S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జపానుకు...

అయిదారు వారాల కింద, జపాన్ గురించి కూడా చెప్పాలని నాకు నేనే మాట యిచ్చుకున్నాను. కలం చేతబట్టుకుని కూచుంటే ఏం రాయాలి? అని ప్రశ్న. వంద సంగతులు ముసురుకుంటాయి. అనుకున్న సంగతి మరుగున పడుతుంది. కనుక ఉన్న జపాన్ పుస్తకాలన్నీ కనిపించేట్టు పెట్టుకున్నాను. ఉన్నమాట చెప్పాలి. అన్నీ ఇంగ్లీషు ద్వారా చదవవలసిందే. కొనిచినా, సయొనారా తప్ప మరొక ముక్క తెలియదు. అసలు జపనీస్ నుంచి అనువాదాలు రావడమే చాలా నెమ్మదిగా మొదలయింది. మురసోకి షికెబు రాసిన మొదటి నవల మొన్న మొన్న ప్రపంచానికి అందింది. ఈ జపాన్, తైవాన్, చైనాల సంగతే అంత.
సినిమాలు వెతికి వెతికి చూచే కాలంలో సెవెన్ సమురాయ్ దొరికింది. ఊరివారు రక్షణ కోసం కిరాయి గూండాలను తేవడం అనే కథ ఇక్కడ నుంచే షోలేకు దక్కింది అన్నారు. ఆ తరువాత షోలేతో ఆ సినిమాకు ఏ రకంగానూ పోలిక లేదు. అకీర కురొసావా అనే జపనీస్ దర్శకుడు అందరికీ సులభంగా దొరికాడు. ఫిల్మ్ క్లబ్‌లో అందరూ అతని గురించే మాట్లాడేవారు. ఆ ఊపులో 80 దశకంలోనే సికింద్రాబాద్ టివోలీలో ‘కగెముష’ అనే సినిమా చూశాను. తెర ముందు ఉన్నవారు సీటీలు అను ఈలలు వేశారేమో గుర్తులేదు. నాకు మాత్రం సినిమా, ముక్క తలకు ఎక్కలేదు. అకూటగవా ర్యునెన్సోకు అనే రచయిత పేరు ఒకటి దొరికింది. అందరి ముందు ఆ పేరు ఒకసారి అంటే చాలు, మనం అప్పర్ సర్కిల్‌లోకి ఎక్కి కూచుంటాము. ఇది ఇలా ఉండగా శశికపూర్ కూతురు సంజనా బృందం వారు లలితకళా తోరణంలో ‘రషోమన్’ నాటకంగా ఆడారు. ఎమ్.ఎస్.సత్యు రంగాలంకరణ చేశాడు. ఒకే రంగస్థలం మీద రెండు దృశ్యాలు చూపించినట్లు గుర్తు. అది కూడా అకూటగవా రచనే.
ఈ జపాన్ పేర్లను పలికే తీరు తలకు ఎక్కదు. ముందు ఒక సంగతి అర్థమయింది. నా పేరు కారంచేడు గోపాలం. కానీ ఈ మధ్యన గోపాలం కారంచేడు అని రాయడం అలవాటయిందు. జపాన్ వారి సంగతి కూడ అంతేనట. ‘హారుకి మురకామి’ అని ఇంగ్లీషులో చదివిన పేరున వాళ్ల దేశంలో నయితే మురకామి హారుకి అంటారట. మా బాబు జపనీస్ చదువుకున్నాడు. ట, త పలకడం, అనవసర దీర్ఘాలు సవరించి, ఆ భాష మన తెలుగులాగ వినబడుతుంది, అంటాడు.
ఇంత దూరం రాత సాగినా నేనింకా విషయంలోకి పోనే లేదు. ఇవాళ చెప్పదలుచుకున్నది పుస్తకాల గురించి మాత్రమే. మురకామి పేరు తప్ప ఇప్పటివరకు అంత సినిమాల గురించే చెప్పినట్లున్న. పరిచయం అటువంటిది మరి. హారుకి మురకామి రచనలు నాకు అంతగా నచ్చలేదు. అయితే అతని తీరు, బతుకు, ఇతర రచనలు బాగుంటయి. కారణాల గురించి వెతికేది దండుగ గాని జపనీస్ సాహిత్యం మీద చూపు పడింది. కనీసం 50 లేదా 60 పుస్తకాలు పోగయినవి. పాతవి, నడిపాతవి మొదలు, సమకాలం రచనలు కూడా ఉన్నాయి. నాలుగయిదు పుస్తకాలు పూర్తిగ చదివిన. కొన్ని బల్ల మీద నా కొరకు ఎదురుచూస్తున్నయి.
ఒక ఆశ్చర్యకరమయిన సంగతి చెప్పి ముందుకు సాగాలని గట్టిగా అనిపిస్తున్నది. జపనీస్ భాషలోని సౌందర్యం, తేడాలు మనకు అందవు. అన్ని రచనలను సగటు ఇంగ్లీషులోనే చదువుకోవాలి. తెలివిగల అనువాదకుడు వాక్య నిర్మాణం, అందాలను అందించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. అది పక్కన బెడితే, జపాన్ వారి పాత నవలలో కూడా సాంఘిక సంబంధాలు, వాటి మీద వ్యాఖ్య, రచన తీరులలో మాత్రం ఎక్కడలేని తాజాదనం కనబడుతున్నది. ఈ విషయం గురించి మరింత తీవ్రంగా పరిశీలన అవసరమని నిర్ణయించుకున్నాను. ఉదాహరణకు మోరీ ఒగాయి అనే రచయిత (పేరు తేడా తెలియదు) 1913లో రాసిన ‘ద వైల్డ్ గీస్’ అనే చిన్న నవల చదివాను. బీద ప్రేమ, ధనికుడితో పెళ్లి, కుటుంబ సంబంధాలు, మోసాలు, అపోహలు, అపార్థాలు, కొంచెం పేర్లు, పరిస్థితులు మార్చి రాస్తే ‘టియర్ జెక్కర్’ (ఏడిపించే) తెలుగు సినిమా వచ్చేస్తుంది. ఇవాళటి ప్రేక్షకులు కూడా బాగుంది అని చూస్తారు.
షికిబు అనే అమ్మాయి రాసిన వెయ్యేళ్ల నాటి నవల యింకా సవివరంగా చదవలేదు. అది వేయి పడగలుకన్నా పెద్దదిగా ఉంది. ముగల్ దర్బారు కుట్రలులో లాగ, అందులో రాజకుటుంబాలు, వారి సమస్యలు చక్కగా వర్ణించి ఉన్నాయని అర్థమయింది. ఎవరయినా ఒక దినపత్రిక వాళ్లు అవును అనాలి గానీ, నిత్యం సీరియల్‌గా దాన్ని యాడాదిపాటు ధారావాహికగా లాగించవచ్చు. తప్పక పేలుతుంది.
ఒకప్పుడు నేను అనువాదాలు మొదలుపెట్టి భాషా సాహిత్యాలను వెదుకుతున్నప్పుడు మిషిమా యుకియో, కరాబాటా యసునారి, మసుజి ఇయిసే లాంటి వారిని బాగా చదివాను. ఈ పేర్లు చిత్రంగా ఉన్నాయి కదూ, వీటి అర్థాలు ఉన్నాయి. అర్థం తెలియని మన పేర్లు మిగతా వారికి చిత్రంగా తోచే ప్రమాదం ఉంది. మన వాళ్ల పేర్లే అర్థం గావడంలేదు ఈ మధ్యన! మిషిమా కథ, నా అనువాద రచనల సమాహారం మరణతరంగంలో వచ్చింది. సమకాలీనులు, ఇటీవలి వారిని చదవడానికి సమయం ఉందన్న ధీమాతో నేను కొన్ని పాత రచనల అనువాదాలను సంపాయించాను. వాటిలో కొన్నింటిని గురించి చెప్పకుంటే తప్పు అవుతుంది.
పదిహేడవ శతాబ్ది రెండవ అర్ధంలో జపాన్ సాహిత్య ప్రపంచాన్ని కుదిపిన ఒకానొక రచయిత ఇహారా సైకాకు (ఇది గోపాలం కారంచేడు పద్ధతి!) స్క్రీమింగ్ వర్ల్‌డ్ అని ఒక చిన్న నవల ఇతనిది ముందు దొరికింది. ఆత్రంగా చదివాను. అలనాటి సామాజిక పరిస్థితులు, ఆడవారి స్థానం, మగవారితో సంబంధాలు ఆ నవలలో చాల అందంగా రాసి ఉన్నాయి. మనిషి నాడయినా, నేడయినా ఒకటేగదా అనిపిస్తుంది. ఇది బాగ చిన్న రచన. తెలుగులోకి రాసి అచ్చువేస్తే అందరూ చదువుతారు గద అనిపించింది. మధురోహరం ఒంటరిగ తినగూడదని గద మన పద్ధతి. అందుకే మంచి రచన తెలుగులో రాయాలని అనిపిస్తుంది. ఆ దారిలో చాలనే రాసిన. నా ఉత్సాహానికి సమంగ రియాక్షన్ రాలేదు. ఇక ఈలోగానే సైకాకు రాసిన మరొక అద్భుతమైన పుస్తకం చేతికి అందింది. ఆ పుస్తకం పేరును తెలుగులో చెప్పాలె అంటే ‘ప్రేమను ప్రేమించిన అయిదుగురు అమ్మాయిలు’ అని వస్తుంది. ఈ అయిదుగురు అమ్మాయిలు ఒకటే కథలో ఉంటే గోలగా ఉండేదేమో! ఈ పుస్తకంలో వరుసగా అయిదు ప్రేమ కథలు ఉన్నాయి. వాటికి తగినట్టు పాతకాలం నాటి రేఖాచిత్రాలు కూడ తోడుగ ఉన్నయి.
సైకాకు రచనల గొప్పదనం గురించి జపాన్‌లోనే అరవయి సంవత్సరాల కింద ఎవరికీ అంతగా పట్టలేదట. మనకు ఇంగ్లీషు వర్షన్ ఇంత త్వరగా చేతికి అందడం గొప్ప విషయం అనుకోవాలి. పుస్తకంలో అయిదు కథలు. వాటిని రచయితనే పరిచయం చేస్తూ ఇరవయి రెండు పేజీల వ్యాసం. కథల తర్వాత ముప్ఫయి పేజీలకన్నా నిడివిగల విశే్లషణ కూడా ఉన్నాయి. అనువాదం పేరుతో, మన కథలను అన్ని భాషల వారికి అందించే ప్రయత్నం ఈ మధ్యనే మొదలయిందని నా అనుమానం. సంస్కృతి, బతుకుల గురించి ఇక్కడి కథ చెప్పేలోపల వారిని మానసికంగా అందుకు సిద్ధం చేయడానికి ఈ కథాగ్రంథంలో చేసిన ప్రయత్నం ఆదర్శంగా ఉంది.
పుస్తకాన్ని సమీక్షించినా, పరిచయం చేసినా, అందులోని కథ వివరం చెప్పాలని నాకు అనిపించదు. ఈ కథలు ఎంత బాగున్నాయో చదివితే అర్థం అవుతుంది. ఆ కాలంనాటి జపాన్ తీరు ప్రజా సంబంధాలు కళ్లకు కట్టినట్లు కనబడతాయి. అట్లాగని ఇవి పురాణ పద్ధతిలో అసలు లేవు అచ్చమంత సాంఘిక కథలు. ఈ కథలనయినా తెలుగులో అందించాలని నేను అనుకుంటున్నాను.
పంతొమ్మిదవ శతాబ్ది చివరి కాలం నుంచి తన రచనలతో జపనీస్ సాహిత్య ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మరొక రచయిత నా బల్ల మీద కుదురుగా కూచుని ఉన్నాడు. ఆయన పేరు సోసెకి నట్సుమె. నత్సుమే అనాలేమోనని నా భయం. జపాన్ వారికి టఠడఢలు అంతగా ఇష్టం ఉండవు. సోసెకి రాసిన ‘కోకొరొ’ అనే నవల మొదట చదివాను. సైకాలజీ ప్రధానాంశంగా, చర్చలతో సాగే లోతయిన రచన అది. ఒక యువకుడు అప్రయత్నంగా ఒక పెద్దమనిషిని ‘సెనె్సయ్’ (గురువుగారి). ఆ గురువు చిత్రమయిన వ్యక్తి. అంతర్ముఖుడు. ప్రపంచం పట్టని మనిషి. భార్య మీద జాలితో కూడిన ప్రేమ. కథలోని యువకునికి, చదివే వారికి ఈ నవల చెప్పకుండనే పాఠాలు చెపుతుంది. ఈ నవల గురించి కూడ ఇంతకన్న ఎక్కువ చెప్పాలని అనిపించడంలేదు.
ఇక చివరకు నాకు మిగిలింది ‘పది రాత్రుల కలలు’ అని ఇంచుమించు అర్థం వచ్చే ఒక చిన్న పుస్తకం. అందులో పది కథలు. అంటే పది కలలు. కనుక వాస్తవికంగా ఉండవు. ఊహలకు కూడా అందని ప్రపంచంలోకి మనల్ని ఊడ్చి తీసుకుపోతాయి. ఇది కూడా నత్సుమె సోసెకి రచన. ఇంగ్లీషులో అచ్చు వచ్చి మూడేళ్లు అయినట్లు కనబడుతుంది. ఒక్కో కథ నాలుగు పేజీలకన్నా ఎక్కువ ఉండదు. కానీ చదువుతున్న వారిని మాత్రం ఆ నాలుగు పేజీలలోనే లోకాలు విప్పి చూపిస్తుంది. ఇంత చిత్రమయిన, బలమయిన రచన మరొకటి నాకు గుర్తుకు రావడం లేదంటే నమ్మండి. ఈ పది కథలను సినిమాగా తీశారు! అది మరొక అద్భుతం! నిజానికి సోసెకీ ‘నేను పిల్లిని’ అని ఒక రచన చేశాడు. అది ఆత్మకథ అంటున్నారు! అది చదవడం నేనింకా మొదలుపెట్టనే లేదు.
ఈలోగా తనిజాకీ జునిచిరో లాంటి మరెందరో రచయితలు రారమ్మంటున్నారు. వీళ్లందరినీ చదివితే సరిపోదు. కొన్ని రచనలనయినా తెలుగులో అందించాలి. ఆశీర్వదించండి!

-కె.బి.గోపాలం