S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అవాంఛిత రోమాలతో అవస్థలు

స్ర్తిలకు తలపైన ఒత్తయిన మెత్తని కురులు ఎంతో అందం. అవి కొంత మందిలో బిరుసుగాను, వంకీలుగాను, ఉంగరాలతోను కూడా అందమిస్తాయి. అయితే అవి వేరే అసహజమైన ప్రదేశాలలో అంటే ముఖంపైన పై పెదవి మీద, చిబుకం మీద, చేతులు ముంజేతులు, మోకాళ్ల మీద నల్లని వెంట్రుకలు ఉంటే అది గమనించి చికిత్స చేయించవలసిన పరిస్థితి. ఛాతి మీద కూడా కనిపించవచ్చు. గొంతు స్వరం మారవచ్చు. చిన్నపిల్లల్లో ఇలా ఉంటే అది కొన్ని రోజులు పోయినాక రాలిపోవచ్చు. కానీ బాలికలకి 10-15 సం. వయసులో అంటే రజస్వల వయసులో కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు అవసరం. గైనకాలజిస్టు లేక శిశు వైద్య నిపుణులు కొన్ని పరీక్షలు నిర్వహించి, రోగమున్నదా లేక వంశపారంపర్యమా (జెనెటిక్) నిర్ధారించగల్గుతారు. ముక్య కారణం బాలికలలో ఉండే హార్మోన్ల నిష్పత్తి మారిపోవడమే. ఈస్ట్రోజన్ అనే స్ర్తి హార్మోను, ఏండ్రోజన్ అనే పురుష హార్మోన్ల నిష్పత్తి నార్మల్‌గా లేకపోతే వెంటనే చికిత్స అవసరం. అదేకాక ఆ పురుష హార్మోన్లు ఎక్కడ్నించి ఉత్పత్తి అవుతున్నాయో చూడాలి. ఎడ్రినల్ గ్రంథి, తర్వాత ఓవరీలు ఈ రెండూ పురుష హార్మోన్లు స్రవిస్తాయి. ఎడ్రినల్ కంతులు, లేక లోపాలు గాని ఓవరీలలో గాని పిసిఓడి అనే కారణం లేక ఒవేరియన్ సిస్టు, కంతులు దీనికి కారణం కావచ్చు. దీనికి వైద్య సలహా ప్రకారం అల్ట్రా సౌండ్, సిటి స్కాన్ అవసరం పడవచ్చు. కొన్ని హార్మోన్ల పరీక్ష - టెస్టోస్టిరాన్ 17 - కీటోస్టిరాయిడ్స్, ఇన్సులిన్ వంటివి చేస్తారు.
చికిత్స కారణాలను బట్టి ఉంటుంది. పిసిఓడి కి ఓవరీల మీద పనిచేసే మందులు లేక ఇంజక్షన్లు, కంతుల వల్ల అయితే దానికి మందులతోపాటు ఆపరేషన్లు, లాపరోస్కోపీ వంటివి అవసరం అవుతాయి.
అయితే మెనోపాజ్ దరిదాపులలో కూడా ఈ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ దశలో ఓవరీలు శక్తిహీనం అవడంవల్ల స్ర్తి హార్మోన్లు ఈస్ట్రోజన్ వంటివి లోపించడం లేక బాగా తగ్గిపోవడం వల్ల ఏండ్రోజన్ల ప్రభావం ఎక్కువై నిష్పత్తి మారిపోతుంది. వారికి గడ్డం మీద చెంపల మీద, పై పెదవి మీద మీసాల లాగ వెంట్రుకలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని హిర్సుటిజమ్ అంటారు. వీటివల్ల శరీర ఆరోగ్యం మీద ప్రభావం లేకపోయినా స్ర్తిల మనస్సుపై ముఖ్యంగా బాలికలు, యువతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
రుతుక్రమంలో కూడా అపసవ్యత వుండవచ్చు. రుతుక్రమం దూరదూరంగా రావడం 2-3-6 నెలల వరకూ రాకపోవడం లేక కొన్ని సంవత్సరాలు ఆగిపోవడం కద్దు. మెనోపాజ్ దశ అందరూ అంగీకరిస్తారు గాని బాలికలు యువతులు దానివల్ల కూడా మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది.
ఈ మధ్యకాలంలో స్ర్తిల దుస్తుల ఫ్యాషన్ వల్ల కాళ్లు పిక్కలు చేతులు కన్పించడం సర్వసాధారణం. కనుక వారు రోమాలను అసహ్యించుకుని చికిత్స కోసం వెంపర్లాడుతారు.
చికిత్స - కారణాన్ని నిర్మూలించడమే కాక వెంట్రుకలు పోగొట్టాలి. దీనికి అనేక మాత్రలు, లేజర్ వంటి చికిత్సలు చేయించవచ్చు. నోటి మాత్రలు ఏంటీ ఏండ్రొజన్స్ అనేవి లభిస్తున్నాయి. వైద్యుల సహాయంతో పర్యవేక్షణలో వాడితే ఓపికతో వాటిని నివారించుకోవచ్చు. సైప్రొటిరాన్, డ్రోస్పెరినాన్ అనేవి ముఖ్యమైన మందులు. ఇవి సరియైన మోతాదులో నిర్ణయించిన కాలంలో వాడితే 5-6 నెలలకి వెంట్రుకలు పెరగడం ఆగిపోవడమే కాక ఉన్నవి క్రమేపీ రాలిపోతాయి. కొంతమందికి ఓసి పిల్స్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ బిళ్లలు వాడడం వల్ల అందులోని ఈస్ట్రోజన్ వల్ల వెంట్రుకలు పెరుగుదల ఆగిపోతుంది. ఇంతకు ముందే పెరిగిన వాటిని లేజర్ సహాయంతో నిర్మూలించవచ్చు. బ్లేడుతో షేవింగ్ అసలే చేయకూడదు. దానివల్ల మరింత త్వరగా పెరుగుతాయి.
కొంతమంది స్పెషలిస్టులు స్పైరనోలాక్టోన్, మెట్‌ఫార్మిన్ బిళ్లలు వాడడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తున్నారు. కొద్దిగా వున్న వెంట్రుకలకి ఇపైలేషన్, వాక్సింగ్ వంటి పద్ధతులు చాలు.
ఇంక తలపై వెంట్రుకలు రాలిపోతుంటాయి. మధ్యభాగం పల్చబడటం, చెంపలపైభాగం మాడు బట్టతల రావచ్చు. ఆచోట తలపై రాసుకునే మందులు - మినాక్సిడిల్, ఎనాస్టిమ్, ఈస్ట్రోజన్ సొల్యూషన్‌లు దొరుకుతాయి.
అన్నిటికంటె ముఖ్యం పేషెంట్‌కి మనోధైర్యం పెంపొందించడం. మెనోపాజ్ దశలో కావలసినది వ్యక్తిత్వం ఆత్మస్థైర్యం తప్ప అందచందాలు కావని డాక్టర్లు కౌన్సిలింగ్ చేయాలి. నిజానికి పెద్ద వయసులో వారి విలువ అంతకంతకు పెరుగుతుంది కాని రూపం వల్ల తగ్గదు కదా!

-- డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో