కాలజ్ఞానాన్ని వొడిసిపట్టుకుంటూ..
Published Saturday, 28 July 2018నేను..
జీవం + ప్రాణం + చైతన్యం
జీవ ప్రాణ చైతన్య సంయోగమే జీవితం.
జీవం ఉన్నంతవరకు, ప్రాణం ఉన్నంతవరకు, చైతన్యం ఉన్నంత వరకు నేను దేహమే.. ఈ దేహానిదే జీవితం. జీవ ప్రాణ చైతన్యాలు ఈ దేహం నుండి తప్పుకుంటే శరీరం శవమే అవుతుంది. ‘నేను’ మాత్రం ‘మాస్టర్’ అవుతుంది.
* * *
జీవం కోల్పోవటమే నిర్జీవం.. అదే మరణం. ఆ మరణానికి రూపమే శవం.
అంటే, జీవానికి రూపం శరీరం, నిర్జీవానికి రూపం శవం.
‘రూప’ నిర్మాణ పరంగా జీవం ఉన్నా లేకపోయినా, ప్రాణం ఉన్నా లేకపోయినా, చైతన్యం ఉన్నా లేకపోయినా నేనుకు ఉన్న భౌతిక శరీర నిర్మితి అంతా ఒక్కటే!
ఇలా హ్యూమన్ ‘అనాటమీ’ ఒక్కటే అయినప్పటికీ హ్యూమన్ ఫిజియాలజీ వేరు. అంటే, శరీరం ధర్మం శవ ధర్మం వేరువేరు అనే!
శరీర నిర్మాణాన్ని అవగతం చేసుకోవటానికి శాస్ర్తియ దృక్పథం సరిపోతుంది. అయితే దేహంలా అనిపించే ఈ ‘నిర్మాణ కాయా’న్ని అవలోకించటానికి గిక స్పృహ, తాత్విక చింతన, యోగసాధన తప్పనిసరి.
‘నేను’ నిర్మాణానికి ఒక దశ వరకు భౌతిక ఆచ్ఛాదన సరిపోతుంది. అదే ‘నేను’లోని ‘నేను’ను పునస్సృష్టించటానికి ఈ భౌతిక వనరులు కొంతవరకే సహకరిస్తాయి. వనరులు ఉడిగిన చోట నరనేత్రం సరిపోదు. మానస నేత్రం సరిపోదు. అధిమానవ, అధిమానస, అధి భౌతిక నేత్రం తేజరిల్లాల్సిందే. అదే త్రినేత్రం!
ఈ మూడో కంటికి కావలసింది ధర్మాన్ని పొదువుకున్న తత్వం. అధిభౌతిక తత్వం. అధి మానవ తత్వం. అధి ఆత్మతత్వం. శరీరాన్ని వీడిన జీవకళ, శవాన్ని వీడిన చైతన్య జ్వాల ఈ మూడో నేత్ర ప్రభ అవుతుంది.
దేహాన్ని మనసును పొదువుకుని సాగిన ప్రయాణంలో జ్ఞానం, విజ్ఞానం వికసించినా మృత్యు స్పర్శను అనుభూతించే గిక సాధనతో ప్రజ్ఞానం పరిఢవిల్లేది ఈ మాడో కంటిచూపుతోనే!
ఇలా, ‘నేను’ అనాటమీ + ఫిజియాలజీ + ఫిలాసఫీల సమ్మేళనం.
అన్నట్టు, ‘నేను’ది అయిదున్నర అడుగుల మానవ రూప వ్యవస్థనే అయినప్పటికీ ‘నేను’కు అంగాలు, అంగ వ్యవస్థలు ఎంత ముఖ్యమో కణాలు, కణజాలాలు అంతే ముఖ్యం.
ఇలా ‘నేను’ మీడియమ్‌గా ఒక ‘నిర్మాణకాయం’
* * *
నేను...
సృష్టిలోనే అతి పెద్ద జ్ఞాన భాండాగారం.. విజ్ఞాన ప్రయోగ క్షేత్రం.. ప్రజ్ఞాన విశ్వావరణ.
నేను... ‘విశ్వ’ ప్రతీక.
కొండ అద్దమందు కొంచెమై ఉంటుంది అన్నట్టుగా విశ్వ రహస్యాలన్నీ ‘నేను’లో వొదిగి ఉంటాయి.
అందుకే-
నేను - త్రినేత్రంగా విశ్వనేత్రం!
నేనులోని నేనుగా అంతర్నేత్రం!
నేను - అంతర్నేత్ర ప్రభనే కాదు. అత్యద్భుత యంత్ర ప్రతిభ కూడా. ఈ మానవ యంత్రానికి మించిన ఇంకొక యంత్రం ఈ భౌతిక ప్రపంచంలో మరొకటి ఉండబోదు - భవిష్యత్తులోనైనా!
నేను ‘నేను’గా పరిణమిస్తూ పోతుంటే మరొక అత్యద్భుత మానవ యంత్రం దివ్యరోచిస్సులతో ఆవిష్కృతం కావలసిందే తప్ప సృష్టి తనకు తానుగా ‘నేను’కు ధీటుగా మరొక యంత్రాన్ని అందించదు. అందుకే విశ్వనేత్రం చూపు మానవ తంత్రం పైనే నిగిడించి ఉంది.
* * *
నేను...
ఎముకల గూడులా అనిపించే హ్యూమన్ స్కెలిటన్.
ఈ అస్థిపంజర అల్లిక ఈ సృష్టిలో మరొక ప్రాణిగూటికి ఉందా? అని. ఈ అస్థిపంజరానికి ఉన్న చైతన్యం మరొక జీవగూటికి లేదేమో!
‘నేను’కు ఎంతటి మెత్తటి మనస్సో! ఈ ఎముకల గూటికీ అంతే మెత్తటి వ్యవస్థ! అందుకే ఎంతో గట్టివి అనిపించుకునే రెండు ఎముకలు కలిసే జాయింట్‌లో ఎంతో మెత్తటి ద్రవ పదార్థం సుతిమెత్తగా చైతన్య సారమవుతోంది. ఇలా ఎముకల గూడులోని ప్రతీ కదలికా నిశ్శబ్ద చైతన్య వాహికగా చిత్రాతి చిత్రమే!
అన్నట్టు, ‘నేను’ దేహంగా అత్యద్భుత రసాయనిక క్షేత్రం.. రసాయనశాల. క్షణక్షణం ఈ రసాయన శాల అలుపెరుగక ‘కర్తృత్వ బాధ్యత’ను వహించి, తన పని తాను చేసుకుంటూ పోతుండటం వల్లనే ‘నేను’ ఎంతటి ఘన, ద్రవ, వాయు పదార్థ సేవనం చేస్తున్నా ఇలా జీర్ణమై అలా జీవకళతో మనుగడ సాగిస్తోంది. తాగేది జావనే అయినప్పటికీ ఇలా జీవనానికి కావలసిన జవసత్వాలకు కొదువ లేకుండా పోతోంది.
ఎముకల గూడును తనలో దాచుకున్న మాంస కండర వ్యవస్థ, రక్తాన్ని శుద్ధిచేసే హృదయ వ్యవస్థ, ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని నియంత్రిస్తూ ప్రాణప్రదమవుతున్న శ్వాసకోశ వ్యవస్థ, మలినాలను బయటకు పంపుతూ ఆరోగ్యాన్ని చేకూర్చే చర్మ వ్యవస్థ, విసర్జిత వ్యవస్థ - ఈ వ్యవస్థల నుండి ఏ అవస్థా పడకుండా శక్తిని ఉద్భవింపచేస్తోంది ‘నేను’కు తావలమైన హ్యూమన్ బాడీ.
ఇలా, మానవ దేహంలా వ్యవహరింపబడుతున్నదంతా ‘కెమికల్ ప్లాంట్’ తప్ప మరొకటి కాదు. వేడెక్కుతున్న దేహాన్ని సమస్థితికి తెచ్చేది, చల్లబడే శరీరాన్ని సమ ఉష్ణోగ్రతలోకి తెచ్చేది ఈ రసాయనశాలనే. సదా నిశ్చలంగా 98.6 డిగ్రీల వేడిమిలో ఉంచుతూ ఆరోగ్యకర వాతావరణంలో ‘నేను’ను నిలపటం ఈ కెమికల్ ప్లాంట్ వల్లనే సాధ్యవౌతోంది.
ఇంకొక అతి ముఖ్య విషయం-
ఈనాటి కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ వ్యవస్థ మన మెదడు ముందు బలాదూరే! ఈ నేపథ్యంతో నేను ‘్ఫర్ ఎవర్ యూనివర్సల్ కంప్యూటర్’! కాబట్టి ఏ కంప్యూటర్ అయినా ఈ ‘నేను’ సృజిస్తే పని చేయాల్సిందే తప్ప స్వతంత్రంగా మాత్రం కాదు. ఏ యంత్రంలో ఎన్ని వైర్స్, ఎన్ని కేబుల్స్ ఉన్నప్పటికీ ‘నేను’లోని నాడీమండలం, నరాలకు మించినవి మాత్రం కావు. అసలు ప్రపంచంలోని అన్ని కంప్యూటర్ల కేబుల్స్, వైర్స్‌ను ఒక్కచోటికి చేర్చినా హ్యూమన్ బ్రెయిన్‌లోని నెర్వ్స్ వ్యవస్థే అతి పెద్దది అవుతుంది. అలాగే, మన కళ్లను మించిన ‘కెమెరాలు’ ఈ సృష్టిలోకి మరొకమారు రావేమో!
ఇంకొక మాట-
నేను ఎముకల గూడు అనుకున్నాం.. ఈ గూటిలోని ఎముకలు వయసుతోపాటు పెరుగుతూనే ఉంటాయి, అరుగుతూనే ఉంటాయి. కానీ చెవి వెనుకనున్న మూడు చిన్న ఎముకలు మాత్రం పుట్టిన నాటి నుండీ పుడమిని వీడేదాకా ఒకే సైజ్‌లో అంటే సేమ్ సైజ్‌లో ఉంటాయి. మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ప్రతీ నిమిషానికి మన గుండె ఆరు లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంటుంది. అంటే, ఉజ్జాయింపుగా రోజుకి ఎనిమిది వేల లీటర్ల రక్తం పంప్ అవుతోందన్నమాట.
అందుకే - నేను -
సృష్టి ప్రయోగంలో క్రౌన్ ఆఫ్ క్రియేషన్!
ప్రజ్ఞాన రచనలో ఇమ్మోర్టల్ బీయింగ్!!
కాలజ్ఞానంలో మాస్టర్ పీస్!! *