S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెళ్లికి పల్లెకు పోదాం

అన్నయ్య పాలమూరులో ఉంటాడు. అమ్మ, నాన్న పల్లెలో ఉంటారు. అన్నయ్య నేను పల్లెలో ఉన్నాను అనుకుంటాడు. అమ్మ, నాన్న నేను అన్నయ్య దగ్గర ఉన్నాను అనుకుంటారు. నేను మాత్రం ఆ రెండు చోట్లా కాకుండా మరెక్కడో ఉంటాను. చిన్నప్పటి నుండి అరాచకం అన్నది నా పద్ధతి. చదువు విషయంలో తప్ప మిగతా అన్నింట్లోనూ అరాచకమే. అందుకే ఎటూ కాకుండా ఇట్లా మిగిలినట్టున్నాను. నా వల్ల మంచి పనులు జరగలేదా అన్న ప్రశ్నకు జవాబులు నేను చెప్పకూడదు.
ఒకసారి ఇలాగే వెంకటన్న వాళ్ల ఊరికి బయలుదేరుతున్నాడు. ఆయనను సాగనంపడానికి నేను బస్టాండుకు బయలుదేరాను. బస్సును చూచిన తరువాత నాకూ ఎక్కాలి అనిపించింది. ఆ కాలంలో అణా పైసలు కూడా జేబులో ఉండేవి కావు. కానీ ఇద్దరికీ సరిపడా టికెట్ డబ్బులు ఉన్నట్టు అర్థమయింది. ఇంకేముంది, నేను కూడా బలుమూరు బయలుదేరాను. ఇక రెండు ఇళ్లల్లో వాళ్లు నేను వెంకటన్నతో వెళ్లి ఉంటానని తెలుసుకోవడానికి చాలాకాలమే పట్టింది. నాకు ఎవరి మీదనో కోపం వచ్చి ఇంట్లో నుంచి పారిపోయాను అని కూడా అనుకున్నారట. నిజంగా ఆ పని జరిగి ఉంటే ఎంత బాగుండునో! హాయిగా స్వతంత్రంగా, ఏ బాధ్యత లేకుండా, చివరకు లోకాభిరామం రాయవలసిన బాధ్యత కూడా లేకుండా ఎక్కడో తిరుగుతూ ఉండేవాడిని. ఇవాళటికి కూడా అలా వెళ్లిపోవాలని ఎంత కోరికగా ఉందో చెప్పి, ఈ కాలమ్‌లోనే చెప్పి చివాట్లు తిన్నాను కూడా.
మొత్తానికి ఆ సందర్భంగానో, మరో సందర్భంగానో బలమూరు వెళ్లాను. అక్కడ పక్క ఇంట్లో వెంకటన్న వాళ్ల మేనమామగారు ఉంటారు. ఆయన మహా స్నేహశీలి. కుర్రవాళ్లను పోగేసుకుని కులాసాగా గడపాలని కోరుకునే మనిషి. వారం రోజుల్లో వాళ్ల అమ్మాయి పెళ్లి ఉంది. కనుక మామయ్య నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. వెళ్లడానికి వీలులేదు గాక లేదు పొమ్మన్నాడు. మొదలే అదుపు, ఆజ్ఞ పట్టించుకోని మనిషిని, ఇక ఆహ్వానం కూడా దొరికితే ఉండిపోక పోతానా? కనుక ఆ ఊరిలో వారంపైనే గడిపినట్టు జ్ఞాపకం.
మామ వాళ్లకు వేరుశెనగ కాయలు పండినట్టున్నాయి. వేరుశెనగలను మంటలో పోసి కాల్చుకు తినడం అసలయిన పల్లెటూరి పద్ధతి. కంప అనే ముండ్ల చెట్లను సేకరిస్తారు. అవి ఆరిపోయి ఉంటాయి. వాటన్నిటినీ ఒకచోట కుప్పగా తగులబెడతారు. ఆకాశం ఎత్తు మంటలు రేగుతాయి. కింద భారీఎత్తున నిప్పుల కుప్ప మొదలవుతుంది. అప్పుడు పల్లీలు అనే గ్రౌండ్‌నట్స్ అనే వేరుశెనగలను తెచ్చి వాటిలో గుమ్మరిస్తారు. కర్రలు పెట్టి బాగా కలియబెడతారు. ఈ లోపల నిప్పులు సగం ఆరిపోతాయి. ఇక చుట్టూ కూర్చుని ఎవరెవరి చాకచక్యం కొద్దీ వారు నేలశెనగబుడ్డలను వెలికి తీసుకుని తినడం మొదలవుతుంది. పల్లీలను మూంగ్‌పల్లీ అనాలి. లేదంటే చిక్కుడుకాయలు కూడా ఫల్లీలే. చిన్నప్పటి నుంచి వాటిని మేము న్యాలశెన్గబుడ్డలు అనే అన్నాము. పట్నం వచ్చిన తరువాత ఫల్లీలు అనే పేరు తెలిసింది. మామయ్య ఒక సాయంత్రం ఇంటి ఆవరణలోనే ఈ పల్లీల వంట ఏర్పాటు చేశాడు. సాధారణంగా పొలంలో చేను పక్కన చెత్త చేర్చి నిజంగా పచ్చ్ఫిల్లీలను కాల్చుకు తినడం పద్ధతి. అప్పుడు ఇంట్లోనే ఆ సంబరం తీరింది. మామయ్య మనస్తత్వం గురించి చెప్పడానికి ఈ ఒక్క ముక్క చాలు.
మామయ్య దక్షిణాదికి వెళ్లి సంగీతమూ, హరికథా గానమూ నేర్చుకుని వచ్చాడు. కానీ తెలంగాణంలో ఇటువంటి కళలకు గౌరవమూ, గుర్తింపు లేవుగాక లేవు. ఆయన సాయంత్రం అయిన తరువాత ఏవో చిరుతిండ్లు ఏర్పాటు చేసి, ఆ సరదా కూడా ముగిసిన తరువాత తన ప్రదర్శన ప్రారంభించేవాడు. తమిళనాడులో నేర్చుకున్నాడు కనుక ‘ఘరఘర ఘరఘర మఘాదేవ శంభో’ అంటూ ఆయన పాడిన పాట నాకు ఇవాళటికీ గుర్తుకు వస్తుంది. ఆయన కూతురు జయలక్ష్మికి పెళ్లి. ఆయమ్మ పాపం ప్రస్తుతం లేదు. కానీ తండ్రికి తగిన తనయ. బలమయిన గొంతు విప్పి పద్యం పాడిందంటే కళ్లముందు పద్య నాటకం ప్రత్యక్షం అయ్యేది. పెళ్లి పేరున మైకు, స్పీకర్‌లు కూడా వచ్చాయి. ఇక ప్రతినిత్యం ఊళ్లో వాళ్లకు ఉచిత వినోద కార్యక్రమం జరిగేది. ‘పోరికై క్షమాపాలుడు యవ్వారినాసించెనో, వారే వత్తురు’ అంటూ జయలక్ష్మి పాడిన అశ్వత్థామ పద్యం ఒక్కసారి నా తలలో గింగురుమన్నది. కళ్లలో తడి కూడా వచ్చింది. నాకంటే చిన్నది. చల్లని తల్లి. కానీ పాపం వెళ్లిపోయింది. ఆ అమ్మాయి పెళ్లి నాకు ఒక చక్కని జ్ఞాపకంగా మిగిలింది.
పక్క ఊరిలోనే వరుని ఇల్లు. వాళ్లు దూరం వాళ్లు కాదు. దగ్గరి బంధువులే. ఇక పెళ్లి కోసం కావలసినంత మంది పోగయ్యారు. అంతా కలిసి కుర్రవాళ్లయ్యారు. ఇక సరదాలే సరదాలు. పెద్దలంతా కలిసి జానపద ధోరణిలో చేసిన డేగ నృత్యం నాకు ఇవాళటికీ గుర్తుంది. పల్లెవారు ఒక పెద్దమనిషిని నడువుకు ఎత్తుకుంటారు. ఆ మనిషి తన రెండు కాళ్లను ఎత్తుకున్న మనిషి ఎద చుట్టూ బిగిస్తాడు. ఎత్తుకున్న మనిషి ఆ పెద్ద మనిషి నడుమును పట్టుకుంటాడు. ఆ పెద్ద మనిషి తన రెండు చేతులను పైకి ఎత్తుతాడు. డేగ రెక్కలలాగ ఆడిస్తాడు. ఒక లయ కొద్దీ నాట్యం సాగుతుంది. సోమయాజుల ఇంట్లో సాంప్రదాయపరులైన మా పెద్దలంతా కలిసి ఇంత సరదాగా కాలక్షేపం చేశారంటే నాకే నమ్మకం కలగదు.
భోజనాల దగ్గరికి వస్తే ఇక సరదాలు, సరసాలు భారీఎత్తున మొదలయ్యేవి. మగపిల్ల వాళ్లందరూ నిప్పులు, ఆడపిల్లలు వెన్నముద్దలు, వేడికి కరిగిపోతారు. అది నెయ్యి అవుతుంది అంటూ పాట పాడినట్టు నాకు ఎందుకో గుర్తుంది. లేక కేవలం అది మాటేనేమో? పెళ్లి అంటే ఎప్పటిలాగ గంటలలో ముగిసే తతంగం కాదు. పందిరి వేయడంతో మొదలుపెడితే పదహారవ నాటి దాకా ప్రతినిత్యం ఏదో ఒక సంబరం జరుగుతుంది. విందులు జరుగుతాయి. వచ్చిన వారు అందరూ ఉండిపోతారు. ఆ పెండ్లిలో చేసిన సైజులో లడ్డూలు ప్రస్తుతం తిరుపతి వెంకన్న పెళ్లికి మాత్రమే చేస్తారని నా నమ్మకం. తుంపకుండా ఒక లడ్డు వేయించుకుని తిన్నవాడికి ఏదో ఇస్తామని హుషారు చేసేవారు. కొంతమంది తినేవారు కూడా. అంతలేసి తిండి ఆ కాలంలో గనుక వీలయింది.
బండ్లు కట్టి వరుని ఇంటికి మనుగడుపులకు వెళ్లాలి. ఆడంగులు, పిల్లలు బండ్లలో ఎక్కుతారు. లడ్డూలు తిన్న మాలాంటి వాళ్లంతా అంత దూరమూ నడకే. హాయిగా బావుల్లో పడి ఈదితే తిన్నది అరుగుతుంది. మళ్లీ తినడానికి ఆకలి అవుతుంది. చేరిన గుంపులో ఒక అన్నయ్య, ఒక బాబాయి ఉండేవారు. వాళ్ల వంటి హాస్యప్రియులు సినిమా వాళ్లకు దొరికితే ఏమయ్యేదోనని నాకు ఇవాళ అనుమానం వస్తుంది. ప్రతి మాటకూ పారడీలు, ప్రతి సందర్భానికి పాటలు, ప్రతి విషయానికీ జోకులు. నిత్యకల్యాణం పచ్చతోరణం అంటారు. అది ఒకవేపు సాగుతుండగా నిత్యం నవ్వులూ, నిండుగా సరదాలు ఆ పెళ్లిని నా జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిపివేశాయి.
బ్రాహ్మణులు భోజనప్రియులు అన్న మాట ఉండనే ఉంది. అందరూ తింటారు. మాలాంటి వాళ్లు మాత్రం తిన్నాము అని గట్టిగా చెప్పుకుంటాము. బాగా తింటారు కనుక చూడవద్దు అంటారు అని పాలేరు ఒకతను అనుకున్నాడట. ఎంత తింటారో చూద్దామని ఇంటి అమ్మగారు భోంచేస్తూ ఉంటే తొంగి చూచాడట. ఆ యమ్మ పప్పు వడ్డించి ఏదో ఆలోచిస్తూ గరిటె ఆకులో పెట్టి ఏ పచ్చడి కోసమో పక్కకు వెళ్లింది. అది పాలేరు మహాశయుని కంట పడ్డది. ‘అమ్మో, బాపన్లు గంటెలు, గినె్నలు కూడ తింటరు, కనుకనే చూడొద్దు అంటరు’ అనుకున్నాడట. అది పక్కన పెడితే అన్నయ్య అని చెప్పిన మంత్రశాస్తవ్రేత్త రామాచార్యులు గారు ఒకానొకనాడు సాపాట్లు అనే భోజనాలు ముగిసిన తరువాత వేసిన ఒక చిన్న డైలాగు మా వాళ్లకంతా రెఫరెన్స్ పాయింట్‌గా మిగిలిపోయింది. అందరూ భోజనాలు ముగించుకుని వచ్చి చేతులు, కాళ్లు కడుక్కుంటున్నరు. ఎవరి మానాన వాళ్లు లేవకూడదు అన్నది సాంప్రదాయం మరి. బాగా తిన్న బాపనయ్యలందరూ చేతులు కడుక్కుంటూ ఉంటే ఆ అన్నయ్య మూలన ఉన్న ఒక రాతి రోలు మీద ఎక్కి నిలబడి ‘బాపనోండ్లు పంచెలు వదులు చేసి బాగ తినిరి’ అన్నాడు. ఆయన మాటలే విచిత్రంగా ఉంటాయి. ఈ డైలాగు అంతకంటే విచిత్రంగా ఉంది. అప్పటికే భుక్తాయాసంతో ఉన్న వాళ్లందరూ పడీపడీ నవ్వలేక మరింత కష్టపడ్డారు. మొత్తానికి పెళ్లి ఎంత సరదాగా జరగాలో అంత సరదాగానూ జరిగింది.
ఆ పెళ్లిని గురించి తలుచుకుంటే పెళ్లికొడుకు ఊళ్లోని మంచినీళ్ల బావి బలంగా గుర్తుకు వస్తుంది. అటువంటి బావులను గురించి పత్రికలలో చదువుతున్నాను. ఆ బావికి ఒకవైపు గోడ నిటారుగా ఉంటుంది. రెండు వైపుల గోడలలో నడవడానికి, కూచోవడానికి వీలుగా ఒక నడవ ఉంటుంది. నడవలో బావివేపు కమానులు, స్తంభాలు ఉంటాయి. మిగిలిన వేపు బావి లోపలికి దిగడానికి నడవలోకి వెళ్లడానికి మెట్లు ఉంటాయి. వేసవి కాలమయినా నడవలో చేరి కూచుంటే బావిలో నీటి కారణంగా ఎయిర్‌కూలింగ్ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది. ఆ ఊరికి మళ్లీ వెళ్లే అవకాశం రాలేదు. ఆ ఊరివాళ్ల పెళ్లి మళ్లీ ఇప్పుడు ఒకటి వచ్చింది. కనుకనే జయలక్ష్మి పెళ్లి గుర్తుకు వచ్చింది. పెళ్లికి వెళతాను గానీ, ఆ ఊరికి వెళతానా?

-కె.బి.గోపాలం