S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గురువే భాస్కరుడు

ఏం పాడుతున్నారు? ఎలా పాడుతున్నారనే దానిపైనే ‘పాట’ స్థాయి ఆధారపడి ఉంటుంది.
నాభి నుంచి హృదయం, కంఠస్వరాల మీదుగా రసనాడుల మీద నర్తించే మాటలకు నాదం తోడైతే వినబడేది నిత్య శుద్ధ చైతన్యంతో కూడిన పాట.
దట్టమైన మేఘాలావరించి, ఒక్కసారిగా కుంభవృష్టి వర్షం కురిస్తే మరి మబ్బులు కనిపించవు-
నాదాన్ని మోసుకొచ్చే మాటలు కూడా అంతే. మబ్బులు నిండిన మేఘాలు లేకపోతే వర్షం వుండదుగా? సాహిత్యం చెప్పలేని చోట సంగీతం ప్రారంభవౌతుంది. సాహిత్యంతో ముడిపడ్డ సంగీత పరమార్థం ఇదే. పాట వింటూ అలా పరవశించి పోతారేగాని, ఎక్కడ, ఎవరు నేర్పారో ఎనే్నళ్లు నేర్చుకున్నారో లాంటి వివరాలు ఎవరూ అడగరు. ముఖేముఖే సరస్వతి. పాడే పాట స్థాయి మన బుద్ధే నిర్ణయిస్తుంది. ఒకరి పాటను మరొకరితో పోల్చకూడదు. పాడి చెప్పలేకపోవచ్చు.
కానీ కర్ణాటక శాస్ర్తియ సంగీతానికీ, లలిత, లలిత శాస్ర్తియ సంగీతానికీ, లలిత, లలిత శాస్ర్తియ సంగీతం, సినిమా సంగీతానికీ గల వ్యత్యాసం వినే శ్రోతలకు బాగా గ్రహించగలరు. అపశృతిని తొందరగా గ్రహించేది ఎవరో తెలుసా?
కేవలం సంగీత జ్ఞానం లేని శ్రోతలే అంటే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు తెలిసిన గ్రహించటంలో వింత లేదు.
స్వర వర్ణాలతో, గమక సహితంగా ఒక్కొక్క సంగతీ పాడుతూ, రాగభావంతో పెనవేసుకుపోయే సాహిత్యాన్ని చెవికి చేరవేయటమే సంప్రదాయ సంగీత విద్వాంసుని లక్షణం.
దశ విధ గమకాలుగా పిలవబడే ఆరోహణ, అవరోహణ, ఢాలు, స్ఫురితం, కంపితం, లీనము, ప్రత్యాఘాతం, ఆహతం, అనాహతం, వళి, హుంఫితం లాంటి ఎన్నో గమకాలు కేవలం విద్వాంసులకు మాత్రమే తెలిసిన సాంకేతిక పరమైన మాటలు - వీటి ప్రయోగం విద్యార్థులకే తప్ప వినేవారికి ఏమీ తెలియదు. వారికి తెలిసినది కేవలం విని ఆనందించటమే. పాటను నడిపించేది సుస్వరంతో కూడిన రాగం. మనుషుల రూపలావణ్యాలు ఎలా ఏర్పడుతాయో రాగానికీ ఒక నిర్దిష్టమైన రూపం ఉంది. రాగ భావం ఉంది. రాగరసం ఉంది.
ఇంటి నిర్మాణానికి ఇంజనీరు ప్లాన్ ఆధారం. మనోధర్మ సంగీత గృహానికి గాయకుడి ఆలోచనే ఆధారం. ఇది ఎప్పటికప్పుడు ప్రతిరోజూ మారిపోతూంటుంది.
నిన్న పాడిన రాగం ఈ రోజుండదు. ఈ వేళ పాడిన దానికి మరుసటి రోజుకూ తేడా ఉంటుంది. గాయకుని కల్పన రోజూ మారుతూ చిత్ర విచిత్ర గతులలో సాగుతూంటేనే నవ్యత, నాణ్యత కనిపిస్తుంది.
ఇదివరకటి రోజుల్లో గ్రామఫోన్ రికార్డు చేసేందుకు చాలామంది పేరున్న విద్వాంసులు నిరాకరించేవారు. కారణం ఒక్కటే. ఎంతో కష్టపడి నేర్చుకున్న దివ్యమైన సంగీతం చిత్తం వచ్చినట్లు, సమయాసమయాలు లేకుండా వినిపిస్తే సంగీత గౌరవం వుండదని గాఢంగా నమ్మిన ఆత్మగౌరవం కల్గిన విద్వాంసులు కావటమే - నిజానికి, స్వేచ్ఛగా పాడగలిగిన గాయకులకు ఇది అవరోధమే. అందుకే రాళ్లను సైతం కరిగించగల అమృత సమానమైన గానం వారితోనే అంతర్థానమైంది. 78 ఆర్‌పిఎం గ్రామఫోన్ రికార్డుల వ్యవధి కేవలం మూడున్నర నిమిషాలు. అనుకున్న అందచందాలన్నీ ఆ స్వల్ప వ్యవధిలో ముగించాలి.
నిజానికిది స్వేచ్ఛగా పాడే గాయకులకు అవరోధమే.
పునాదులు లేని గృహం ఎన్నాళ్లుంటుంది? చెప్పండి. సంగీత జ్ఞానం లేని పాటైనా అంతే. ఇష్టమైతే కష్టపడి నేర్చుకోవాలి.
ఒకే గొంతులో అన్ని రకాల గమకాలూ అందరూ పలికించలేరు. ‘మహావైద్యనాథ శివన్’ అత్యంత వేగంతో మెరుపు మెరిసినట్లు స్వర సంచారంతో పాడేసినా, ఆ పాట స్పష్టంగా వుండేదట.
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ మధ్యమ కాలంలో చక్కగా స్థిమితంగా పాడేవాడట. ఇద్దరిదీ వైరుధ్యమైన బాణీలే. ఈ ఇద్దరూ తిరువయ్యారులోనే వుండటం విశేషం.
* * *
పాటకు ఆధారం స్వరం. పాటను నడిపించేదే స్వరం. స్వరజ్ఞానం నాదానుభవం నేర్పుతుంది. లయ జ్ఞానంతో పాటను నిలకడగా పాడించేది కూడా స్వరమే.
భావంతో పాడమని నిర్దేశిస్తుంది - సంగీతానికి స్వరజ్ఞానమే ప్రధానం. ‘స్వరం’ పాడిన పాట శాశ్వతంగా గుర్తుండేలా చేస్తుంది. నూటికి 70 శాతం విద్యార్థులు ఈ స్వర జ్ఞానానికి చాలా దూరంగా ఉంటాయి.
చాలా ఇష్టమని ఏడాది పొడుగునా ఒకే కూర తింటే ఏమవుతుంది. అన్న హితవు ఛస్తుంది. ఎవరో గాయకుడు ఎప్పుడో, పాడేసిన పాట పట్టుకుని వ్రేలాడుతూ అదే పనిగా పాడినా కలిగే ప్రయోజనం కూడా ఇంతే ఇలాగే ఉంటుంది.
మన ప్రతిభా వ్యుత్పత్తులు కనిపించవు. మనమెవరమో ఎవరికీ తెలియదు. సంగీతం చూసేది కాదు, కేవలం వినేది.
మందలో ఒకడిగా కాదు. వందలో ఒకడిగా పేరు తెచ్చుకోవాలి. సాధనతో సాధించాలి. ‘ఒక మాటకు ఎంత ఊపిరినివ్వాలి? మాటను ఎప్పుడు వదిలిపెట్టాలి?’ లాంటి పట్టువిడుపులు బాగా తెలియాలి. అందులోనే పాట సౌందర్యమంతా దాగి ఉంటుందనే వారు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఈ రహస్యం అందరికీ తెలియకపోవచ్చు. ఇటుకలను పేర్చగా ఏర్పడేది ఇల్లు. స్వరాలు పేరిస్తే ఏర్పడేది పాట. ఏ వరసలో పేరిస్తే అందమో తెలియాలి. నాదం దేహంలోంచి పుట్తుంది. నాభిలోంచి పుట్టేది ‘పర’. హృదయంలోంచి వచ్చేది ‘పశ్యంతి’. కంఠంలో పుట్టేది ‘మధ్యమ’. జిహ్వలో నాట్యమాడేది ఓంకార. స్వరూపమైన వైఖరి. ఇవన్నీ తెలిసిన గురువు వల్లనే ‘నాద మర్మం’ తెలుస్తుంది. అసలు తెలుసుకోవాలనే జిజ్ఞాస వుండాలిగా? ఆకలే లేనివాడికి పంచభక్ష్యం పరమాన్నాలు రుచిస్తాయా? కడుపు నిండా తిన్నవాడికి కోరికలుండవు. అందుకే అన్ని దానాలకంటే అన్నదానం శ్రేష్ఠం అన్నారు. సంగీతం కూడా అంతే. జ్ఞాన గంగతో పునీతులైన అలనాటి మహా విద్వాంసులు కూడా సంగీతం కోసమే సంగీతం పాడారు. పార లౌకిక సుఖమే కోరుకున్నారు. పరమార్థ చింతనతో బ్రతికారు. దివ్యమైన సంగీతాన్ని భావితరాలకు పంచారు. అదే వారి లక్ష్యం.
లోకంలో ఐదు రకాల గురువులుంటారు.
పక్షి గురువు: పక్షి తన రెక్కలతో పిల్లను సాకినట్లు సంగీతం నేర్పే గురువు.
మీన గురువు: ఇతర విద్వాంసుల అనుభవాలు చెప్పి బోధించే గురువు.
మర్కట గురువు: శిష్యుడే గురువును వెంబడిస్తాడు. శిష్యుడికి శ్రమ కల్గించడు.
మార్జాల గురువు: పిల్లి తన పిల్లల్ని కూడా వెంటబెట్టుకుని తిరిగినట్లుగా, గురువు తన శిష్యుల్ని వెంట తీసుకెళ్లి తిప్పుతూ బోధిస్తాడు.
కూర్మ గురువు: మనసా, వాచా, కర్మణా యోగ్యుడైన శిష్యుణ్ణి కంటికి రెప్పలా కాపాడుతూ జ్ఞానభిక్ష ననుగ్రహించే సద్గురువు. వీరే అరుదుగా లభిస్తారు. అందుకే ‘బాధ’ గురువులెవరో తెలుసుకోగల జ్ఞానముంటే బోధ గురువులను గుర్తించే మార్గం దానంతట అదే దొరుకుతుంది. ఇదే పెద్ద చిక్కు. యోగ్యుడికి సరైన గురువును పైవాడే చూపిస్తాడు. వివేకానందుడికి రామకృష్ణ పరమహంస దొరకలా?
*
కాకినాడ శ్రీ సరస్వతీ గానసభ వ్యవస్థాపకుడైన కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తి నాయుడు గాయకుల కల్పతరువు.
తెలుగుదేశంలోని సంగీత ప్రియులకు సంప్రదాయ శాస్ర్తియ సంగీతం పట్ల అనురక్తినీ, అభిరుచినీ కలిగించిన రసజ్ఞుడు. గొప్ప కళాపోషకుడు.
దక్షిణాది నుండి ప్రతి ఏడూ విధిగా వచ్చి కచేరీలు చేసే వయొలిన్ విద్వాంసుడు గోవింద స్వామి పిళ్లై 1929 సం.లో అనారోగ్య కారణాల వల్ల రాలేదు. ఈ విషయాన్ని ఉత్తరం ద్వారా తెలుసుకున్న నాయుడుగారు ఎవరికీ ఈ విషయాన్ని తెలియనివ్వలేదు.
సరిగ్గా సాయంత్రం 5 గంటలకు వేదిక ముందు నిలబడి ‘మహాజనులారా! అనారోగ్య కారణాల వల్ల గోవిందస్వామి పిళ్లై ఈ సంవత్సరం రాలేకపోయారు. ఈ విషయం వ్రాస్తూ
‘మీ ఆంధ్రదేశంలో వేంకటస్వామి నాయుడు అనే వయొలినిస్టు ఉన్నాడు. అతను చాలా సమర్థుడు. నాకంటే మించి వాయించగలడు’ అన్నాడు.
ఆయన ఔదార్యమూ, నాయుడిగారి వయొలిన్‌పై గౌరవమూ ఎంతటిదో గమనించండి’ అని ప్రకటించి అది వరకే నాయుడుగారు చేసిన ఏర్పాటు ప్రకారం తెర వెనుక నుండి ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్ చేతబట్టుకుని వేదిక నధిరోహించి, సభకు నమస్కరించారు. ఆ వేళ కచేరి అద్భుతం. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.
గోవిందస్వామి పిళ్లై అభిప్రాయాన్ని ద్వారం నాయుడు గారి వయొలిన్ కచేరీ నిరూపించింది. అదో మరపురాని ఘట్టం. సంగీత రసికులు నాయుడు గారి వాద్యంలోని మకరంద మాధుర్యాన్ని మనసారా గ్రోలి ఆ సంగీత కచేరీ న భూతో న భవిష్యతి అంటారు.

- మల్లాది సూరిబాబు 90527 65490