S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (అరణ్యకాండ-9)

శ్రీమద్రామాయణం
గొప్ప ధర్మశాస్త్రం
*
వాసుదాసు వ్యాఖ్యానం
అరణ్యకాండ-9
*
శ్రీమద్రామాయణం గొప్ప ధర్మశాస్త్రం. ఇందులో సర్వవిధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజధర్మం, ప్రజాధర్మం, పతిధర్మం, సతీ ధర్మం, భాతృధర్మం, పుత్రధర్మం, భృత్యుధర్మం, మిత్రధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి ఉంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయంమీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాద ధర్మం కూడా చెప్పబడింది. వీటితోపాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి.
సత్ ప్రభు లక్షణం తెలుసుకోవాలంటే, రామ- దశరథుల రాజ్యపాలనా విధానంలో దొరుకుతుంది. ఆర్య ప్రభువులు ఏ పని చేసినా ప్రజల అనుమతి లేకుండా చేయలేదు. తాము ప్రభుత్వం నడిపేది ప్రజలకొరకేనని, వారిని సుఖ పెట్టడానికేనని వారు భావించేవారు. ప్రత్యక్షంగానైనా - పరోక్షంగానైనా ప్రజలకు హాని కలిగించే పనేదీ చేయరు. శ్రీరాముడి పట్ట్భాషేకం గురించి దశరథుడు చేసిన (అయోధ్యకాండ) ఉపన్యాసం ఇందుకో ఉదాహరణ. ప్రజల దగ్గర పన్నులు తీసుకుంటూ, వారి కష్టాలు తొలగించకపోతే నరకంలోకి పోతామని వారి నమ్మకం (అరణ్యకాండ).
ప్రభువైనవాడు ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, వేగులవారి ద్వారా, ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలి. ప్రజలు ఇష్టపడని గుణాలు తనలో ఉంటే, ఎంత నష్టమైనా, కష్టమైనా అవి మానుకోవాలి. ఆ విషయంలో రాజు అంతఃకరణం చెప్పింది ముఖ్యం కాదు. ఇతరులను సంతోషపెట్టడానికి తనెందుకు దుఃఖపడాలని అనకూడదు. ఈ విషయంలో రాముడే ప్రమాణం.
శ్రీరాముడు పట్ట్భాషేకం జరిగిన తర్వాత ఒకనాడు వేగులవాడైన భద్రుడిని నగరంలో- పల్లెల్లో వార్తలేంటని, తమను గురించి ప్రజలేమనుకుంటున్నారని అడిగాడు. జవాబుగా వాడు, తనను లోకులందరూ ప్రశంసిస్తున్నారని చెప్తే, అంతటితో తృప్తి పడలేదాయన. ఉన్నదున్నట్లు- విన్నది విన్నట్లు అసలు విషయాలన్నీ చెప్పమంటాడు రాముడు. భద్రుడప్పుడు లోకుల పొగడ్తల మాటలు ముందు చెప్పి తర్వాత, ‘‘తామసుడగు రాక్షసు గృహసీమను జిరకాలమట్లు చెరబడిన్ సతిన్, రాముడు రోయక కూడెడి, గాముకులగు వారి కెందు గన్నులు గలవే’’ అని ప్రజలు వారికి తోచినట్లనుకుంటున్నారని అంటాడు. అతడు చెప్పిన మాట సత్యమని ఇతరులతో దృఢపర్చుకొని, భరతాదులను పిలిపించి, లక్ష్మణుడితో లంకలో జరిగిన సంగతంతా చెప్పి, ‘‘...అపవాదము దుస్సహమై, తపియింపగ జేసె నన్ను.. విడిచెద మిమ్మెల్లర, నే విడిచెద నా ప్రాణమేని, విమల యశము కై..’’ అంటూ, సీతను వాల్మీకాశ్రమానికి పంపాడు రాముడు. ఒకడిపైన ఇంతకంటే అసత్యమైన అపవాదం పడుతుందా? అలాంటి అపవాదాన్ని పోగొట్టుకోవడానికి ఇంతకంటే స్వార్థ పరిత్యగం చేసిన వాడుంటాడా? కాబట్టి, ప్రతి మనిషి, తనను చూసి ఇతరులు తప్పు తోవలో ప్రవర్తించకుండేట్లు, లోకోపకారమైన మార్గానే్న అనుసరించాలి.
సత్ ప్రభువు ప్రజల సుఖ దుఃఖాలను అనుదినం విచారించాలి. సీతా వియోగానంతరం, లక్ష్మణుడు తిరిగొచ్చేంతవరకు, నాలుగు రోజులు, కొలువు దీర్చలేదు రాముడు. దానికి ‘మర్మనికృంతనమైన బాధ’ పడుతూ లక్ష్మణుడితో వెంటనే కొలువు తీర్చమని చెప్పి పరితపించాడు.
అలాంటి అనురాగం గల ప్రభువు విషయంలో, ప్రజలు కూడా అలానే వుండేవారు. అతడితో అడవులకు పోవడానికి, ప్రాణాలైనా పరిత్యజించడానికి అంగీకరించారు. ప్రభువు తానెంత గొప్పవాడైనా, తక్కువ వారితో కూడా కలిసి మెలిసి వుండాలి. దీనే్న సౌశీల్యం అంటారు. గుహుడికి రాముడిని చూడగానే తటాలున కౌగిలించుకోవడానికి వాళ్లిద్దరి మధ్య ఎంత స్నేహం వుండాలో కదా? అలానే రాజు ఎంత తెలిసినవాడైనా, మంత్రుల ఆలోచనలను సలహాలను తిరస్కరించకూడదు. వారు చెప్పింది విని, వారితో తను చేయదల్చుకుంది, సరైందని నమ్మే విధంగా సమాధానం ఇవ్వాలి. విభీషణుడు శరణు చొచ్చినపుడు జరిగిన సంగతి ఇందుకొక ఉదాహరణ. ఇంతెందుకు? రాముడి గుణగణాలను చక్కగా అర్థం చేసుకుంటే, రాజుకుండవలసిన సద్గుణాలే కాకుండా, సాధారణంగా ప్రతి పురుషుడికి వుండాల్సిన, సత్యం - దయ-ఇంద్రియ విగ్రహం- పితృభక్తి- ఏకపత్నీ నియమం- సౌభ్రాత్రం- దైవ భక్తి- దేవతారాధనం- నిత్య కర్మానుష్ఠానం విపులంగా ఆయనలో వున్నాయని తెలుసుకోవచ్చు.
ఇక ఉత్తమ స్ర్తిల లక్షణాలన్నీ కలిగున్నవారిగా సీత, కౌసల్య, సుమిత్రల గుణాలను బట్టి, నీచ స్ర్తిల లక్షణాలున్నవారిగా కైకేయి, శూర్పణఖల గుణాలను బట్టి తెలుసుకోవచ్చు. రావణాసురుడు చెడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తాయి రామాయణంలో. ఇంద్రియాలను జయించలేకపోవడం, అసత్యాలు పలకడం, వేగులవారు లేకపోవడం- వున్న వారికి సరైన జీతాలు ఇవ్వకపోవడం, తన పరిసరాల్లో జరుగుతున్న వృత్తాంతాలను తెలుసుకోలేకపోవడం, విన్న ప్రతి విషయాన్నీ నమ్మడం- నిజా నిజాలు మంత్రులపైన పడవేడం, తన మేలుకోరి చెప్పగలవారికి జ్ఞాన హీనతతో చెప్పేవారికి మధ్య తేడా తెలుసుకోలేకపోవడం, ఎవరినీ నమ్మకపోవడం, మూర్ఖత్వం లాంటి పలు దుర్గుణాలు వున్న రావణుడు సమూలంగా నాశనమయ్యాడు. పైన పేర్కొన్న విషయాలన్నీ, శూర్పణఖ, మారీచుడు చెప్పిన మాటల్లో బయటపడుతుంది. రాముడితో యుద్ధమెందుకు చేయవలసి వచ్చిందో- యుద్ధ కారణమేంటో తన భటులకే తెలియనీయక వంచన చేసి, వారి ప్రాణాలు తీసిన (రావణాసురుడి లాంటి) ప్రభువు ఎలాంటివాడో రామాయణం చదువుతే అర్థమవుతుంది.
ఇలాగే రామలక్ష్మణ భరత శత్రుఘు్నల చర్యలవలన భాతృ ధర్మం, సుగ్రీవుడి చర్యలవలన మిత్ర ధర్మం, హనుమంతుడి చర్యలవలన భృత్యు ధర్మం తెలియచేయబడ్డాయి రామాయణంలో. అరణ్యవాసానికి పోయేటపుడు శ్రీరాముడు తల్లి కౌసల్యతో (అయోధ్యకాండ) అన్న మాటల్లో సతీ ధర్మం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆ విషయం ‘‘... వారిజనేత్రకు భర్తృసేన సద్గతి సమకూర్చు దల్లి... భర్తృహిత కారిణివై చరియింపు మంగనా..’’ అన్న ఆంధ్ర వాల్మీకి పద్యాల్లో స్పష్టంగా తెలుస్తుంది. అలానే అనసూయ సీతకు హితోపదేశం చేసిన ఘట్టం చదివితే సతీ ధర్మం గురించి తెలుసుకోవచ్చు.
పితృభక్తిని తెలుసుకోవాలంటే, అయోధ్యకాండలోని ‘‘.. పుత్ర లబ్దికై పనిగొని తల్లి తండ్రి పడు పాటులకుం బ్రతి సేయ నౌనె? యింపున దల జూచి నీళ్లు కడుపుంగని యన్నము పోసిపెట్టి యెండను జడిగాలి బ్రోతురు దినంబును వారల తుల్యులే యొరుల్’ అన్న రాముడి వాక్యాలను చదవాలి.
మిత్ర ధర్మాన్ని గురించి ‘‘సులభము మిత్రుల జేర్చుట, కలసిన మరి మైత్రి చెడక కాపాడుటయే బలితపు గష్టము మది చంచలమగుటను బ్రీతిచెడును స్వల్పంబునకేన్’’ అన్న సుగ్రీవుడి మాటల్లో తెలయచేయబడింది. న్యాయవాది ధర్మాన్ని హనుమంతుడి వాక్యాలలోను, కన్యాజనకత్వాన్ని ‘‘జననీ వంశమువారని, జనకు కులమువారి స్వపతి సంతతి వారిన్ దనయా! కన్యక సంశయ, మున ద్రోయు సదా యకీర్తి ముంచునొ యనుచున్’’ అన్న ఉత్తరకాండ పద్యాలలోను తెలుసుకోవచ్చు. సుందరకాండలోని ‘కోపి తునుము గురువులనేన్, గోపి కడుం గరకులాడు గుణవంతులనన్, గోపి యొనర్పగజాలని, పాపం బేదైన గలదే భావింపగన్’’ అన్న పద్యంలో కోపి లక్షణం ఏంటో తెలుసుకోవచ్చు.
రామాయణంలో సకల ధర్మాలున్నాయి. ఇందులో వున్న ధర్మాలే మిగిలిన అన్ని గ్రంథాలలోనూ కనబడతాయి. ఇందులో లేని ధర్మాలు మరింకేదాంట్లోను కనిపించవు. రామాయణంలో సూత్రప్రాయంగా చెప్పిన ఎన్నో విషయాలను వ్యాసమహర్షి తన గ్రంథాలలో పేర్కొన్నాడు. ఉదాహరణకు ‘నాళీక జంఘుని’ కథ. ఇలానే రామాయణంలో సూక్ష్మంగా చెప్పబడిన ధర్మాలను, కథలు కథలుగా కల్పించి వ్యాస భగవానుడు ఇంతకు నాలుగింతలు గ్రంథాన్ని తయారుచేశాడు. భగవద్గీతంతా కూడా రామాయణ సారమేనని గ్రహించాలి.
-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా.. 7036558799 - 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12