S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘మంచుపై విన్యాసాల్లో’ మేటి..

దూరాన శే్వతవర్ణంలో మెరిసిపోయే పర్వత శిఖరాలు.. కింద భాగాన మంచు లేని పొడవైన రహదారి.. అక్కడ ఎటుచూసినా పిల్లల కోలాహలం.. మంచు శిఖరాలపైకి చేరుకోవాలని వారి ఆరాటం.. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ ప్రాంతంలో ఏటా జనవరి నుంచి కొన్ని నెలల పాటు ఈ దృశ్యాలు కనువిందు చేస్తాయి.. శీతలగాలుల వేళ మంచు పర్వతాలను అధిరోహించడం ఎవరికైనా మధురానుభూతిని కలిగిస్తుందని 21 ఏళ్ల ఆంచల్ ఠాకూర్ అంటోంది. ‘స్కీయింగ్’ (మంచుపై విన్యాసాలు చేయడం)లో మన దేశానికి అంతర్జాతీయ పోటీలో అవార్డు సాధించిన ఆమె పేరు ఇపుడు మనాలీలో మార్మోగుతోంది. ‘స్కీయింగ్’ పోటీల్లో అంతర్జాతీయ పతాకం సాధించిన తొలి భారతీయురాలిగా ఆంచల్ రికార్డు సృష్టించింది. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ‘స్కీయింగ్’ క్రీడ ఇంకా తగినంత ప్రాచుర్యం పొందనందున దీంట్లో ప్రవేశం ఉన్న ఆటగాళ్ల సంఖ్య చాలా తక్కువే.
ఇటీవల టర్కీలో ‘ఫెడరేషన్ ఇంటర్నేషనలె డె స్కీ’ (ఎఫ్‌ఐఎస్) ఆధ్వర్యంలో జరిగిన ‘అల్పైన్ ఎజ్డెర్ 3200 కప్’ పోటీలో భారత్ తరఫున పాల్గొన్న ఆంచల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మనాలీ సమీపంలోని బురువా గ్రామంలో ఉంటున్న ఆంచల్‌కు చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే ఎంతో మక్కువ. తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా క్రీడల్లో రాణించిన వారే. దీంతో విభిన్నమైన ‘స్కీయింగ్’పై ఆమె దృష్టి సారించింది. కొన్ని నెలల పాటు నిరంతర సాధన, కఠోర శ్రమ చేయడం వల్లనే తాను అంతర్జాతీయ పోటీలో రాణించానని ఆంచల్ చెబుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఆమె ఎన్నో పతకాలు సాధించింది. అయితే, టర్కీలో సాధించిన పతకం మాత్రం అన్నింటి కంటే భిన్మమైందని తెలిపింది.
టర్కీలో ఆంచల్ కాంస్య పతకం సాధించినట్లు సోషల్ మీడియాలో చూశాక పలువురు ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కేంద్ర క్రీడల శాఖామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, పలువురు సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఆమెను ప్రశంసిస్తూ సందేశాలను పంపారు. ఇంతమంది నుంచి అభినందనలు, ప్రశంసలు ఒక్కసారి రావడంతో తాను ఎంతో భావోద్వేగానికి లోనై, రెండు మూడు రోజులపాటు నిద్రకు, భోజనానికి దూరమైనట్లు ఆమె గుర్తు చేస్తోంది. తనకు పతకం దక్కడంతో ‘స్కీయింగ్’ క్రీడకు కొంతవరకైనా ప్రచారం లభించినట్టయిందని అంటోంది. ఈ ఆట తనకు సంప్రదాయబద్ధంగా, సహజ సిద్ధంగా వచ్చిందని, తన కుటుంబ సభ్యులకు కూడా ఇందులో ప్రవేశం ఉందని చెబుతోంది. కుటుంబ సభ్యుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ మంచు పర్వతాలను అధిరోహించడాన్ని పసిప్రాయంలోనే ఆమె శ్రద్ధగా గమనించేది. పర్వతాలను ఎక్కడం, దిగడం.. మంచుపై జారిపడడం వింత అనుభూతిని కలిగిస్తుందని అంటోంది. విపరీతంగా మంచు కురిసే శీతాకాలంలో సైతం ‘స్కీయింగ్’ ఎంతో సరదాగా ఉంటోందని ఆంచల్ తన అనుభవాలను వివరిస్తోంది. తమ ఇంట్లో పిల్లలు సైతం ఈ క్రీడ అంటే ఎంతో ఉత్సాహం చూపుతారని ఆంచల్ బంధువు చంపా ఠాకూర్ చెబుతున్నారు. ఆంచల్ సోదరి హీరా, సోదరుడు హిమాంశు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్నారు. ఆమె తండ్రి రోషన్‌లాల్ ఠాకూర్ జాతీయ స్థాయి స్కీయింగ్ పోటీల్లో చాంపియన్‌గా గుర్తింపు పొందారు. ఈ వారసత్వాన్ని ఆంచల్ పుణికిపుచ్చుకుంది. మొదట్లో మంచు శిఖరాలను అధిరోహించడాన్ని వినోదంగా భావించినా, ఆ క్రీడ తనకు జాతీయ, అంతర్జాతీయ పతకాలను తెచ్చిపెడుతుందని తాను ఎన్నడూ భావించలేదని ఆమె తెలిపింది. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో కొనే్నళ్ల పాటు శిక్షణ పొంది తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతోంది.
స్కీయింగ్ క్రీడ చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆంచల్ తెలిపింది. ప్రత్యేకమైన దుస్తులు, ఇతర పరికరాల కోసం దాదాపు అయిదు లక్షల రూపాయలు ఖర్చయినట్లు, తాను ఏడవ తరగతి చదువుతుండగా యూరప్‌లో శిక్షణ పొందానని చెబుతోంది. ఏటా మూడు నెలల పాటు యూరప్‌లో శిక్షణ పొందడానికి ఎంతో ఖర్చవుతున్నా, ఈ క్రీడలో ఉన్న అనుభూతి మాటల్లో చెప్పలేనంటోంది. మన దేశంలోనూ ‘స్కీ’ రిసార్టులను ఏర్పాటు చేసి, ఏడాదిలో కనీసం ఎనిమిది నెలల పాటు శిక్షణ ఇప్పిస్తే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని అంటోంది. విదేశీ కోచ్‌లకు భారీగా జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుందని వివరిస్తోంది.
బీజింగ్‌లో జరిగే 2022 వింటర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని ఆంచల్ శిక్షణ పొందుతోంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కష్టతరమని, అయినా నిరంతర సాధనతో కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఖాళీ సమయాల్లో తన దుస్తులను తానే కుట్టుకుంటానని, స్వెట్టర్లు అల్లుతుంటానని ఆమె తెలిపింది. తన ఇంట్లో ఆవులకు దాణా వేయడం, పొలంలో గడ్డి కోయడం, వంట చేయడం కూడా తనకు ఇష్టమంటోంది. హిందీ సినిమాలన్నా, చిత్రలేఖనం అన్నా ఆమెకు మక్కువే. తన గదిలో బాలీవుడ్ ప్రముఖులు ప్రియాంక చోప్రా, లిసా హేడన్ వంటి ప్రముఖులు ఫొటోలను పెట్టుకుంది. విదేశీ క్రీడాకారులకు సంబంధించిన స్కీయింగ్ వీడియోలను తరచూ కుటుంబ సభ్యులతో కలసి చూస్తుంటుంది. తన గ్రామంలోని మిగతా అమ్మాయిల కంటే తాను విభిన్నం కాదని, కాకపోతే విదేశాల్లో ‘స్కీయింగ్’ శిక్షణ పొందడం ఒక్కటే తన ఘనత అని ఆమె వినమ్రంగా చెబుతోంది.