S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాట్యమయూరి

దేవులపల్లి ఉమ ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు, యాంకర్. ఎన్నో వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ కళామతల్లికి ఎనలేని సేవ చేస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య విభాగంలో ‘కూచిపూడి - రస సిద్ధాంత’ అనే అంశంతో పిహెచ్.డి కోసం పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ మానవ వనరుల శాఖ, న్యూఢిల్లీ ద్వారా ఎస్.ఆర్.ఎఫ్. సీనియర్ రీసెర్చి ఫెలోషిప్ పొందారు. అప్పుడు వీరి పరిశోధనాంశం ‘అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి హరికథలు - కూచిపూడిలో ప్రదర్శనానుకూలత’. ఎంతో పాండిత్యం కలిగినా.. ఏ మాత్రం భేషజం లేకుండా, సూటిగా, సాదాసీదాగా ఉంటారు. ఉమ చదువుల తల్లి, కల్పవల్లి. వీరితో ముఖాముఖి.
ప్రశ్న: మీ గురువుల గురించి చెప్పండి.
జ: నేను వెంపటి కోదండరామయ్య గారి వద్ద నేర్చుకున్నాను. వీరు వెంపటి వేంకట నారాయణగారి కుమారుడు. పద్మశ్రీ డా.శోభానాయుడు, వేదాంతం రాధేశ్యాం, పద్మభూషణ్ డా.వెంపటి చినసత్యంగారి వద్ద నేర్చుకున్నాను. నాట్యశాస్త్రం, సిద్ధాంతం డా.పి.ఎస్.ఆర్. అప్పారావు గారి వద్ద నేర్చుకున్నాను.
ప్ర: మీ పరిశోధన గురించి...
జ: హెచ్‌ఆర్‌డి, మానవ వనరుల శాఖ నుండి నేను సీనియర్ రీసెర్చి ఫెలోషిప్ పొందాను 2012లో. అప్పుడు నా పరిశోధనాంశం ‘అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి హరికథలు - కూచిపూడి ప్రదర్శనానుకూలత’. ఇప్పుడు నేను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్యశాఖలో పిహెచ్.డి. చేస్తున్నాను. నా పరిశోధనాంశం ‘రస సిద్ధాంతం - కూచిపూడి’ నా మార్గదర్శి గైడ్ డా.వనజ ఉదయ్‌గారు.
ప్ర: మీ విదేశీ పర్యటనల గురించి...
జ: మలేషియా, యుఎస్‌ఏ లో కాలిఫోర్నియా, న్యూజెర్సీ, పిట్స్‌బర్గ్, న్యూయార్క్ వెళ్లాను. కౌలాలంపూర్‌లో ఎన్నో మధురస్మృతులు. నా గురువులు నా ప్రతిభని నమ్మి, నన్ను మెచ్చుకున్నారు. కాలిఫోర్నియాలో ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అక్కడ బృందంగా ప్రదర్శించాం. కాని నా మీద చూపు తిప్పుకోలేక పోయామంటూంటే నా మనసు ఆనందంతో ఉరకలు వేసింది. అదో తీయటి అనుభూతి.
ప్ర: మీ అభిరుచులేమిటి?
జ: ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం చాలా ఇష్టం. జ్ఞానం పెంపొందించేవి, మానసిక వికాసం కలిగించే పుస్తకాలు చదవటం వల్ల ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటుంది.
ప్ర: మీరు చేసిన రూపకల్పన (కొరియోగ్రఫీ) వివరాలు చెప్తారా?
జ: భాండాసుర సంహారం, శివనాట్య విలాసం, రుక్మిణీ కళ్యాణం, బ్యాలేలు కొరియోగ్రఫీ చేశాను. ఎన్నో నృత్యాంశాలు రూపకల్పన చేశాను.
ప్ర: మీ ప్రదర్శనల్లో మరచిపోలేని స్మృతులు?
జ: అన్నీ మధురస్మృతులే! చిన్నప్పుడు బ్యాంకు ప్రోగ్రామ్‌లో దశావతారం చేయడం బాగా గుర్తు. ఆ తర్వాత భామాకలాపం, మన్మథుడిగా, కృష్ణుడు, శివుడుగా వేసి ఎంతో మెప్పు పొందాను. అలాగే ప్రతినాయక (విలన్) పాత్రలో భస్మాసురుడు నాకు బాగా పేరు తెచ్చిన పాత్ర. అసలు ప్రేక్షకులు నన్ను మేకప్ లేకుండా గుర్తు పట్టలేకపోయారు. ఎస్‌విబిసి నాద నీరాజనంలో శ్రీకృష్ణుని పాత్ర చేయడం చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది.
ప్ర: కళారంగంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
జ: డబ్బు లేనివారికి కళల్లో ప్రోత్సాహం తక్కువ. ప్రతిభను గుర్తిస్తారు కాని పైకి రావడం కష్టం. నేను ఎంతోమంది పిల్లలకి కళ కోసం నేర్పుతాను. డబ్బు మీద నాకు ధ్యాస ఉండదు. నాకు ఎంతోమంది ఆణిముత్యాల్లాంటి శిష్యులు ఉన్నారు.
ప్ర: యాంకర్‌గా కూడా చేస్తున్నారు?
జ: భక్తి టీవీలో స్వర్ణకమలం 30 వారాలు ప్రతి ఆదివారం నృత్యం మీద ప్రసారమయ్యేది. దానికి యాంకర్‌గా చేశాను. ఎస్‌విబిసిలోనే సిరిసిరి మువ్వలు 21 వారాలు గొప్ప నృత్య గురువులు, కళాకారుల మీద చేశాను. ఆధ్యాత్మికత, మానసిక వికాసం, కళలు, కళాసేవ, నృత్యం, సాహిత్యం, రంగస్థల కళలు, మానసిక వైద్యం వంటి ఎన్నో అంశాల మీద కార్యక్రమాలు నిర్వహించాను. ఎన్నో నృత్య ప్రదర్శనలకు కంపీరింగ్ చేశాను. నృత్య వేదిక-4 ప్రపంచ తెలుగు మహాసభలు - తిరుపతిలో చేశాను.
ప్ర: మీరు కూచిపూడితోపాటు వేరే రీతులు కూడా నేర్చుకున్నారా?
జ: భరతనాట్యం ప్రఖ్యాత గురువు వి.ఎస్.రామమూర్తి గారి వద్ద నేర్చుకున్నాను. కలరిపయట్టు గురువు సుధాకరన్ (కాలీకట్) నుండి నేర్చుకున్నాను.
ప్ర: మీరు పొందిన గౌరవ పురస్కారాలు?
జ: నాట్యమయూరి, కళారత్న, గోల్డెన్ అవార్డు మలేషియాలో వచ్చాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కాలిఫోర్నియా సిలికాన్ ఆంధ్రా -2008లో వచ్చింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హరికథను కూచిపూడి శాస్ర్తియ నృత్య శైలిలో చేసినందుకు వచ్చింది. అన్నింటికీ మించి ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల ఆదరణ, నా శిష్యుల ప్రేమ లభించింది. ఇదే నాకు అసలైన గౌరవం.
ప్ర: రుక్మిణీ కళ్యాణం గురించి చెప్పండి.
జ: హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు. వారి ముని మనవరాలు రాజేశ్వరిగారు. ఆవిడ ప్రోత్సాహంతో రుక్మిణీ కళ్యాణం హరికథను కూచిపూడిలో కొరియోగ్రఫీ చేశాను. దీనికి ఆడియో కేసెట్టు ప్రఖ్యాత హరికథా భాగవతారిణి శ్రీమతి ఉమామహేశ్వరి గారు ఇచ్చారు. అవసరమైన చోట్ల సందర్భోచితంగా డిఎస్‌వి శాస్ర్తీగారు సంగీతం ఇచ్చారు.
ప్ర: మీపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది?
జ: అమ్మ కామేశ్వరి. మేనమామ వెంపటి ముక్తేశ్వరరావుగారు. ఈయన మృదంగ విద్వాంసులు. వీరు వెంపటి చినసత్యంగారి వద్ద మృదంగం వాయించేవారు. ఇలా వెంపటి కుటుంబంతో నాకు చిన్నప్పటి నుండి ఎంతో సంబంధం, అనురాగం ఉంది. అమ్మ అత్తవారిల్లు దేవులపల్లి. దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారు మాకు బంధువులే. ఇలా ఎంతోమంది గొప్ప కళాకారుల ప్రభావం నా మీద పడింది.
ప్ర: మీడియా సంప్రదాయ కళలను ఎలా పాపులరైజ్ చేయాలి?
జ: టీవీలో కొన్ని ఛానల్స్ భక్తి, ఎస్‌విబిసి వంటివి శాస్ర్తియ కళలకు ప్రోత్సాహం ఇస్తున్నాయి. అలాగే అన్ని టీవీ ఛానల్స్ ఇస్తే కళలకు, కళాకారులకు ఎంతో అండగా ఉంటుంది.
ప్ర: కళాకారులకు మీరిచ్చే సందేశం.
జ: కళ మీద ప్రేమతో నేర్చుకోవాలి. అర్థం చేసుకొని, బాగా అభ్యాసం చేయాలి. కళ ఒక మహాసముద్రం. ఎంత నేర్చుకున్నా ఇంకా ఎంతో ఉంది. కళ ఒక మనిషిని, ఉన్నత మనిషిగా, సంస్కారం ఉన్న మనిషిగా రూపుదిద్దుతుంది.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి