S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైదరాబాద్‌తో వీరేశలింగం చుట్టరికం

కందుకూరి వీరేశలింగం పంతులుగారు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారో ఇతమిత్థంగా చెప్పలేం కాని ఒకసారి మాత్రం సరోజినీ నాయుడు, ముత్యాల గోవిందరాజులు నాయుడు గారింటికి వచ్చి ఒక పూట ఆతిథ్యం స్వీకరించి పిల్లలను చూసి సంతోషపడి, నాగపూర్ వెళ్లిపోయారు. సరోజినీనాయుడుకూ, వీరేశలింగం గారికీ చుట్టరికం ఏమంటే ఆయన సరోజినీ నాయుడు పెళ్లి చేశాడు చెన్నపట్నంలో. మరి ఆమె తల్లిదండ్రులు, అఘోరనాథ చటోపాధ్యాయ, వరద సుందరీదేవి, కూతురు పెళ్లిపీటల మీద ఎందుకు కూచోలేదు అంటే సరోజినిది సంఘసంస్కరణ వివాహం. అఘోరనాథ చటోపాధ్యాయ గారిది బ్రాహ్మణ కుటుంబం. ముత్యాల గోవిందరాజులుగారు బ్రాహ్మణులు కారని ఆయన పేరే చెబుతున్నది కదా. అఘోరనాథ్ దంపతులు వెనుకంజ వేసి ఉంటారు. సరోజిని అత్యంత ప్రతిభావంతురాలు. పనె్నండవ ఏటనే ఆమె మద్రాసు వెళ్లి మెట్రిక్ పరీక్ష రాసి గణనీయంగా కృతార్థులైంది. పదిహేనో ఏటనే గోవిందరాజులు నాయుడుగారితో ప్రేమలో పడింది. ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో ముత్యాల నాయుడుగారు గొప్ప పేరున్న వైద్యుడు.
అప్పుడు బ్రాహ్మ సమాజ సంప్రదాయాన్ని అనుసరించి చెన్నపట్నంలో వీరేశలింగం, రాజ్యలక్ష్మమ్మ దంపతులు సరోజిని పెళ్లి చేశారు. అందువల్ల సరోజినీ నాయుడు తల్లిదండ్రుల బాధ్యత పూనుకున్నారు. సరోజినీ నాయుడుకు ఇంగ్లీషు, తెలుగు, బెంగాలీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో చక్కటి పరిజ్ఞానం ఉండేది. ఆమె కాకినాడలో జరిగిన కాంగ్రెసు మహాసభలకు హాజరైంది. ఏలూరులో కొంతకాలం సంగీత నృత్య కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసింది. ఆమెకు తెలుగు బాగా నేర్చుకొనే అవకాశం ఇందువల్ల సమకూడటంలో ఆశ్చర్యమేముంది. ఆమె ఇంగ్లండ్ వెళ్లి కేంబ్రిడ్జ్‌లో చదువుకొని అక్కడి సాహిత్యవేత్తల మెప్పు పొందింది.
హైదరాబాద్ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో చిలకమర్తి లక్ష్మీనరసింహ కవికి సమ్మానం జరిగినప్పుడు సరోజినీ నాయుడు అధ్యక్షురాలై ఆయనను సత్కరించింది. విలువైన శాలువా కప్పి నన్ను సమ్మానించిందని చిలకమర్తి వారే స్వీయ చరిత్రలో రాసుకున్నారు. ఏలూరులో ఒక ధనిక కుటుంబం వారి ఇంటిలో జరిగిన పెండ్లికి ‘్భమాకలాపం’ యక్షగాన సంగీత నృత్య తత్త్వజ్ఞాన రూపకం చూసి తెలుగు వాళ్లు నృత్యగాన కళలలో బెంగాలీ వాళ్లకేమీ తీసిపోరని కితాబిచ్చినట్లు శ్రీమతి కాశీ చయనుల వేంకట మహాలక్ష్మిగారు స్వీయ చరిత్రలో చెప్పారు. వీరి స్వీయ చరిత్ర గోదావరీ తీర బ్రాహ్మణ కుటుంబాల ఒకనాటి సాంస్కృతిక జీవనాన్ని ఆకర్షణీయంగా చిత్రించింది. వీరి పూర్వులు నిజాం రాష్ట్రం నుంచే వలస వెళ్లి తీరాంధ్రంలో స్థిరపడినట్లు తెలుస్తున్నది.
1948లో వీరేశలింగం శతజయంతి మద్రాసు (ఇప్పుడు చెన్నై)లో మూడు రోజులపాటు జరిగింది. అప్పటికింకా నిజాం నవాబుగారి అధికారం చెల్లుతూనే ఉంది. నిజాం నవాబు వీరేశలింగం జయంతికి భూరి విరాళం (పదివేల రూపాయలు కాబోలు) ప్రకటించాడు. కాని తరువాత ఆయన నవాబరికం కూలిపోయింది. కాబట్టి వీరేశలింగం శతజయంతి విరాళం నవాబుగారి దగ్గరే ఉండిపోయింది. అప్పటి ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలు నిజాంగారి ఔదార్యాన్ని పత్రికీకరించాయి.

-అక్కిరాజు రమాపతిరావు