S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం -101

మీకో ప్రశ్న:
========
రాముడు చెప్పిన రాజనీతిలో మండలం మధ్యలో ఉన్న రాజుని ఏమంటారు?

(అయోధ్యకాండ సర్గ 100, 47వ శ్లోకం నించి)
రాముడు శతృఘు్నడిని ప్రశ్నించడం కొనసాగించాడు.
‘వ్యవసాయంతో, గోరక్షణతో జీవించే వైశ్యులంతా నీకు అనుకూలంగా ఉన్నారు కదా? వ్యవసాయం, పశువుల పాలన మీద ఆధారపడిన ప్రజలంతా సుఖంగా అభివృద్ధి చెందుతున్నారు కదా? నువ్వు వాళ్లందర్నీ రక్షిస్తూ, ఆపదలని తొలగిస్తూ పాలిస్తున్నావు కదా? ఎందుకంటే రాజు దేశంలోని ప్రజలు అందర్నీ ధర్మంతో రక్షించాలి. స్ర్తిలతో మంచి మాటలు మాట్లాడుతూ వాళ్లని బాగా రక్షిస్తున్నావు కదా? నాగవనాన్ని రక్షిస్తున్నావు కదా? ఆడ ఏనుగులు ఎక్కువగానే ఉన్నాయి కదా? ఆడ ఏనుగులు, గుర్రాలు, ఏనుగులు ఉన్నవి చాలని నువ్వు వాటి విషయంలో తృప్తి చెందడం లేదు కదా? రాజకుమారా! నువ్వు నిత్యం ఉదయమే నిద్ర లేచి, చక్కగా అలంకరించుకుని రాజమార్గానికి వెళ్లి ప్రజలకి కనిపిస్తున్నావు కదా? నీ కింద పనిచేసే వారంతా నిన్ను చూడ్డానికి భయపడకుండా లేరు కదా? మరీ భయం చేత వాళ్లు దూరంగానే ఉండిపోవడం కూడా లేదు కదా? ఈ రెండూ కాక మధ్య మార్గాన్ని అవలంబించడమే మంచిది.
‘దుర్గాలు అన్నిటిలో ధనధాన్యాలు, ఆయుధాలు, నీళ్లు, యంత్రాలు, శిల్పులు, ధనస్సుని ధరించిన వాళ్లు కావలసినంతగా ఉన్నారు కదా? భరతా! నీ ఆదాయం అధికంగా ఉండి, వ్యయం చాలా తక్కువగా ఉంది కదా? నీ ధనం అపాత్రుల చేతుల్లోకి వెళ్లడం లేదు కదా? దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు, అతిథులు, యోధులు, మిత్రవర్గాలు కోసం మాత్రమే నువ్వు ఖర్చు చేస్తున్నావు కదా? పూజ్యుడు, పరిశుద్ధమైన మనసు కలవాడైన పురుషుడి మీద ఏదైనా అపరాధం ఆరోపించబడితే, శాస్త్రాలలో నేర్పు గలవారి చేత ఆ నేరాలని అడిగించకుండానే దురాశతో ఆ పురుషుడిని చంపేయడం లేదు కదా? దొంగిలించే సమయంలో చూసిన సాక్షి చేత చూడబడిన వాడు, పట్టుబడ్డ వాడు, ప్రశ్నించబడ్డ వాడు, లాభం ఉన్న వాడైన దొంగని లంచంతో (అధికారులు) విడిచి పెట్టడం లేదు కదా?
‘్భరతా! తన ఇష్టం వచ్చినట్లు శాసనం చేస్తూ, ఏ రాజు అమాయకుడ్ని శిక్షిస్తాడో అతను కార్చిన కన్నీరు ఆ రాజు కొడుకుల్ని, పశువుల్ని నశింపచేస్తుంది. దానం, మనసు, వాక్కు అనే మూడిటితో వృద్ధులు, బాలలు, ఉత్తములైన పండితులని వశం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నావు కదా? గురువులు, వృద్ధులు, మునులకి, దేవతలు, అతిథులు, దేవాలయాలకి, బ్రాహ్మణులకి నమస్కారం చేస్తున్నావు కదా? నువ్వు అర్థం చేత ధర్మాన్ని కాని, ధర్మం చేత అర్థాన్ని కాని, అధిక సుఖాల ఆసక్తితో, కామంతో ధర్మార్థాలని కాని బాధించడం లేదు కదా? విజయాన్ని సాధించగల వాడివి, కాలం తెలిసిన వాడివి, శ్రేష్ఠుడివైన ఓ భరతా! నువ్వు ధర్మార్థ కామాలు అన్నిటినీ తగిన కాలాల్లో విభజించి, వాటిని సేవిస్తున్నావు కదా? సమస్తమైన శాస్త్రార్థాల్లో పండితులైన బ్రాహ్మణులు నీకు, నీ పౌరులకి, జానపదులకి సౌఖ్యం కలగాలని కోరుకుంటున్నారు కదా? నాస్తికత్వం, అసత్యం, క్రోధం, ఏమరుపాటు, పనుల విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనలతోనే కాలాన్ని గడపడం, జ్ఞానులని నిర్లక్ష్యం చేయడం, సోమరితనం, ఇంద్రియాలకి వశమవడం, మంత్రులు ‘దేనికి? అన్నిటికీ నేను ఒక్కడినే’ అని ఆలోచించడం, విషయం అర్థం కాని వాళ్లతో ఆలోచన చేయడం, నిర్ణయించిన పనులు ప్రారంభించక పోవడం, ఆలోచనల్ని రహస్యంగా ఉంచకపోవడం, మంగళకరమైన పనులని చేయకపోవడం, చాలామంది శత్రువులని ఒకేసారి ఎదిరించడం అనే పధ్నాలుగు రాజదోషాలని నువ్వు విడిచి పెడుతున్నావు కదా?
‘ఓ భరతా! పది గుణాలు (జూదం, వేట, పగటి నిద్ర, ఇతరులని నిందిస్తూ మాట్లాడటం, స్ర్తిలు, మదం, నృత్య, గీత వాద్యాలు, వ్యర్థంగా తిరగడం) ఐదు రకాల శత్రుత్వం (శత్రువు, ధనం, స్ర్తిలు, కఠినమైన మాటలు అనే అపరాధం వల్ల కలిగే ఐదు రకాల శత్రుత్వం) నాలుగు విధాలు (్ధనాన్ని న్యాయంగా సంపాదించడం, రక్షించడం, అభివృద్ధి చేయడం, అర్హత గలవారికి దానం) స్వపక్షానికి చెందిన ఏడుగురు (తనవాడు, మిత్రుడు, ఆశ్రీతుడు, బంధువు, బావమరిది, పని వల్ల పరిచయమైనవాడు, సేవకుడు, ఉపకారాలు చేయడం వల్ల పరిచయమైనవాడు) ఎనిమిది గుణాలు (పుకార్లు, సాహసం, ద్రోహం, ఇతరుల ధనాన్ని అపహరించడం, ఈర్ష్య, అసూయ, మాటల్లో కోపం, కొట్టడం అనే కోపాన్ని కలిగించే గుణాలు) మూడు కార్య లోపాలు (శక్యం కాని పనులు చేయడానికి పూనుకోవడం, అజ్ఞానంతో శక్యమైన పనులని చేయడానికి ప్రయత్నించక పోవడం, శక్యమైన పనులని సమయం కాని సమయంలో చేయడం) మూడు విద్యలు (వేదాలు, వార్త - వ్యవసాయం, గోరక్షణ, వర్తకం, ఇంద్రియాన్ని జయించడం - దండ/ రాజనీతి) ఆరు గుణాలు (సంధి, విరోధం పెట్టుకోవడం, దండెత్తి వెళ్లడం, అనుకూల సమయానికై ఎదురుచూడటం, బలం లేని వాడు, బలం ఉన్నవాడు ఐన ఇద్దరు శత్రువులతో మాటల్లో మాత్రమే మంచిగా ఉండటం, బలవంతుణ్ని ఆశ్రయించడం) దైవ, మానుషం (దైవం వల్ల కలిగే ఐదు విధాలైన ఆపదలు - అగ్ని, జలం, వ్యాధులు, దుర్భిక్షం, మరణం - మనుషుల వల్ల కలిగే ఐదు విధాలైన ఆపదలు - అధికారులు, దొంగలు, రాజసన్నిహితులు, రాజు దురాశ) కృత్యం (శతృపక్షంలో జీతం దొరకని పిసినారులు, అవమానించబడ్డ ఆత్మాభిమానం కలవారు, నిష్కారణంగా కోపించబడ్డవారు, భయపెట్టబడ్డ ధీరులు అనే నాలుగు రకాల వారిని వాళ్లకి కావాల్సినవి ఇచ్చి తన వైపు తిప్పుకోవడం) వింశతి వర్గం (ఎట్టి పరిస్థితుల్లోను సంధి చేసుకోడానికి తగని వాళ్లు, విరోధం చేతే సాధించతగ్గ వాళ్లైన ఇరవై రకాల శతృసముదాయం - చిన్న వాడు, వృద్ధుడు, దీర్ఘరోగి, బంధువులు వెలివేసిన వాళ్లు, పిరికివాడు, పిరికిపందలైన జనం కలవాడు, లోభి, లోభులైన జనం కలవాడు, మంత్రుల ప్రేమని పొందనివాడు, ఎక్కువ భోగలాలసుడు, చపలచిత్తుడు, దేవ, బ్రాహ్మణులని నిందించేవాడు, శపించబడ్డ వాడు, మానవ ప్రయత్నం మాని దేవుడి మీద ఆధారపడేవాడు, రాజ్యంలో దుర్భిక్షం ఏర్పడినవాడు, వ్యసన పరులైన సేన కలవాడు, స్వదేశంలో ఉండని వాడు, చాలామంది శత్రువులు కలవాడు, కాలం అనుకూలించని వాడు, సత్యం, ధర్మం లేని వాడు అనే ఇరవై రకాల శత్రువులతో విరోధం తప్ప సంధి చేసుకోకూడదు) ప్రకృతులు (మంత్రులు, దేశం, దుర్గాలు, ధనాగారాలు, దండం) మండలం (తన రాజ్యాన్ని విస్తరించాలనుకునే రాజు చుట్టుపక్కల ఉన్న పదకొండు విధాల రాజుల సముదాయం - మధ్యలో రాజు, వారికి ముందు శత్రువు, మిత్రుడు, శత్రువు మిత్రుడు, మిత్ర శత్రువు, శతృమిత్ర మిత్రుడు అనే ఐదుగురు. వెనుక భాగంలో పారిణిగ్రాహుడు, పార్షిణిగ్రాహుడు, ఆక్రందుడు, పార్షిగ్రాహాసురుడు, ఆక్రందాసురుడు అని ఐదుగురు ఉంటారు. పక్కన వాడు మధ్యస్థుడు. వాటికి బయట ఉండే వాడు ఉదాసీనుడు. ఇది ద్వాదశ రాజ మండలం) యాత్రా విధానం, దండ విధానం, సంధి, విగ్రహాలనే రెండు కారణాలు... వీటన్నిటినీ చక్కగా అర్థం చేసుకుని అనుసరిస్తున్నావు కదా?
‘నువ్వు శాస్త్రోక్త లక్షణాలు గల ముగ్గురు, నలుగురు మంత్రులతో కాని, అందరితో కలిసి కాని, వేరువేరుగా కాని రహస్యంగా ఆలోచనలు చేస్తున్నావు కదా? నువ్వు చదివిన నేరాలు, నువ్వు తల పెట్టిన పనులు, నీ భార్య, నువ్వు విన్న శాస్త్రాలు సఫలమైనాయా? భరతా! నేను కోరుకునే విధంగా నీ బుద్ధి ధర్మార్థ కామాలలో శ్రద్ధ కలదై, ఆయుష్షు కీర్తి లని వృద్ధి పొందించేదిగా ఉందా? సన్మార్గంలో నడిపించే మంగళకరమైన ఏ ఆచారాన్ని మన తండ్రి అనుసరిస్తున్నాడో, మన ముత్తాతలు అనుసరించారో దాన్ని నువ్వు కూడా అనుసరిస్తున్నావు కదా? పండిన మధురమైన పదార్థాలని ననువ్వు ఒక్కడివే తినకుండా వాటి మీద అభిలాష గల నీ మిత్రులకి కూడా ఇస్తున్నావు కదా? మహా బుద్ధిశాలి, విద్వాంసుడు ఐన రాజు సమస్త రాజ్యాన్ని పొంది ప్రజలని తగిన విధాలుగా దండిస్తూ, యథా శాస్త్రంగా ధర్మంగా పరిపాలిస్తూ మరణించాక స్వర్గానికి వెళ్తాడు కదా!’ ఇలా లక్ష్మణుడు భరతుడ్ని రాజనీతికి చెందిన వివిధ అంశాలని ప్రశ్నించాడు.
ఆ రోజు ఆశే్లష వెంట వచ్చి ఆ హరికథని విన్న వాడి అమ్మమ్మ మీనమ్మ ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో చెప్పింది.
‘హరిదాసు ఆరు తప్పులు చెప్పాడ్రా. ఇంటికెళ్లాక అయోధ్య కాండలోని వందవ సర్గ తీసి చూడు. అందులో ఇవి లేవు’
ఆవిడ ఆ తప్పుల్ని చెప్పింది. మీరా తప్పులని పట్టుకోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
------------------------------
అయోధ్యకాండలోని వందో సర్గకి కచ్చిత్ సర్గ అని ఎందుకు పేరు వచ్చింది?
అందులోని ప్రతీ శ్లోకంలో కచ్చిత్ (అవునా?) అని వస్తూంటుంది కాబట్టి పండితులు దానికి ‘కచ్చిత్ సర్గ’ అనే పేరు పెట్టారు.
===================================

1.హరిదాసు 100వ సర్గని పూర్తి చేస్తాను అని చెప్పాడు కాని ఇంకా పూర్తి కాలేదు.
2.రాముడు గౌరవించే వారిలో వైద్యుల గురించి కూడా అడిగాడు. హరిదాసు అది చెప్పలేదు.
3.హరిదాసు తప్పుగా మంత్రుల అర్హతల్లో ధనవంతులని కూడా చేర్చాడు. కాని ‘్ధనవంతులనే’ అన్న మాట వాల్మీకి రాయలేదు.
4.వాల్మీకి మంత్రుల అర్హతల్లో ‘విద్యావంతులు’ కూడా చేర్చాడు. హరిదాసు దీన్ని విస్మరించాడు.
5.రాముడు భరతుడ్ని ‘వివిధ పనుల సామర్థ్యం గురించి తెల్లవారుఝామున ఆలోచిస్తున్నావు కదా?’ అని అడిగాడు. హరిదాసు ఆలోచించాల్సిన ఈ విలువైన కాలం గురించి చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి