S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆంధ్రకేసరిలో ఆధ్యాత్మికత

భారత స్వాతంత్య్ర సమరాంగణంలో మహోజ్జ్వల తారగా వెలిగి, నాలుగు దశాబ్దాలపాటు దక్షిణ భారత ప్రజా జీవిత రంగంలో స్వయం ప్రకాశమై ‘ప్రజలే తానై, తానే ప్రజలై’ నిలిచిన భరతమాట ముద్దుబిడ్డ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు. ‘నా ప్రజలు - నా బిడ్డలు’ అని వారి శ్రేయస్సుకై తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహానుభావుడు.
అష్టదరిద్రుడు, అనంతభోగి, కార్యసాధన చింత తప్ప ఆయనకు వేరే ధ్యాసే లేదు. ఒకసారి నేలన పడుకున్నాడు. మరోసారి హంసతూలికా తల్పం మీద శయనించాడు. ఒకచోట శాకాలారగించాడు. మరోచోట పంచభక్ష్య పరమాన్నాలను చవిచూశాడు. ఒకప్పుడు భోగి మరొకప్పుడు యోగి. వారి జీవితమే ఒక జైత్రయాత్ర. ప్రకాశంగారి శతజయంతి సందర్భంగా ‘స్రవంతి’ సంపాదకీయం నాకు గుర్తుకువచ్చి వెలుగులోకి తీసుకురావలసిన అవసరం, బాధ్యతను రేకొల్పింది. స్రవంతి సంపాదకీయం ఇలా సాగింది. ‘రౌడీలకు నాయకుడైనా, రాజమహేంద్రవరం పురపాలక సంఘాధ్యక్షుడైనా, సైమన్ కమిషన్ బహిష్కరణ వేళ తుపాకి గుండ్లకు రొమ్మువిప్పినా, లక్షలు గడించి వ్యయించినా, ముఖ్యమంత్రి పదవిని అలంకరించినా, ప్రతిపక్ష నాయకుడైనా, జమీందారీ రద్దుకు పాటుపడినా, ఉత్పత్తిదారుల వినిమయదారుల సహకార సంఘాలు పెట్టినా గాంధేయ సిద్ధాంతాలను అనుసరించినా, గాంధీజీ ప్రతిఘటించినా, హరిజనోద్ధారకుడైనా, ఆశ్రీత పోషకుడైనా, ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి కంకణం కట్టినా, ఆంధ్రప్రదేశ్ అవతరణోద్యమంలో అగ్రగామిగా ఉండి, అకుంఠిత దీక్షతో, అసమాన ధైర్య సాహసాలతో, అపూర్వ త్యాగనిరతితో, ఆత్మవిశ్వాసంతో ప్రజాసందోహము కొరకు స్వార్థానికి కాక, పరార్థానికై బ్రతికారు ఆంధ్రకేసరి ప్రకాశం. ఆయన విశిష్ట గుణాలను ఈ తరం వారు తెలుసుకొని, ఆకళింపు చేసుకొని, ఆచరించవలసిన అవసరం ప్రస్తుత సామాజిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులలో ఇటు ప్రజలు అటు పాలకులకు చాలా అవసరం.
* * *
ప్రకాశం గారిలో అంతర్లీనంగా అపారమైన ఆధ్యాత్మిక చింతన ఉందని, దానికి తగ్గట్టుగా ఆయన జీవితంలో తు.చ తప్పకుండా ఆచరించారని తెలిసినవారు చాలా తక్కువనే చెప్పాలి. వారి స్వీయ చరిత్ర ‘నా జీవిత యాత్ర’ క్షుణ్ణంగా చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ వ్యాసం ద్వారా ప్రజా బాహుళ్యానికి చేరుతుందని నా తలంపు, తపన, తపస్సు. సామాన్యంగా రాజకీయాలలో, ప్రజోద్యమాల పోరాటాలలో పడి నలిగే వారిలో రచనా ధోరణి, ఆధ్యాత్మిక దృష్టి కనిపించడం చాలా అరుదు. ఆంధ్రకేసరి అటువంటి ధోరణుల, చింతనల అపూర్వశక్తి. ఆయన భగవద్గీత, షడ్దర్శనాలు లోతుగా పరిశీలించారు. అంతటితో తృప్తిపడక, సామాన్య ప్రజానీకానికి తెలియబరచడానికి అనుగుణంగా తేటతెలుగులో వివరిస్తూ వేర్వేరు గ్రంథాలు ప్రత్యేకించి రచించారు. పంతులుగారికి ఈ గ్రంథాలను రచించే అవకాశం వారు కారాగార శిక్షలను అనుభవించేటప్పుడు దొరికింది. ఈ విధంగా ఆంధ్రకేసరి వేదోక్తి అయిన ‘అంతా మనమంచికే’ అని నమ్ముతూ, తన శిక్షను ఆశీర్వాదంగా, కారాగార చీకటిలో ఆశాదీపాన్ని వెలిగించారు.
ప్రకాశంగారు కారాగారాలలో రచించిన భగవద్గీతాది తాత్విక గ్రంథాలలో యోగసూత్ర సిద్ధాంతం ఒకటి. యోగ సూత్రాలంటే ఆసనాలకు, ప్రాణాయామం నియాలకు మాత్రమే సంబంధించిన గ్రంథమనుకుంటారు సామాన్యంగా. కానీ యోగ సూత్రాలు ప్రధానంగా నిశితమైన, తాత్విక చింతనకూ, మానసిక శక్తుల సాధనకూ, వాటి వివేచనకూ సంబంధించిన గ్రంథం. తద్వారా సకల దుఃఖవర్జితమైన సమున్నత స్థితిని, స్థితిప్రజ్ఞతను చేరుకునే మార్గాలను సూచించే గ్రంథం. ఈ విషయాలనే మిక్కిలి సులభ శైలిలో సంపూర్ణ తేట తెనుగులో వివరించారని ప్రత్యక్ష సాక్షులు, ప్రకాశంగారి శిష్యులైన పి.వి. గణపతి శాస్ర్తీగారు ‘ఆంధ్రకేసరి రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలు’ అనే వ్యాసంలో రాశారు. అలాగే భగవద్గీతా సిద్ధాంతం వివరిస్తూ మరొక గ్రంథం పంతులుగారు వ్రాయడం తాను స్వయంగా చూశానని అన్నారు. ఈ గ్రంథాలన్నింటిని చిత్రగారి ప్రధాన సంపాదకీయంలో నడిచే ‘శిల్పి’ మాస పత్రిక ప్రచురించింది. కానీ అవి ఏవీ ఈనాటికీ వెలుగులోకి రాలేదు.
మద్రాస్‌లో బారిస్టరుగా సంపాదిస్తున్న రోజులలో స్వామి వివేకానంద గారిని ‘ఇన్‌హౌస్’లో దర్శించుకుని గంటకు పైగా ఆధ్యాత్మిక చర్చలు జరిపారు. తిరుచినాపల్లి జైలులో తోటి ఖైదీలతో రామాయణ, భారత భాగవత పురాణాల పఠనం, వ్యాఖ్యానం ఏ స్థాయిలో ప్రకాశంగారు చేసేవారో తెనే్నటి విశ్వనాథంగారు పద్యరూపంలోనూ చాలా బాగా వర్ణించారు. సర్వం దేశం కోసం త్యాగం చేసి, ఏదీ మిగుల్చుకోకుండా, అన్నీ కోల్పోయిన తరుణంలో ఒకానొక రోజు కారులో ప్రకాశంగారు వెళ్తుంటే, ‘పంతులుగారు తమకు ఒక్క ఇల్లు కూడా లేకుండా పోయింది కదా’ అని విచారం వ్యక్తపరిస్తే, ఆయన భగవద్గీతలోని ‘అనికేతః స్థిరమతిః’ అనేక శ్లోకం వివరించిన నిర్మలమైన మనసు కలిగిన మహామనీషి. పంతులుగారు కేవలం భగవద్గీత, ఉపనిషత్తులు చదవడమే కాకుండా, కూలంకషంగా అర్థం చేసుకొని మనసా వాచా కర్మణా ఆచరించిన మహాపురుషుడు అని వారి ప్రియశిష్యులు ఏడిద కామేశ్వరరావు ‘ప్రకాశంగారితో నేను కన్నవీ - విన్నవీ’ అనే వ్యాసంలో ఏ విధంగా స్మరించుకున్నాడో చూడండి. ఒకరోజు కృష్ణ జయంతి రోజు బులుసు సాంబమూర్తిగారితో గుంటూరు కారులో వెళ్తూ తరచూ చేసే తాత్విక చర్చలో దిగారు. ‘సాంబమూర్తి మహాభారతంలో మహాద్భుతంగా రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణుడిని చోరుడు అని వర్ణించడం నాకు చిత్రంగా ఉంటుంది’ అన్నారు పంతులుగారు.
సాంబమూర్తి గారన్నారు ‘అందులో వేదాంతార్థం ఉంది కాదుటండి.. అది కాస్త వివరంగా చెప్పండి’ కొంత ఉత్సుకత చూపుతూ.
‘.. కంసుడూ, జరాసంధుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన రాజుల పరిపాలన నేటి నైజాం పరిపాలనగా సాగేవి. పల్లెలను కొల్లగొట్టడం, పట్టణాలను, రాజధాని నగరాలను పోషించడం - ఫలితం - పల్లె ప్రజల దారిద్య్రం, అజ్ఞానం, అవిద్య - గోధనం, పాలు, పెరుగూ, వెన్న, మీగడ పట్టణాలకు బలవంతంగా తరలించడం, అంతట కృష్ణుడు కొంతమంది స్నేహితులతో ఇళ్లలో దూరి వెన్న దొంగిలించడం, ఎంగిలి చేయడం, తరలిపోయే పాలు, వెన్న కుండలను బద్దలు కొట్టడం - ఫలితం.. పల్లెధనం, గోధన ప్రవాహం తగ్గి పల్లెల్లో సామాజిక సాంఘిక ఆర్థిక న్యాయం పెరగడం, గ్రామాల సిరిసంపదలు పెరగడం, పాలకవర్గ దుశ్చర్యల నుండి జనావళిని కాపాడాడు. కృష్ణుడి చిలిపి, ఆకతాయి పనులు అందరికీ రుచించే కథలుగా రాశారు కాని నిజానికి - అవి ఆర్థిక వ్యవస్థకు వికేంద్రీకరణ అని నాకు అనిపిస్తుంది సాంబమూర్తి..’ ఎంతో ఆసక్తితో వింటున్న సాంబమూర్తిగారు ‘కృష్ణుడి గోగణము, బలరాముడి నాగలి ఉండనే ఉన్నాయి కాదుటండి.. దీనిని అందరు తెలుసుకోవాలి.. అంటూ చెప్పబోతుండగా సాంబమూర్తి - ఇది నా అభిప్రాయం మాత్రమే. దీనిని ఇలాగే ఉండనీ.. దీనికి ప్రచారం వద్దు.. అది మన పనికాదు’ అన్నారు నవ్వుతూ పంతులుగారు.
ఒకసారి పంతులుగారి దర్శనం కోసం, సందేశం కోసం వచ్చిన పాతిక పైచిలుకు అన్ని మతాల యువతకు పంతులుగారి సందేశం ఈ విధంగా ఉంది. ‘మీరు మహాభారతాన్ని చదివారా? అందులోని రాజనీతిని, పాలక పాలితుల బాధ్యతలను అర్తం చేసుకోండి. ఒకటికి పదిసార్లు చదివి అందులోని మర్మాలను కంఠస్థం పట్టండి. అప్పుడు రాజకీయాలలో దిగండి’ అన్నారు.
అసలు నిజంగా స్రవంతి సంపాదకీయం రాసిన ఈ వర్ణన అక్షర సత్యాలనిపిస్తుంది. ప్రపంచ చరిత్రలో ప్రకాశం కంటె ధైర్యశాలులుండవచ్చు. త్యాగులుండవచ్చు. స్వదేశ భక్తులుండవచ్చు. పరిపాలనా దక్షులుండవచ్చు. ప్రతిభావంతులుండవచ్చు. పాత్రికేయులుండవచ్చు. వక్తలుండవచ్చు. రక్తులుండవచ్చు. విరక్తులుండవచ్చు - కానీ ఈ గుణాలన్నీ ఒకేచోట రూపుగొన్న నాయకులరుదు. అది ప్రకాశం ప్రత్యేకత. రావినూతల శ్రీరాములుగారి మాటలలో ‘త్యాగేనె్తకేన అమృతత్త్వ మానగతిః’ అనే ఉపనిషత్ సూక్తికి ప్రబల ఉదాహరణ ఆంధ్రకేసరి ప్రకాశం.
ప్రకాశంగారి ఈ గ్రంథాలు ఎక్కడైనా దొరుకుతాయని ఆశిస్తూ ఈ ప్రచురణ ద్వారా, నేటి తరం ఇలాంటి ప్రాతః స్మరణీయుల గురించి తెలుసుకోవడం వారి విధి. తెలియపరచడం నాటి తరం వారి బాధ్యత.*

--టంగుటూరి శ్రీరాం, ప్రధాన కార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ - 99514 17344.