S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజమహేంద్రవరం టెర్రర్ ప్రకాశం

ప్రకాశంగారి జీవితమే ఒక పోరాటం. ఎన్నో సందర్భాలలో మృత్యువు అంచుల దాకా వెళ్ళి, ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకుని ధైర్యంతో చివరిక్షణందాకా పోరాడి విజయం సాధించాడు. అయితే ఆయన అల్లరి చిల్లరి వారితో తిరిగినా, ఆ నాటకాల గొడవల్లో పడి తగాదాల్లో కూరుకుపోయినా ధర్మం తనవైపే ఉందన్న ఆత్మజ్ఞానమే ఆయనను రక్షించింది. నిజానికి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశంగారికి ఇంతటి ఖ్యాతి, రావడానికి విజయం కలగడానికి ఏకైక కారణం ఆయనకున్న ఆత్మజ్ఞానం. స్వశక్తి. ఇంకా విశే్లషిస్తే తన ప్రవర్తన, ఉన్నతమైన తన వ్యక్తిత్వం. ఏనాడూ.. ఏ సందర్భంలోనూ.. తనకంటూ కేవలం తన కోసం కాకుండా ఇతరుల కోసం, తాను నమ్మిన నీతి కోసం, ధర్మం కోసం తెగించి సాధించాడు. ఒక లక్ష్యం కోసం, ఆత్మాభిమానం కోసం, పదిమందికి ఉపయోగం అనిపిస్తే ఎక్కడలేని ప్రతాపం చూపించేవాడు. అందుకే శ్రీ భోగరాజు పట్ట్భా సీతారామయ్యగారు అంటారు. ‘‘తనకోసం కాక సజ్జన క్షేమం కోసంగాను ఎచట ప్రదాములున్న అచట ప్రకాశం ప్రత్యక్షమగును.. నేను ఒక చిన్న వేదాంతిని.. ప్రకాశంగారొక సైనికుడు, వీరుడు. ప్రకాశంగారిని ఆపదలాకర్షించును.. తెగింపు ఆయన నైజము.’’
పెద్దలకు పెద్ద, రౌడీలకు రౌడీ మన ప్రకాశం అని రాజమండ్రిలో అందరూ అనుకునేవారు.
పంతులుగారి జీవితాన్ని రెండు భాగాలుగా.. ప్రధానంగా విభజించవచ్చును. ఎందుకంటే తన సంపదనూ, శక్తియుక్తులనూ, సమయాన్ని మానవ సేవకే అంకితము చేశాడు కాబట్టి. రాజకీయరంగంలోకి ప్రవేశానికి పూర్వము, ప్రవేశించిన తరువాతి జీవితము. అసలు రాజకీయరంగ ప్రవేశము కూడా సజ్జన శ్రేయస్సు కోసమే కదా.. మహాత్మగాంధీగారి పిలుపు మేరకు దేశదాశ్య విమోచనకోసం అందరికంటే ముందు నదురు బెదురు లేకుండా సమరంలో దిగిన తొలి తెలుగు తేజం ప్రకాశం. తన చిన్నతనంలోనూ, యువకుడిగా గడిపిన జీవితం తొలిభాగం. ఈ భాగంలో నేర్చుకున్న అలవర్చుకున్న జీవిత సత్యాలను, తెగువ, తెగింపులను తద్వార సంపాదించిన శక్తి అనుభవాలను మలిదశలో సక్రమ మార్గంలో, సమయానుకూలంగా వినియోగించడం నిరుపేదకు సెకెండ్ గ్రేడ్ ప్లీడర్‌ను కుగ్రామంలో ఒక సాంప్రదాయ, అతి సామాన్య కుటుంబంలో జన్మించిన సామాన్యుడు ఆంధ్రకేసరిగా కీర్తినార్జించాడు.
1887 సంవత్సరంలో పంతులుగారు మెట్రిక్యులేషన్ తప్పారు. కారణం నాటకాల పిచ్చి ముదిరి, ‘‘సంగీతం చేత బేరసారములుడిగెన్’’ అన్నట్లు ఒక విధమైన నిర్లక్ష్యమైన జీవితానికి అలవాటు పడ్డారు. అప్పట్లో రాజమహేంద్రవరంలో రౌడీ జట్లు బాగా ఉండేవి. పైగా పెద్దమనుషులుగా చలామణీ అయ్యే వాళ్ళందరికీ రౌడీలతో సంబంధాలుండేవి. ప్రకాశంగారి మాటల్లో చెప్పాలంటే ‘‘... నేను కూడా ఈ పార్టీల వలలో పడ్డాను. ఆ పడటంలో సంఘంలో కిందశ్రేణిలో ఉండే జనంతో సంపర్కం కలగడంలో ఆశ్చర్యం ఏమి ఉంది? చేపలు పట్టుకుని జీవించే బెస్తలతోనూ, వాళ్ళ నాయకులతోనూ చేతులు కలపవలసి వచ్చింది. వాళ్ళ అభిమానం సంపాదించడానికి వాళ్ళ యిళ్ళకి కూడా వెళ్ళేవాడిని. వాళ్ళు కల్లు తాగుతూ ఉంటే పక్కనే ఉండవలసిన అవస్థ కూడా కలిగేది. కానీ యెన్నడూ అది ముట్టుకోవాలనే ధోరణి మాత్రం కలగలేదు’’ అని ప్రకాశంగారు స్వీయచరిత్ర ‘నా జీవితయాత్ర’లో రాసుకున్నారు. అదీ పంతులుగారి వ్యక్తిత్వం. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు అని అనుమానం రావడం మనందరికీ సహజమే. ఒకటి స్వతహాగా ప్రకాశం, నటనా కళామతల్లి మీద అభిమానం, అభినయ సామర్థ్యం కూడాను. రెండోది తనను అన్ని విధాలా ఆదుకున్న, చదువు సంధ్యలు చెప్పించి ఇంతటి వాడ్ని చేసిన గురువుగారు నాయుడుగారికి ఉన్న నాటకాల పోషణ. గురువుగారు పంతం పడితే తను పంతం పట్టినట్లే. గురువుగారి పరువు ప్రతిష్ఠ తన పరువు ప్రతిష్ఠ అందులో సందేహమే లేదు. ఈ సందర్భంలో ప్రకాశంగారు స్వీయచరిత్రలో ఏమని రాసుకున్నారంటే ‘‘... ఎందుచేతనో ఆయనకి నేను ఎన్ని గత్తర్లలో పడినా చివరికి తేల్తాననే ఒక నమ్మకమూ, దృఢవిశ్వాసమూ వుండేవి. కనుక ఆయన నా వ్యవహారాలన్నీ చూసీ చూడనట్టుగా ఉండి, పైనించి, కంటికి రెప్పలా కనిపెడుతూ వుండేవారు. చదువులో కొంత శ్రద్ధగానే వుండేవాణ్ణి. కాకపోతే కొంచెం పొగరుబోతుతనం అనేది ఉండేది.’’ అది ప్రకాశంగారి గురుభక్తి. తన గురువుగారికి తరువాతి జీవితంలో కొంత రుణం తీర్చుకోగలిగానని వారి శ్రేయస్సుకోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నించానని వ్రాసారు పంతులుగారు.
ప్రకాశంగారి ప్రతాపము, ప్రతిఘటన, తన స్వంత శక్తి, బలము, ఆలోచన మీదనే ఉండేది. ఆ రోజులలో ప్రకాశంవారు గోదావరి వరదల్లా కొట్టుకుపోవలసి ఉండేది. దైవికంగా తన సమయస్ఫూర్తి వల్ల వెంట్రుకవాసి తేడాతో బయటపడ్డాడు. వారు గోదావరి మంచి వరదల్లో ఉన్నప్పుడు తన స్నేహితులతో కలిసి బ్ను పడవని ఏట్లోకి తీసుకెళ్ళాడు. తను చుక్కాని దగ్గర ఉన్నాడు. పడవని కోటి లింగాల దాకా పోనిచ్చి బాగా పైకి ఎగురనిచ్చి, వాలుగా వదిలాడు. ప్రవాహం మంచి జోరుగా ఉండడంతో చుక్కాని తన చేతిలోంచి జారి నీళ్ళలో పడింది. తన స్నేహితులందరూ కంగారు పడ్డారు. ప్రకాశం గభాలున ఏట్లోకి దూకాడు. తెడ్డు పట్టుకొని పడవ ఎక్కలేకపోయాడు. పడవ దగ్గరికి వెళ్ళడం పడవ ఎక్కలేకపోవడం జరిగింది. చాలాసేపు యుద్ధం చేశాడు. ప్రాణాల మీద ఆశ వదులుకుని ఆ మహానదిలో చిట్టచివరికి తనే తెడ్డు అందివ్వమని సూచించాడు. అంతేకానీ ఆ స్నేహితులలో ఎవ్వరికీ ఆలోచన రాలేదు. పైగా విపరీతంగా ఖంగారు పడ్డారు. ఈ విధంగా బ్రహ్మాండమైన గండం తప్పిందని ఈ కథను వర్ణించారు ప్రకాశంగారు.
ఆ కాలంలో రాజమహేంద్రవరంలో టెర్రర్ సృష్టించారు ప్రకాశంగారు. ఎంతవరకూ పోయిందంటే వ్యవహారం.. ఆయన భవిష్యత్తు విషయంలో ఎంతో ఆశ పెట్టుకున్న బంధువులతో సహా హనుమంతరాయుడిగారికి కూడా ఆందోళన కలిగింది. కొట్లాటలు, కేసులు, కోర్టులు, వాయిదాలు, శిక్షలు.. ఒకటేమిటి..? తెల్లవారి లేస్తే రాత్రయ్యేలోగా ఏమి వస్తుందో తెలిసేది కాదు.
అప్పట్లో తాలింఖానాలు చాలా ప్రసిద్ధిగాంచినాయిట. కాకినాడలో సింగితపు అబ్బాయి అనే వేపారి పంతులు తాలింఖానాలకి, అందులోని వస్తాదులకు గురువు. మనిషి మంచి ఆజానుబాహుడు. బొర్ర మీసాలు, దిట్టమైన కనుబొమ్మలు, బొజ్జ.. భీకరంగా ఉండేది ఆకారం. వృత్తి ఆయుర్వేద వైద్యం. పెద్దల్లో పెద్దవాడు, రౌడీల్లో రౌడీ. ఆయనలో ప్రకాశంగారికి తగాదా ఏర్పడ్డది నాటకాల విషయంలో. ఈ సంఘటనను పంతులుగారు చాలా విపులంగా రాశారు.
ప్రకాశంగార్లు నాటకం ఆడుతుంటే అకస్మాత్తుగా వాళ్ళ మీద తన సేనతో పడి కర్రలతో, ఇతర ఆయుధాలతో దెబ్బతీశాడు. ఈ లైట్లు ఆపేసి చీకటిలో వెతికి వెతికి ప్రకాశం జట్టును కొట్టారు. పంతులుగారు కిటికీలో కూర్చుని ఉండగా కర్రతోనో, గొలుసుతోనో యనమండ కొండయ్య అనే అతను ఇల్లెక్కి మరీ దెబ్బతీశాడు. అదృష్టవశాత్తూ ఆ దెబ్బ కొద్దిగా కిటికీ ఊచకి దూసుకుపోవడంతో ప్రకాశంకి అంత గట్టిగా దెబ్బ తగలలేదు. లేకపోతే మూతి పగలవలసిందేనట. ఇకనేం పౌరుషాలు పెరిగిపోయాయి. పట్టింపులు తారాస్థాయికి చేరాయి. ప్రకాశమా.. మజాకా? ఈ మధ్యలో దేవుడి ఊరేగింపు వేడుకలొచ్చినాయి. రాత్రి సమయం ఉత్తరము కాకినాడ మసీదుదాకా వచ్చింది. హఠాత్తున ఎదురునుంచి ఘల్లు.. ఘల్లు.. మని గొలుసు చప్పుడు చేరుకుంటూంది. అబ్బాయి స్వయంగా నిలువెత్తు కర్ర, దాని చివర గొలుసూ తీసుకుని కాలాంతకుడుగా వచ్చి పడ్డాడు. ప్రకాశం జట్టులోని వస్తాదులే అతని దెబ్బలకి తాళలేక కాలికి బుద్ధి చెప్పారు. ప్రధాన నాటకుడైన దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్యకు తల పగిలి మెదడు బయటపడింది. ప్రకాశం కాళ్ళు, చేతులు, భుజాల మీద చాలా దెబ్బలు తగిలాయి. తను విధిలేక పక్కన ఉన్న కోమటి యిల్లు తెరిచి ఉండటముతో దూరాడు ప్రకాశం. ముమ్మడి వెంకటరత్నం అనే వస్తాదు సుమారు 200 దెబ్బలు తిని ఇతరులను కాపాడాడట. పోలీసు కేసు అయినా కోర్టుకెక్కినా ఎవ్వరూ సాక్ష్యానికి రాలేదు. సింగితపు అబ్బాయి అంటే అంత భయభ్రాంతులన్నమాట. ఈ విషయాన్ని ప్రకాశం చాలా గాఢంగా ఆలోచించి రేపు వాళ్ళని నడిరోడ్డు మీద కొట్టాలని కసి పెంచుకున్నాడు. కొన్నిరోజులకి ఆ పార్టీ మనిషి ప్రకాశానికి చిక్కాడు. ప్రకాశం నాడు వెళ్తున్న బండి దగ్గరకి వెళ్ళి దిగి కిందికిరా.. అని గర్జించాడు. అతను దిగిపోతే ఎద్దును విప్పేసి, ప్రకాశం అమాంతం బండిని పైకి లేపి వాడిని కింద పడేశాడు. చలపతిరావు అనే సహచరుడుతో కలిసి అతనిని పచ్చడి కింద చితకగొట్టారు. ఇది జరిగింది రాజమహేంద్రవరం తాలూకా ప్రెస్ ఎదురుగా, ఆర్ట్ కాలేజీకి వందగజాల దూరంలో.. ప్రకాశం వాడిని చితకబాదడం.. అదీ పట్టపగలు నడి మెయిన్‌రోడ్డులో చూసి ‘‘ ఇదేమిటి?’’ అని ఎవ్వరూ అడిగే దమ్ములేకపోయింది. స్వయానా కాశీ విశ్వనాథం అనే షావుకారు (ఆర్డనరీ బెంచ్ మెజిస్ట్రే ట్), కొరళ్ళు సుబ్బారాయుడు (టి.డి.పి. కాకినాడ) కూడా చూసి చక్కా పోయారని పంతులుగారి ఉవాచ అంతే మళ్ళీ పోలీస్ కేసు, కోర్టు, విచారణ మామూలే.. పై వాళ్ళందరూ సాక్షులు. దీనిలో ఏమాత్రమూ ప్రమేయము లేని నాయుడుగారిని ఇరికించారు ఆ జట్టువాళ్ళు. ఈ విషయం ప్రకాశాన్ని కలవరపరిచింది. తన దగ్గర ప్లీడరు ఫీజుకాదు గదా చివరికి వకాల్త నామా ఖర్చులకు కూడా డబ్బు లేదు.
ప్రకాశం, చలపతిరావును తీసుకొని విశ్వనాథంగారి ఇంట్లోకి దూకి రాత్రి వేళ ‘‘మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే.. నీ ప్రాణాలు దక్కవు సుమా’’ అని బెదిరించారు. ఏమైతేనేమి ‘‘తగాదా జరగడం చూశాను కానీ తనకు ఆ బీభత్సం చూసి భరించలేక వెళ్ళిపోయానని, ఎవరు ఎవరిని కొట్టారో చెప్పలేనని ’’ సాక్ష్యం చెప్పారు. ఫలితంగా కేసు కొట్టి వేశారు. ఇంకా ఇలాంటి కొట్లాటలు చాలానే ఉన్నాయి.
‘‘నేను ఎన్నో సాహసకార్యాల్లో పడి ప్రమాదాలు తప్పించుకున్నానంటే దానికి దైవికమైన బలం అల్లా ఉండగా, నేను చేసే పనిలో ఒక న్యాయం ఉన్నదనే విశ్వాసం కూడా నాకు తోడ్పడిందనుకుంటాను. కాకినాడలో మమ్మల్ని అక్రమంగా కొట్టారు. వాళ్ళమీద స్వయంగా కేసుపెడ్తే సాక్ష్యం చెప్పేవాళ్ళే లేకపోయారు. చివరికి వాళ్ళకి కాస్త బుద్ధిచెప్పే పెద్దమనిషి కూడా లేకపోయాడు! ... తీవ్రమైన ప్రతీకార బుద్ధిచేత నేనెందుకు పాల్పడ్డాను. (నా జీవితయాత్ర)
కాస్త ఉడుకురక్తం చల్లారడం మూలాన, తన జీవితలక్ష్యం అంతా ప్లీడర్ మీద ఉండడం చేత దృఢసంకల్పంతో ప్లీడరు పరీక్ష పాస్ అయినవాడు ప్రకాశం. ఆ నాటకాల రౌడీ జట్టుల సుడిగుండం నుంచి బయటపడి లండన్ దాకా చదువుకోసం వెళ్ళాడు. ఇంకో విషయం తనకు చిన్నతనంలో శిక్ష వేసిన తెల్లదొర మెక్ట్ఫా దొరకి ఆవకాయ తీసుకెళ్లి ఇచ్చారు పంతులుగారు. ఆయన ప్రకాశంగారిని తన సతీసమేతంగా గౌరవించి భోజనం పెట్టి మరీ పంపించాడు. తన పోకడలో, ప్రవర్తనలో ఏ మాత్రమూ స్వార్థంకానీ, న్యాయంకానీ చూపించలేదు. అన్యాయాన్ని ఎదురించడం, ఖండించడం, నిజాన్ని, నమ్మిన సిద్ధాంతాన్ని నిర్భయంగా ఎంతటి వారి ముందైనా చెప్పడం ఆయన నైజం.
డా. దాశరథి మాటల్లో ప్రకాశం ‘‘మరపురాని మహానుభావుడు.’’ ఏల అనగా..
ధైర్యానికి శౌర్యానికి
ప్రతిరూపం ప్రకాశం
త్యాగానికి జనసేనకు
మారుపేరు ప్రకాశం

-టంగుటూరి శ్రీరాం 99514 17344