S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూలమూర్తికి నిత్యాలంకరణలు

శ్రీ వేంకటేశ్వర స్వామి పుష్పాలంకారప్రియుడు తిరుమల శ్రీనివాస ప్రభువుకు చేసే అన్ని సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనదని, పవిత్రమైన కార్యమని ‘‘తిరువాయ్ మొళి’’ అనే గ్రంథంలోకూడా పేర్కొన్నారు. స్వామిని క్షణ్మాత్రకాలం చూస్తేనే జీవితం ధన్యమవుతుందని తలిచే మానవునికి స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల పుష్పహారాలతోసర్వాంగ సుందరంగా అలంకరింపబడిన పూమాలలు తమ అదృష్టాన్ని ఇంకేవిధంగా భావిస్తాయోకదా! ఒకసారి ఈ పుష్పహారాల వివరాలను తెలుసుకుందాం.
శిఖామణి
కిరీటం మీద నుంచి రెండు భుజాలమీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది ఎనిమిది మూరల దండ
సాలగ్రామ మాల
శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు.
కంఠసరి
మెడలో రెండు పొర్వలుగా రెండు భుజాలమీదికి అలంకరింపబడే దండ ఒకటి మూడున్నర మూరలు.
వక్షస్థల లక్ష్మి
శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కటిన్నర మూర.
శంఖుచక్రం
శంఖుచక్రాలకు రెండు దండలు, ఒక్కొక్కటి ఒక మూర
కఠారిసరం
శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి. రెండు మూరలు.
తావళములు
రెండు మోచేతుల కింద, నడుము నుంచి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుంచి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే మూడు దండలు.
1.మూడు మూరలు. 2. మూడున్నర మూరలు. 3. నాలుగు మూరలు.
తిరువడి దండలు
శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర. ప్రతి గురువారం జరిగే ‘‘పూలంగిసేవ’’లో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పై పేర్కొన్న మాలలతోపాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. ఇవి గాక శ్రీవారి ఆనందనిలయంలోని వివిధ ఉత్సవమూర్తులకు కూడా ఈ క్రింది విధంగా పూలమాలలు సిద్దం చేయబడి సమకూర్చబడుతాయి.
ఉత్సవమూర్తులకు నిత్యమూ అలంకరింపబడే పూలదండల వివరాలు
భోగ శ్రీనివాసమూర్తికి - ఒక దండ
కొలువు శ్రీనివాసమూర్తికి - ఒక దండ
శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వామికి - మూడు దండలు
శ్రీదేవి, భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి - మూడు దండలు
శ్రీ సీతారామలక్ష్మణులకు - మూడు దండలు
శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణులకు - రెండు దండలు
చక్రత్తాళ్వారుకు (సుదర్శనుడు) - ఒక దండ
అనంత గరుడ విష్వక్సేనులకు - మూడు దండలు
సుగ్రీవ అంగద హనుమంతులకు - మూడుదండలు
ఇతర విగ్రహమూర్తులకు అలంకరించే పూలదండలు
బంగారువాకిలి ద్వారపాలకులు - రెండు దండలు
గరుడాళ్వారు- ఒక దండ
వకుళమాలిక - ఒక దండ
భగవద్రామానుజులు (మూలమూర్తికి, ఉత్సవమూర్తి)- రెండు దండలు
యోగనరసింహస్వామి - ఒకదండ
విష్వక్సేనుల వారికి - ఒకదండ
పాటు తయారు- ఒక దండ
బేడి ఆంజనేయస్వామికి - ఒక దండ
శ్రీ వరాహస్వామి ఆలయానికి -మూడు దండలు
కోనేటిగట్టు ఆంజనేయస్వామికి - ఒక దండ ( ప్రతి ఆదివారం మాత్రమే)
*
అంతేకాకుండా శ్రీ స్వామివారి నిత్యకల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకుగాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలో కూర్చబడుతాయి. శ్రీ స్వామివారికి అలంకరించే మాలలకు గానూ తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గనే్నరులు,సన్నజాజులు, మొల్లలు, మొగిలి, కమలం (తామర), కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపుచెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం,బిలువం (మారేడు) ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలు వెదజల్లే ఎన్నో పుష్పజాతులను, పత్రాలను శ్రీవారి పుష్పకైంకర్యంలో వినియోగిస్తారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా శ్రీ స్వామివారికి జరిగే తోమాలసేవ (పుష్పకైంకర్యం)కు గాను ఈ పుష్ప అర నుంచి సిద్ధం చేయబడిన పూలమాలలను, జియ్యంగార్లు తలపై పెట్టుకొని బాజాభజంత్రీలతో ఛత్రచామర మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగావచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది. ఇలా ఇంతటి విశిష్టతను కలిగి ఉండి ఎందరో పరమభక్తుల్ని స్మరింపచేస్తూ, నిత్యమూ శ్రీవారి పుష్పకైంకర్యంలో పాలుపంచుకొంటూ ఉన్న ఈ పుష్పమండపాన్ని (పూల అరను) మనసారా కీర్తిస్తూ పుష్పమండపాధిపతి అయిన తిరుమల గోవిందుని మనసారా పిలుస్తూ భక్తి కుసుమాలతో అర్చిద్దాం.

-రామాపురం రాజేంద్ర ఫొటోలు: తలారి రెడ్డెప్ప