S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆదర్శ శిఖరారోహణం

నిన్నటియాకలి నేడూ ఉన్నది/ కన్నదినంబె కడ చనెను/ పన్ని నిదుర, మాపటికి నున్నదదె/ యెన్నగ రాతిరి యెందోపోయ’/ ఎన్నడు తెలిశేము ఎచ్చరిక ఎపుడో? అంటాడు, అన్నమయ్య.
ఆకలేస్తుంది. అన్నం తింటాం. ఆ పూటకది సరి. పూట గడిచిందా? మళ్లీ అదే ఆకలి. మళ్లీ తింటాం. ఎంత తిన్నా పరగడుపే. సంగీత జ్ఞానం కూడా ఒక ఆకలి’. ఎన్నిసార్లు ఎంత తిన్నా జిహ్వ రుచులను కోరుతూంటుంది. ఎంత పాడినా, ఏదో కొత్త రకం కోరుతుంది.
సంగీత జిజ్ఞాస కూడా అంతే. తెలిసేకొద్దీ ఉత్తమ స్థితికి వెళ్లిపోతుంది మనసు. సముద్ర మట్టానికి 60 వేల అడుగుల ఎత్తులో వుండి ప్రపంచంలోనే ఎతె్తైన శిఖరం వౌంట్ ఎవరెస్ట్ - ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి, కార్యసాధకులైన ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే 1953లో అధిరోహించి జెండా పాతేశారు. వాళ్ల తర్వాత ఎందరో ప్రయత్నం చేసి, వెనుతిరిగి వచ్చేశారు.
సంగీత శిఖరం కూడా అంతే. శారీరం బాగా వుండి ఆటుపోట్లకు నిలిచి సద్గురువు నాశ్రయించి కీర్తి శిఖరాలందుకున్న మహావిద్వాంసులు మాత్రమే గుర్తుండిపోతారు.
వెనకటి తరంలో అటువంటి మహనీయులు ఎందరెందరో వున్నారు. కర్ణాటక సంగీత రంగంలో మహావైద్యనాథ శివన్, కోనేరి రాజపురం వైద్యనాథ భాగవతార్, మధురై పుష్పవనమయ్యర్, నాదస్వర విద్వాన్ టి.ఎన్.రాజరత్నం పిళ్లై, వేణుగానంలో శరభశాస్ర్తీ, మహాలింగం, వయొలిన్ విద్వాంసులలో ద్వారం వెంకటస్వామి నాయుడు, వీణాగానంలో ధనమ్మాళ్ వంటి మహావిద్వాంసులు, హిందూస్థానీ సంగీత రంగంలో ఉస్తాద్ బడే గులామాలీఖాన్, ఉస్తాద్ అమీర్‌ఖాన్, బిస్మిల్లాఖాన్, అల్లావుద్దీన్ ఖాన్, అబ్దుల్ కరీంఖాన్, రోషనారాబేగం, ఉస్తాద్ సలామత్ ఆలీఖాన్, ఉస్తాద్ నజాకత్ ఆలీఖాన్ (పాకిస్తాన్) వంటి వారు ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదిగి, మనం తల ఎత్తి నమస్కరించతగ్గ స్థాయికి చేరుకున్నవారే.
సంగీతం.. వీరెవ్వరికీ వృత్తిపరమైన విద్య కాదు. అది వారి ప్రవృత్తే. కొందరి వంశంలోనే ఉంది. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలే సంగీతం. అందుకే పుట్టారు. పాడవలసినంతా పాడి వెళ్లిపోయారు. ఎవార్డులైనా, రివార్డులైనా వారినే వెతుక్కుంటూ వెళ్లాయి. ప్రయత్నంతో వచ్చినవి కావు. పదిచోట్ల పాడిన పలుకుబడితో వారు సంపాదించి, కూడబెట్టుకున్న ఆస్తులూ లేవు. కీర్తి కండూతి లేదు. హిమాలయాలంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిపోయే మనస్తత్వం. నియమ నిష్టలతో నేర్చిన సంగీతమే వారికి అలవాటు చేసింది. అదే వారి మూలధనం.
మొట్టమొదటిసారి చంద్రమండలంపై అడుగుపెట్టిన వ్యోమగాములు పై నుండి క్రిందకు చూశారు. కెమెరాలో భూమి ఒక ‘చుక్క’లా కనిపించింది. ముగ్గురు వ్యోమగాముల్లో ఒకరైన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ సంభ్రమాశ్చర్యాలకు లోనై విస్తుబోయాడు. ‘ఈ అనంత విశ్వంలో నేనెంతటి వాడను. అణువునైన ఔదునా పరమాణువునైన ఔదునా? పర్వతముల ముందు నేను పరమాణువునైన కాదు. ఉదధి ముందు నిలిచిన - ఒక బిందువునైన కాను’ అని భావించాడు. అంతరంగమంతా ఆందోళనే. క్రిందకు దిగిన తర్వాత కొన్ని రోజుల వరకూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఈ అనంత చరాచర విశ్వంలో ‘నేను ఎక్కడ?’ ఏపాటి వాణిణ అనుకున్నాడు. భగవాన్ రమణుల దర్శనం చేసిన కొమ్ములు తిరిగిన మేధావులైన పండితులు, వేదాంతులు, ఆధ్యాత్మిక విదులు లోక విజేతలు ‘నేను’ అనే భావాన్ని వదిలించుకుంటే తప్ప దారి లేదని తెలుసుకుని నిజ మార్గానే్వషణలో కృతకృత్యులయ్యారు. ప్రపంచంలో అన్ని సమస్యలకూ కారణం ఈ ‘నేను’ అనే భ్రాంతే. మీరు చూడండి. ఇందుగలడందు లేడన్నట్లుగా సంగీత సాహిత్య కళారంగాల్లో రాజకీయాల్లో ఇప్పుడు విలయతాండవం చేస్తున్నది ఇదే.
ఎత్తు నుండి చూస్తే ‘చుక్క’లా కనిపించే ఈ భూమీద ఎనే్నసి యుద్ధాలు జరిగాయి. ఎంతెంత అహంకారాలు? కక్షలు, కార్పణ్యాలు? మనిషన్న వాడికి ఓ మదింపు కావాలి. అంటే వ్యక్తిగతమైన గుర్తింపు గుణాలు ఆధారంగా సమాజం అతన్ని గుర్తించాలని భావిస్తాడు. తను ఆశించిన స్థాయి ఏ మాత్రం తగ్గినా తట్టుకోలేడు. బాణాలు తగిలిన లేడిలా విలవిల్లాడిపోతాడు.
ఈ గుర్తింపులోని తేడాలవల్లే చరిత్రలో యుద్ధాలు జరిగాయి. అందలాలెక్కి అధికారం వెలగబెట్టిన వారి దగ్గర నుంచి, అడుగు బడుగు జీవనం గడిపేవాళ్ల దాకా అందరూ ఈ గుర్తింపునకు దాసులే. మత్తుకు దాసోహమైనవారే. కానీ చూడండి.
మన కవులు, పండితులూ, గాయకులు, మహావిద్వాంసులూ మత్తులు కాకపోయినా సమాజానికి ఎంతో చేయాలనే మత్తులో మంచి మంచి మహాకావ్యాలందించి ప్రసాదించి వెళ్లారు. తమను తాము మరిచి పాడేసిన గాన గంధర్వులు, సంగీతమే లోకంగా జీవించారు. రసిక హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. జీవనోపాధి కోసం సంగీతాన్ని ఆశ్రయించలేదు. అందుకే భవిష్యత్తరాలకు ఆదర్శ పురుషులయ్యారు.
‘యద్యదాచరిత శ్రేష్టః తత్తదేవేతరో జనః/ సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే’
ఎలా నడవాలో మనకు తోచదు. యితరులు చెప్తే నచ్చదు. ఏది మార్గం? అందుకే పెద్దలు, ప్రముఖులైనవారు దేన్ని ఆచరిస్తారో ప్రజలు కూడా వాళ్లనే అనుసరిస్తారు. అదే ప్రమాణంగా భావిస్తారు. దాన్ని కూడా విస్మరిస్తే మరి దిక్కులేదు. ‘నదీనాం సాగరో గతిః’ - శాస్త్ర ప్రమాణమే అన్ని విద్యలకూ దిక్సూచి. సంగీతానికి సంబంధించి మన పెద్దలు కొన్ని మార్గదర్శక సూత్రాలు నిర్వచిస్తూ సాధన చేసే పద్ధతిని ఎంతో వివరణాత్మకంగా చెప్పారు. ధ్వని వేరు మాధుర్యంతో నిండిన నాదం వేరు. ఇది అనుభవించేదే కానీ మాటల్లో చెప్పేది కాదు - వీటికి తేడా ఉందని తెలియాలి.
అక్షరాలనీ, పదాలనీ అర్థవంతంగా కూర్పు చేస్తేనే వాక్యాలు ఏర్పడతాయి. వాక్యాలు ఏర్పడని మాటలు వ్యర్థం.
మాటలకు సంగీతాన్ని జోడిస్తే కలిగేది నాదసుఖం.
స్వరాలు ఎడాపెడా ఎలా పడితే అలా ప్రయోగిస్తే అది గానమవ్వదు. రెండు, నాలుగు స్వరాలు వరుసగా పాడగా ఏర్పడేది ఒక తాళం. ఐదేసి స్వరాలతో మరో తాళం ఏడేసి స్వరాలతో పాడుకుంటూ పోతే ఇంకో తాళం.. ఇలా సప్తతాళాలూ ఏర్పడ్డాయి. సప్త తాళాల్లోనూ అలంకారాలుగా ప్రతి తాళంలోనూ అన్ని తాళాలూ దర్శనమిస్తూంటాయి.
మనం పాడే పాటలో రాగవైవిధ్యం ఎలా ఉంటుందో తాళాల్లో కూడా వైవిధ్యం కనిపిస్తూంటుంది. దీన్ని గమనించి అనుసరించేది మృదంగ వాద్య కళాకారుడే. లయ వాద్యం పరమార్థమే అది. ఈ రహస్యం తెలిసి పాడేవారి గానం త్రివేణీ సంగమంతో సమానం.
అందుకే ‘తెలిసి రామచింతనసేయవే’ అంటాడు త్యాగయ్య. ఏం పాడుతున్నామో ఎలా పాడుతున్నామో ముందు పాడేవారికే తెలియకపోతే వినేవారికెలా తెలిసేది? కర్ణాటక సంగీతంలో ‘తానవర్ణాల’కున్న ప్రాధాన్యత చాలా ఉంది.
రాగం పాడాలన్నా, ఒక కీర్తనకు అప్పటికప్పుడు స్వరకల్పన చేయాలన్నా మనోధర్మంతో ఒక మాటను వాగ్గేయకారుడు సూచించిన దానికంటే భిన్నంగా పాడాలన్నా ‘వర్ణాలే’ ఆధారం. తానవర్ణాలు, అటతాళ వర్ణాలు, గాయకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రిస్తూ పట్టువిడుపులను తెలియజేస్తూండే అద్భుత రచనలు యాంత్రికంగా పాడేవి కావు.
నిజాయితీ లేని సంగీత గురువులవల్లా లక్ష్యశుద్ధిలేని శిష్యుల వల్ల ప్రయోజనం ఉండదు. శరీర శారీరాలు రెండూ స్వాధీనం కాని శిష్యుల్ని భరిస్తూ వారి అపశృతిని సహిస్తూ, ఆత్మవంచనతోనో సర్దుబాటు ధోరణిలోనో తిరిగే సంగీత గురువుల వల్ల సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ. అలవికాని, పాడలేని విషయాలపై సాధారణంగా అందరికీ చిన్నచూపే. అర్హతలేని వారిని అందలమెక్కించే ప్రయత్నం అనర్థం. సంగీతమే ప్రాణమనుకునే జిజ్ఞాసులు రాగస్వరూప స్వభావాలు తెలియకుండా నాదసుఖానికి అర్థం కూడా బోధపడకుండా ఉబలాటంతో పాడేందుకు చేసే ఎటువంటి ప్రయత్నమైనా వృథాయే. నేల విడిచి సాము గరిడీలు ఎవ్వరూ చేయరు. జన సామాన్యంలో సంగీతాభిరుచిని కలిగించాలనే ఉద్దేశంతోనే రాష్టవ్య్రాప్తంగా సంగీత కళాశాలలు నడుస్తున్నాయని సమర్థించే ప్రయత్నం చేసేవారుండవచ్చు. సంస్కారం లేని సంగీత బోధనకు విలువలేదు.
సాధన కంటే సంగీత సంస్కారమే ముఖ్యం. ఎన్నాళ్లు చెబుతారు? ఈ స్వరాలు? ఏదో రామదాసు కీర్తనో, అన్నమాచార్య కీర్తనో చెప్పండి’ అంటూ తల్లిదండ్రులు అధ్యాపకుల్ని నిలువరించి మోహరించినంత కాలం, సంగీతం పెరగదు. పెరగనివ్వదు. పండంటి బిడ్డను కనాలంటే ఏ తల్లైనా నవమాసాలూ ఆగాల్సిందే - పసందైన పాట పాడాలన్నా, అంతే. ఆత్మవంచన తెలుసుకోనివ్వదు.
సుస్వరానికున్న రంగు, రుచి తెలిసిన మహానుభావులు వారి జీవితాలను అంకితం చేసి రాగనిర్ణయమంటూ చేసి వాటికి అద్భుతమైన పేర్లు పెట్టారు. 72 మేళకర్త రాగాలను సృష్టించారు. వాటికెన్నో జన్యరాగాలున్నాయనీ అనంతాలై రాగాః. రాగాలకు పరిమితి లేదు. ఎన్ని రాగాలనైనా సృష్టించవచ్చుననీ తేల్చారు.
త్యాగరాజు, శ్యామశాస్ర్తీ, ముత్తుస్వామి దీక్షితులకు 400 ఏళ్లకు ముందే రాగనిర్ణయం జరిగి లోకంలో సంగీత విత్తనాలు మొలకెత్తటం ప్రారంభమైంది.
భక్త్భివంతో యోగులు రాసే కీర్తనలకూ, భోగులు రాసే పాటలకూ ఎంతో తేడా ఉంటుంది. అంకిత భావంతో రాసుకుని పాడుకున్న వాగ్గేయకారులకూ, మిగతా వారికీ నక్కకూ నాగలోకానికీ వున్నంత వ్యత్యాసం. మొదటిది శాశ్వతం రెండోది అశాశ్వతం - ఎవరూ గుర్తుంచుకోరు. చెప్పేవారు లేక కాదు. చెబితే వినే సంస్కారం కరువైంది. తమకు తాము తన్నుత్తములుగా భావించేవారు... ఎంత చెప్పినా వినరు. విన్నట్లు నటిస్తారు. ఆచరించరు. అనుష్టానం చేసేవార్ని చూసి అవహేళన చేయడానికైనా వెనుకాడరు.
దివ్యమైన సంగీతం నేర్చుకోవటానికి దగ్గర మార్గాలంటూ లేవు. ఉండేదొక్కటే. రాజమార్గం. తినే పదార్థాల్లో ఉప్పు, పులుపు, కారం అన్నీ సమపాళ్లలో ఉంటేనే కడుపునిండే భోజనవౌతుంది. అలాగే శ్రుతి లయలతోబాట. పాటకు కావలసిన అన్ని హంగులూ సక్రమంగా ఉన్న గానం చెవికి రుచిని కల్గించి మనసును ఆనంద లోకాల్లో విహరింపజేస్తుంది.
ఇష్టమైతే ఎంత కష్టమైనా పట్టుదలతో నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం కలిగిన శిష్యులూ, వారిని ఉద్ధరించాలనే సదాశయాలతో, సంగీత జ్ఞానం కల్గిన సద్గురువులు కలిస్తేనే సంగీతం పెరుగుతుంది. ఇందులో ఎవరిలో లోపాలున్నా సరే, ప్రయోజనం సున్నా. ప్రతికూల వాతావరణంలో ఆటుపోట్లు తెలిసి, అనుకోని అవాంతరాలెన్ని ఎదురైనా తట్టుకుని నిలబడి తప్పటడుగులు వేస్తూ ఎన్ని తప్పులు చేసినా పరిష్కరించగల వారి శిక్షణలో రాటుతేలినవారే కీర్తి శిఖరం మీద కూర్చుంటారు. అసమర్థులు గిరి ప్రదక్షిణ చేస్తూ మిగిలిపోతారు. సంగీతమైనా అంతే. చౌకబారు ఆలోచనలతో ప్రయత్నమే లేకుండా కీర్తి రావాలనే కండూతి కలిగిన శిష్యుల్ని సాధారణంగా సద్గురువులు తమ సమీపానికి రానివ్వరు. మరో వీధిలో విద్వాంసుణ్ణి వెతుక్కోమంటారు. నిజాయితీ కలిగి, సంగీతం పట్ల సద్గురువుల పట్ల భక్తిగౌరవాలున్న వారికి దక్కేది ఆదర్శ శిఖరారోహణమే.

- మల్లాది సూరిబాబు 90527 65490