S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రెండేళ్ల జైలుశిక్ష

ట్రాఫిక్ సార్జెంట్ మైఖేల్ ఓ బుధవారం ఉదయం డౌన్‌టౌన్‌లో ట్రాఫిక్‌ని నియంత్రించేప్పుడు కోహెన్ ఓ కార్లో వెళ్తూండటం చూశాడు. అది కొత్త, తెల్ల కేడీలాక్. కోహెన్ రెండేళ్ల క్రితం ఓ పచారీ దుకాణంలో రివాల్వర్‌ని చూపించి, బెదిరించి దొంగతనం చేసిన చిన్న దొంగని మైఖేల్‌కి తెలుసు. దొంగతనం చేసాక అతను స్వచ్ఛందంగా పోలీసుస్టేషన్‌కి వచ్చి తన తప్పుని అంగీకరించడంతో తక్కువ శిక్ష పడింది. బహుశ సత్‌ప్రవర్తనతో జైల్ నించి బయటకి వచ్చి ఉంటాడని మైఖేల్ అనుకున్నాడు. ఐతే ఓ ప్రశ్న అతని బుర్రని తొలచసాగింది.
కోహెన్ పనె్నండు వేల డాలర్ల విలువైన కేడీలాక్ కారుని ఎలా కొనగలిగాడు? అది మైఖేల్‌కి కలిగిన అనుమానానికి నాంది.
నలభై రోజుల తర్వాత మైఖేల్ ఓ ఫాస్ట్ఫుడ్ రెస్ట్‌రెంట్లో హేంబర్గర్ తింటూ, దాని ముందు ఆగిన ఓ విదేశీ స్పోర్ట్స్ కారుని కిటికీలోంచి చూశాడు. అది కేడీలాక్ కన్నా ఖరీదైంది. అందులోంచి దిగి లోపలకి వచ్చే వ్యక్తిని చూసి కొద్దిగా నివ్వెరపోయాడు.
అతని పేరు శామ్. అతనితో మాట్లాడేంత పరిచయం ఉండటంతో మైఖేల్ అతన్ని పలకరించాడు.
‘హలో శామ్. మళ్లీ నిన్ను వీధుల్లో చూడటం సంతోషం’
‘హలో మైక్. రెండేళ్లు జైల్లో గడిపాక నిన్ను మళ్లీ చూడటం నాకూ ఆనందంగా ఉంది’ శామ్ చిరునవ్వుతో చెప్పాడు.
ఇద్దరూ కరచాలనం చేసుకున్నాక శామ్ మైఖేల్ పక్కన కూర్చున్నాడు.
‘ఆ కారు ఎవరిది?’ మైఖేల్ ప్రశ్నించాడు.
‘నాదే. నేను ఆదా చేసిన డబ్బుతో కొన్నాను’
‘మాకు తెలీకుండా బేంక్ దొంగతనం ఏదైనా చేసావా?’
‘అదేం కాదు. నేను జైలుకి వెళ్లక మునుపు చాలా సంపాదించాను’
‘అలాంటప్పుడు స్మిత్ స్ట్రీట్‌లోని ఓ చిన్న టైలర్ షాప్‌లో రివాల్వర్‌తో బెదిరించి ఎందుకు దొంగతనం చేసావు?’
‘ఆ రాత్రి ఎక్కువ తాగడం వల్లనుకుంటా’
‘తర్వాత పోలీసుస్టేషన్‌కి వచ్చి నువ్వు దొంగతనం చేసావని చెప్పావు. అవునా?’
‘అవును. అందువల్ల నాకు తక్కువ శిక్ష పడుతుందని’
‘నీకు కోహెన్ ష్రెడర్ అనే మాజీ దొంగ తెలుసా?’ మైక్ అడిగాడు.
‘లేదు. ఎందుకు అడుగుతున్నావు? అతను కూడా అటికా జైల్లో శిక్ష అనుభవించాడా?’ శామ్ ప్రశ్నించాడు.
‘అతను కూడా జైల్ నించి విడుదలయ్యాక ఓ కొత్త కారుని కొన్నాడు.’
‘నా కారు లాంటిదా?’
‘కాదు. కేడీలాక్’ మైఖేల్ చెప్పాడు.
* * *
కొన్ని వారాల తర్వాత మైఖేల్ ఆ రెండూ కాకతాళీయాలు అనుకుని మర్చిపోయాడు. ఓ ఆదివారం తన భార్య మేగీతో ఓ సరస్సు ఒడ్డున ఉన్న రెస్ట్‌రెంట్లో లంచ్ చేస్తూ సరస్సులోని మర పడవలని చూస్తున్నాడు. అకస్మాత్తుగా అతను కళ్లు చిట్లించి చూసాడు. తర్వాత తన భార్యతో చెప్పాడు.
‘అతను ఫ్రేంక్ లేమంటే. అతను కొనే్నళ్లు జైల్లో ఉన్నాడు. అలాంటి వాడు అంత ఖరీదైన మర పడవని ఎలా కొనగలిగాడో?’
లేచి అతని దగ్గరికి వెళ్లి పలకరించి అడిగాడు.
‘దీని ఖరీదెంత?’
‘మీరెవరు?’ ఫ్రేంక్ ఎదురుప్రశ్న వేశాడు.
‘మైఖేల్. పోలీస్ ఆఫీసర్ని. కాని డ్యూటీలో లేను కాబట్టి ఇప్పుడు పోలీస్‌ని కాను. దీని ఖరీదెంత?’
‘డెబ్బై వేల డాలర్లు. మీక్కూడా ఇలాంటిది కొనే ఉద్దేశం ఉందా? ఇది సెకండ్ హేండ్‌ది. కాని మంచి ధరకి వచ్చింది. కొత్తది రెండు లక్షల దాకా ఉంటుంది.’
దాంట్లో సగం డబ్బు కూడా ఫ్రేంక్ దగ్గర లేదని మైఖేల్‌కి తెలుసు. అది ఎక్కడ నించి వచ్చింది? అతని నేరాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఓ దుకాణం యజమాని తల మీద రివాల్వర్ పిడితో కొట్టి గల్లాపెట్టెలోని డబ్బుని దోచుకున్నాడు. మూడు వేల డాలర్ల చిల్లర మాత్రమే.
తిరిగి వచ్చిన భర్త ఏదో ఆలోచనలో పడటం గమనించిన మేగీ అడిగింది.
‘ఏమిటి ఆలోచిస్తున్నారు?’
‘ముగ్గురు మాజీ దొంగలు. చేసింది చిన్న దొంగతనాలు. ముగ్గురూ స్వచ్ఛందంగా పోలీసులకి లొంగిపోయారు. ఆ ముగ్గురూ జైల్ నించి విడుదలయ్యాక ఖరీదైన వాహనాలని కొన్నారు. వారికా డబ్బు ఎక్కడ నించి వచ్చినట్లు?’
‘మీరు కేవలం ట్రాఫిక్ సార్జెంట్ తప్ప షెర్లాక్ హోమ్స్ కాదు’ మేగీ నవ్వుతూ చెప్పింది.
‘దీని వెనక ఏదో గూడుపుఠాణి ఉంది’ మైఖేల్ ఆలోచనగా చెప్పాడు.
* * *
సోమవారం మైఖేల్‌కి సెలవు. అతను డిటెక్టివ్ బ్యూరోకి వెళ్లి సార్జెంట్ ఫెన్నర్‌కి తన అనుమానాన్ని వెల్లడించాడు.
‘శామ్, కోహెన్, ఫ్రేంక్ లాంటి చిల్లర దొంగలు మాఫియాకి చెందిన వారంటే నేను నమ్మను’ ఫెన్నర్ పెదవి విరిచి చెప్పాడు.
‘నేను మాఫియా అనలేదు. ఏదైనా గేంగ్‌కి చెందినవారై ఉండచ్చు. నేనోసారి వారి కేస్ ఫైల్స్‌ని చూడచ్చా?’
అతను అయిష్టంగానే వాటిని ఇచ్చాడు. గంటపైనే మైఖేల్ ఆ మూడు ఫైల్స్‌ని చదివాడు. వారి నేరాల్లో విశిష్టమైన పోలికలు కనిపించాయి. ప్రతీ కేస్‌లో ఆయుధం ఉపయోగించబడింది. ఇద్దరు దుకాణం యజమానులు దాన్ని లూగర్ రివాల్వర్‌గా గుర్తించారు. ఒక్కసారి కూడా రివాల్వర్ పేలలేదు. అన్ని నేరాలు చిన్న షాపుల్లోనే జరిగాయి. పచారీ దుకాణం, టైలర్ షాప్, లిక్కర్ షాప్. ప్రతీ సందర్భంలో దొంగ మొహానికి ముక్కు నించి గడ్డం దాకా రుమాలు కట్టి ఉంది.
అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన సంగతి ముగ్గురు దొంగలూ దొంగతనం చేసాక సరాసరి పోలీసుస్టేషన్‌కి వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవడం. శామ్ తన లాయర్‌తో వచ్చాడు. ముగ్గురికీ గతంలో చిన్నచిన్న నేరాలు చేసిన రికార్డ్ ఉంది. జడ్జీలు ముగ్గురికీ రెండు నించి మూడేళ్ల శిక్షనే విధించారు. ముగ్గురూ విడుదలయ్యారు. జైల్లో ఉన్నప్పుడు సంపాదించే అవకాశం లేకపోయినా బయటకి వచ్చాక ఖరీదైన వాహనాలని ఎలా కొన్నారు?
‘బాధితులు వీళ్లని గుర్తించలేకపోయారు’ మైఖేల్ ఫెన్నర్‌కి ఫైల్‌ని తిరిగి ఇస్తూ చెప్పాడు.
‘వాళ్ల మొహాలకి రుమాలని కట్టుకున్నారు కాబట్టి’
‘ముగ్గురు దొంగల ఎత్తు, బరువు దాదాపుగా ఒకటే అని గమనించాను’
‘ఆ ముగ్గురూ తాము చేయని నేరాన్ని ఒప్పుకునేందుకు వాళ్లు మూర్ఖులు కారు’ ఫెన్నర్ చెప్పాడు.
‘కారు. కాని ఇంకేదైనా కారణం ఉండి ఉండచ్చు’
‘అలా ఆలోచించే నువ్వు మూర్ఖుడివి’ ఫెన్నర్ నవ్వుతూ చెప్పాడు.
‘మొహానికి రుమాలు కట్టుకుని, రివాల్వర్‌తో బెదిరించి, చిన్న షాపుల్లో దొంగతనం చేసాక లొంగిపోయిన కేసుల ఫైల్స్ గత ఐదేళ్లవి నాకు కావాలి. దయచేసి ఇవ్వు’
‘నువ్వెళ్లి ట్రాఫిక్‌ని నియంత్రించడం మంచిది’
‘దయచేసి. ఏదైనా బయటకి వస్తే నీకే ఖ్యాతి వస్తుంది. నా సెలవు రోజున నేనీ పని చేస్తున్నాను’ మైఖేల్ కోరాడు.
ఫెన్నర్ అలాంటి మరి కొన్ని ఫైల్స్‌ని ఇచ్చాడు. మైఖేల్ వాటిని పరిశీలిస్తే అలాంటి మరో ఎనిమిది కేసులు కనిపించాయి. వాటిల్లో ఒకటి దుకాణం యజమాని మోసమే. తనే డబ్బుని దాచేస భాగస్వామిని మోసం చేయాలని దొంగతనం చేసానని ఒప్పుకున్నాడు.
మరో కేసులో పోలీసులు సమయానికి వచ్చి నేరం జరిగిన చోటే దొంగని అరెస్ట్ చేయడంతో తన నేరాన్ని అంగీకరించాడు.
ఇద్దరు ఇంకా జైల్లో ఉన్నారు. ఒకడు ఫ్లోరిడాకి వెళ్లిపోయాడు. నాలుగో దొంగ పేరు మేక్స్, మైఖేల్ అతని చిరునామా రాసుకున్నాడు.
* * *
మేక్స్ ఖరీదైన కాస్మొటిక్స్ షాప్‌ని నడుపుతున్నాడని ఆ షాప్‌లోకి వెళ్లగానే మైఖేల్ గ్రహించాడు.
‘నాతో మాట్లాడాలా? దేని గురించి?’ మేక్స్ అడిగాడు.
‘కొనే్నళ్ల క్రితం నువ్వు చేసిన దొంగతనం గురించి’
‘దానికి నేను జైలుశిక్షని అనుభవించాను. ఈ షాప్ మీద ఆదాయం బావుంది. దొంగతనాలు మానేసాను’ మేక్స్ చెప్పాడు.
‘నువ్వు ఎప్పుడు బయటకి వచ్చావు?’
‘పద్దెనిమిది నెలల క్రితం’
‘ఈ షాప్ ఎప్పుడు తెరిచావు?’
‘ఏడాది దాటింది’
‘బయటకి రాగానే తెరిచావు’
‘అవును. ఏమిటీ ప్రశ్నలు. బయటకి వచ్చాక నేనేం నేరం చేయలేదు’ మేక్స్ కొద్దిగా భయంగా చెప్పాడు.
‘నీలాంటి వాళ్లు ఈ నగరంలో గత ఐదేళ్లల్లో ఏడుగురు ఉన్నారు. ముఖం కప్పుకుని చిన్న దొంగతనం చేసి, తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్లి నేరం ఒప్పుకోవడం, రెండేళ్ల జైలుశిక్ష తర్వాత అకస్మాత్తుగా చాలా డబ్బు రావడం. ఈ షాప్ తెరవడానికి నీకు డబ్బెక్కడిది?’
‘నేను ఆదా చేసాను’
‘నీ దగ్గర అంత డబ్బుంటే, నూట ముప్పై ఆరు డాలర్ల చిన్న మొత్తానికి ఎందుకు దొంగతనానికి వెళ్లావు?’
‘నాకు తెలీదు. అలా జరిగిపోయింది’
‘అసలు విషయం చెప్పు మేక్స్’
‘అదేం లేదు. ఇంక మీరు వెళ్తే సంతోషం. చాలామంది కస్టమర్లు ఎదురుచూస్తున్నారు’
మైఖేల్ ఆ రాత్రి మేగీతో ఆ విషయం చర్చించాడు.
‘మీది ఉత్త అనుమానమే’ ఆమె చెప్పింది.
‘ఫెన్నర్ కూడా అదే మాటన్నాడు. వాళ్లకి మరి కార్లు, మర పడవలు, షాప్‌లు తర్వాత ఎలా వచ్చాయి? వాళ్లు తప్పు ఒప్పుకోవడం వల్ల అని నా అనుమానం’
‘అంటే నేరం వొప్పుకుని జైలుకి వెళ్లడం వల్ల వాళ్లకి ఎవరైనా డబ్బు ఇచ్చి ఉంటారంటారా? అలా చేసే వాళ్లు పిచ్చివాళ్లై ఉంటారు’
‘లేదా తెలివి గలవాళ్లయి ఉంటారు.’
ఆ రాత్రి మేలుకుని మైఖేల్ ఆ విషయం గురించి చాలాసేపు ఆలోచించాడు.
* * *
మర్నాడు శామ్‌ని కలిసి మైఖేల్ ప్రశ్నించాడు.
‘నిజం చెప్పు. నీ కొత్త కారుకి డబ్బు ఎక్కడ నించి వచ్చింది’
‘నిజమే చెప్పాను’
‘నువ్వు చెప్పింది అబద్ధమని మనిద్దరికీ తెలుసు. తక్కువ మొత్తం దొంగతనం చేసి వెళ్లి దేనికి పోలీసులకి లొంగిపోయావు?’
‘నా లాయర్ లొంగిపొమ్మని చెప్పాడు’
‘పేరు? ఎక్కడ ఉంటాడు?’
‘ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నన్ను వదులు’ చెప్పి శామ్ వెళ్లిపోయాడు.
ఆ సాయంత్రం ఫెన్నర్ నించి మైఖేల్‌కి ఫోన్ వచ్చింది.
‘మైక్! శామ్ లాయర్ ఇందాక ఫోన్ చేసి తన క్లైంట్‌ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావని ఫిర్యాదు చేసాడు’
‘నేను చేసింది కేవలం మాట్లాడటమే’
‘ఆ నీ పిచ్చి అనుమానం గురించా?’
‘సార్జెంట్ ఫెన్నర్. ఆ ఏడుగురూ అమాయకులని, కావాలనే జైలుకి వెళ్లారని నేను గట్టిగా నమ్ముతున్నాను’
‘కారణం?’
‘అందుకు వాళ్లకి ఎవరో డబ్బిచ్చారు?’
‘ఎందుకని?’
‘అదీ ఆలోచించాను. ఆ దొంగతనాల్లో చాలా పోలికలు ఉన్నాయి. అందరు దొంగల ఒడ్డు, పొడవు, బరువు ఒకేలా ఉండటం. అన్ని నేరాల్లో లూగర్ రివాల్వర్‌నే వాడారు. అందరూ ముఖానికి రుమాలు కప్పుకున్నారు. దొంగతనం చేసాక వెళ్లి పోలీసుస్టేషన్‌లో తప్పు ఒప్పుకున్నారు. దీనివల్ల వారికి జైలుశిక్ష అనే నష్టం తప్ప లాభం లేదు’
‘నువ్వు తెలివైన డిటెక్టివ్‌వి కాబట్టి ఇదంతా కనుక్కున్నానని చెప్తున్నావా?’ ఫెన్నర్ ఎకసెక్కంగా అడిగాడు.
‘నేను ట్రాఫిక్ పోలీస్‌ని మాత్రమే ఫెన్నర్’
‘అది గుర్తుంచుకుని దీన్ని ఇంతటితో మర్చిపో. లేదా కెప్టెన్‌కి ఈసారి నీ మీద సరాసరి ఫిర్యాదు వెళ్తుంది’ ఫెన్నర్ హెచ్చరించాడు.
‘ఆ లాయర్ పేరేమిటో అడగచ్చా?’
‘క్రాసీ. టవర్ బిల్డింగ్‌లో అతని ఆఫీస్ ఉంది’
‘క్రాసీ? టవర్ బిల్డింగ్? నేను ఇంకోసారి ఆ ఫైల్స్‌ని చూడచ్చా?’ వెంటనే మైఖేల్ అడిగాడు.
* * *
సివిలియన్ బట్టల్లో మైఖేల్ క్రాసీ ఆఫీస్‌కి వెళ్లి అతన్ని కలిశాడు. క్రాసీ పొట్టివాడు. బట్టతల. వయసు అరవై పైనే.
‘ఏం కావాలి మిస్టర్ మైఖేల్?’ క్రాసీ అడిగాడు.
‘మీ క్లైంట్స్‌లోని కొందరి మీద నాకు ఆసక్తి ఉంది’ మైఖేల్ చెప్పాడు.
‘శామ్ కాకుండానా?’
‘అవును’
‘పేర్లు?’
‘ఫ్రేంక్. కోహెన్. మేక్స్, జిమ్... మొత్తం ఏడుగురు దొంగలకి మీరు లాయర్. వాళ్లకి తక్కువ శిక్ష పడేలా వాదించారు’
‘అది నా ధర్మం’
‘మీకు ఫీజు ఎవరు చెల్లించారు?’
‘ఇంకెవరు? నా క్లైంట్స్’
‘మీ ఫీజు ఎంతో నాకు తెలుసు. వారికా స్తోమత లేదు. అంతేకాక మీకు ఫీజు చెల్లించిన వాళ్లే, వాళ్లు లొంగపోవడానికి చాలా డబ్బు చెల్లించారు’
వెంటనే క్రాసీ మొహంలో రంగులు మారాయి.
‘మీలో ఊహాశక్తి ఎక్కువ అనుకుంటా’ అడిగాడు.
‘అవును. అపరాధ పరిశోధకుడికి అది అవసరం. లేదా ఇది నేను కనుక్కునేవాడిని కాను. ఇది ఉంటే పోలీసులు అసలు దొంగ కోసం వెదికి పట్టుకునేవాళ్లు. అతన్ని రక్షించడానికే ఇదంతా జరిగింది.’
‘మీలో రచయితయే లక్షణాలున్నాయి’
‘వారికి, మీకు అంత డబ్బు చెల్లించిన వ్యక్తి చాలా, చాలా ధనవంతుడై ఉండాలి. మీ క్లైంట్స్‌లో అంత ధనవంతుడు ఒక్కడే. అతనికి, ఈ కేసుకి ఏమిటి సంబంధం?’ మైఖేల్ ప్రశ్నించాడు.
‘డ్యూటీ మీద కాక మీరు మీ స్వంత సమయంలో ఇక్కడికి వచ్చారనుకుంటాను. మీరు డిటెక్టివ్ బ్యూరోలో కాక ట్రాఫిక్‌లో పని చేస్తున్నారు. యూనిఫాంలో రాలేదు కాబట్టి మీరు వెంటనే వెళ్లకపోతే మీ మీద మీ అధికారులకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది’ క్రాసీ కఠినంగా చెప్పాడు.
‘తప్పక ఫిర్యాదు చేయండి. మా చీఫ్ మిమ్మల్ని ఆ ధనవంతుడైన క్లైంట్ పేరు అడిగే అవకాశం ఇచ్చిన వారవుతారు’
‘బయటకి నడు’
‘నా అనుమానం స్థిరపడింది. వెళ్తున్నాను’ చెప్పి మైఖేల్ బయటకి నడిచాడు.
ఆ రాత్రి మేగీకి లాయర్ క్రాసీని కలిసిన సంగతి చెప్తే అరిచింది.
‘పెద్దవాళ్లతో ఎందుకు? మీకు సంబంధం లేని దాంట్లో దేనికి తలదూర్చడం. మీరు మీ బుర్రని, యూనిఫాంని ట్రాఫిక్‌కే పరిమితం చేస్తే సంతోషిస్తాను.’
* * *
మైఖేల్‌కి హాస్పిటల్లో మెలకువ వచ్చేసరికి తన పక్కన కుర్చీలో కూర్చుని కన్నీరు కార్చే మేగీ కనిపించింది.
‘ఏం జరిగింది?’ చుట్టూ చూస్తూ అడిగాడు.
‘ఇవాళ ఉదయం మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూంటే మిమ్మల్నో కారు వచ్చి గుద్దింది’
‘నేను బతికే ఉన్నాగా? ఏడుపు ఆపు’
‘అదృష్టవశాత్తు మీకు ఏదీ విరగలేదు. మిమ్మల్ని కారు ఢీకొట్టాక ఎగిరెళ్లి ఇంకో కారు బంపర్ మీద పడ్డారు. అదే సిమెంట్ రోడ్ మీద పడి ఉంటే, తల చితికేదని డాక్టర్ చెప్పాడు.’
‘ఐతే ఇంక ఏడుపు ఆపు. ఆ కారు డ్రైవర్ ఎవరో తెలుసుకున్నారా?’
అక్కడికి వచ్చిన ఫెన్నర్ అది విని చెప్పాడు.
‘లేదు. కాని ఆ బంపర్ కారతను నిన్నిక్కడికి తీసుకువచ్చాడు. అతను తెలివిగా వెళ్లిపోయే ఆ కారుని ఫొటో తీశాడు. నంబర్ దొరికింది’
‘అది క్రాసీ కారు కదా?’
‘అవును. నీకెలా తెలుసు. అది అతని కొడుకుది’
‘ఊహించాను. బహుశ ఎవరో అది తన పనని వచ్చి పోలీసులకి ఈపాటికి లొంగిపోయి ఉంటారు. అవునా?’
‘అవును. ఇదీ ఊహించావా?’ ఫెన్నర్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘క్రాసీ కొడుకు పేరేమిటి?’
‘స్టీవెన్’
‘అతనే ఆ చిల్లర దొంగతనాలని చేసింది ఫెన్నర్’
‘ఇంకా నీలో ఆ అనుమానం పోలేదా? లేక నీ తలకి తగిలిన దెబ్బ వల్లా? విశ్రాంతి తీసుకో...’ ఫెన్నర్ వెళ్తూ చెప్పాడు.
‘మూర్ఖంగా ఏమిటండి ఇది? ఆ కేసుని వదిలేయమన్నానా?’ మేగీ మందలించింది.
‘నేను కాదు. మీరంతా మూర్ఖులు’ మైఖేల్ నవ్వుతూ తల తడుముకుంటూ చెప్పాడు.
* * *
మైఖేల్‌ని మర్నాడు ఉదయం హాస్పిటల్ నించి డిశ్చార్జ్ చేశారు. మైఖేల్ ఊహించినట్లే ప్రమాదం జరిగిన సమయంలో స్టీవెన్ మరోచోట ఉన్నట్లుగా బలమైన ఎలిబీ ఉంది. పోలీసులకి లొంగిపోయిన అతని మిత్రుడు కారుని తీసుకెళ్లాడని స్టీవెన్ పోలీసులకి చెప్పాడు.
* * *
‘మీరు నన్ను నష్టపరిహారం కోరకుండా ఉంటానని హామీపత్రం మీద సంతకం చేస్తే మీకు ఏభై వేల డాలర్లని ఇవ్వదలచుకున్నాను’ మైఖేల్ ఇంటికి వచ్చిన లాయర్ క్రాసీ చెప్పాడు.
‘మిగిలిన వాళ్లకి మీరిచ్చిన మొత్తం ఇంతేనా?’ మైఖేల్ నవ్వుతూ ప్రశ్నించాడు.
‘మిగిలిన వాళ్లా? వాళ్లెవరు?’
‘ఇది లంచం. నా నోరు మూయించే లంచం. నాకొద్దు’
‘మీరేమంటున్నారో నాకు అర్థం కావడంలేదు’
‘ఇంకోసారి మీ అబ్బాయిని రక్షించుకోడానికి ఈ ఏభై వేలు ఉంచండి. బయటకి నడవండి. మళ్లీ ఎప్పుడూ రాకండి’ మైఖేల్ అరిచాడు.
* * *
మైఖేల్ తర్వాతి వారం రోజుల మెడికల్ లీవ్‌లో ఉన్నాడు. దాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. మేగీ వద్దంటున్నా వినకుండా తన స్వంత కారులో ఓ వ్యక్తిని రహస్యంగా అనుసరించసాగాడు.
క్రాసీ కొడుకు స్టీవెన్ నాలుగో రాత్రి తొమ్మిదికి ఓ చిన్న వడ్డీ వ్యాపారి షాప్‌కి వెళ్లే ముందు మొహానికి రుమాలు కప్పుకోవడం అతన్ని అనుసరించే మైఖేల్ చూశాడు. తక్షణం జేబులోంచి రివాల్వర్ తీసి అద్దాల కిటికీలోంచి లోపల జరిగేది బయట నించే చూశాడు. లోపల కస్టమర్లు ఎవరూ లేరు. స్టీవెన్ దాని యజమానిన రివాల్వర్‌తో బెదిరించడం, అతను కేష్ బాక్స్‌లోంచి కొంత డబ్బు తీసి స్టీవెన్‌కి ఇవ్వడం చూశాడు. స్టీవెన్ బయటకి వచ్చే దాకా ఆగి మైఖేల్ చెప్పాడు.
‘ఆగు స్టీవెన్. కదిలితే గుండు దిగుతుంది’
అతను ఆగలేదు. మైఖేల్ వైపు ఓసారి కాల్చి పరిగెత్తాడు. మైఖేల్ భుజంలో గుండు దిగి రక్తం చిందింది. మైఖేల్ సందేహించకుండా కాల్చాడు. స్టీవెన్ తక్షణం నేలకూలాడు. షాప్ యజమాని బయటకి పరిగెత్తుకు వచ్చాడు.
‘పోలీసులకి ఫోన్ చేయండి. అంబులెన్స్ అవసరం ఉందని చెప్పండి’ మైఖేల్ చెప్పాడు.
* * *
హాస్పిటల్‌కి వచ్చిన ఫెన్నర్ మైఖేల్‌కి చెప్పాడు.
‘స్టీవెన్ పోయాడు. గుండు సరిగ్గా గుండెలో దిగింది. ఆత్మరక్షణకి కాబట్టి నీ మీద కేసుండదు. నీ అనుమానం నిజం. ఆ నలుగుర్ని పిలిచి ప్రశ్నిస్తే, స్టీవెన్ పోయాడు కాబట్టి తమ తప్పుని ఒప్పుకున్నారు. నిన్ను నమ్మనందుకు సారీ. అసలు దొంగ క్రాసీ కొడుకు స్టీవెనే. డబ్బవసరం ఉండి కాక, అతను క్లెప్టోమేనియాక్ కాబట్టి ఆ దొంగతనాలు చేసాడు అని క్రాసీ అంగీకరించాడు.’
‘ఈసారి క్రాసీ ఎవరికీ లంచం ఇచ్చి తన కొడుకు నేరాన్ని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు’ మైఖేల్ చెప్పాడు.
(ఎడ్వర్డ్ డి హాక్ రచనకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి