S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృషితో నాస్తి దుర్భిక్షం

కృషి, పట్టుదల, నిరంతర పరిశ్రమ, భవిష్యత్తును అంచనా వేయగలిగే నేర్పు, కష్టనష్టాలను సమాన దృష్టితో చూడగలిగే మనోస్థైర్యం కలవారు జీవితంలో తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుతారు. తాము అభివృద్ధిలోకి రావడమే కాదు తమ తోటివారి అభివృద్ధికి కూడా బాటలు నిర్మిస్తూ ముందుకు సాగుతారు.
నిజమే! తమ జీవన విధానం ద్వారా సమాజానికి మంచి సందేశం అందించి, పది మందికి ఆదర్శప్రాయంగా నిలిచేవారు సమాజంలో ఎప్పుడూ మాన్యులుగా పరిగణించబడతారు. అయితే ఈ స్థాయికి రావడం ఒక్కపూటలోనో, ఒక్క రోజులోనో జరుగదు. దాని వెనుక ఆ వ్యక్తి స్వయంకృషితోపాటు తన అయిన వాళ్ల తోడ్పాటు, త్యాగం కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది.
కొందరు గొప్పవాళ్లుగా పుడతారు. మరి కొందరు తమ కృషి ద్వారా గొప్పవారుగా మారుతారు. ఇంకా కొందరిపై గొప్పదనం ఆపాదించబడుతుంది. వీరిలో రెండవ కోవకు చెందినవారు కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ అధినేత ఏడుదొడ్ల జగన్‌మోహన్‌రెడ్డిగారు.
ఓ కుగ్రామంలో తమ జీవనయానాన్ని ప్రారంభించి నేడు తెలంగాణలో, ఆ మాటకొస్తే భారతదేశంలోని పలు దక్షిణాది, మధ్య రాష్ట్రాలలో అత్యుత్తమ ప్రమాణాలతో, నాణ్యతతో ముద్రించే ప్రింటర్స్‌గా పేరు సంపాదించిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ సంస్థ అధినేత ఎ.జగన్‌మోహన్ రెడ్డిగారి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం.
‘బ్రతుకు, బ్రతుకనివ్వు’ అనే నుడిని ‘బ్రతుకు, బ్రతుకునివ్వు’ అని మార్చి చూపిన నిర్విరామ కృషీవలుడాయన.
1958 జూన్ 12వ తేదీన వరంగల్ జిల్లాలోని దివిటిపల్లె గ్రామంలో ఏడుదొడ్ల సుగుణమ్మ, చంద్రారెడ్డి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు జగన్మోహన్‌రెడ్డి. వీరికి భారతి అనే చెల్లెలు, వెంకట రాంనర్సింహారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి అనే తమ్ముళ్లు ఉన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి గారి విద్యాభ్యాసం వరంగల్ జిల్లాలోని జఫర్‌గడ్‌లో జరిగింది. ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూనే మరోవైపు తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ వ్యవసాయం చేసేవారు. కర్షక వృత్తి అన్నా, తమ పుట్టిన ఊరు అన్నా ఎంతో అభిమానం కల జగన్‌మోహన్‌రెడ్డి గారికి జీవితంలో ఏదైనా సాధించాలనే ధ్యేయం బలంగా ఉండేది. పిత్రార్జితంగా లభించిన వ్యవసాయానే్న నమ్ముకోకుండా తాను బ్రతుకుతూ మరో నలుగురికి జీవనోపాధి కల్పించే పని చేపట్టాలని చూస్తున్న వీరికి హైదరాబాద్‌లో ఉన్న పిన్ని బాబాయి ఏడుదొడ్ల వెంకటరెడ్డి, నర్సమ్మ గార్ల రూపంలో మార్గనిర్దేశం జరిగింది. అంతే! వారితోపాటు 1974లో హైదరాబాద్ చేరి వారి వేణుగోపాల్ ప్రింటింగ్ ప్రెస్‌లో ఉంటూ పని నేర్చుకోవడం మొదలుపెట్టారు. అహర్నిశలు కృషి చేస్తూ చాలా త్వరలోనే ప్రింటింగ్ మెళకువలను ఔపోసన పట్టారు. ఈ క్రమంలోనే 1975లో వీరి చెల్లెలు భారతికి గాదె రవీందర్‌రెడ్డి గారితో వివాహం జరిగింది.
1980లో కేవలం 15000 రూపాయల పెట్టుబడితో ప్రింటింగ్ ప్రెస్ లెటర్‌ప్రెస్ టెక్నాలజీతో రైతు జీవనాన్ని ప్రతిబింబించేలాగా ‘కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్’ పేరుతో ప్రారంభించి, అంతా తానై ఒక్కడే నడిపించసాగారు.
1982లో గోలి నారాయణరెడ్డి, సుశీలమ్మ గారి కనిష్ఠ పుత్రిక సంపత్‌కుమారితో వివాహం జరిగింది. అదే సంవత్సరం జగన్‌మోహన్ రెడ్డిగారి పెద్ద సోదరుడు వెంకటరాం నర్సింహారెడ్డి కూడా అన్నకు తోడుగా ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేయడం ఆరంభించారు. వారే కాకుండా మరి కొంతమంది బంధువులను కూడా సహాయంగా తీసుకొని ప్రింటింగ్ ప్రెస్ నడపసాగారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలోనే అనుకోని అవాంతరంగా వెనె్నముకలో ఏర్పడిన సమస్య వల్ల 1985లో జగన్‌మోహన్ రెడ్డి గారికి స్పైనల్ కార్డ్ మేజర్ ఆపరేషన్ జరిగింది. అయితే ఆపరేషన్‌కు ముందు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి నడకను పాక్షికంగా కోల్పోయారు. తర్వాత ఆరునెలలపాటు బెడ్‌పైనే ఉన్నారు. పెళ్లైన రెండేళ్లలోనే ఇలా జరిగినా సంపత్‌కుమారి గారు ఏ మాత్రం కలత చెందలేదు. ఆ సమయంలో ఎంతో నిబ్బరంగా వ్యవహరించి, భర్త మరిది బాగోగులను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ఏనాడూ ధైర్యం కోల్పోకుండా జగన్‌మోహన్ రెడ్డిగారిలో నూతనోత్సాహం నింపారు. వారి నిరంతర తోడ్పాటుతో ఆరు నెలల్లోనే హాండ్‌స్టిక్ సాయంతో నడుస్తూ, రిక్షాలో ప్రయాణించి ప్రింటింగ్ ప్రెస్‌కు వెళ్లడం మొదలుపెట్టారు జగన్‌మోహన్‌రెడ్డి. ఈ విధంగా వారికి 9 సంవత్సరాలకి ఒకసారి చొప్పున మూడుసార్లు ఆపరేషన్లు జరిగాయి. ఈ సమయంలో ఊళ్లో భూములు, వ్యవసాయం పనుల్లో తలమునకలై, ఆ పల్లె జీవితానికి అలవాటుపడిన వీరి తల్లిగారు ఊరిలోనే ఉండిపోయినా, సంపత్‌కుమారి గారు భార్యగా, తల్లిగా, వదినగా, యజమానురాలిగా అనేక పాత్రలు సమర్థంగా నిర్వహిస్తూ, జగన్‌మోహన్ గారికి ఏ మాత్రం ఇంటి బాధ్యతలు అప్పగించకుండా పూర్తి సమయం వ్యాపార నిర్వహణలో గడిపేందుకు పూర్తి సహకారం అందించారు. కార్యేషుదాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాతా, క్షమయా ధరిత్రి.. ఈ గుణాలన్నీ కలబోసిన సుగుణాల రాశి సంపత్‌కుమారి వంటి అర్ధాంగి లభించడం తన జీవన విజయం వెనుక ముఖ్య కారణం అంటారు జగన్‌మోహన్‌రెడ్డి.
1986 నుండి వీరి చిన్న తమ్ముడు ఉత్తమ్‌రెడ్డి కూడా ప్రెస్‌లో పని చేయడం మొదలు పెట్టారు. 1990వ సంవత్సరంలో జగన్‌మోహన్ రెడ్డి, సంపత్‌కుమారి దంపతులకు రాజశేఖర్‌రెడ్డి జన్మించారు. 1991లో పెద్ద తమ్ముడు వెంకట రాం నర్సింహారెడ్డి గారికి అరుణతో వివాహం జరిగింది. తర్వాత కొంతకాలానికి 1992లో వీరి తండ్రి ఏడుదొడ్ల చంద్రారెడ్డి గారు స్వర్గస్థులయ్యారు.
తండ్రి మరణం తర్వాత పెద్ద తమ్ముడు ఊరికి తిరిగి వెళ్లిపోయి వ్యవసాయం పనులు చూసుకొనేవారు. అప్పుడూ వారానికి ఒకసారి ఊరికి వెళ్లి తమ్ముడికి వ్యవసాయం గురించి సలహాలు, సూచనలు ఇచ్చి వచ్చేవారు. వెంకట్‌రాం నర్సింహారెడ్డి గారికి చంద్రశేఖర్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్ అమెరికాలో ఎం.ఎస్. చదివాడు. రవి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
1997లో చిన్న తమ్ముడు ఉత్తమ్‌రెడ్డికి కవితతో వివాహం జరిపించారు. వీరికి ఒక కుమారుడు మణిశేఖర్, ఒక కుమార్తె శ్రేయ కలిగారు. వీరు ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నారు.
1998లో అంటే హైదరాబాద్‌కు వచ్చిన 24 సంవత్సరాల తర్వాత సొంత ఇల్లు నిర్మించుకున్నారు.
మెల్లమెల్లగా ప్రింటింగ్ ప్రెస్‌ను విస్తరిస్తూ మరి కొంతమందికి జీవనోపాధి కల్పించారు. సమయపాలన, నాణ్యతలను పాటిస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో మరో ముఖ్యమైన ముందడుగు 2002 సంవత్సరంలో వీరు ఫోర్ కలర్ మెషీన్‌ను కొనుగోలు చేయడం. ఆ తర్వాత సంస్థను వేగంగా విస్తరిస్తూ మరిన్ని మెషీన్లు అందుబాటులోకి తెచ్చారు. మానవ వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్టల్ర నుండి ప్రింటింగ్ అవసరాల నిమిత్తం కర్షక్‌కు వచ్చేలా సంస్థను తీర్చిదిద్దారు.
2008లో వౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో షెడ్ తీసుకొని వెబ్ మెషీన్‌తో అక్కడ బ్రాంచిని ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం వారి పెద్ద తమ్ముడు మళ్లీ ఊరి నుండి హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారంలో పాలుపంచుకోవడం మొదలుపెట్టారు. ప్రతీ వారం ఊరికి వెళ్లి వ్యవసాయ పనులు చక్కబెట్టి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ విధంగా ముగ్గురు అన్నదమ్ములు ఏకత్రాటిపై నిలుస్తూ, నిర్విరామంగా కృషి చేస్తూ 2014లో వౌలాలిలోనే మరో యూనిట్‌ను ప్రారంభించారు.
పుట్టిన ఊరి నుండి ఒక్కడు వచ్చి నేడు దాదాపు 300 - 350 మందికి జీవనోపాధిని కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డి సర్వదా అనుసరణీయులు. వీరి సలహాలు, సూచనలతో ఎంతోమంది తమ సొంత వ్యాపారాలు ప్రారంభించారు. సూర్య ఆర్ట్ ప్రింటర్స్, కార్మిక్ ప్రింటర్స్, సాయిరాం గ్రాఫిక్స్, ఎస్.ఆర్.డిజిటల్స్, ఎస్.ఆర్.ఎంటర్ ప్రైజెస్, ఎస్.ఆర్.ట్రేడర్స్.. ఇలా ఎన్నో ఎనె్నన్నో వీరి ఆశీస్సులతో నేడు అభివృద్ధి పథంలో సాగుతున్నాయి.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి