S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవత్వం పరిమళించిన వేళ..

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
నిజం నిద్రలేచిన సమయం..
నేను కొండ దారిలో నడుస్తూ వెళుతున్నాను. ఎదురుగా - దూరంలో ఒక ఎతె్తైన పర్వతం శాంత గంభీర వదనంతో తన విశాలమైన బాహువులతో ఇతర పర్వతాలను ఆలింగనం చేసుకుని నిలబడి వుంది. వెనుక నుంచి ఉదయిస్తున్న సూర్యుని బంగారు కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి.
అది ఆకాశాన్ని చుంబించే ఔన్నత్యం.. ఉత్తేజపరిచే ఉత్సాహం...
అన్నిటినీ మించి- లక్ష్యాన్ని చేరుకుని, జీవితాన్ని జయించిన నిజమైన విజయం!
వెంటనే నాకు ‘శ్రీనివాసరావు’ మనసులో మెదిలాడు-
అవును.. నేను అర్జంటుగా శ్రీనివాసరావుని చూడాలి!
ఇన్నాళ్లూ అతనెక్కడుంటాడో తెలీదు. పైగా, అతనితో నాకెలాంటి సంబంధమూ లేదు -
విచిత్రమేమిటంటే.. ఈ భూమీద వచ్చేపోయే రాత్రీపగళ్లతో సంబంధం లేని అతను - అసలు బ్రతికి వున్నాడో, లేదో.. అనే స్పృహ నాకింత కాలమూ రాలేదు.
కానీ.. ఈ రోజు?
నిరాశా నిస్పృహలు నిజానికి కష్టాలు కావనీ, ‘ప్రేరణ’కి అవే అసలైన పునాదులనీ, అవే మనలో కొత్త ఆశా కిరణాన్ని నింపుతాయనీ, ‘నిరాశా నిస్పృహల్ని’ ఇలా భావించి స్వీకరించిన వారికే ‘భవిష్యత్తు’ వారసత్వవౌతుందని నిరూపించిన వ్యక్తి.. శ్రీనివాసరావు!
నిజమే.. తమ భవిష్యత్తుని తామే స్వయంగా లిఖించుకునే వారి దగ్గరికి ‘లక్ష్యం’ దానంతట అదే నడచి వస్తుంది.
గతంలో కనీ వినీ ఎరుగని సంఘటనలు, వ్యక్తులు, వింతలు, విడ్డూరాలు, అక్రమాలు ఎన్నో ఉండగా - అవన్నీ అందరికీ గుర్తుండకపోయినా - జీర్ణంకాని విషయం మాత్రం గుర్తుంటుంది.. అది దృశ్యమో, వ్యక్తో.. ఎవరైనా!
ఈ రోజు.. నా ఆలోచనలన్నీ ‘శీను’ చుట్టే తిరుగుతున్నాయి!
* * *
ఇప్పటికి సుమారు ఐదారేళ్ల క్రితం కావొచ్చు..
నా కొడుకంత వయస్సుంటుంది అతడికి!
పెళ్లయ్యింది. భార్యా, ముగ్గురాడ పిల్లలున్నవాడు కావడమే కాదు - డబ్బూ, ఆకలి సమస్యలు కూడా అతన్ని ఇనుప సంకెళ్లలా చుట్టుకొని ఉన్నాయి. అందుకేనేమో.. అతని కళ్లల్లో ఆ దీనత్వం! ఎప్పుడూ ముభావంగా ఉండటం. ఎవరు పలకరించినా బిక్కుబిక్కుమంటూ వారి కళ్లవైపే చూడడం తప్ప ఏమీ మాట్లాడకపోవడం, అంతరంగం శిథిలమైనట్లు.. బలహీనంగా, నిస్సత్తువగా కనబడేవాడు.
కష్టాలు, కన్నీళ్లు, బాధ్యతలు ఏమీ తెలీని నాకు - ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీరుగా పనిచేసి రిటైరయ్యాక కొన్ని సంస్కరణల గురించి దిక్కుమాలిన ఆలోచనలు ప్రారంభమైనాయి.
ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లని ప్రయోజకుల్ని చేసి, అందర్నీ వృద్ధిలోకి తీసుకువచ్చి ఎవరి జీవితాలకి కావలసిన నైపుణ్యాన్ని వాళ్లు అలవరచుకునేలా తయారుచేసి, వారి బతుకులకి ఏ లోటూ రాకుండా వాళ్లకివ్వాల్సిన వాటాలు, ఆస్తిపాస్తులన్నీ పంచి.. నా బాధ్యతలు తీర్చుకున్నాను. ఇక నాకంటూ చివరిదాకా నిబ్బరంగా జీవించేందుకు నెలనెలా పింఛనూ, తోడుగా అనుకూలవతియైన భార్య, సౌకర్యవంతమైన జీవితం భాగ్యంగా అనుభవిస్తున్నాను.
అందుకే కాబోలు - కాలక్షేపంగా కొత్త ఆలోచనలు, కొత్త మలుపులు.. నా మనసు చుట్టూ అస్తమానం వలయాల్లా తిరుగుతుంటాయి. ఏవైనా పనులపై వీధుల్లో తిరిగేటప్పుడు, చివరికి - బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చేటప్పుడు కూడా వాటికి నా బుర్ర ‘ఊపులో ఉండే అరబిక్ గుర్రం’లా పరిగెత్తేది. ఒకసారి ఆ ‘స్పీడు’లో - నా మెడలో నా శ్రీమతి పుట్టినరోజు కానుకగా అలంకరించిన పాతికవేల బంగారు చైనుని ఎవడో దొంగ కాజేసిపోవడం కూడా నాకు తెలీలేదు.
ఇది తెలిసి మా ఆవిడ గయ్‌ఁ... న ఉరిమింది.
‘రేపట్నుంచి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఒంటి మీద ఒక్క ప్యాంటూ, షర్టు మాత్రమే ఉంచుకుని వెళ్లండి!’ అని వార్నింగిచ్చింది.
నేను జా(లీ)లిగా నవ్వి ఊరుకున్నాను!
* * *
ఆ రోజు సాయంత్రం..
వాకింగ్ కోసం నేను మా ఇంటికి నాలుగు ఫర్లాంగుల దూరంలో ఉండే దుర్గమ్మ చెరువు దగ్గరికి బయలుదేరాను. ఆ చెరువు గట్టుపై కొన్ని రావిచెట్లూ, వేపచెట్లూ వున్నాయి. కబుర్లు చెప్పుకోవడానికి వాటికింద ప్రశాంతమైన చోటు కూడా ఉంది.
చెరువుగట్టు మీదుగా నడుస్తూ.. పావు ఫర్లాంగు దూరం నుంచి చూశానతన్ని!
అతడి కళ్లల్లో ఏదో భయం, కాళ్లూ చేతులు గడగడ వణకడం.. నా దృష్టి నుంచి మరలిపోలేదు. అంతే.. నా నడకలో వేగం పెరిగింది. గబగబా అతన్ని చేరుకున్నాను.
‘అవునూ.. నువ్వూ.. మా పక్కింటి శీనువి కదూ?’ అడిగాను - తెలిసి కూడా తెలీనట్లే పరామర్శించే లోకరీతిని అనుకరిస్తూ.
అతని కళ్లల్లో దిగులు జీరలు గిర్రున తిరిగాయి - ‘కాదు, కాదు.. నేను శ్రీనుని కాదు..’
అతనూ అంతే! తనెవరో అవతలి వ్యక్తికి తెలిసిపోయిందని తెలిసి కూడా - నేనడిగిన ప్రశ్నని ఖండిస్తూ అబద్ధంతో దబాయించాలని చూశాడు.
నాకర్థం కాలేదతడి వాలకం - ‘ఏమిటిలా ఉన్నావ్? ఏమైంది?’ అనడిగాను.
అంతే.. అతనిలో ఏదో తెలీని దుఃఖావేశం పెల్లుబుకుతూ బయటికి తన్నుకొచ్చింది.
‘నేను.. నేను అసమర్థుడ్ని.. జీవితానికి పనికిరానివాణ్ని! ఇక నేను బతకలేను.. నావల్ల కాదు.. నాలో శక్తి లేదు..’ ఇక ఆపుకోలేక రెండు అరచేతుల్లో ముఖం దాచుకొని ఏడవసాగాడు.
నేను విస్తుబోయాను-
‘అందుకని ఏం చేయబోతున్నావ్? ఇక్కడికెందుకొచ్చావ్?’ అడిగాను అర్థంకాక.
‘చచ్చిపోదామనుకుంటున్నాను. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని వచ్చాను...’ అన్నాడు దృఢనిశ్చయంతో.
బిత్తరపోయాను - ‘మరి, నీ భార్యా.. పిల్లలూ?’ అనడిగాను.
‘నాకు తెలీదు... వాళ్లేమైనా అవనీ! ముందు నేనీ జీవితం నుంచి పారిపోవాలి! నాకు విముక్తి కావాలి. దేవుడిచ్చిన శాపం నుంచి తప్పించుకోవాలి...’
తనేం మాట్లాడ్తున్నాడో తనకే తెలియటం లేదని అతని రోదనా స్వరం తెలుపుతూంటే.. ఊహించని ఆ పరిణామానికి ప్రేక్షకుడిగా నిల్చున్న నాపై నాకే కోపం వచ్చింది.
‘ఇంతకీ, అంత ఖర్మెందుకు పట్టింది బాబూ నీకు? ఏమిటి నీ సమస్య?’ అన్నాను.
‘డబ్బు.. డబ్బు.. డబ్బు! అన్నిటికీ డబ్బే కారణం! అది లేకపోవడం వల్లనే.. నాకీ దుస్థితి, పేదరికం, ఆకలి, భయం, దుఃఖం! నేనే కాదు, చివరికి ననే్న నమ్ముకున్న నా భార్యాపిల్లలక్కూడా సంతోషాన్నివ్వ లేకపోతున్నాననే బాధే నన్నీ స్థితికి తెచ్చింది..’
గాద్గదికమైన గొంతులోంచి వెలువడిన అతని మాటల్లోని చివరి వాక్యంలో ధ్వనించిన ‘అర్థం’ అర్థంకాగానే నాకూ అప్రయత్నంగా కళ్లు చెమర్చాయి-
‘చదువుకున్నావా?’ అన్నాను.
‘పెద్దగా లేదండీ..’ గిల్టీగా ఫీలయ్యాడు.
‘్ఫర్లేదు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే అందుకు ఏ అర్హతలూ అవసరం లేదు. నువ్వు చేయగలవా?’ అన్నాను.
అతని కళ్లల్లో క్షణంపాటు ఓ వెలుగు మతాబులా తళుక్కుమంది.
‘చేయగలను సార్! కానీ, దానికి బోలెడు డబ్బు కావాలి కదండీ?! ఎవర్నడిగినా వడ్డీ లేనిదే ఇవ్వరు. అసలు వడ్డీకైనా నా దగ్గరేముందని, ఏం చూసి భరోసాతో ఇస్తారు? తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఓ చిన్న స్టీలు గ్లాసైనా లేదు. ‘ఏం చూసి ఇవ్వమంటావ్?’ అని నా మొహం మీదే అనేశారు. ఎక్కడా కుదర్లేదు!’ అన్నాడు.
నాకు అతని పరిస్థితి పూర్తిగా అర్థమైంది.
అతని ప్రక్కనే కూర్చుని అనునయంగా భుజం చుట్టూ చేయి వేశాను - ‘వయసులో నువ్వింకా చిన్నవాడివే! ముందు ముందు నీకెంతో భవిష్యత్తు ఉంది. పైగా, మరో ముగ్గురి జీవితాలు నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది నీపైన! అదంతా గాలికొదిలేసి నీ దారిన నువ్వు హాయిగా వెళ్లిపోతే వాళ్ల గతేమిటి? అందులోనూ ఆడపిల్లలాంటివి.. మరి, నీ కుటుంబాన్ని ఒంటరిగా వదిలేసిపోవచ్చా? పాపం కాదూ?!’ నెమ్మదిగా నచ్చజెప్తూ, మందలించసాగాను.
‘తెలుసు సార్! వారి జీవితాల్ని బాగుచేయడానికి నాకు సరైన దారేదీ కనబళ్లేదు. దొంగతనాలు, నేరాలు, హత్యలు లాంటి తప్పుడు పనులు చేయడం నాకు రాదు. రోజంతా ఎంతగా ఒళ్లరిగేలా కూలీనాలీ చేసినా వచ్చే డబ్బు చాలడంలేదు.. ఇంకేం చేయమంటారు?’
అతడిలోని బీరత్వానికి కోపం వచ్చినా.. మాటల్లోని నిజాయితీకి నాకు ముచ్చటేసింది.
‘చేయగల సత్తా ఉంటే జీవితంలో నువ్వు ఊహించనంత ఎత్తుకి ఎదిగిపోతావ్ శీనూ! నా మాట విను. నువ్వు బ్రతకాలి. బ్రతికి తీరాలి. జీవితాన్ని జయించాలి. నీ మీద నీకున్న నమ్మకాన్నీ, ఆత్మస్థైర్యాన్నీ కోల్పోవద్దు. జీవితం నుంచి పారిపోవాలనే ఆలోచననే మనసులోకి రానీయకు. నీకు నేను సహాయం చేస్తాను. చెప్పు.. నీకెంత డబ్బు కావాలి?’ అన్నాను.
నా మాటలకి మొదట షాక్ తిన్నట్లుగా ఉండిపోయి, ఆ తర్వాత నమ్మశక్యం కానట్లుగా నావైపు చూశాడు.
‘సార్! మీ డబ్బు మళ్లీ తిరిగిస్తానో లేదో కూడా నాకు తెలీదు. వద్దు సార్.. నాకేం వద్దు!’ అన్నాడు భయంగా.
చిన్నగా నవ్వి, అతని వెన్నుమీద తట్టాను. ‘ఆఁ.. ఆఁ.. మళ్లీ భయం? నేనున్నానుగా! పైసా కూడా తిరిగివ్వద్దులే.. ఎంత కావాలో, ఏం పని చేస్తావో చెప్పు?’ అన్నాను.
అతడి కళ్లలో.. మృత్యువుని ఓడించినంత గర్వం, దానిపై గెలుపు సాధించానన్న ధైర్యం తొణికిసలాడాయి.
‘అదీ.. మీరే చెపితే బాగుంటుంది సార్!’ అన్నాడు ఆనందంగా.
కష్టాలెరుగని నాకు ఆ సమయంలో అతను అనుభవిస్తున్న వేదన - ఎందుకో.. నా మనసుని ద్రవింపజేసింది. నా భోగభాగ్యాల జీవితం మీద ఒకింత గర్వం కూడా కలిగింది.
ఆర్ద్రంగా అతని చేతుల్ని నా చేతుల్తో అందుకుని గట్టిగా నొక్కి, నాకు తోచిన సలహా చెప్పాను. అతడికి నా మాటల మీద నమ్మకమూ, అవి విన్నాక తన మీద తనకు ధైర్యమూ కలిగాయ్.
‘మీరు చెప్పిన పని త్వరగా చేస్తాను సార్..’ అన్నాడు.
‘ఊఁ... ఇప్పుడు - రాముడు కాదు.. ‘శీను మంచి బాలుడు!’ ఇంక చావు గురించిన ఆలోచన నీ మనసులోంచి పూర్తిగా తొలగిపోయినట్లేనా?’ నవ్వుతూ అడిగాను.
తనూ కృతజ్ఞతగా నవ్వాడు - ‘మీ దయ సార్!’ అంటూ.
‘ఇక లేద్దామా! ఇంటికెళదాం.. పద!’
నాతోపాటే అతనూ లేచాడు. ఇంటి ముఖం పట్టి నడుస్తూండగా.. మధ్యలో అన్నాను - ‘ఎల్లుండి శనివారం! ఆ రోజు సాయంత్రం - సరిగ్గా ఏడింటికల్లా ఇందాక మనం కూర్చున్నామే.. అక్కడికి రా.. డబ్బిస్తాను!’
అప్రయత్నంగా చేతులెత్తి దణ్ణం పెట్తూ అన్నాడు ‘సరే సార్!’
‘అన్నట్టూఁ.. మన మధ్య జరిగిన ఈ సంభాషణ, వ్యవహారం మా ఆవిడకి మాత్రం తెలీకూడదు సుమా! తెలిసిందంటే.. ఇక ఇంట్లో తిండి కూడా దక్కదు నాకు!’ అన్నాను కాస్త భయంగా.
‘అలాగే సార్!’ చాలా ప్రశాంతంగా నవ్వేస్తూ అన్నాడు.
* * *
ఆ రాత్రి...
నాకు జీవితంలో ఎప్పుడూ కలగని, తృప్తితో కూడిన ఓ కొత్త రకమైన అనుభూతి మొదటిసారి కలిగింది. ఆ అనుభూతిలో మునిగితేలుతూ.. ఏ సమయానికి నిద్రలోకి జారుకున్నానో కానీ - ఆ మరుసటి రోజు ఉదయం నా శ్రీమతి నన్ను తట్టి లేపేదాకా మెలకువ రాలేదు నాకు.
లేస్తూనే.. ఎఫ్.ఎమ్ రేడియోలోంచి విన్పిస్తున్న ‘పచ్చని చిలకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే...’ అన్న పాటకి అనుగుణంగా నేను డాన్సు చేస్తుంటే.. మా ఆవిడ కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూడసాగింది.
నాలోని ఉత్సాహానికీ, ఉల్లాసానికీ కారణమేంటో.. నేనామెకి చెప్పలేదు.
* * *
ఆ రోజు శనివారం!
అనుకున్న మాట ప్రకారం.. ఆ రోజు సాయంత్రం ఏడింటికి దుర్గమ్మ చెరువు దగ్గర శీనుకి పాతిక వేల రూపాయలున్న కవర్ రహస్యంగా అందిస్తూ.. చెప్పాను-
‘నువ్వు దొంగవి శీనూ..’
‘సార్..?!’ ఊహించని ఆ మాటకి అదిరిపడ్డాడతడు.
నవ్వేశాను - ‘కంగారుపడకు.. జోక్ చేశానే్ల! ఓసారి ఎవడో దొంగవెధవ రోడ్డు మీద నా మెడలో గోల్డ్‌చైన్ లాక్కుపోయాడు. దాంతో వాడు బాగుపడ్డాడో, చెడిపోయాడో నాకు తెలీదు.. ఇదీ అంతే! ఇప్పుడు నీకిస్తున్న డబ్బు నాదే అయినా.. ఇది నీకిచ్చినట్లు ఇక నేను గుర్తుపెట్టుకోను. ఎందుకంటే.. ఈ డబ్బునీ మరో దొంగవెధవ ఎత్తుకెళ్లాడనుకుంటాను. ఎప్పుడైనా అనుమానం వచ్చి నా భార్య అడిగినా.. ఇలాగే చెప్తాను!’ అన్నాను.
శీనుకి కళ్ల నుండి జలజలా నీళ్లు రాలాయి.
అమాంతం నా చేతుల్ని లాక్కుని ముద్దుపెట్టుకున్నాడు.
అతికష్టమీద నా చేతుల్ని వెనక్కి తీసుకున్నాను - ‘ఈ ఎమోషనూ, ఫీలింగూ.. ఇప్పుడు కాదు - నువ్వు బాగుపడినప్పుడు చూపించు!’ అన్నాను.
కళ్లు తుడుచుకున్నాడు.
‘ఇంతకీ... నేను చెప్పిన వ్యాపారం ఎక్కడ పెట్టాలనుకుంటున్నావ్?’ అనడిగాను.
‘ఇంకా అనుకోలేదు సార్! మా ఆవిడా, నేనూ ఇంకా ‘ఎక్కడైతే బాగుంటుందా..’ అని ఆలోచిస్తున్నాం. ఓ నిర్ణయానికి వచ్చాక చెపుతాను సార్..’ అన్నాడు.
‘సరే.. ఇక వెళ్దాం! నీకు నా శుభాకాంక్షలు!’ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను.
* * *
ఇది జరిగిన కొన్నాళ్లకి..
నేను సతీసమేతంగా అమెరికాలో ఉన్న మా రెండో కొడుకు దగ్గరికి వెళ్లాను.
అక్కణ్ణుంచి వచ్చాక పక్కింటి ‘శీను’ గురించి ఆరా తీస్తే.. అతను ఊరి ఛాయల్లోనే లేడని తెలిసింది.
ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లిపోయాడో తెలీలేదు.
* * *
‘ఏమండీ.. ఒకసారి అర్జంట్‌గా బయటకి రండి!’
బాత్‌రూమ్‌లో ఉన్న నేను - నా శ్రీమతి అరుపులు విని గతుక్కుమన్నాను.
ఆ తర్వాత కాస్తయినా గ్యాప్ ఇవ్వకుండా మళ్లీ పిలిచేసరికి - ‘అబ్బఁ.. ఉండవే! కొంపలు మునిగిపోయినట్లు అంతలా అరుస్తావేమిటీ..?’ అన్నాను విసుగ్గా.
‘అబ్బఁ ... మీరు మారుమాట్లాడకుండా వెంటనే వచ్చేయండి! టీవీ న్యూస్‌లో మీ పేరు వినబడ్తోంది.. ఎవరో శ్రీనివాసరావట.. మీ గురించి చెప్తున్నాడు!’
అది వినగానే నా మెదడు బెలూన్‌లా విచ్చుకుని గాల్లోకి లేచినట్లయ్యింది.
గబగబా హాల్లోకి వచ్చాను..
టీవీ ముందు నిలబడి నిశితంగా చూడసాగాను.
యాంకర్ అతని నోటి ముందర మైకు పెడ్తూ ఏదో అడుగుతోంది-
అతడు గర్వంగా, కృతజ్ఞతగా చెప్తున్నాడు.
‘... విధి ఆడే ఆటలో, పరిస్థితులు చేసే దాడిలో ఒంటరై, ధైర్యాన్ని కోల్పోయి, ఓటమి ముందు తలవంచే మనిషికి ధైర్యాన్నిచ్చే ఒక్క ‘మాట’ చేయూత నిచ్చే ఒక్క ‘ఆసరా’ దొరికితే చాలు - ఆ వ్యక్తి ఓటమి అంచు నుంచి తిరిగి విజయం వైపు ఎలా పయనిస్తాడో, జీవితంలో గెలుపుని ఎలా సాధిస్తాడో.. నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.
నేను కూడా ఒకనాడు పరిస్థితులకి తలవంచి, విధి చేతిలో పూర్తిగా ఓడిపోయి ఆత్మహత్య చేసుకోబోయే బలహీన క్షణంలో... ఓ మహానుభావుడు తన ‘మాట’ సాయంతో నాకు ధైర్యాన్నీ, ఆర్థిక సాయంతో ‘ఆసరా’ ఇచ్చి నాలో పోరాట స్ఫూర్తిని పెంచాడు. ఆయన చేసిన సాయంతో మొదట్లో తోపుడుబండి మీద మొదలుపెట్టిన నా టిఫిన్ సెంటర్ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ‘స్టార్ హోటల్’ స్థాయికి చేరుకుంది. ఆర్ అండ్ బీలో ఇంజనీరుగా రిటైరైన రమాకాంతరావు అనే ఆ మహానుభావుడు నాకు దేవుడితో సమానం.
ఆరిపోయే దీపానికి అరచేతుల్ని అడ్డుపెట్టి కాపాడి, కాస్త చేయూతనిస్తే.. అది నిలదొక్కుకోవడమే కాక, తన చుట్టూ ఉండే ప్రాంతానికి కొంతైనా వెలుగు నివ్వగలదని ఆ మహానుభావుడు తనలోని ‘మనిషితనం’ ప్రదర్శించి నాకు జీవిత పాఠం నేర్పాడు. ఆయన చేసిన సహాయం, అందించిన స్ఫూర్తితోనే నేను జీవితంలో నిలదొక్కుకోవడమే కాక, పరిస్థితులతో పోరాడి ఓటమి అంచుకి చేరుకున్న యువతకి కాస్త ఆసరా ఇచ్చి, వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలదొక్కుకునే విధంగా నాకు సాధ్యమైనంత వరకు నేనీరోజు తోడ్పడగలుగుతున్నాను...’
నేను నివ్వెరపోయి చూడసాగాను.
‘నా జీవితాన్ని వెలిగించిన ఆ మహావ్యక్తి రమాకాంతరావు గారికి చేతులెత్తి నమస్కరిస్తూ.. టీవీ ద్వారా ఆయనకి ఇలా కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను...’
టీవీలో అతను ఇంకా ఏదేదో చెప్తున్నాడు కానీ.. ఏదో తెలియని భావంతో ఆనందంలో, సంతోషంలో మునిగిన నా మనసుకీ, తృప్తి నిండిపోయిన గుండెతో ఉప్పొంగిన నాలోని అణువణువూ నాకు సహకరించక పోవడం వల్ల - నాకూ ఇంకేమీ విన్పించలేదు.
అయితే.. అకస్మాత్తుగా నాకేదో గుర్తొచ్చి - నా ప్రమేయం లేకుండానే అసంకల్పితంగా తల తిప్పి నా భార్య వంక చూశాను.
అప్పటికే - ఆమె నా వైపు చూస్తూ వుంది.
కానీ, నేనూహించిన భావం ఆమె ముఖంలో కన్పించడంలేదు.
పైగా, చెమర్చిన ఆమె కళ్లలో.. నా పట్ల మెచ్చుకోలు, తన భర్తలోని ‘మనిషితనం’ వల్ల కలిగిన గర్వమూ చాలా స్పష్టంగా అగుపడుతున్నాయి నాకు.

-ఎస్వీ కృష్ణజయంతి 90009 29663