S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాయు పురాణం

ప్రతి కుటుంబంలోను వాళ్లకు మాత్రమే అర్థమయ్యే మాటలు, జోకులు కొన్ని ఉంటాయి. మా ఇంట్లో కూడా మామూలుగానే మాటలు, జోకులు కొన్ని ఉన్నాయి. కొత్తగా తెలియని తిండి పదార్థం ఏదో ఒకటి ఒకనాడు బల్ల మీదికి వచ్చినట్టుంది. మా అమ్మాయి ‘దీన్ని ఏమంటారు?’ అని అడిగింది. మామూలుగానే సరదాగా మాట్లాడే మా అబ్బాయి చటుక్కున ‘ఏమీ అనరు! తింటారు!’ అన్నాడు. ఆ తరువాత మేము చాలా సందర్భాలలో ప్రశ్న అడగకుండా తింటారు అంటూ తింటూ ఉంటాము.
ఏదో కొత్త వస్తువు ఎదురుగా వస్తుంది. ఒకప్పుడయితే, దీన్ని దేనితో చేశారు అని అడగడం అలవాటు. చాలాకాలం వరకు మనిషి చేసిన వస్తువులన్నీ లోహం, కర్ర లేదంటే రాయి లాంటి వాటితో తయారయ్యేవి. మధ్యలో పింగాణి వచ్చింది. ఆ తరువాత చూస్తుండగానే ఫైబర్ గ్లాస్ వచ్చింది. బేకలైట్ వంటి రకరకాల కాంపోజిట్ బోర్డులు వచ్చాయి. ఇక వచ్చిన వేలాది ప్లాస్టిక్‌ల గురించి వేరుగా చెప్పుకోవలసి వుంటుంది. మొత్తానికి ఎదురుగా వచ్చిన వస్తువు ఏ రకమయినది అని అర్థం చేసుకోవడానికి అందరూ తికమక పడిపోతున్నారు. చేతికందిన సీసా లేక గ్లాసు ఎలాంటిది తెలుసుకోవాలంటే ఒకతను సూది కాల్చి గుచ్చి చూడమన్నాడు. ప్లాస్టిక్ అయితే కాలి రంధ్రం పడుతుంది మరి. ఎవరు మాత్రం కావాలని తన వస్తువులో రంధ్రాలు పొడుచుకుంటారు? కనుక పాత్ర సంగతి అర్థం కాకుండానే ఉండిపోతుంది. కొత్తగా కొన్న గుడ్డ కృత్రిమంగా తయారయిందా లేక సహజంగా పండిన పత్తి నుంచి వచ్చిందా తెలుసుకోవాలంటే దానిలోని ఒక చివరన నిప్పు పెట్టి చూడాలి. ప్రపంచం ఇలాగయ్యింది.
చేతికి ఏదో అంటుకుంటుంది. మరో వేలితో ముట్టుకుని చూస్తే అది జిగురుగా ఉంటుంది. ‘శాణకు మూడుచోట్లు’ అని మాకొక మాట ఉంది. అంటిందేదో మొదటి చోటు. కంటి ముందు పెట్టుకుంటే రెండవ చోటు. దాని వాసన కూడా చూస్తే మూడవ చోటు. ఇక చివరికి ఆ అంటిన వస్తువు అసహ్యమయినదని తెలిస్తే అప్పుడు అసలు బాధ మొదలవుతుంది. దాన్ని వదిలించుకోవాలి. అందుకోసం సబ్బు వాడాలి. అన్నట్టు ఏం చేసి సబ్బు ఒంటికి అంటిన మకిలిని వదిలిస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు అడగకుండానే అందరూ సబ్బును వాడుకుంటున్నారు. కొందరు సబ్బు కూడా వాడకుండా అదే పనిగా కేవలం నీళ్లతోనే ముఖాన్ని రుద్దేసుకుంటారు. నిజానికి సబ్బు అణువుకు రెండు కొండ్లు అంటే కొక్కాలు ఉంటాయి. వాటిలో ఒకటి నీటి అణువును పట్టుకుంటుంది. మరొకటి చమురు అణువును పట్టుకుంటుంది. ఈ రకంగా సబ్బు అణువు చమురును పట్టుకుని, నీటితో తేలుతూ చేతి నుంచి లేదా గుడ్డ నుంచి దూరం పోతుంది. అంటినది చమురు కాకుంటే సబ్బుతో కూడా వదలదని అర్థం.
ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న పదార్థాలలో గాలి విచిత్రమయినది. పుట్టిన మరుక్షణం నుంచి చచ్చేదాకా మనం గాలి పీలుస్తూనే ఉంటాము. గ్రహం చుట్టూ గాలి లేకపోతే మనం ఇలాగ ఉండగలిగే వాళ్లం కాదు. వాతావరణం అంటే చుట్టుకున్న గాలి అని అర్థం. ఇంత ముఖ్యమయినది అయినా గాలి గురించి ‘ఇది దేనితో తయారయింది’ అని మాత్రం అడగకుండానే మనమంతా దాన్ని పీల్చేసి బతుకుతున్నాము.
మనం ఒక్కసారి గాలి పీలిస్తే, అందులో అప్పటివరకు బతికిన మనుషులందరూ ఒక్కొక్కరు వదిలిన ఒక్క అణువయినా ఉంటుందట. మరింత గట్టిగా లెక్క చెప్పాలంటే ఇప్పటికి పుట్టి గిట్టిన వాళ్లందరూ, ప్రస్తుతం బతికి ఉన్న వాళ్లలో కనీసం ఆరేళ్ల వయసు గలవాళ్లందరూ ప్రపంచం మొత్తం మీదట పీల్చి వదిలిన గాలిని మనం ప్రతి శ్వాసలోనూ పంచుకుంటామట. ఒకరు వదిలిన గాలి మొత్తం భూమి వాతావరణంలో వ్యాపించి కలవడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది. కనుకనే ఈ లెక్కలో ఆరేళ్లకన్నా చిన్న పిల్లలను చేర్చలేదని అర్థం చేసుకోవాలి. మనకు ఆరేళ్లు నిండిన నాటి నుంచి మనం వదిలిన గాలిలోని ఒక్కొక్క అణువును ఈ ప్రపంచంలోని వారంతా అణుక్షణం పీలుస్తున్నారని వేరుగా చెప్పనవసరం లేదు. గాలి గురించి ఒక్క సంగతి చెపితేనే బుర్ర తిరిగిపోయే తీరుగా ఉంది. ఇంకా లోతుకు వెళితే ఎనె్నన్ని ఆశ్చర్యాలు ఎదురవుతాయో తెలీదు.
పరిణామం జరుగుతుంటే ఒకప్పుడు కొన్ని జంతువులు మొప్పల పద్ధతిని పక్కనబెట్టి ఊపిరి తిత్తులతో నేరుగా గాలి పీల్చడం మొదలయింది. అప్పటి నుంచి ఈ గాలి పంపకం జరుగుతూనే ఉన్నది. ఇప్పటి మనలాగే అప్పటి నుంచి ఎవరూ గాలి గురించి పట్టించుకోలేదు. సుమారు ఓ వందేళ్ల క్రితం మాత్రం ఇద్దరు పరిశోధకులు ఈ విషయంగా బుర్రలు చించుకున్నారు. కనిపించని గాలి గురించి కనిపించని అంశాలను తెలుసుకోవాలని ప్రయత్నించారు. అయినా సరే వాళ్లు కనుగొన్న సంగతులు ఎవరికీ పట్టకుండానే ఉండిపోయాయి. వాతావరణం గురించి మనం పట్టించుకోము. ఈ వాతావరణం లేకుంటే మనం బతకలేము. కానీ జీవం పుట్టిన నాటి నుంచి వాతావరణం ఒకే రకంగా కాకున్నా ఉండను మాత్రం ఉంటున్నది. మన ప్రాణాలను ప్రశ్నలడగకుండా అది నిలబెడుతూనే ఉన్నది. అయితే మామూలుగా జరిగే ఏ విషయాన్ని మనిషి ప్రశ్నించడు. సూర్యుడు రోజూ కనిపిస్తాడు. కనుక అందులో ఆశ్చర్యం లేదు. అనుక్షణం గాలి పీలుస్తాము. కనుక అందులో ఆశ్చర్యం లేదు. సూర్యుడు కనిపించని రోజున కనీసం వెలుగు కనిపిస్తుంది. గాలి మామూలుగా లేనిచోట్ల కూడా ఏదో గాలి ఉండనే ఉంటుంది. కనుక మనకు వాటి సంగతి పట్టదు.
ఇప్పుడు గాలి గురించి మరొక విచిత్రమయిన సంగతి చెపితే ముక్కున వేలు వేసుకుంటారో, పక్కకు తిరిగి కనుబొమ్మలు ఎగరేస్తారో మీ ఇష్టం. పుట్టిన నాటి నుంచి ఊపిరి ఆగేదాకా అంటే ప్రాణం పోయేదాకా మనం పీల్చే గాలిలో మనకు ఏ రకంగాను పనికిరాని నైట్రోజన్ అనే నత్రజని ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్న గాలిలో మరి ఆ వాయువు 78 శాతం ఉంటుంది. అంత నత్రజనిని ఊపిరితిత్తులలోకి పీల్చినా మనకు అపాయం మాత్రం జరగదు. దానివల్ల సాయం జరగకపోతే అది వేరే సంగతి. దూరం నుంచి వినిపించే పాటలాగ అది చికాకు కాదు, పనికి వచ్చేది అంతకన్నా కాదు.
గాలిలో ఇంచుమించు అయిదో భాగం వరకు ప్రాణవాయువు అనే ఆక్సిజన్ ఉంటుంది. ఈ పేరు వినిపించగానే మన ప్రాణాలకు అదే ఆధారం అని అందరూ భుజాలు ఎగరేస్తారు. మూలకాలలో అన్నిటికన్నా ఎక్కువ ప్రచారం ఉన్నది ప్రాణవాయువేనేమో. ఈ మధ్యన ఆక్సిజన్‌ను అంగళ్లలో అమ్ముతున్నారట కూడా. కాలుష్యం కారణంగా సాయంత్రం కల్లా అలసటకు గురయిన వారు ఆక్సిజన్ బార్‌లకు చేరి అక్కడ కాసేపు శుభ్రమయిన వాయువును పీల్చి తేరుకుంటున్నారు. ఈ విశ్వంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉండే మూలకాలను లెక్కబెడితే ఆక్సిజన్ మూడవ స్థానంలో వస్తుంది. అది మన భూగ్రహం మీద మరింత ఎక్కువగా ఉంటుంది. మరింత చిక్కగాను ఉంటుంది. ప్రాణవాయువు ప్రతి మూలనా ఉంటుంది. చివరికి మరే వాయువుకు వీలులేని చోట కూడా ప్రాణవాయువు దూరి చేరుకుంటుంది. ప్రతి ఇసుక కణానికి ప్రాణవాయువు చుట్టుకుని ఉంటుంది.
ఈ విశ్వంలో ఇంతగా ప్రాణవాయువు నిండుకున్న వాతావరణం గల నిర్మాణం భూమికాక మరొకటి లేదు. విశ్వంలోని మరే గోళం మీద చెట్లు లేవు. చెట్లు ప్రాణవాయువును వదులుతాయని మీకు తెలిస్తే సంతోషం. తెలియకుంటే తెలుసుకోవాలి. చెట్లున్నాయి కనుకనే భూవాతావరణంలో చిక్కగా ప్రాణవాయువు నిండి ఉంది. దూరం నుంచి చూస్తే ప్రాణవాయువు నుంచి ఒక రకమయిన ఆకుపచ్చని వెలుగు విరజిమ్ముతుంది. విశ్వంలోని అణువులకన్నా చిన్న కణాల తాకిడి కారణంగా వాయువు ఈ రకంగా వెలుగుతుంది. ఈ రకమయిన ఆకుపచ్చ వెలుగు విశ్వంలో మరెక్కడయినా కనిపిస్తే అక్కడ కూడా భూమి మీద లాంటి జీవం ఉండవచ్చునని సులభంగా ఊహించవచ్చు. విశ్వంలో చెట్లు ఎక్కడ ఉన్నా ఈ రకమయిన వెలుగుతో తమ ఉనికిని ప్రకటించుకుంటాయని చెప్పవచ్చు.
నత్రజని, ఆమ్లజని అనే ప్రాణవాయువు అనే ఆక్సిజన్‌లు కలిసి వాతావరణంలో 99 శాతం నిండుకుని ఉన్నాయి. ఇక మనం పీల్చే గాలిలోని మిగిలిన ఒక శాతంలో ఏమేమి ఉన్నాయి? మా అబ్బాయి ఉంటే ప్రశ్న అడగకూడదు. గాలి పీల్చాలని మాత్రమే, అనేవాడేమో. కానీ వాడు నాకంటే కుతూహలం గలవాడు. బహుశా జవాబు చెపుతాడేమో! ప్రశ్నను మరో రకంగా అడగవచ్చు మరి. నత్రజని, ఆమ్లజని తరువాత మనం పీల్చే గాలిలో ఎక్కువగా ఉండే మూడవ పదార్థం ఏమిటి? అనవచ్చు. అనవచ్చు అనకుండా ప్రశ్న అడిగి చూడండి. జవాబు చెప్పే ప్రయత్నమూ చేయండి. నాకు తెలుసు అందరూ గజిబిజిలో పడిపోతారని.

-కె.బి.గోపాలం