S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (అరణ్యకాండ-22)

లక్ష్మణుడికి వాతాపీల్వలుల
చరిత్ర చెప్పిన శ్రీరాముడు
*
వాసుదాసు వ్యాఖ్యానం
*
అరణ్యకాండ-22
*
పూర్వం ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే సోదరులు బ్రాహ్మణ వేషం వేసి బ్రాహ్మణులను చంపుతుండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం వేసుకుని, బ్రాహ్మణుల దగ్గరకుపోయి, ఆ రోజున తన ఇంట్లో శ్రాద్ధం ఉందనీ, నిమంత్రణకు రమ్మనీ, సంస్కృత భాషలో పిలుస్తాడు. పిలిచింది నిజమైన బ్రాహ్మణుడే అని మోసపోయి అంగీకరిస్తారు బ్రాహ్మణులు. వాడు తన తమ్ముడిని మేకగా చేసి, చంపి, ఆ మాంసాన్ని బ్రాహ్మణులకు వడ్డించేవాడు. (పూర్వకాలంలో మాంసం తినేవారు బ్రాహ్మణులు కూడా. దానిలోని చెడు గుణాలను, ఇలాంటి మోసాలను తెలుసుకొని దానిని నిషేధించారు) బ్రాహ్మణులు నోరారా తిని పొట్టలు తడవుకొంటూ కూర్చోగానే, ఇల్వలుడు ‘వాతాపీ రమ్ము..’ అని పిలిచేవాడు. అలా పిలవగానే వాతాపి వారి పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఆ బ్రాహ్మణులు చనిపోయేవారు. వారిని వారిరువురూ పీకి తినేవారు.
ఈ విధంగా రాక్షసుల వల్ల వేలాది మంది బ్రాహ్మణులు చనిపోయారు. అప్పుడు దేవతలు ప్రార్థించగా అగస్త్యుడు వారిని తన తపః ప్రభావం వల్ల శాంతింపచేశాడు. ఒకనాడు వీరు అగస్త్యుడికి నిమంత్రణం చెప్పగా ఆయన అంగీకరించి, భోజనానికి వెళ్లి సర్వం బక్షించాడు. శ్రాద్ధం ముగించిన తరువాత ఎప్పటిలాగా ఇల్వలుడు ‘వాతాపీ’ అని పిలిచాడు. అగస్త్యుడు అప్పుడు ‘నీ తమ్ముడి మీద రాక్షసాధమా, ఎందుకు భ్రాంతి? నీ తమ్ముడు జీవించి ఉన్నాడని అనుకుంటున్నావా? నీ భ్రాత చచ్చిపోయాడని తెలియదా? నా కడుపులోంచి బయటకు రావడం సాధ్యమా? నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్తా విను. మేకలాగా నా కడుపులో పడి జీర్ణమై నరకానికి పోయాడు తెలియదా?’ అని మందహాసంతో పలికాడు.
తన తమ్ముడు చనిపోయాడని తెలుసుకున్న ఇల్వలుడు కోపంతో అగస్త్యుడిని చంపడానికి ఆయన మీదకు పోవడానికి ప్రయత్నించగా, ఆ ముని, నిప్పులు కక్కే చూపులతో అతడిని భస్మం చేశాడు. అలాంటి మహిమ కలవాడి ఆశ్రమం ఇదే లక్ష్మణా’ అని చెప్పాడు శ్రీరాముడు. ఇలా చెప్తున్న సమయంలో సూర్యుడు అస్తమించే సమయం కావడంతో, సాయం సంధ్య వార్చి, మునీశ్వరుడు ఇచ్చిన పళ్లను తిని, ఆ రాత్రి అక్కడే గడిపారు సీతారామలక్ష్మణులు. ఆ తరువాత మునీశ్వరుడి అన్నను దర్శించడానికి పోవడానికి అనుమతి కోరారు. అనుమతి లభించగానే, సుతీక్ష్ణుడు చెప్పిన దారి వెంట పోసాగారు. దారిలో రకరకాల చెట్లను, పొదలను, తోపులను, మద్దులను, తాటిచెట్లను, తుమ్మ చెట్లను, పూల చెట్లను, ఆ వనంలో చూశారు. అలా పోతూ అగస్త్యుడి ఆశ్రమం పొలిమేరలకు చేరుకున్నారు.
అగస్త్యాశ్రమానికి చేరువవుతూనే శ్రీరాముడు లక్ష్మణుడితో ‘లక్ష్మణా! ఇక్కడికి సమీపంలోనే తన మహిమ వల్ల అగస్త్యుడని ప్రసిద్ధికెక్కిన మునీశ్వరుడి ఆశ్రమం ఉంది. ఈ వనం హోమధూమంతో నిండి ఉంది. అలసిపోయిన వారికి విశ్రాంతినిస్తుంది. నారచీరెలతో అందంగా ఉంది. శాంతమైన మృగాలున్నాయి. రమ్యమైన పక్షుల ధ్వనులు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఋష్యాశ్రమాలలో చేరిన ప్రదేశమే. ఈ పుణ్యాత్ముడు ఈ దక్షిణ దిక్కుకు వచ్చిన తరువాత రాక్షసులు క్రూర స్వభావం వదిలి భయంతో ఋషులను సమీపించి హింసించడం లేదు. దక్షిణ దిశకు అగస్త్య దిశ అని పేరుంది. సూర్యుడిని అడ్డగించాలనుకున్న వింధ్య పర్వతం ఈయన ఆజ్ఞతో నేలతో సమానమైంది. అగస్త్యుడు చిరకాలం జీవించి ఉండేవాడు. ఇతడి ఆశ్రమంలో అందరూ వినయవంతులు.. భయభక్తులున్నవారు. ఈయనను వీరు వారు అనే భేదం లేకుండా అందరూ సేవిస్తారు. కాబట్టి మనం సేవిస్తే మనకూ మేలు కలుగుతుంది. మనం వనవాసం చేయాల్సిన పధ్నాలుగేళ్లలో గడచిపోయిన కాలం పోగా, మిగిలిన కాలం ఈయనను కొలిచి ఈ ఆశ్రమంలోనే ఉందాం. ఈయన ఆహార నియమాలు కలవాడై అల్పాహారమే తీసుకుంటాడు కాబట్టి ఈయనను గంధర్వులు వచ్చి చూసి పోతుంటారు. వంచకులు, అసత్యవాదులు ఈ ఆశ్రమంలో బతకలేరు. దేవ - యక్ష - గంధర్వులు కూడా ఇక్కడ ఆహార నియమాలు పాటిస్తారు. ధర్మంలో ప్రేమగా ఉంటారు. ఇక్కడ తపస్సు చేసిన అనేక మంది తమ తపస్సిద్ధి వల్ల దేహం వదలి సూర్యతేజంతో విమానాల మీద దేవలోకాలకు పోయారు. ఇక్కడికి ఋషులు మాత్రమే కాకుండా ఇతర భూతాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. దేవతలను దర్శించి, వారిని స్తుతించి, నమస్కారం చేయడం వల్ల, దేవతలు వారికీ దేవత్వాన్ని, యక్షత్వాన్నీ అనుగ్రహిస్తారు. లక్ష్మణా, అగస్త్య ఆశ్రమానికి వచ్చాం. నువ్వు ముందుగా పోయి, నేను, జానకి వచ్చామని చెప్పు. త్వరగా పో’ అనగా లక్ష్మణుడు అలాగే చేశాడు.
-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12