S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒంటరి.. మనం

‘నిజమే.. నాకూ.. ఓ భావన ఏడ్చిందిగా.. ఆయన ఎవరో అన్నది నేనూ అల్లాగే ఎల్లా అనగలను..’ అంటూ రుసరుసలాడ్తూ గదిలోకెళ్లారు అవధాన్లు.
‘ఓ.. ఈ వయసుకి ఈయన గారికి ఓ భావన -గావల్సి వచ్చింది కామోసు-
పిదప కాలం పిదప బుద్ధులంటే ఇవే మరి.. కలికాలం..’ విసురుగా ఫోన్ అందుకుంది కామాక్షమ్మ.
ఇంతకీ ఏం జరుగుతోంది ఇద్దరి నడుమా? అంటే వడ్లగింజలో బియ్యపు గింజ - ఆవకాయ పిండిలో శనగ్గింజ. ఇంట్లో ఇద్దరే అయిపోయేటప్పటికి ఊసుపోక చిలవలు పలవలు అవుతుంటారు ముసలి దంపతులిద్దరూనూ.
దూరదర్శన్‌లో ఆ పాత మధురాలేవో వస్తూ వుంటే అవధాన్లుగారు ఆలాపనగా అందుకున్నారు. ‘పిండి వెనె్నల జాబిలి.. పండు పున్నమి జాబిలి..’ అంటూంటే కామాక్షమ్మ ‘పిండి వెనె్నల కాదండి.. వెండి వెనె్నల.. పండు పున్నమి కాదు నిండు పున్నమి..’ అంటూ సవరించారు.
దానికి అవధాన్లుగార్లు హార్ట్ కాస్తంత హర్ట్ అయి ‘నాకూ ఓ భావన ఏడ్చిందిగా.. అంటూ విషయాన్ని కాస్తా సాగదీశారు అంతే. కామాక్షమ్మ స్పోర్టివ్‌గా తీసుకోలేక పోయింది. అంతే, పిల్లి కాదు మార్జాలం అయ్యింది. చివరాఖరికి అది కాస్తా చిలికి చిలికి గాలివాన అయ్యింది.
ఇంతలో పిడుగులా అవధాన్లుగారు ‘ఏమేవ్.. ఒసేవ్.. ఓ కామాక్షీ..’ కేకలెడ్తున్నారు బెడ్‌రూమ్‌లోంచి. ‘ఏం.. ఎందుకు.. ఆ కేకలు.. కొంపలంటుకున్నట్టు’ విసుక్కుంటూ విసురుగా వచ్చింది చీరకొంగుతో ముక్కుపుడక తిప్పుకుంటూ. ‘నా కళ్లజోడు గాని చూశావా..’ అనునయించాడు కామాక్షిని అవధాని.
‘చూడకేం.. చూస్తూనే వున్నా.. మీ నిర్వాకం..’ అంది పుల్లవిరిచినట్లు.
‘నీకేమైందే పొద్దుట్నుంచి.. విపరీతం చేస్తున్నావ్.. అపర సూర్యకాంతం మాదిరి...’
‘కాదు మరి.. ఇప్పుడు మీకు నేను సూర్యకాంతంలా.. సూరేకారంలా.. కనపడను మరి.. పిల్లల్ని రానీయండి మీ బాగోతం కాస్తా తెర కెక్కిస్తాను..’ అంది తనలో తను గొణుక్కుంటూ, కామాక్షమ్మ.
‘కళ్లు కనపడవు, చెవులు వినపడవు. అలా నీలో నీవు గొణుక్కుంటుంటే ఏం తెలిసి ఏడుస్తుంది నాకీ వయసులో. కొంచెం ఆ రుసరుసలు తగ్గించి నా కళ్లద్దాలు ఎక్కడున్నాయో చెప్పి అఘోరించు..’ అవధానిగారి మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ కామాక్షమ్మ ‘అఘోరిస్తా.. అఘోరిస్తా మరి మీ ఇద్దరి మధ్య నుంచి.. ఇప్పుడో నేనో అడ్డుగోడ మీకు.. ఆ భావనకు మధ్యన..’ అంటూ దీర్ఘం తీసింది కామాక్షమ్మ.
‘ఏమిటే నీ బాధ.. ఎందుకలా ఒకటే గింజుకుంటున్నావ్.. కళ్లద్దాలు మొర్రో అంటుంటే, నువ్వేంటేంటో అభినయిస్తున్నావ్.. అసలేమైంది నీకు ఉన్నట్టుండి..’ అంటూ అవధాన్లుగారు నెత్తి మీద కెళ్లాల్సిన చేతులు కాస్త కళ్లకే వున్న కళ్లద్దాలకి తగిలి చటుక్కున తన మతిమరుపుతనానికి నాలిక్కరచుకున్నారు.
అంతలోనే తమాయించుకుని ఎదురుగా అద్దంలా నిలబడ్డ కామాక్షమ్మని, ‘కళ్లకే వున్నయ్ అని చెప్పుండొచ్చుగా.. యింతసేపు వాగించావ్.. ఎందుకింత మొండిగా తయారయ్యావ్ ఈ రోజు...’ అంటూ బుర్ర నిమురుకున్నారు అవధాన్లుగారు.
‘ఆ భావన కళ్లల్లో కదుల్తు మెదుల్తుంటే.. కళ్లకే వున్న అద్దాలు ఎలా తెలుస్తయ్.. పాపం తమరి, అందుకే ఈ పరాకు.. ఈ ముసలిదాని మీద చిరాకు. చిర్రెత్తుకొస్తోంది ఈయనగారి ఈ వయసులో ఈ వికారాలు చూస్తుంటే..’ అంటూ కామాక్షమ్మ వంట గదిలోకి వెళ్లింది.
‘ఏమిటో దీని గోల. వట్టిమాలోకం. పైగా అయోమయం’ అనుకుంటూ అవధాన్లుగారు అనుసరించారు కామాక్షిని. అవధాన్లుగారు మడికట్టుక్కూర్చున్నారు వంటింట్లో. విసురుగా వడ్డిస్తోంది కామాక్షమ్మ విస్తట్లో. ఈ రుసరుసలు... పగలంతా.. మాపటికి గుసగుసలు.. ఇది మగువల తంతు.. వింతే మరి.. కొత్తేమీ కాదు అవధాన్లు గారికి. పగలంతా మనసులో ఏదో పెట్టేసుకుంటుంది.. రాత్రంతా ఏకరువెట్టేస్తుంది పడగ్గదిలో.. తలగడ మంత్రం.. పడక గది కన్నా ఇరుకు పడతి మది. పడక గది ఇరుకైనా సర్దుకోవచ్చు - పడతి మది ఇరుకైతేనే జీవితంలో అశాంతి.
ఈ చిలిపి చిలిపి అలకలు మాపటి వలపులకు సంకెలలు.. తప్పవు మగవాళ్లకి.. మగువని బుజ్జగించి, లాలించడం; ఎంతైనా.. ఎలాగైనా కామాక్షిని ఊరడించాలని వుంది అవధాన్లుగారికి. చీకటి పడితే.. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ.. తొలి రోజుల్లో నెమరేసుకుంటూ నిద్రలోకి జారిపోయారు అవధాన్లుగారు. కలతపడ్డ మనసు కాస్త కుదుటపడ్తుంది.. అందునా మండు వేసవి కాలం మంచిగా కునుకు పట్టేసింది.. గురక వచ్చేసింది. గుర్రుగుర్రుమంటూ.. పందిరి మంచం.. ఆపైన మెత్తటి పరుపు.
అవధాన్లుగారు నిద్ర నుంచి లేచి కళ్లు తెరిచి చూసేసరికి బిలబిలమంటూ పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండింది. కామాక్షికి గుండెనిండా సంతోషం మిన్నంటింది. పెద్దాడు డెహ్రాడూన్ నుంచి కుటుంబంతో సహా దిగబడిపోయాడు. అమ్మాయి కూడా అల్లుడ్ని వెంటేసుకుని సింగపూర్ నుంచి చంటాడితో సహా ఈ పల్లెటూరికి విచ్చేసింది - కబురు లేకుండా ఇలా.. సడెన్‌గా.. అంతే.. అంతా ఫ్లైట్ల మహాత్మ్యం.. నెట్‌లో ఇట్టే బుక్ చేస్తే.. అట్టే వచ్చేస్తారు ఎక్కడికైనా.. ఎప్పటికైనా..
వరల్డ్ వండర్‌లో ఇది ఒకటిగా చెప్పుకోవలసిందే చెప్మా.. విస్తుపోయి చూస్తూండిపోయారు అవధాన్లుగారు.
‘ఇదేనా రావడం...’ పెద్దాడ్ని పలకరించారు అవధాన్లుగారు. ‘వాడు తనవైపు చూడనైనా చూడకుండా.. విననైనా వినకుండా.. ముఖం తిప్పుకుని లోనికెళ్లాడు. అదే పరిస్థితి అల్లుడు, కూతురు విషయంలో కూడా ఎదురయ్యింది అవధాన్లుగారికి. ఏమయ్యింది వీళ్లిలా నన్ను ఒంటర్ని చేస్తున్నారనుకుంటూ లోనికి చూద్దురు గదా.. లోపల అందరూ కూడి ఏదో మాట్లాడుకుంటున్నారు - తను అటుగా వస్తున్నట్లు గమనించి మాటలు ఆపేశారు. తనని ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. అవధాన్లుగారికి ఇదంతా అయోమయంగా అనిపించింది.
ఏమిటి ఈ వింత పరిణామం.. ననె్నందుకు దూరం పెడ్తున్నారు వీళ్లందరూ. ఏమీ పాలుపోవటం లేదు అవధాన్లుగారికి. హఠాత్తుగా అందరూ ఒక్కటై ఊడిపడటం ఏమిటి - తన్ని ఇలా దూరంగా ఉంచడమేమిటి - దోషిలా తనని ముఖం చాటు మాట్లాడుకోటమేమిటి?
తన తప్పిదం ఇసుమంతైనా తెలియటం లేదు అవధాన్లు గారికి. కాఫీ తీసుకువచ్చిన కామాక్షిని చిన్నగా కదిలించారు కాఫీ గ్లాసు చేతుల్లోకి తీసుకుంటూ. ఓ అంటరానివాడికి అందించినట్లు కాఫీ గ్లాసు అందించి, విసవిస లోనికెళ్లిపోయింది కామాక్షి నిరుత్తరంగా...
భోజనాల వాళ్లు భోజనాలు, టిఫిన్ల వాళ్లు టిఫిన్లు ముగించుకుని, అందరూ అవధాన్లగార్ని చుట్టుముట్టారు రంగస్థల వేదికైన హాల్లో. ముందుగా పెద్దవాడు పెదవి విప్పాడు. ‘నాన్నగారు మీరు చేస్తున్న పని ఎంత మాత్రం సమర్థనీయం కాదు’ అన్నాడు.
‘మామయ్యగారూ! మీరిలా.. ఈ వయసులో’ అంటూ తలదించుకున్నారు అల్లుడుగారు.
‘ఇంకా ఆయనతో తత్తత్తా.. మెమ్మెమ్మా.. అంటారేంట్రా.. ఈ వయసులో ఈ ప్రేమలేఖలు.. భావనకు విరహగీతికలు.. ఏంటో నిలదీయక..’ అంటూ కామాక్షమ్మ తెర దించేసింది.
ఆ కాగితాన్ని కాస్తా చేతిలోకి తీసుకుని కళ్లద్దాలు సవరించుకుని, ఈ రగడకి, వీళ్ల హఠాత్ ఆగమనానికి కారణం అర్థమయి ఫక్కుమని పగలబడి నవ్వి కామాక్షిని ప్రేమగా చూస్తూ.. నిన్నటి నుంచి తనలోని రుసరుసలు, విసుర్లుకి కారణం ఇదా...
భావనా.. భావనా.. ఏమి నీ నివేదన...
నీకై పూచిన పూవునా...
నీకై రాలిన నవ్వునా.. ఇదా.. నీ వేదనకి, ఆవేదనకి కారణం.
ఈ మధ్యన ఇద్దరమే ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉండటం చేత ఏమీ ఊసుపోక, నా ఊహల్లో పుట్టుకొచ్చింది ఈ భావన. అప్పుడప్పుడు నీలో ఉదాశీనత, చిటపటలు, రుసరుసలు చూస్తూ నిన్నూరడిస్తూ నాలో కలిగే భావనలని, నీలో తొంగిచూస్తున్న ఒంటరితనాన్ని పలకరిస్తూ, అన్వయిస్తూ.. ఇలా కాగితం మీద పెట్టాను. అంతేకాని నీవపోహ పడ్డట్టు, అసూయ చెందినట్టు అది నీకు సవతి కాదు - వీళ్లందరికి సమస్య కాదు - ‘్భవన’ నా మనసులో ఊహ.
పోనే్ల ఇలాగైనా.. మీరందరూ ఎడారిలా ఉన్న మా మధ్యకు వాన చినుకై వచ్చారు. మామూలుగా అయితే పిల్లల చదువులనో, సెలవుల్లేవనో సాకు చెప్పే మీరు అమ్మని ఓదార్చటానికైనా వచ్చారు - వచ్చిన వాళ్లెటూ వచ్చారు గాని ఓ వారం మా ఒంటరితనాన్ని మరిపించండి - అదే మా వేదన.. నివేదన..’ అంటూ కళ్లు తుడుచుకుంటూ అవధానిగారు కామాక్షమ్మని తృప్తిగా చూస్తూండిపోయారు. కామాక్షమ్మకి ఇప్పుడు ఇల్లంత నిండుగా ఉండి సందడే సందడయ్యింది - పిల్లలకి ఇష్టమైన వంటకాలు గుర్తు చేసుకుంటూ రేపటిలోకి తొంగి చూస్తోంది.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505