S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓ.. పెద్ద.. కథ

‘నీ సలహా చాలా ఇబ్బందికరంగా ఉంది. నేనిప్పుడు ఆదాయం కోసమా ఈ పని చేస్తున్నది - నన్ను దత్తత తీసుకున్నవారి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని...’ అంటూ మరో మాటకి తావివ్వకుండా బావ కారులో వెళ్లిపోయాడు, సినిమా హాలు నిర్మాణం పనుల మీద.
అంతే అది మొదలు బావ పనులని, పరిణామాలని ఒక శ్రోతలా చూస్తూండిపోయాను. కాని మరెప్పుడూ సలహానివ్వలేదు.
చిత్ర జగతి సినీ పత్రికలో విలేకరిగా పని చేస్తున్న సుమంత్, మన పెదనాన్నగారి మనుమడు. వాడు ప్రివ్యూలకి వెళ్లేటప్పుడు నన్ను కూడా వెంట పెట్టుకు పోయేవాడు. రిటైరై నేను మటుకు ఇంట్లో చేసేది ఏముంది కనుక. నేనూ వాణ్ణి ఫాలో అవుతూ ఉండేవాణ్ణి. అలా ఇటీవల విడుదలైన రెండు సినిమాలకి వాడితో కూడా వెళ్లాను. ఒకటి రంగస్థలం, రెండు మహానటి - రెండూ రెండు కథాంశాలు, భిన్నమైన ఇతివృత్తాలు. అక్కడ సినీ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు.. ఇంకా ఫైనాన్సర్స్.. ఏరియాలు కొనుక్కునేవారు, రచయితలు అందరూ హాజరయ్యారు. పాత్రికేయులకి కేటాయించిన చోట్ల మేము చేరిపోయాము.
అందులో మహానటి నటశిరోమణి సావిత్రి యదార్థ గాథ. అంటే బయోపిక్ - తెలుగులో తొలిగా తెరకెక్కించిన చిత్రం. ఇకపోతే రంగస్థలం.. కథ పాతదైనా, కథనం కొత్తదంటున్నారు. సినిమాలు రెండుకి రెండూ పాసయినయ్. నిర్మాతలని ఆర్థికంగా ప్రోత్సహించినయ్, జనానికి నచ్చినయ్.
ప్రివ్యూలు చూశాక సుమంత్ సమీక్షలు రాస్తూ నన్ను అభిప్రాయమడిగాడు - నేను నా అభిప్రాయాన్ని పై విధంగా వివరించాను. ‘అలా కాదు బాబాయ్.. రెండింటిలో కథలు ఇన్‌హ్యూమన్‌గా లేవు’ క్వొశ్చన్ వేశాడు నన్ను. ఎలా ఆలోచిస్తే అలా సమాధానం వస్తుంది - ఏది ఏమైనా ఆస్థి చెడ్డది... దోచుకు తినడం పాతదే - అన్నానే్నను.
‘ఎలా.. మీరేమంటున్నారు..’ అంటూ ఉత్సుకత కనబరచాడు సుమంత్. అయితే నీకు నా చిన్నప్పటి కథ ఒకటి చెప్పాలి; విను - అంటూ సుమంత్‌ని గతంలోకి తీసుకెళ్లాడు బాబాయ్ సుధాకర్. సుధాకర్ నిల్చుని ఎదురుగా సంవత్సరం బాబుని ఆడిస్తున్న ఓ తల్లిలోని మమకారాన్ని, మాతృత్వాన్ని సుమంత్‌కి చూపించి, తనుగా కనకపోయినా, మీ నాన్నని ఆ వయసులో చేరదీసి మాతృత్వపు మమకారాలను రుచి చూపించారు మీ నానమ్మ తాతయ్యలు దత్తత తీసుకుని.
చివరకు వాళ్లకు మిగిలింది.. మీ అమ్మానాన్నలు మిగిల్చింది ఏమిటో తెలుసా?..’ అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు సుధాకర్.
‘ఎందుకు బాబాయ్ మీరు అంత ఎమోషనల్ అవుతున్నారు.. అసలేం జరిగింది.. నిస్సంకోచంగా చెప్పండి..’ ఆసక్తి కనబడింది సుమంత్‌లో సుధాకర్‌కి.
సుమంత్‌ని తనతోపాటు గతంలోకి తీసుకెళ్లాడు సుధాకర్.
‘సరసక్కయ్య.. సరసక్కయ్య’ తలుపు తడ్తున్నాడు. చినరాఘవయ్య, సుధాకర్ తండ్రి. ఎంతకీ తలుపు తీసిన అలికిడి కాని.. లోపల్నించి మాట వినికిడి గాని చెవులకందలేదు. ఇంతలో పక్కనున్న, అద్దెలకుంటున్న వాళ్లు ‘మామ్మగారు లేరండి. రాత్రి కొంచెం ఆయాసం ఎక్కువైతే ఆసుపత్రిలో చేర్చారు’ ‘అలాగా ఏ ఆసుపత్రి.. అక్కయ్యతో ఎవరున్నారు?’ అడిగాడు తను.
‘అదేమోనండి... ఎన్ని రోజులుగా కబురు పెట్టినా కూడా ఇంతవరకు కొడుకు రాలేదు సరికదా, బదులు ఇచ్చినట్లుగా కూడా తెలియదు’ అంటూ కనుమరుగై పోయింది ఆవిడ. చినరాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. ఏమిటి కొడుకు నిర్వాకం. ఎలాంటి అక్కయ్య ఎలా అయిపోయింది. బావ బ్రతికున్న రోజుల్లో సాక్షాత్తు లక్ష్మీదేవిలా.. పోతపోసిన నిలువెత్తు విగ్రహంలా.. బంగారు ఆభరణాలతో, ముతె్తైదువ అలంకారాలతో - ఖరీదైన నేత చీరలో, పట్టుబట్టల్లో.. కొప్పు నిండా పెరట్లో విరగకాసిన జాజులు మాలకట్టి తురిమేది, లేత తమలపాకులు తాంబూలం బుగ్గన్నొక్కి అదిమేది.
అలాంటిది.. ఆ కొడుకు నిర్వాకం ఇలా ఉంది మరి. దిక్కులేని అనాథని చేసి, మనోవ్యాధితో మంచం ఎక్కించేసేడు చేరదీసిన పాపానికి. చేసిన పాపం ఊరకే పోదు.. జన్మజన్మలకి కట్టి కుడుపుతుంది. కాలమే చెప్తుంది గుణపాఠం.. ఇల్లలకగానే పండుగనుకుంటున్నారు కుంకాయిలు. ఈ రోజు సజావుగా గడిచిపోవచ్చు - రేపేంటన్నది చూసుకోవాలి మరి అనుకుంటూ ఆసుపత్రిలోకి అడుగుపెట్టాడు చినరాఘవయ్య - భావోద్వేగాలు వేగిరపడ్తున్నయ్ తనలో.. ఏం చూడవలసి వస్తుందో, అక్కని ఏ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందోనని..
అక్క మంచమీద అటుఇటు కదుల్తోంది, మాగన్నుగా తనని చూసి దగ్గరికి పిలిచి ఏదో చెప్పబోయింది - సైగ చేస్తోంది. బహుశా తను పెంచిన కొడుకు గురించే అయి ఉంటుంది. కదిలే శిలలా.. శిథిలావస్థకొచ్చిన భవంతిలా ఉంది.. కళ్లు తుడుచుకుంటూ దగ్గరగా వెళ్లి ఓదార్చి వసారాలోకి వచ్చాడు చినరాఘవయ్య, మా నాన్న.
బావ ఆ రోజుల్లోనే వెయ్యి ఎకరాల భూస్వామి. అక్కని బావకిచ్చి వివాహం చేశారు. ఎంతకీ అక్కకి సంతానం కలగలేదు - విసిగిపోయిన అక్కా బావ వరసకి కొడుకైన పద్మనాభాన్ని దగ్గరకు తీసి సకాలంలో ఉపనయనం అదీ చేసి వారసుడిగా ప్రకటించుకున్నారు. దత్తత అనేది వారికి వారసత్వంగా మారింది. బావ కూడా దత్తతే వచ్చాడు - అలా వంశానికి వారసుణ్ణి చేసుకున్నారు అక్కాబావ.
అంతంత మాత్రపు ఆరోగ్యమైన బావ ఆరోగ్యం కాస్తా క్షీణించసాగింది. రైతులు మక్తాలు తెచ్చిస్తే ఎంచే ఓపిక, కోరిక లేని బావ ఆ సొమ్ముని పొత్తాలు, పొత్తాలుగా దిండు కింద, పరుపు కింద పేర్చి ఓ మొత్తమయ్యాక భద్రపరపించేవాడు ఇనప్పెట్టెలో. బావ పక్క మీద ఉన్నప్పుడున్న సిరి, బావ పక్కకెళ్లినప్పుడు కొంత కొంత దాన్ననుసరించి వున్న జేబుల్లోకి వెళ్లి దూరేది. అలా తరిగినది తరగగా మిగిలినది పద్మనాభం చేత ఇనప్పెట్టెలో దాయించేవాడు బావ - బావకి చెప్పే వీల్లేని ఖర్చులకి అలవడ్డ పద్మనాభం కొంత నొక్కేసి జేబులో కుక్కేసి మిగిలింది దాచేవాడు ఇనప్పెట్టెలో.
అయినా బావ జమీందార్ - చెవర్లెట్ కారులో షికారు కెళ్లేవాడు. అలాటి దశలో ఆయన మైండ్‌లో సినిమా హాలు నిర్మాణానికి పునాది పడ్డది. తన స్వంత స్థలంలో శంఖుస్థాపనకి ముహూర్తం పెట్టించాడు. ‘ఇది నీకు సరికాదు బావా. సినిమా హాలు నిర్మాణానకి, నిర్వహించడానికి అర్ధబలం ఒక్కటే చాలదు. అంగబలం చాలా అవసరం’ చెప్పాడు నాన్న. ఇప్పటికైనా ముంచుకు పోయింది లేదు. గోడౌన్‌లు చేసి అద్దెకిద్దాం. వార్షిక ఆదాయాన్ని సునాయాసంగా పొందవచ్చు అంటుండగానే బావ నాన్నవైపు గుర్రుగా చూసి...
‘నీ సలహా చాలా ఇబ్బందికరంగా ఉంది. నేనిప్పుడు ఆదాయం కోసమా ఈ పని చేస్తున్నది. నన్ను దత్తత చేసుకున్న వాళ్ల పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని..’ అంటూ మరో మాటకి తావివ్వకుండా కారులో వెళ్లిపోయాడు బావ సినిమా హాలు నిర్మాణం పని మీద.
అంతే.. అది మొదలు శ్రోతలా బావ పనులని, పరిణామాల్ని చూస్తూండిపోయాను. కాని మరెప్పుడు సలహానివ్వలేదు.
హాలు ఏమంటూ మొదలుపెట్టాడో బావ, తేనెతుట్టెను చుట్టుముట్టిన కందిరీగల్లా బావ పంచకి చేరారు చాలామంది. లెక్కలు రాసేవారు లెక్కలు రాసి, లెక్కల్లో సొమ్ము బొక్కేసేవారు. ఇళ్ల స్థలాలు, పొలాల బేరాల్లో కమిషన్ రూపంలో కొంత, ఆమ్యామ్యా రూపంలో ఇంకొంత సొమ్ము చేసుకున్నారు - దక్కించుకున్నారు.
ఆస్తంతా హరించుకు పోయింది. పోయింది పోగా కొంత వ్యాజ్యాల్లో వుంది. కోర్టులో అది తేలేదెప్పుడు - హాలు పూర్తయ్యేదెప్పుడు. ఇదంతా బావ కళ్లకి కట్టినట్లు కనిపించి, అదే.. అదే.. తనలో తను తలుచుకుంటూ, తలచుకుంటూ మదనపడి మనోవ్యాధితో మంచం పట్టాడు. అరకొరగా వున్న మావ ఆరోగ్యం కాస్తా మంచమెక్కింది.
బావని హాస్పిటల్‌లో చేర్పించారు - మనోవ్యాధికి మందు తమ వద్దలేదని.. వైద్యులు తేల్చి చెప్పారు. ఇక రెండు మూడురోజుల్లో చనిపోతాడనగా బావ ‘చిన రాఘవా..’ అంటూ దగ్గరకి పిలిచాడు. ఆశగా బావ దగ్గరగా వెళ్లాడు తను. బావ గుడ్లనీరు జాలువారుతోంటే తుండుతో కళ్లు అద్దుతోంది అక్క.
‘చినరాఘవా.. నాక్కొంచెం డబ్బు సర్దుబాటు చేస్తావా..’ అంటూండగానే ఆ రోజే డ్రా చేసినది, కవరు - కవరు పళంగా బావ చేతిలో ఉంచాను. కవరులో కరెన్సీ చేతిలోకి తీసుకుని బావ ఇంత సొమ్ము చూసి ఎన్నాళ్లయ్యిందో అంటుంటే, నాకు కంట్లో కన్నీళ్లు అడ్డొచ్చి బావ ముఖం కనపడలేదు. అంతటి బావ ఇంతటి మాట అనడం.. నా చెవులు వినడం, నా గుండెని పిండినట్లై అక్కడ ఉండలేక బయటకు వచ్చేసి, కన్నీరు మున్నీరైన కళ్లని వత్తుకుంటూంటే కర్చ్ఫీ తడిసి ముద్దైంది.
ఆ తర్వాత బావ మరణించడం.. నేనిచిచ్న కరెన్సీ బావ హాస్పిటల్ బిల్లుకి, అంత్యక్రియలకి చెల్లిపోవడం జరిగిపోయింది - హాస్పిటల్ రావడంతో సాగిపోతున్న బావ ఆలోచనలకి తెరపడిపోయి, ‘అక్కా...’ అంటూ పరుగెట్టుకుంటూ లోనికి వెళ్లాడు నాన్న.
అక్క మంచం మీద కదిలే శిలలా వుంది. మనోవ్యాధి తనని మంచమెక్కించింది. బావ మనోవ్యాధి ఒకరకంగానైతే, అక్కది మరో విషయానికి. అక్క అన్న వీరాస్వామి కూతురు మేనకోడలు కనకవల్లిని కోడలుగా తెచ్చుకుంది దత్తుడికి; ఇద్దరూ కళ్లల్లో పెట్టుకు చూసుకుంటారు ప్రేమతో అనుకుంది. విధి లిఖితమో.. స్వయంకృతమో.. తెలియదు కానీ తామొకటి తలిస్తే, దైవం మరొకలా ఆశీర్వదించాడు. వాళ్లది వాళల్లు పంచేసుకుని స్థిరచరాలు, తనతో బంధాన్ని తెంచేసుకున్నారు. ననే్నకాకిని చేశారు. సగంలో ఆగిపోయిన సినిమా థియేటర్ వాళ్ల పరమైంది. తనలా కూలిపోవటానికి సిద్ధంగా వున్న భవంతి అక్క పరమైంది. అది కూడా అక్క తదనంతరం పద్మనాభంకే అన్నట్లు అక్క సంతకంతో విల్లు రాయించారు. ఇది అన్న.. అంటే పద్మనాభం మామ సృష్టించిన విల్లు.
అక్క కోర్టుకెడ్తే.. అన్నీ తనకనుకూలిస్తే నెగ్గవచ్చు, కాని భర్త పరువు, మర్యాద తను రచ్చకెక్కించినది అవుతుందని అక్క నెగ్గగలిగిన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికి.. తగ్గేవుంది. అందరూ ఉండి అక్క తను అనాధ అయ్యింది.. ఆ దిగులే అక్కని మానసికంగా, శారీరకంగా కుంగదీసింది. లక్ష్మీదేవిలా ఉండే అక్క ఇప్పుడెలా అయిపోయింది. బావని పందిరి చేసుకుని పచ్చని లతలా అల్లుకుపోయి సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించే అక్క.. అన్న వీరాస్వామి, కొడుకు కోడలు.. దుష్టత్రయం చేతికి చిక్కి శల్యమై పోయింది - పందిరి కూలిన లత నేలపాలై మాడిపోయింది - వసి వాడిపోయింది.
తన జరుగుతున్న తంతు చూసి విచారించడం తప్ప చేయగలిగింది, చేయగలిగేది ఏముంది? తనకి వ్యవహారం బొత్తిగా తెలియదు.. మెత్తటి మనసిచ్చాడు గాని తెలవితేటలు అతిగా ఇవ్వలేదు పరమాత్మ. అందుకేనేమో ఓ కవిగారన్నట్లు ‘బుద్ధికి హృదయం లేక.. హృదయానికి బుద్ధే రాక నరుడే ఈ నరలోకం నరకం చేశాడు’ అన్నాడు - దేవుడనే వాడున్నాడా.. నిస్సందేహంగా ఉన్నాడు. అయితే పాపం పండితేగాని పరిష్కరించలేడు.
ఈ భావోద్వేగాల్నించి తను బయటపడేసరికే అక్క కదిలే శిల అవస్థ నుంచి.. కదలని శిల అయ్యిందని, నాడి చూసిన డాక్టర్ పెదవి విరిచి, ‘షి ఈజ్ నో మోర్...’ డిక్లేర్ చేశారు అక్క భౌతికంగా లేదని.
‘దిక్కులేని అనాధ పక్షిని చేశారు.. ...! చిన రాఘవకి గుండె లోతుల్లో నుంచి మూలుగులా విన్పించింది. ఇకపై జరగాల్సిన కర్మకాండకు తెర తీసింది-
తన చిన్ననాటి కథ ఎవరిదో, ఏమిటో.. ...
నిర్వేదంగా అవగతమయ్యింది సుమంత్‌కి. బాబాయ్ సుమంత్‌ని ఓదార్చ ప్రయత్నించాడు - అప్పటికే చెమ్మగిల్లినయ్ సుమంత్ నేత్రాలు - గొంతు ఆర్ద్రమయి పోయింది.
‘కూల్.. కూల్.. మై చైల్డ్.. నువ్వడిగావని నా గుండె ద్వారా, నాన్నగారి గుండెలోని ఆవేదనని.. నీకు ఈ సందర్భంగా వివరించాను-
సత్యంగా ముమ్మాటికి ఓ... పెద్ద.. కథ... వాళ్లు జీవించి వున్న వరకు వారి గుండెల్లోని వ్యథ.. మరణించినా, ఆత్మలకు క్షోభ అంతింత కాదు. నా అన్నవారే.. ఇలా చేయడం, సినిమాలోనే కాదు.. నిజ జీవితాలలో కూడా సాధ్యమని చెప్పడం నా ఉద్దేశం. అందుకే రెండు సినిమాలకు, మన జీవితాలకు.. బింబము, ప్రతిబింబము అన్నంత సామ్యముందని చెప్పడం కూడా నా ఆంతర్యం.
ఇప్పుడు చిత్ర సమీక్ష వ్రాయి సుమంత్. నీ చేవ్రాలు నా మానసిక స్థితికి అద్దం పడ్తుంది. ‘లేదు బాబాయ్!! ముందు మా స్వంత చిత్రానికి సమీక్ష వ్రాసి, ఆ తరువాత పశ్చాత్తప్తుడైన మనసుతో.. పై చిత్రాలకు సమీక్షలు వ్రాస్తాను అంటూ ఇంటివైపు తిప్పాడు కారుని నిద్రాణమైన తలిదండ్రుల మనసులను ప్రక్షాళనం చేయడానికి.. జాగృతమైన మనసులతో తాత, నానమ్మల ఆత్మలకి ప్రశాంతి కలిగించడానికి.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505