S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నవరస భరితం.. ఆయన జీవితం ( ప్రకాశం కథలు)

కాలం గడుస్తూనే ఉంటుంది. దశాబ్దాలు, శతాబ్దాలు ఎనె్నన్నో దొర్లుతూ పోతూ ఉంటాయి. అలాగే ఆ కాలవాహినిలో ఎందరెందరో కలిసిపోతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ కొందరు మహానుభావులు మాత్రము చరిత్రలో చెరగని ముద్రతో నిలిచి తన తరం వారినేగాక భావితరాల వారిని కూడా ప్రభావితులను గావిస్తూ ఉంటారు. అటువంటి వారిలో ప్రకాశంగారు అగ్రగణ్యులు. ప్రకాశం గారిని తలుచుకున్నప్పుడల్లా ఆశ్చర్య చకితులవుతుంటాము. గగుర్పాటు కలుగుతుంటుంది. గత చరిత్ర గుర్తుకు రావడంతో పాటు అనిర్వచనీయమైన ఆనందం పరవళ్లు తొక్కుతుంటుంది.
రాజకీయాల్లో ఎందరో పాల్గొంటారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. కొన్నికొన్ని సందర్భాలలో సమస్యలను సృష్టించుకుంటారు. కానీ ఎట్టి సమస్యలలోనైనా, పరిస్థితులలోనైనా ప్రజల పక్షాన నిలిచి ప్రజా నాయకులుగా గుర్తింపు పొందుతారు. తెలుగు గడ్డపై అలాంటి నాయకులలో ఆంధ్రకేసరి ప్రప్రథములు.
దేశం కోసం లక్షలాది మంది త్యాగం చేశారు. వారిలో ఆ త్యాగం ఉన్న పదవిని వదులుకోవడం వరకో, లాఠీదెబ్బలు తినడం వరకో, జైలుకు వెళ్లడం వరకో, కష్టాలు పడటం వరకో, ఆస్తులను నష్టపోవడం వరకో పరిమితమై ఉంటుంది. కానీ తన భార్యాపిల్లలను కూడా పట్టించుకోకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం సర్వం త్యాగం చేసినవారు బహు కొద్దిమందే ఉన్నారు. వారిలో అగ్రగణ్యులు పంతులుగారు.
భయమనేది ఎలా ఉంటుందో అది ఏమిటో ప్రకాశం గారికి అసలు తెలీదు. ప్రమాదాన్ని శంకించి, పరాజయానికి బెదిరి తన సంకల్పాన్ని మార్చుకోవడం, మాట తప్పడం, మడమ తిప్పడం ఆయన జీవితంలో ఏనాడూ లేదు. పైపెచ్చు అచంచల చిత్తంతో ఎదుర్కొనేవారు. అంతేకాకుండా ప్రత్యర్థుల మంత్రాలు కుతంత్రాల చేతనో, ప్రతికూల పరిస్థితుల వల్లనో దెబ్బ తిన్నప్పుడే ప్రకాశంగారు తన మహా ఔదార్యాన్ని ప్రదర్శించేవారు. ఆయన కూడా ఒక్కొక్కప్పుడు తప్పుదారులు తొక్కక పోలేదు. కానీ వారి వాత్సల్యం, నిష్కల్మషమైన అనురాగం, మనసారా చేసిన త్యాగాల వలన ఆంధ్ర ప్రజానీకం మాత్రమే కాక దక్షిణ భారత ప్రజ ఆయనను అక్కున చేర్చుకుంది. ఆయన తప్పులను క్షమించింది. మా ఆంధ్రకేసరి, మా ప్రకాశం అని జేజేలు కొట్టింది. మళ్లీ మళ్లీ గెలిపించుకొంది.
ప్రకాశం గారు స్థాపించిన స్వరాజ్య పత్రిక సంపాదకులు పంతులుగారి నమ్మినబంటు. ప్రియ శిష్యుడైన ఖాసా సుబ్బారావు గారు ప్రకాశంగారి వ్యక్తిత్వం గురించి ఈ విధంగా విశదీకరించారు. ‘... ప్రమాద పరిస్థితులలోనే ప్రకాశంగారి ఉదాత్తత వెలికి వచ్చేది. ప్రకాశం గారిని చూచినప్పుడల్లా తన తలంపునకు చర్చిల్‌గారే వచ్చేవారని లోగడ మద్రాస్ గవర్నర్‌గా పని చేసిన సర్ ఆర్చిబాల్డునై నాతో అనేకమార్లు చెప్పాడు. ఇద్దరివీ సింహంలాంటి ముఖాలు. ఇద్దరి మూర్తులు అత్యంత గంభీరాలు. ఇద్దరూ మేరు సమధీరులు. చర్చిల్ వలె ప్రకాశం కూడా జాతీయ వీరుడుగా పరిగణించబడి ప్రజల ప్రేమాదరాలను అపారంగా చూరగొన్నారు. ప్రజా హృదయంలో ఆయన నెలకొల్పుకున్న స్థానానికి ఎంతటి ప్రతికూల ప్రచారం కూడా భంగం కలిగించేది కాదు.’
ఆ మహానుభావుడికి త్యాగమే, ఆయన ఆదర్శప్రాయమైన జీవితమే భావితరాల ప్రజలకు ఒక చుక్కానిలాగా, వేగుచుక్కలాగా, వెల్గుబాటగా నిలిచింది అనడానికి ఈ ఉదాహరణ ఒక మచ్చుతునక మాత్రమే. ప్రకాశంగారి ప్రభావం పసి హృదయాలలో కూడా, లోకం పోకడ తెలియని, లేలేత చిన్నారులపైన కూడా ఏ విధంగా ముద్ర వేసిందో తెలుసుకుందాం.
పి.రాజపోలనాయుడు గారు ప్రకాశంగారి అనుచరుడు (తరువాత 1955లో జరిగిన ఎన్నికలలో శాసనసభ్యుడుగా గెలిచారు.) ప్రకాశంగారు ‘ఆదర్శ నాయకుడు’ అని చెప్తూ ఈ విధంగా విశదీకరించారు. ‘... 1930లో మేము కళ్లు తెరవని పసిబిడ్డలం. వార్తలకూ, విశేషాలకు అందుబాటులో లేని మారుమూల పల్లెల్లో పెరుగుతున్నాం. అయినప్పటికీ ప్రకాశంగారి పేరు మాత్రం మా గ్రామంలో ఆనాటికే మారుమోగుతున్నది. ‘ప్రకాశంగారట, తెల్లదొరల తుపాకులకు ఎదురునిలిచి, కాల్చగలిగితే కాల్చండి అని గుండె చూపాడట... ధైర్యం అంటే వారిదే ధైర్యం.. అలాంటి వారు పదిమంది ఉంటే తెల్లోళ్లు ఉచ్చులు తెంపుకొని పారిపోయి ఉండేవారు.. సింహం ముందు ఎవరు నిలువగలరు? ఈ విధంగా పెద్దలు, పిన్నలు రచ్చబండల మీద కూర్చొని కథలు కథలుగా చెప్పుకునేవారు.. మా గుండెలు ఉవ్వెత్తున ఉప్పొంగేవి. మేమిదివరకు ఇంగ్లీషు వారినే చూడలేదు. వారు ఏమి చేస్తున్నారో మాకు తెలియనే తెలియదు. కానీ వారి మీద వ్యతిరేకత ఏర్పడింది. వారిని మన దేశం నుండి తరిమివేయాలనిపించింది. అలా మా లేత హృదయాల నాకట్టుకోగలిగారు. ప్రకాశం గారంటే రైతుబిడ్డలమైన మాకందరికీ ఒక విధమైన గౌరవం, భక్తి.. ఒక రకమైన ఆకర్షణ ఏర్పడింది? ఆనాటి ఆ పసి పిల్లవాడు 1955లో శాసనసభ్యు డైనాడు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. నిజమైన నాయకుడు తన తోటివారిని నాయకునిగా తీర్చిదిద్దగలగాలి. ఎవరూ, చూడని మార్గాన్ని తను చూడాలి. ఆ మార్గాన ముందు తను పయనించాలి, తరువాత ప్రజలను ఆ మార్గాన నడిపించాలి. ప్రజల ఉన్నతి కోసం ప్రజల అభ్యుదయం కోసం కొత్తకొత్త పథకాలను రచించాలి. వాటి ఫలితాలను ప్రజలకు సమంగా పంచాలి. అతనే నిజమైన ప్రజానాయకుడు. ఈ గుణాలన్నీ ప్రకాశంగారికి సహజ ఆభరణాలు.
గాంధీజీ లాగానే ప్రకాశం కూడా అశక్తులను సశక్తులుగా మార్చగలిగారు. లక్షలాది మంది మానసిక దౌర్బల్యాన్ని తన గంభీరోపన్యాసాల ద్వారా, కార్యాచరణల వలన ఇట్టే తుడిచేసి వారిలో నవ చైతన్యాన్ని సృజింపచేసేవారు. ఒక రకంగా చెప్పాలి అంటే ‘గాంధీ-ప్రకాశం’ గార్ల సంబంధం ‘ద్రోణ- ఏకలవ్య’ సంబంధంలా గోచరిస్తుంది వారి జీవితాలను పరికించిన వారికి. గాంధీజీ ప్రభావానికి లోనై సర్వసంగ పరిత్యాగులైన వారిలో ప్రకాశంగారు గాంధీగారి మనసులోనే కాకుండా గాంధీగారి ఆలోచనలలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
గాంధీజీ వంటి మహానాయకుడు సైతం ఒక్కొక్కప్పుడు ప్రకాశం వ్యక్తిత్వాన్ని, చిత్తశుద్ధి, త్యాగనిరతి, నిరంతర ప్రజాసేవ చూసి ఆశ్చర్య చకితులయ్యేవారు. నిజానికి ఒక సత్యాన్ని నిర్మొహమాటంగా చెప్పడంలో, నమ్మిన సిద్ధాంతాన్ని హరిహరాదులు అడ్డొచ్చినా ఆచరించే ధీరత్వాన్ని చూసి ప్రకాశంగారిని గాంధీగారు, ద్రోణుడు ఏకలవ్యుడ్ని బ్రొటనవేలు ఇమ్మని అడిగినట్లుగా ప్రకాశం గారిని ఖాదీ తీవ్రత విషయంలో కోరడం జరిగింది. కాంగ్రెస్‌లో ఉన్న హేమాహేమీలు, మేధావులు తమను గాంధేయవాదులుగా చెప్పుకునే శిష్యకోటి ఖాదీ ఉద్యమంలో పాల్గొనడానికి ముందుకు రాలేదు. కారణం ఏమైనా కావొచ్చు - మిల్లుదార్లతో విభేదాలు, ప్రాణాపాయం, ఓటు బ్యాంకులు ఇలా ఎన్నో కుంటిసాకులు కావొచ్చు. గాంధీగారు ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి అని తీవ్రంగా చింతిస్తున్న సమయంలో తన మాటే కాదన్న ప్రకాశంగారు గుర్తుకొచ్చారు.
టి.వి.రాఘవరావు గారు, ఎస్.వెంకటేశ్వరన్‌గారు, ఐసిఎన్ ప్రొవెన్షియల్ టెక్స్‌టైల్ కమిషనర్లుగా ఉండగా ఢిల్లీలో 1946 సెప్టెంబర్‌లో గాంధీగారితో ఇంటర్వ్యూ చరిత్రలో ముఖ్యమైనదిగా వారు రాసుకున్నారు. గాంధీజీ తన చింతన, బాధ అంతా మర్చిపోయి ఆ అధికార్లతో ప్రకాశం గారితో తను కోరుకుంటున్నదని చెప్పమన్న పలుకులు ఇవి. ‘నా ప్రియ అధికారులారా! నాకు ప్రకాశానికి మధ్య అభిప్రాయ భేదాలున్నప్పటికి, నాకు ప్రకాశం గారంటే ఆదరణనే తప్ప వ్యతిరేకత ఏనాడూ లేదు. నా ‘గ్రామీణ నిర్మాణ కార్యక్రమం’ జయప్రదం కావాలి అంటే మొట్టమొదటి కార్యం కేంద్ర ప్రభుత్వం పంపించనున్న మిల్లు, మరకదళ్లని నిరాకరించడం. అంతేకాకుండా ఉన్న వాటిని కూడా మూయించగలగడం. ఈ రెండూ అత్యంత సాహసోపేత చర్యలు చేపడితేనే గ్రామాలలోని ఖాదీ పరిశ్రమ, చరఖా కార్యక్రమాలు, నూలు వడకడం వంటి సామాన్య ప్రజారంజక రంగాలు అభివృద్ధి చెంద గలుగుతాయని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. దీనికి గాను నా మాటగా ప్రకాశానికి చెప్పండి. మద్రాస్ ప్రధానిగా ప్రకాశంగారు మిల్లులను తిరిగి పంపిస్తే (నా సూచన మేరకు) ఏమైనా దుష్ఫలితాలు సంభవిస్తే నా భుజస్కంధాల మీద తీసుకొని నేనే ఏకైక బాధ్యుడ్ని కాగలను. ఒకవేళ సత్ఫలితాలు సంభవిస్తే (కచ్చితంగా ఉంటాయి) అవి కేవలం ప్రకాశం, ఆయన ప్రభుత్వానికి మాత్రమే చెందుతాయి. ఈ విజయం ప్రకాశానికే చెందుతుంది. ఎందుకంటే ఈ సాహసం కేవలం కేసరులే చేయగలరు కనుక.’ ప్రకాశంగారు గాంధీ సందేశం విన్న వెంటనే మిల్లుదార్లతో, బడా బాబుల నుంచి గొప్పగొప్ప దిగ్గజాల నుంచి వ్యతిరేకత, విభేదాలు, తగాదాలు వస్తాయి అన్న ప్రమాదాన్ని లెక్కచేయకుండా, పైగా తన ప్రభుత్వానికే ముప్పు వస్తుందని తెలిసినా ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి ఇచ్చినట్లుగా, మరకదళ్లను తిప్పి పంపాడు. సామాన్య ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించ గలిగాడు కానీ ప్రత్యర్థుల కుతంత్రాలకు బలైనాడు. గాంధీగారి మెప్పులు, వ్యాపారస్తుల దెప్పులు చిరునవ్వుతో భరించారు ఆంధ్రకేసరి. అందుకే ఆయన దీనజన బాంధవుడు.
తరువాతి కాలంలో స్వార్థపరులు, దొడ్డిదారులు తొక్కే రాజకీయ నాయకుల కారణంగా ప్రకాశంపై అవిశ్వాసం నెగ్గడంతో ప్రజా ప్రభుత్వం పడిపోయింది. ప్రజాపక్షపాతి, ప్రజల మనిషి ప్రకాశాన్ని పదవీచ్యుతులను చేశారు. అలాంటి నాయకులు సభలకు వచ్చిన సందర్భాలలో ప్రజలు తీవ్రంగా నిరశించి, చెప్పుల దండలతో సత్కరించి సభలను జరగకుండా అడ్డుకున్నారు.
ఆంధ్రదేశపు నడిబొడ్డున విజయవాడలో ప్రకాశం కాంస్య విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ విధంగా ఆ మహామనీషిని తమ మనసులలో నింపుకున్నారు ఆనాటి ప్రజానీకం. తెనే్నటి విశ్వనాథం, టి.వి.ఎస్. చలపతిరావు గారలు ఈ శుభ కార్యానికి నడుం బిగించారు. అతి కొద్దిసమయంలోనే 25వేల రూపాయలు విరాళాలు అందినాయి. 1951 జనవరి 23న ఏకంగా 82 రెండెడ్లబండ్లు ఒకదాని వెనుక ఒకటి రాగా, ప్రకాశంగారి చిత్రపటాన్ని ఊరేగిస్తూ వచ్చారు. లక్షలాది అభిమానులు పాల్గొన్నారు. వారి ఆనందోత్సవాలతో, జైజై నినాదాలతో నగరం మొత్తం పండుగ వాతావరణం సంతరించుకొంది. రఫీ అహ్మద్ కిద్వాయిగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ప్రకాశంగారి త్యాగాలు, ఆస్తులు, ధనం రూపాలలోనే కాక పదవులను, అధికారాలను కూడా దీనజన హితానికి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తృణప్రాయంగా వదిలేశారు. మద్రాసులో అధ్యక్ష పదవి, ప్రధానమంత్రి పదవి, పెద్దల విన్నపాల మేరకు అది కూడా దేశ ప్రగతి కోసం వదులుకున్నారు.
1957లోని సంఘటనను కె.ఎస్.సుబ్రహ్మణ్యంగారు ‘ప్రకాశం ప్రకాశమే’ అన్న వ్యాసంలో ప్రకాశంగారి గాంభీర్యాన్ని చక్కగా వివరించారు. మంత్రి వర్గీయులందరి గుండెల్లో రైళ్లు పరిగెడ్తున్నాయి. సంజీవరెడ్డిగారికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పంతులుగారిని నిలబెట్టారు. పంతులుగారంటూ నిలబడ్తే నీలంగారి ఓటమి తప్పదు. ఈ పరిస్థితులలో ‘ఆంధ్రా జనతా’ ఎడిటర్‌గా సుబ్రహ్మణ్యంగారు ప్రకాశంగారి దర్శనార్థమై పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. ప్రకాశంగారు ఆ వయసులో కూడా తనని గుర్తుపట్టి కుశల ప్రశ్నలు వేసి కూర్చోమన్నారుట.
సంభాషణ వారిరువురి మధ్య జరిగినది ఇదిగో...
‘పంతులుగారూ! పార్టీ నాయకత్వానికి మీరు పోటీ చేస్తున్నారని వింటున్నాం ఎంతవరకూ నిజం! అని నెమ్మదిగా కదిల్చాను. నమ్మండి నమ్మకపోండి. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎదురుప్రశ్న వేశారు. ఆ ప్రశ్న వింటే మీరూ ఆశ్చర్యపోతారు.
‘అవునురా! నిలబడమని అడుగుతున్నారు. అదే ఆలోచిస్తున్నాను. నీ సలహా ఏమిటి? నా దగ్గరలోనే పిడుగు పడ్డట్లనిపించింది. అంత గొప్పవాడు అటువంటి పెద్ద విషయంలో నా సలహా అడుగుతున్నాడు. షాక్ నుంచి కోలుకొని, గుండె దిటవు చేసుకొని తోచింది అన్నాను.
.... మీరు మళ్లీ పోటీ చేస్తే ముక్కోటి ఆంధ్రులు సంతోషిస్తారు.. సంజీవరెడ్డిగారు మీ ప్రియ శిష్యులే కదా? మీ ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వయసులో మీరీ భారాన్ని వహించగలరా? పోటీ చేయకపోవడమే ఉత్తమమని అనుకుంటున్నాను..
‘... నిజమేరా. నువ్వు చెప్పింది నిజమేరా! బొడ్డు నుంచి పై వరకూ బాగానే ఉంది. కానీ దిగువ ఏమవుతున్నదో నాకు తెలీదు. అలానే రాసేయిరా. నేను పోటీ నుంచి విరమిస్తున్నానని!’ వారి ఆత్మ అంతటి పరిశుభ్రమైనది. పదవులను ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకుని వేలాడే రోజులలో ప్రకాశంగారి నిర్మలత, స్వచ్ఛత, నిస్వార్థత ఎవరిలో చూడగలం?
ప్రకాశంగారు ఆంధ్ర రాష్టమ్రంతటా తిరుగుతూ తన ప్రజలను కలుసుకుంటూ ఉండేవారు. నిరంతరం ప్రజాక్షేమమే. ప్రజల కోసం, ప్రజలతో మమేకం ఆయన దినచర్య. విరామం ఎరుగని కర్మయోగి. 20 మే 1957న అనంత జ్యోతిలో కలిసిపోయారు. ఒక యుగం ముగిసింది.
1872, ఆగస్టు 23న జన్మించిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు 1957, మే 20న హైదరాబాద్‌లో స్వర్గస్థులైనారన్న వార్త యాద్భారతం దుఃఖాశ్రువులు కార్చింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ, అనేక ప్రజా సంస్థలు ఆంధ్రకేసరికి తమ గాఢ సంతాపాన్ని వ్యక్తపరిచాయి.
పార్లమెంట్‌లో సంతాపం ఈ విధంగా ప్రభుత్వం తెలియజేసింది. ఒక మహోత్కృష్ట వ్యక్తి అస్తమించారు. వారు తీర్చిదిద్దిన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, జాతీయ రంగం నుంచే ఒక మహత్తర వ్యక్తి నిష్క్రమించారు.’
ప్రపంచ చరిత్రలో ప్రకాశం కంటె ధైర్యశాలులుండవచ్చు. త్యాగులుండవచ్చు. దేశభక్తులుండవచ్చు. స్వాతంత్య్ర సమర వీరులుండవచ్చు. పరిపాలనా దక్షులుండవచ్చు. ప్రతిభావంతులుండవచ్చు. పాత్రికేయులుండవచ్చు. రక్తులుండవచ్చు. విరక్తులుండవచ్చు. భోగులుండవచ్చు. యోగులుండవచ్చు. కానీ ఈ గుణాలన్నీ ఒకేచోట రూపుగొన్న నాయకులరుదు. అదే ప్రకాశంగారి విశిష్ఠత.
పంతులుగారి ఆశయసిద్ధి కోసం, వారి కలలను నిజం చేయడానికిగాను, 1972, ఆగస్టు 23న ప్రకాశంగారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా పంతులుగారి వంశీయులు స్వర్గీయ టంగుటూరి సూర్యనారాయణరావు గారు ‘ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ’ను స్థాపించారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ పి.వి. నరసింహారావుగారు హైదరాబాద్‌లో సంస్థను ప్రారంభించి ప్రోత్సహించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రకాశంగారి ఆశయాలైన ‘గ్రామ స్వరాజ్యం’ ‘గ్రామోద్ధరణ’ ‘అక్షరాస్యత’ రంగాలలో విశేష కృషి జరుపుతున్నది.
ప్రకాశం గారి గురించి, ఆయన వ్యక్తిత్వంపైన, జీవిత విశేషాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించారు టంగుటూరి సూర్యనారాయణ రావుగారు. వారి కలం నుండి జాలువారిన కవిత నిజంగా పంతులుగారి జీవిత విశేషాలకు అద్దం పడ్తుంది - ‘మన ప్రకాశం’లో.

మన ప్రకాశం ( -కీ.శే. టంగుటూరి సూర్యనారాయణరావు )

ఆంధ్రుల కగ్రజుడెవ్వడు
ప్రజలకు ప్రియతమ నాయకుడెవ్వడు
బ్రిటిష్ గుండెల్లో బల్లెమెవ్వడు
అఘటిత ఘటనా సమర్థుడెవ్వడు
అతడే అతడే ఆంధ్రకేసరిగ వెలిగినాతడే!
రెండు చేతులతో సంపాదింపగ
నాల్గు చేతులతో వెదజల్లంగను
యోగిగ భోగిగ రోజులు గడపగ
గర్జన వెనుకని మెత్తని మనసుతో
గ్రామాభ్యుదయం సాధించాలని
జమీందారులను తుడిచేయాలని
అప్పుల బాధల తొలగించాలని
బీదల పాలిట కల్పతరువులా
ఆంధ్ర కేసరిగ వెలిగినాతడె!
నమ్మిన పథకము వొదిలిపెట్టలే
దొల్లని మాటకు తలను వంచలే
దెప్పుడేటి కెదురీత జంకలే
దెవడు దేశమున కంకితమెవ్వడు
అతడే అతడే ఆంధ్రకేసరిగ, వెలిగినాడతడే!
విగ్రహాదులేల వింతలేల
మనసులేని వొట్టిగుర్తులేల
నిండు గొంతెత్తి చెప్పరేల?
ఆంధ్రమూర్తి యితడు, ఆంధ్రకీర్తి యితడు
ఆంధ్రజాతి యితడు, ఆంధ్ర సర్వస్వమితడు!

-టంగుటూరి శ్రీరాం.. 9951417344