S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మార్పు తెచ్చిన శాపం( కథ)

విజయుడు ఒక గురుకులంలో సమస్త విద్యలు, మంత్రతంత్ర విద్యలు కూడా పూర్తి చేసుకుని గురువుగారికి తగిన దక్షిణ సమర్పించి, ఆయన ఆశీర్వాదం తీసుకుని తన ఊరికి బయలుదేరాడు. అలా విజయుడు కొన్ని మైళ్లు నడిచిన తరువాత ఓ ఇంటి అరుగు మీద బడలిక తీర్చుకునేందుకు కూర్చున్నాడు.
ఇంతలో ఆ ఇంటి నుండి ఒక స్ర్తి ఆర్తనాదం, తరువాత ఏడుపు వినిపించాయి. లోపల ఒక పురుషుడు ‘మీ ఇంటి నుంచి బంగారం తీసుకురావే. లేకపోతే నిన్ను చంపుతాను’ అని ఆమెపై విరుచుకు పడుతున్నాడు.
విజయుడు ఆ స్ర్తి ఆర్తనాదాలు విని ఉండలేక వెంటనే లేచి కిటికీలోంచి లోపలికి చూశాడు. ఆ పురుషుడి హింస నుండి ఆ స్ర్తిని రక్షించి వాడికి తగిన గుణపాఠం నేర్పాలని విజయుడు నిశ్చయించుకొన్నాడు.
‘ఆగు.. ఇంకొక్కసారి నీ చేయి ఆమె మీద పడిందో నీ అంతు చూస్తాను’ అని విజయుడు అరిచాడు. విజయుడి గొంతు విని అతను, అతని భార్య ఆశ్చర్యపోయారు.
‘నా పెళ్లాం, నా ఇష్టం నీవెవరు నన్ను అడగటానికి?’ అంటూ ఆమెను మరలా హింసించబోయాడు.
వెంటనే విజయుడు తలుపు విసురుగా తీసుకుని ఇంట్లోకి వెళ్లి ఆ వ్యక్తిని కిందకు తోసి, నాలుగు పిడిగుద్దులు గుద్దాడు.
‘ఆగండి.. నా భర్తను ఏమీ చెయ్యకండి’ అంటూ ఆమె విజయుడికి అడ్డుపడింది.
‘చూశావా నీవు హింసిస్తున్నా.. నీ భార్య నీ మేలే కోరుతున్నది’ అని చెప్పాడు విజయుడు.
‘బంగారం తీసుకురాకపోతే దీని మీద నా ప్రవర్తన ఇలానే ఉంటుంది’ అని ఎర్రని కళ్లతో అన్నాడతను.
‘మూర్ఖుడా ఎంత చెప్పినా నీవు వినడం లేదు. నా మంత్రశక్తిని ఉపయోగించి, ఈమె శరీరంలో ఓ అద్భుత శక్తిని మంత్రం ద్వారా నిక్షిప్తం చేస్తున్నాను. నీవు ఈమెను ఒక దెబ్బ కొడితే నీకు రెండు దెబ్బలు తగులుతాయి. కానీ, నీవు కొట్టే దెబ్బలు ఈమెకు తగలవు. నీవు ఈమెను తిడితే నీకు చెంపదెబ్బ తగులుతుంది.. ఆడవాళ్లు అంటే అంత చులకన ఉండకూడదు.. మగవాడిగా కష్టపడి సంపాదించు. ఆడవాళ్ల నుండి బంగారం ఆశించకూడదు. కష్టపడి సంపాదించిన డబ్బే సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తుంది.. ఈ సత్యం తెలుసుకో’ అని చెప్పాడు.
అయినా ఆ వ్యక్తి విజయుడి శక్తిని పరీక్షించేందుకు తన భార్య వీపు మీద కొట్టాడు. చిత్రంగా ఏదో అదృశ్యశక్తి అతని వీపు మీద బలంగా రెండు దెబ్బలు వేసింది. అతను కింద పడిపోయాడు.
వెంటనే ఆమె విజయుడి కాళ్ల మీద పడి, ‘అయ్యా, నా భర్తను క్షమించండి. మీ శాపాన్ని తీసివేయండి. ఆయనకు ఏమైనా అయితే నేను భరించలేను’ అని ఏడుస్తూ వేడుకుంది.
తన భార్య మంచితనం చూసేసరికి ఆ వ్యక్తిలో ఒక విధమైన మార్పు వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి విజయుడి కాళ్ల మీద పడి ‘అయ్యా, నాకు బుద్ధి వచ్చింది. ఇక నా భార్యను హింసించను’ అని వేడుకున్నాడు.
ఆ వ్యక్తిలో కలిగిన మార్పునకు విజయుడు తృప్తి చెంది సంతోషించి తన మంత్రశక్తిని ఉపసంహరించుకొన్నాడు. తను నేర్చుకున్న మంత్రతంత్ర విద్య ఒక కుటుంబాన్ని నిలబెట్టింది. విజయుడు సంతోషంతో తన ఊరికి బయలుదేరాడు.

-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445