S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతర్నాటకం...-కొయిలాడ రామ్మోహన్‌రావు

ఉదయం నుంచి కొడుకు అభినవ్ గురించి ఆలోచిస్తూ మధనపడుతున్న యశోధరకి నీరసం ముంచుకొచ్చింది. తరగని ఆలోచనలతో ఆమె మెదడు వేడెక్కిపోయింది. కొడుకు భవిష్యత్ ఏమైపోతుందోననే ఆలోచనలతో ఆమె నవనాడులూ క్రుంగిపోయాయి.
యశోధర భర్త రాహుల్ రెండు సంవత్సరాల క్రితం ఏక్సిడెంట్‌లో చనిపోయాడు. భర్త స్థానంలో ఆమెకిచ్చిన ఉద్యోగం కొంత ఊరట కలిగించినా, పిల్లలను చక్కగా పెంచి, పైకి తేవటం ఆమెకో సవాలు అయింది. దానికి ముఖ్యకారణం కొడుకు అభినవ్. వాడిప్పుడు ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాడు. వాడికి అఖండమైన తెలివితేటలున్నా చదువు విషయంలో అవి సద్వినియోగం కావటంలేదు. వాడి టీచర్ల మాటలో చెప్పాలంటే ‘వాడికి డీవియేషన్‌లు ఎక్కువ. దేని మీదా ఏకాగ్రత నిలపడు’. దాంతో వాడికి ఏ సబ్జెక్ట్‌లోనూ మంచి మార్కులు వచ్చేవికావు. ప్రతి నెలా స్కూల్ నుంచి వాడి గురించి కంప్లైంట్‌లే. వాడికన్నా రెండేళ్లు చిన్నదయిన నైమిష కాస్త ఫర్వాలేదు గానీ, అభి వల్ల వచ్చిన సమస్యతో యశోధర నిరంతరం సతమతమవుతూ వుండేది. తాజాగా ఆమెకిప్పుడో కొత్త తలనెప్పి తయారయింది. దానికి కారణం ‘పార్థు’.
పార్థు యశోధర ఇంటికి నాలుగిళ్ల అవతల నివాసముంటున్నాడు. హైదరాబాద్‌లో ‘బెస్ట్ బయోటెక్’లో సైంటిస్టుగా పనిచేసే పార్థు, భార్యను చంపిన నేరానికి జైలుపాలయి, శిక్ష ననుభవించి, విడుదలయిన తర్వాత హైదరాబాద్‌లో ఉండలేక, విశాఖపట్నం వచ్చి, యశోధర ఉంటున్న కాలనీలో స్థిరపడ్డాడు. ఆ కాలనీలో ఉండే వారికి పార్థు గురించి క్రమక్రమంగా తెలిసింది. దాంతో అతనితో మాట్లాడడానికి జనం జంకేవారు. ఎక్కడయినా ఎవరయినా ఎదురుపడితే, తమ పిల్లలను పక్కకు దాచుకొని, భయంభయంగా అతని దూరంగా జరిగిపోయేవారు. ఇంట్లోంచి బయటకొచ్చేవారు, రోడ్డు మీద పార్థుని చూడగానే చప్పుడన ఇంట్లోకి దూరిపోయి, అతనక్కడ లేడని నిర్ధారణ చేసుకున్న తర్వాతే బయటకొచ్చేవారు.
పార్థు గురించి తెలిసిన తర్వాత అతనికి వంట పని, ఇంటి పని చేసే పార్వతి వెంటనే పని మానేసింది. అప్పటి నుంచి పార్థుయే తన పనులన్నీ తానే చేసుకొనేవాడు. అతనికి సహాయం చేయడానికి గానీ, అతని దగ్గర పనిచేయడానికి గానీ ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. ఇంట్లో ఏ రిపేరొచ్చినా అతనికి సాయమందేది కాదు.
* * *
ఉదయం పార్థుతో, అభిని చూసిన దగ్గర్నుంచి యశోధరకు మనసు మనసులో లేదు. అభి పార్థు ఇంటి నుంచి నవ్వుతూ బయటకు రావడం, పార్థు అతన్ని సాగనంపటం, దూరం నుంచి చూసింది యశోధర. అయితే వాళ్ళిద్దరూ ఆమెను గమనించలేదు. ఈ మధ్యకాలంలో అభిలో చాలా మార్పు రావడం ఆమె గమనిస్తూ వస్తోంది. మునుపటికన్నా హుషారు ఎక్కువయింది. ఎక్కడి నుంచో పాపులర్ సైన్స్ పుస్తకాలు తెచ్చుకొని దీక్షగా చదవటం, ఇంతకు ముందులా క్రికెట్ ఆడటానికి ఉత్సాహం చూపించకపోవడం, ప్రతిరోజూ సాయంత్రం చెప్పాపెట్టకుండా బయటకు చెక్కేయడం, లేటుగా ఇంటికి రావడం, ఎక్కడికి వెళ్లావని అడిగితే, ఫ్రెండ్ ఇంటికెళ్లానని చెప్పి, పుస్తకాలలో మునిగిపోవడం.. ఇవన్నీ ఆమె గమనిస్తూ వచ్చినా.. ఈ మార్పు వెనుక పార్థు ఉన్నాడనే విషయం ఆమెకిప్పుడే తెలిసింది. ‘వాడి కొత్త ఫ్రెండ్ పార్థు’ అన్న విషయం తెలిసాక, ఆమెకు చెమటలు పట్టాయి. అంత పెద్దవాడితో, అందునా అలాంటి వాడితో వాడికి ఫ్రెండ్‌షిప్పేమిటో ఆమెకు అర్థంకాక తలపగిలిపోతోంది.
పార్థు నుంచి వాడిని ఎలాగయినా వేరుచేయాలన్నదే ఆమెకిప్పుడు తక్షణ కర్తవ్యం. కానీ అదేమంత సులువు కాదని ఆమెకు స్పష్టంగా తెలుసు. అభి ఎంత మంచి కుర్రవాడయినా, వాడిలో మొండితనం పాలెక్కువ. వాడిని ఒప్పించడం, సరైన దారిలోకి తెచ్చుకోవడం చాలా కష్టం. దండించి దార్లోకి తెచ్చుకోవడం అవివేకమైన పని, అలా చేస్తే వాడు ఇంట్లోంచి పారిపోయే ప్రమాదం ఉందన్న విషయం ఆమెకు సుస్పష్టం. నేరుగా పార్థుని కలిసి, వాడిని దూరంగా ఉంచమని చెప్పే ధైర్యమూ, తెగువా ఆమెకు లేవు. అందుకే.. ఆచితూచి అడుగువేయాలని ఆమె ఆలోచన. నెమ్మదిగా వాడిలో మార్పు తేవాలని నిర్ణయించుకున్న యశోధర, పార్థుతో అభికి పరిచయం ఉన్నట్లు తెలియనిదానిలా ప్రవర్తించసాగింది.
ఈ మధ్యకాలంలో అభిలో వచ్చిన మార్పు కారణంగా యశోధరకు మనశ్శాంతిని కలిగించిన అంశాలు కూడా వున్నాయి. వాటిలో మొదటిది. చదువు పట్ల కూడా అభి దృష్టి పెట్టడం. రెండవది నైమిష, అభిల మధ్య పెరిగిన సఖ్యత. గతంలో అన్నాచెల్లెళ్లిద్దరికీ క్షణం పడేది కాదు. సెలవు రోజు వచ్చిందంటే యశోధరకు నరకమే. కానీ ఇప్పుడామెకు సెలవు రోజొక పండుగలా అనిపిస్తుంది. ఆ రోజు ఇంట్లో దొరికే వస్తువులతో అభి రకరకాల మేజిక్‌లు, సైన్స్ ప్రయోగాలూ చేస్తూ ఉండటం, వాటి వెనుకనున్న సైన్స్, చెల్లికి బోధపరచడం చేస్తుండటం తో, నైమిష ఇరవై నాలుగు గంటలూ అన్నను అంటిపెట్టుకొని ఉంటూ, వాడికి కావలసిన వస్తువులన్నీ సేకరించి, అందిస్తూ ఉంటుంటే ఎంతో ముచ్చటగా ఉండేది యశోధరకు. ఒకరోజు యశోధర తెల్లని పిండిని పట్టుకొని, అది ‘వంట సోడా’ అవునా కాదా?’ అనే మీమాంసలో పడితే, దాని శాంపిల్ మీద నిమ్మకాయ పిండి, అది పొంగగానే వంట సోడా అని కన్‌ఫర్మ్ చేసి, వంట సోడా అంటే సోడియం బైకార్బొనేట్ అని, నిమ్మకాయ రసంలో ఏసిడ్ దాంతో రియాక్ట్ అయితే కార్బన్ డయాక్సైడ్ అనే సేస్ విడుదలవుతుందని, అందుకే వంట సోడా పొంగిందని, నైమిషకు వివరిస్తూ ఉంటే వాడి సైన్స్ పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయింది యశోధర. ఇలాంటి సంఘటనలు అనేక పర్యాయాలు జరిగినా, కొడుక్కి, కూతురికి సైన్స్ పట్ల ఇష్టత పెరగడం గమనించి, ఆనందపడినప్పటికీ పార్థు గురించి ఆమెలో భయం పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు.
* * *
ఒక సెలవు రోజు ఆమె భయపడినంత పనీ జరిగింది. వంట గదిలో ఉన్న యశోధర, బాధతో అరుస్తున్న నైమిష కేకలు విని, తల్లడిల్లిపోతూ హాల్లోకి వచ్చి, అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయింది. అక్కడ నిలబడి ఉన్న అభి, నైమిష చేయి పట్టుకుని, చాకుతో గాట్లు పెడుతున్నాడు. నైమిష బాధతో విలవిలలాడుతోంది. నైమిష చేయంతా ఎర్రని రక్తంతో తడిసిపోయి భయంగొలుపుతోంది. వెంటనే యశోధర, అభి దగ్గర్నుంచి చాకు లాక్కొని, వాడిని కొట్టడానికి చెయ్యెత్తేసరికి, అభి, వాడితోపాటూ నైమిష బిగ్గరగా నవ్వుతూ ‘మమీ భయపడిపోయింది.. మమీ భయపడిపోయింది’ అని చప్పట్లు కొడుతూ గంతులేయడంతో, ఏం జరుగుతుందో తెలియక బిత్తరపోయిన యశోధరకు, క్షణంలోనే కోపం ముంచుకొచ్చింది కొడుకుపైన. అది గమనించిన అభి, ఆమెను ప్రేమతో చుట్టేసి, ‘సారీ మమీ.. ఇదో సింపుల్ మేజిక్’ అనేసరికి, ‘మేజిక్కా!’ అంటూ ఆశ్చర్యపోయింది.
‘అవును మమీ.. మేజిక్కే.. పసుపు, సున్నం కలిపి మీరు ఎర్రని పారాణి తయారుచేస్తారు కదా? అదే టెక్నిక్ ఇక్కడ వాడాను. చెల్లి చేతికి ముందుగా పసుపు రాశాను. సున్నంలో ముంచిన ఈ చాకును చెల్లి చేతి మీద తాకించేసరికి, గాట్లు పెట్టినట్లు ఎర్రగా అయిపోయింది రక్తంలా.. అంతే!’ అంటూ వివరించాడు. కొడుకు చేస్తున్న ఇలాంటి ప్రయోగాలకు సంతోషించాలో లేదో ఆమెకస్సలు బోధపడటం లేదు. ఇవేవీ ఆమె మనసులోని భయాన్ని దూరం చేయలేక పోయాయి. పార్థు బెడద వదిలించుకొనే మార్గాలనే ఆమె అనే్వషిస్తూనే ఉంది.
* * *
బాగా ఆలోచించి, తమ సమస్యకు పరిష్కారం కేవలం ‘్భనుచందర్’ మాత్రమే చూపగలడనే నిర్ణయానికొచ్చింది. ‘్భను’ ఆమెకు చిరకాల మిత్రుడు. సన్నిహితుడు. హైదరాబాద్‌లో ఉంటున్న భానుకి ఫోన్ చేసి, తనకొచ్చిన సమస్యను టూకీగా చెప్పింది. ఆమెకు ధైర్యం నూరిపోసి, వారంరోజుల్లోగా ఆఫీసు పని మీద వచ్చినపుడు, కలసి తగిన పరిష్కారం గురించి ప్రయత్నం చేద్దామని చెప్పగానే, ఆమెకెంతో రిలీఫ్ వచ్చినట్లయింది. భాను సమర్థత మీద ఆమెకు అపారమైన నమ్మకం ఉంది.
మాట ఇచ్చిన ప్రకారం భాను, విశాఖపట్నం వచ్చి, యశోధరను కలసి ఆమె ద్వారా విషయాలన్నీ వివరంగా తెలుసుకున్న తర్వాత,
‘నువ్వు ఫోన్లో ఈ విషయం చూచాయగా చెప్పిన తర్వాత, ఈ ఊర్లోనే ఉంటున్న మా ఫ్రెండ్ గోపాల్‌కి, పార్థు మీద ఓ కనే్నయమని చెప్పాను. వాడు చాలా వివరాలు సేకరించాడు. వాడు చెప్పిన దాన్నిబట్టి, పార్థుకి సహాయం చేయడానికి ఎవరూ, ఏ విధంగానూ ముందుకు రావటంలేదు. పార్థు ఇంట్లోనే ఒక లేబరేటరీ ఎస్టాబ్లిష్ చేసి, రీసెర్చ్ కొనసాగిస్తున్నాడు. అతని నేర చరిత్రకు భయపడి, అసిస్టెంట్లుగా పనిచేయడానికి ఎవరూ దొరకటంలేదు. అభితో ఏర్పడిన పరిచయాన్ని పార్థు, రీసెర్చ్‌కి ఉపయోగించుకుంటున్నాడు. అభి అత్యుత్సాహంతో పార్థు చెప్పిన పనులన్నీ చేస్తూ, అతనికి సహాయపడుతున్నాడు. అది ఎలాంటి రీసెర్చో, దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలుంటాయో, వాటివల్ల ఇప్పుడు గానీ, భవిష్యత్తులోగానీ అభికి ఏమైనా ప్రమాదం జరగవచ్చునేమోనని నాకిప్పుడు భయం పట్టుకుంది’ అని ఆపాడు.
ఆ మాటలు వినగానే యశోధర ముఖం భయంతో పాలిపోయింది. పరిస్థితి ఇంతగా విషమించిందని ఆమె ఊహించలేక పోయింది. భాను ఆమెకు ధైర్యం చెప్పి, హైదరాబాద్‌లో ఉన్న బ్రాంచికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అక్కడయితే పార్థు బెడద ఉండదు కనుక, కొంచెం కష్టమైనా అదే సరైన పరిష్కారమనిపించిందామెకు.
* * *
యశోధరను, ఆమె పిల్లలను రిసీవ్ చేసుకోవడానికి సికిందరాబాద్ స్టేషన్‌కి వెళ్లిన భాను, వాళ్లు ట్రైన్‌లో గానీ, ప్లాట్‌ఫాం మీద గానీ కనిపించకపోయే సరికి గాభరాపడ్డాడు. యశోధర ఫోన్ స్విచ్చ్ఫాలో ఉండటం వల్ల ఆమెను కాంటాక్ట్ చేయడం కుదరలేదు. వాళ్లు హైదరాబాద్ చేరకపోవటం వెనుక పార్థు హస్తముందేమోనని అనుమానించి గాభరాపడ్డాడు. సమయానికి భాను ఫ్రెండ్ వైజాగ్‌లో లేకపోవడం వల్ల యశోధర గురించి ఏ విషయమూ సేకరించలేక పోయాడతను. మర్నాడు ఉదయానికిగానీ, యశోధర ఫోన్ దొరకలేదతనికి. ఎంతో ఆదుర్దాగా ఆమెనెన్నో ప్రశ్నలడిగాడు. ఆమె నుంచి నిర్లిప్తంగా సమాధానాలు రావటం అతనికెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫోన్ పాడయిందని, హైదరాబాద్ వచ్చే ఆలోచన విరమించుకున్నదని, పార్థు వల్ల పెద్ద ముప్పేమీ లేదని.. ఆమె చెపుతున్న సమాధానాలు వింటే అతనికి మతి చలించినట్లయింది. ఏమిటిలా మాట్లాడుతుంది అనుకుంటున్న భానుకి ఆమె నిర్లక్ష్య ధోరణి పట్ల కోపం వచ్చింది. ‘ఏమిటి? నీకు పిచ్చెక్కిందా? ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నావా?’ అని గద్దించాడు. అటునుంచి ఘాటుగా సమాధానం వచ్చింది. ‘పిచ్చి నాక్కాదు.. నీకే..’ అంటూ. నివ్వెరపోయాడు. అతని నోట మాట రాలేదు.
‘అవును నీకే పిచ్చి. మదపిచ్చి. త్రాష్టుడా.. ఎంతగా నమ్మానురా నిన్ను. నీ నిజ స్వరూపం తెలిసిపోయింది. ఇకపైన నాకెప్పుడూ ఫోన్ చేయకు, కలవడానికసలే ప్రయత్నించకు’ అంటూ కఠినంగా పలికింది యశోధర. ఆ స్వరంలో ఉన్న తీవ్రతకు అతను కంగారుపడుతూ.. ‘అబద్ధం.. అబద్ధం... నీకు ఎవరో..’ అంటూ పిచ్చివాడిలా అరుస్తుండగా, ఆమె ఫోన్ కట్ చేసింది. ఆ అరుపులకు బెదిరిపోయిన అతని భార్య ‘లలిత’ పరిగెత్తుకొచ్చింది ‘ఏమైందండీ?’ అని అదుర్దాగా ప్రశ్నిస్తూ. ‘ఏం లేదు.. ఏం లేదు..’ అంటూ బాత్‌రూంలో దూరి తలుపేసుకున్నాడు.
* * *
నాలుగు రోజుల క్రితం...
యశోధర హడావిడిగా ఆఫీసుకు బయల్దేరుతున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది.
‘ఈ టైమ్‌లో ఎవరొచ్చారబ్బా? కొంపతీసి పార్థు కాదు కదా?..’ అనుకుంటూ, భయపడుతూ మెల్లగా తలుపు తీసిన యశోధర, గుమ్మం దగ్గర నిలబడి ఉన్న యువతిని చూసి నివ్వెరపోయింది. ‘ల...లి..తా!’ ఆమె నోటమ్మట అప్రయత్నంగా ఆ అక్షరాలు వెలువడ్డాయి. భాను వచ్చి వెళ్లిన కొన్ని రోజులకు అతని భార్య ఇలా హఠాత్తుగా ఊడిపడటం వెనుకున్న ఆంతర్యమేమిటో తెలియక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది యశోధర.
‘ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. గంటలో తిరిగి వెళ్లిపోతాను. ఆఫీసుకు బయల్దేరుతున్నట్లున్నారు. లేట్‌గా వెళ్లడానికి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోండి’ అంటూ చొరవగా లోపలికొచ్చి కూర్చుంది. అయోమయంగా తలూపి, ఫ్రిజ్‌లోంచి డ్రింక్ తీసి ఆమెకిచ్చి, ఆఫీసుకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని, లలిత ముందు కూర్చుని శ్రద్ధగా ఆమె చెప్పేది వినడానికి సిద్ధపడిందామె.
‘మీరేదో సమస్యలో ఇరుక్కొని, మావారి సలహా మీద హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే నిర్ణయం తీసుకున్నారు కదా? అసలేం జరిగిందో వివరంగా చెప్తారా? మీకు మేలు చేయడానికే నేనింత దూరం వచ్చాను’ అని అడిగింది లలిత.
యశోధర జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరంగా చెప్పింది. ఇవన్నీ లలిత ఎందుకు అడుగుతుంది? ఈ విషయమై ఆమె శ్రద్ధ తీసుకొని ఇంత దూరం రావలసినఅవసరం ఏమిటి? అనే ప్రశ్నలు ఆమె మనసును దొలిచేస్తున్నా, త్వరలోనే వాటికి సమాధానాలు వస్తాయనే తలపుతో వేచి ఉంది ఓపిగ్గా.
‘మీకు చాలా విషయాలు చెప్పాలి. మా ఆయన మీరనుకున్నంత మంచివాడు కాదు. ఆయనొక స్ర్తిలోలుడు. మేకవనె్న పులి’ అని క్షణంపాటు ఆగింది. ఆ క్షణంలోనే యశోధ, పక్కలో బాంబు పేలినంతగా అదిరిపోయింది. తను వింటున్నది నిజమా? అనుకుంటూ దిమ్మదిరిగిన దానిలా అయిపోయింది. లలిత మళ్లీ మొదలుపెట్టింది. ‘పార్థు దగ్గర నేను రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండేదాన్ని. ఆ పరిచయం వల్ల మా రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. పార్థు చాలా మంచివాడు. అతని భార్య స్రవంతి భాను బుట్టలో పడిపోయింది. వారిద్దరి మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం నాకుగానీ, పార్థుకి గానీ తెలియకుండా చాన్నాళ్లు జాగ్రత్త పడ్డారు. అయితే ఒకరోజు వాళ్లిద్దరూ పార్థుకి దొరికిపోయారు. భార్యను ఎంతగానో ప్రేమించే పార్థు తట్టుకోలేక పోయాడు. పిచ్చికోపంతో విచక్షణా జ్ఞానం కోల్పోయిన పార్థు స్రవంతిని కొట్టాడు. భాను ఎలాగో తప్పించుకున్నాడు. పార్థు కొట్టిన దెబ్బకి మంచం పట్టీ తగలడంతో, తలపగిలి స్రవంతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. భానుని కూడా చంపేద్దామని ప్రయత్నించిన పార్థు ప్రయత్నం ఫలించలేదు. ఈ లోపుగానే పోలీసులకు దొరికిపోయాడు.
పోలీసులకు లొంగిపోయిన పార్థు హత్యకుగల కారణాన్ని బయటపెట్టలేదు. చాలారోజులుగా తన మానసిక పరిస్థితి బాగాలేదని, అప్పుడప్పుడు దెయ్యం పట్టినవాడిలా ప్రవర్తిస్తూ ఉంటానని డాక్టర్‌ని సంప్రదించే లోపుగానే ఈ అఘాయిత్యం జరిగిందని, అటువంటి మానసిక స్థితిలో భార్యపై చేయి చేసుకుంటే ప్రమాదవశాత్తు ఆమె మరణించిందని కోర్టుని నమ్మించాడు. దీనినిబట్టి పార్థు ఎంత మంచివాడో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక మీలో భయాన్ని పెంచడానికి పార్థు కొనసాగిస్తున్న రీసెర్చ్‌ని భాను పావులా వాడుకున్నాడు. బహుశ పార్థు, సగంలో వదిలేసిన రీసెర్చ్‌ని కొనసాగిస్తూ ఉంటారు. ఆయన ఎంచుకున్న రీసెర్చ్ టాపిక్స్ అన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు. వాటివల్ల ఎవరికీ ఏ ప్రమాదమూ లేదు. పార్థు వంటి గొప్ప సైంటిస్టు దగ్గర మీవాడు ఇప్పటినుంచే శిక్షణ పొందటం, మీరు ఏనాడో చేసుకున్న అదృష్టం. మరో విషయం.. వైజాగ్‌లో ఉంటున్న మావారి ఫ్రెండ్ గోపాల్‌కి మావారు ఫోన్ చేసి, పార్థు గురించి ఎంక్వైరీ చేయమని చెప్పడం నా చెవిన పడింది. అప్పుడు నాకెందుకో అనుమానం వచ్చి, అప్పటి నుంచి భాను కదలికలను గమనిస్తూ ఉన్నాను. మీ హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ విషయమై పదేపదే మీ మేనేజర్ మీద ఒత్తిడి తేవడం, మీ కోసం మా ఇంటి దగ్గర్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం కోసం హైరానా పడిపోవడం, పదేపదే మీతో ఫోన్లో మాట్లాడుతుండటం నాకొచ్చిన అనుమానాలను బలపర్చాయి. మిమ్మల్ని మెల్లమెల్లగా ఉచ్చులోకి దించాలనుకుంటున్నాడని నాకర్థమయింది. అందుకే మిమ్మల్ని హెచ్చరిద్దామని బయల్దేరి వచ్చేసాను. ఇక నిర్ణయం మీదే’ అంటూ లేచి నిలబడింది, బయల్దేరడానికి సిద్ధపడుతూ.
వెంటనే లలితను కౌగలించుకొని ‘చాలాచాలా థేంక్స్. గొప్ప ప్రమాదం నుంచి నన్ను తప్పించారు’ అని ఉద్వేగంగా అంటూ ఆమెను బలంగా హత్తుకుంది యశోధర. నీచుడైన భర్త ఆడుతున్న ‘అంతర్నాటకానికి’ తెరదించగలిగినందుకు తృప్తిపడుతూ తేలికపడిన మనసుతో ఆప్యాయంగా ఆమె తల నిమిరింది లలిత.

-కొయిలాడ రామ్మోహనరావు.. 98493 45060