటిపనులు చెప్పడం సరికాదు. వారు ఏం చదువుతున్నారో అని గమనిస్తూ అవసరమైన సూచనలు చేస్తుండాలి. ఇక విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టీ పెట్టకుండా వాటిని క్షుణ్ణంగా చదివి మెదడుకి ఎక్కించుకోవాలి. చదివిన విషయాలను తరచూ మననం చేసుకోవాలి. పిల్లలకు సంబంధించి వారి ఏకాగ్రత, నిద్ర, స్నానం, ఆహారం, ఆరోగ్యం, ఇతర సౌకర్యాలపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారిస్తుండాలి. ‘పునశ్చరణ సామర్థ్యం’ పెంచుకునేందుకు ఈ తరహా పద్ధతులు విద్యార్థులకు ఉపయోగపడతాయి.
ఇక పరీక్ష హాలులో విద్యార్థులు గాభరా పడకుండా ప్రశ్నాపత్రాన్ని సాంతం పరిశీలించాలి. ముందుగా తమకు బాగా తెలిసిన వాటికి జవాబులు రాయాలి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని క్లిష్టమైన ప్రశ్నల గురించి ఆ తరువాత ఆలోచించాలి.
*
నిద్రకు దూరమై.. చదువు భారమై!
‘నిద్రకు వెలినై, నేనొంటరినై..’ అంటూ నిరాశాగీతాలు పాడుకుంటూ చాలామంది విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేక పోతున్నారట! ‘పరీక్షా కాలం’లో విద్యార్థులు నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది విద్యార్థులు రోజులో కనీసం ఏడుగంటలు కూడా నిద్రకు నోచుకోవడం లేదట! ఢిల్లీ, ముంబయి, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, చండీగఢ్, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో నిపుణులు జరిపిన సర్వేలో పలు ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. చదువుపై ఒత్తిడి పెరిగి 18 శాతం మంది విద్యార్థులు మూడు నుంచి అయిదు గంటలు మాత్రమే నిద్ర పోతున్నారని సర్వేలో వెల్లడైంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో మాట్లాడేందుకు కూడా సమయం లేకుండా పోతోందంటూ చాలా మంది విద్యార్థులు వారి అంతరంగాన్ని సర్వే సందర్భంగా ఆవిష్కరించారు. నిద్రకు మాత్రమే కాదు.. మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులకు కూడా చదువుల పుణ్యమాని విద్యార్థులు దూరం అవుతున్నారు.
ముందు నుంచీ ప్రణాళికాబద్ధంగా చదవకపోవడం, పరీక్షలు దగ్గరకొచ్చే సరికి సిలబస్ భారీగా మిగిలిపోవడంతో నిద్రాహారాలకు దూరమై పుస్తకాలను పట్టుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. జీవన విధానంలో మార్పులు, తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల కూడా పాఠ్యాంశాలపై ఏకాగ్రత చూపలేకపోతున్నారు. సర్వే సందర్భంగా సుమారు 6,500 మంది విద్యార్థులను విచారించగా- కంటి నిండా కునుకు ఉండడం లేదన్న సమాధానం ఎక్కువగా వినిపించింది.
పరీక్షలపై పేరెంట్స్‌లో ఆందోళన కారణంగా తాము ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని 74 శాతం మంది విద్యార్థులు తెలిపారు. వ్యాయామానికి రోజూ అరగంట సేపు కూడా సమయం కేటాయించే పరిస్థితి లేదని 86 శాతం మంది విద్యార్థులు అంగీకరించారు. విరామం కోసం కనీసం గంట సేపు కూడా బయటకు వెళ్లడం లేదని 68 శాతం మంది వాపోయారు. ఏయే పాఠ్యాంశాలను చదవాలన్న విషయమై పేరెంట్స్ ప్రమేయం పెరిగిపోతోందని 82 శాతం మంది పిల్లలు ఆందోళన చెందారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గంట సేపు గడిపేందుకు కూడా తాము నోచుకోవడం లేదని 73 శాతం మంది దిగాలుపడ్డారు. ఒక శాతం మంది పిల్లలు మాత్రమే రోజూ కుటుంబ సభ్యులతో మూడు గంటల సేపు గడుపుతున్నారు.
ఓ వైపు పరీక్షలు ముంచుకొస్తున్నా కొంతమంది విద్యార్థులు తమ అలవాట్లను మానుకోవడం లేదని సర్వేలో తేలింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై రోజూ మూడు గంటల సేపు 34 శాతం మంది విద్యార్థులు కాలక్షేపం చేస్తున్నారు. ‘అంతర్జాలం’లో 11 శాతం మంది విహరిస్తున్నారు. పరీక్షలకు ముందు కాసేపు కూడా ప్రశాంతంగా ఉండడం అసాధ్యం అవుతోందని 94 శాతం మంది విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. 5 నుంచి 7 గంటల నిద్ర తమకు ఏ మాత్రం సరిపోవడం లేదని 53 శాతం మంది తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో పిల్లలకు తగినంత నిద్ర, ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం, కాస్త విరామం ఉండాలన్న నిపుణుల సూచనలను తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కళాశాలలో చేరిన రోజు నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే పరీక్షల ముందు ఇలా నిద్రాహారాలకు దూరమయ్యే పరిస్థితి ఉండదని తెలిసినా.. చాలామంది విద్యార్థులు ఆ పద్ధతులను పాటించడం లేదు.
వేడుక చేసుకోండి..
‘పరీక్షలు సమీపించాయని ఒత్తిడికి లోనుకాకండి.. మార్కులు, ర్యాంకుల ధ్యాసతో వేదన చెందకండి.. పరీక్షలను పండుగలా భావించి ఆనందం ఆస్వాదించండి..’ అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిల్లలతో ప్రత్యక్షంగా సంభాషించి, వారి పట్ల తన ఆత్మీయతను చాటుకున్నారు. ఈ నెల 16న ఢిల్లీలో ‘పరీక్షా పర్ చర్చా’ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా నిర్వహించి, విద్యార్థులకు అమూల్యమైన సలహాలను అందజేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా వార్షిక పరీక్షలకు సమాయత్తమవుతున్న విద్యార్థుల్లో ఒత్తిడిని, భయాన్ని తొలగించి, వారిలో నూతనోత్తేజాన్ని నింపేందుకు మోదీ ‘పరీక్షా పర్ చర్చా’లో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
‘మీరు పరీక్షా ఫలితాల గురించి భయపడడం మానేసి, శక్తివంచన లేకుండా చదువుతూ ఉండాలి.. నేర్చుకోవడంపై ఏకాగ్రత ఉండాలి.. మీలో అంతర్లీనంగా ఉన్న శక్తియుక్తులకు పదునుపెట్టుకోండి.. నిబద్ధతతో లక్ష్యంపై గురిపెట్టి ముందుకుసాగితే- మార్కులు, ఫలితాలు వంటివన్నీ అదే దారిలో వస్తాయి.. రాజకీయాల్లో నా సిద్ధాంతం కూడా ఇదే.. ఏనాడూ ఆశ వదులుకోరాదు, నిరాశలో మునిగిపోవద్దు.. పట్టుదల వీడకుండా పరిశ్రమించడంలోనే గెలుపు రహస్యం ఉంది..’ అని మోదీ పిల్లలకు సూచించారు. ఆయన ఇచ్చిన సలహాలు విద్యార్థులకు నిరంతరం స్ఫూర్తిమంతమైనవే.
‘పరీక్షా పర్ చర్చా’ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు ఆయన ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ప్రధానితో జరిగిన ‘ముఖాముఖి’లో పాల్గొన్న విద్యార్థులు కూడా ధైర్యంగా తమ ప్రశ్నలను సంధించారు.
‘ఎగ్జామ్ వారియర్స్’ (పరీక్షల యుద్ధవీరులు) పేరిట తాను ఇటీవల రాసిన పుస్తకాన్ని మోదీ విద్యార్థులకు పరిచయం చేస్తూ, తనను ఓ మిత్రుడిగా భావించి సందేహాలన్నీ అడగాలని సూచించారు. పిల్లలు అడిగిన పలు ప్రశ్నలకు స్పందిస్తూ, ఆయన ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి..
* మీలోని అంతర్గత నైపుణ్యాన్ని వెలికితీయడానికే పరీక్షలు.
* పరీక్షలను పండుగలా జరుపుకోవాలి.
* మనసుకు నచ్చిన పనులను చేయండి. మంచి పుస్తకాలు చదవండి. ప్రకృతిని ఆరాధించండి.
* వివేకానందుడి బోధనలు నిత్యం చదవండి.
* పరీక్షల సమయంలో ఒత్తిడి, బెరుకుదనం సహజం. ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించండి.
* మిగతా అంశాలను పక్కన పెడితే పరీక్షలపై ఏకాగ్రత సాధ్యం.
* ఇతరులతో పోల్చుకోవద్దు, తల్లిదండ్రుల మనోభావాలను నిలదీయకండి.
* వ్యాయామం, యోగ, ధ్యానంతో మనసు తేలిక పడుతుంది. చదువుపై దృష్టి సారించేందుకు వీలుంటుంది.
* ఏదీ అసాధ్యం అని భయపడకండి, నిర్మలమైన మనసుతో పాఠ్యాంశాలపై దృష్టి పెట్టండి.
* తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లోని ప్రతిభను గుర్తించాలి. ఫలానాది సాధించాలని పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచరాదు.
* పిల్లలను ఇతరులతో పోల్చితే ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది.
* పుస్తకం ముందు కూర్చుని ‘ఆఫ్‌లైన్’లో ఉంటే ఫలితం ఉండదు. చేసే పనిపై ఏకాగ్రత ఉండాలి. ఎప్పడూ ‘ఆన్‌లైన్’లోనే ఉండాలి.
* చదువును ధర్మంగా స్వీకరించాలి. దాన్ని సామాజిక హోదాగా పోల్చరాదు.
* ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులను అనుమానించవద్దు. వారు పిల్లల కోసమే త్యాగాలు చేస్తారు.
* ఒకే కాలపట్టిక 365 రోజులకూ పనికిరాదు. అది సమయానుకూలంగా మారాలి.