S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 108 మీరే డిటెక్టివ్

రాముడికి కోపం వచ్చినట్లు గ్రహించిన వశిష్ఠుడు ఇలా చెప్పాడు.
‘జనులు ఆయా లోకాలకి పోతూ తిరిగి వస్తూంటారని జాబాలికి కూడా తెలుసు. కేవలం నిన్ను అయోధ్యకి మళ్లించాలని మాత్రమే జాబాలి అలా చెప్పాడు. లోకాలకి ప్రభువైన ఓ రామా! ఈ లోకం ఎలా పుట్టిందో చెప్తా విను.
‘సృష్టి ప్రారంభంలో అంతా జలమయంగా ఉండేది. దాని మీద భూమి పుట్టింది. ఆ తర్వాత దేవతలు, బ్రహ్మదేవుడు పుట్టారు. విష్ణుమూర్తి కూర్మ రూపం ధరించి భూమిని ఉద్ధరించాడు. శిక్షితులైన తన కుమారులు మరీచి మొదలైన వారితో కలిసి ఆయన ఈ జగత్తుని సృష్టించాడు. శాశ్వతుడు, నిత్యుడు, నాశనం లేని బ్రహ్మదేవుడు పరబ్రహ్మ నించి పుట్టాడు. బ్రహ్మదేవుడికి మరీచి, మరీచికి కశ్యపుడు కొడుకులుగా పుట్టారు. కశ్యపుడికి సూర్యుడు పుట్టాడు. పూర్వం ప్రజాపతిగా ఉన్న మనువు సూర్యుడి కొడుకు. మనువు కొడుకు ఇక్ష్వాకువు. మనువు మొదట సమృద్ధమైన ఈ భూమిని ఎవడికి ఇచ్చాడో ఆ ఇక్ష్వాకువే మొదటి అయోధ్య రాజు. ఇక్ష్వాకువుకి శ్రీమంతుడైన కుక్షి పుట్టాడు. కుక్షి కొడుకు వికుక్షి. వికుక్షికి గొప్ప తేజస్సు గల, ప్రతాపవంతుడైన అనరణ్యుడు కొడుకుగా పుట్టాడు. అనరణ్యుడికి గొప్ప చేతులు, కీర్తిగల బాణుడు పుట్టాడు. సత్పురుషుల్లో శ్రేష్టుడైన అనరణ్య మహారాజు రాజ్యపాలనలో అనావృష్టి, దుర్భిష్టాలు కలగలేదు. ఒక్క దొంగ కూడా లేడు.
‘అనరణ్యుడికి పృథువు, పృథువుకి త్రిశంకువు పుట్టారు. వీరుడైన త్రిశంకుడు సత్యవాక్య బలంతో శరీరంతో స్వర్గానికి వెళ్లాడు. త్రిశంకువుకి గొప్ప కీర్తి గల దుందుమారుడు, అతనికి గొప్ప తేజస్సు గల యువనాశ్వుడు, యువనాశ్వుడికి శ్రీమంతుడైన మాంధాత పుట్టారు. మాంధాతకి సుసంధి పుట్టాడు. సుసంధికి ధృవసంధి, ప్రసేనచిత్తు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ధృవసంధి కొడుకు శతృసంహారకుడైన భరతుడు. ఐతే భరతుడికి అశితుడు కొడుకు. అశితుడికి హైహయులు, తాలజంఘలు, శూరులైన శశిబిందులు అనే రాజవంశీయులు శతృవులయ్యారు. అశితుడు వారందరినీ ఎదిరించగా వారు అతన్ని తరిమికొట్టారు. దాంతో అతను అందమైన పర్వతం మీద మునిగా మారాడు. అప్పుడు అశితుడి ఇద్దరు భార్యలు గర్భవతులు. వారిలో ఒక భార్య సవతి గర్భం నశించడానికి విషం పెట్టింది. భృగు వంశానికి చెందిన ధన్వంతరి మహర్షి హిమవత్ పర్వతం మీద నివసించేవాడు. అశితుడి భార్యయిన కాళింది ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించి, కొడుకు పుట్టాలనే వరం ఇవ్వమని కోరింది. ఆ బ్రాహ్మణుడు ఆమెతో ఇలా చెప్పాడు.
‘ఓ దేవీ! నీకు మహాత్ముడు, లోకప్రసిద్ధుడు, ధార్మికుడు, మంచి శీలం కలవాడు, వంశోద్ధారకుడు, శతృసంహారకుడైన కొడుకు పుడతాడు’
కాళింది చాలా సంతోషించి, ధన్వంతరి మహర్షికి ప్రదక్షిణం చేసి అతని అనుమతి తో ఇంటికి వచ్చి, పద్మపత్రాలు వంటి కళ్లు, బ్రహ్మతో సమానమైన కాంతి గల కొడుకుని కన్నది. ఆమె గర్భాన్ని చంపాలని సవతి విషం పెట్టడంతో, విషంతో పుట్టిన అతను సగరుడు అయ్యాడు. ఆ సగర చక్రవర్తి యజ్ఞం చేసి యజ్ఞాశ్వాన్ని అనే్వషించే సమయంలో పర్వతంలో వేగంగా పొంగి, ప్రజలని భయపెట్టే సముద్రాన్ని తవ్వించాడు. సగరుడికి అసమంజుడనే కొడుకు పుట్టాడు. వాడు అందర్నీ ఇబ్బంది పెడుతూండటంతో వాడ్ని వదిలేశాడు. అసమంజుడికి పరాక్రమశాలైన అంశుమంతుడు, అతనికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు పుట్టారు. భగీరథుడికి కకుత్సుడు అనే కొడుకు పుట్టాడు. అతన్ని బట్టే మీకు కాకుత్సులనే పేరు వచ్చింది. కకుత్సువుకి రఘువు అనే కొడుకు పుట్టాడు. అతని నించే మీకు రాఘవులు అనే పేరు వచ్చింది. రఘువు కొడుకు తేజశ్శాలిగా పెరిగి లోకంలో పురుషాదకుడు, కల్మాషపాదుడు, సౌదాసుడు అనే పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు.
‘కల్మాషపాదుడి కొడుకు శంఖణుడు. వాడు తండ్రితోనే యుద్ధం చేసి సైన్యంతో సహా నశించాడు. శంఖణుడి కొడుకు శూరుడైన సుదర్శనుడు. అతని కొడుకు అగ్నివర్ణుడు. అతని కొడుకు శీఘ్రగుడు. అతని కొడుకు మరువు. మరువు కొడుకు ప్రశుశ్రవుడు. అతని కొడుకు మహాకాంతిశాలైన అంబరీషుడు. అతని కొడుకు నహుషుడు. అతని కొడుకు పరమ ధార్మికుడైన నాభాగుడు. అతనికి అజుడు, సువ్రతుడు అనే ఇద్దరు కొడుకులు. ధర్మాత్ముడైన దశరథుడు సువ్రతుడి కొడుకే. రాముడనే ప్రసిద్ధమైన పేరు గల నువ్వు ఆ దశరథుడి పెద్ద కొడుకువి. అతని రాజ్యం మీద అధికారం కలవాడివి. అందుచేత ఓ రాజా, నీ రాజ్యాన్ని నువ్వు గ్రహించి ప్రజల్ని పాలించు. ఇక్ష్వాకు వంశీయుల్లో పెద్ద కొడుకే రాజవుతాడు. పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు కాడు. ఓ రామా! ఇప్పుడు నువ్వు అతి ప్రాచీన రఘు వంశీయుల ఆ కులధర్మాన్ని చెరచవద్దు. అధికమైన రత్నాలు, విశాలమైన రాష్ట్రాలు గల ఈ భూమిని నీ తండ్రిలానే పరిపాలించు.’

(అయోధ్యకాండ 110వ సర్గ)

ఇంటి దగ్గర 110వ సర్గ చదువుకుని వచ్చిన ఆశే్లష అమ్మమ్మ మీనమ్మ వెంటనే హరిదాసుతో చెప్పింది.
‘ఏమయ్యోయ్. ఇవాళ హరికథలో ఐదు తప్పులు చెప్పావు. ఇలా ఐతే ఎలా?’

మీరా తప్పులని కనుక్కోగలరా?

1.హరిదాసు 108వ సర్గలోని మిగిలిన భాగాన్ని చెప్తున్నానని చెప్పాడు కాని క్రితం రోజే అది పూర్తి చేశాడు.
2.రాముడు ఆ మాటలని జాబాలి మాటలు విని చెప్పాడని ఈ సర్గ మొదట్లో వాల్మీకి రాశాడు. దాన్ని హరిదాసు చెప్పడం విస్మరించాడు.
3.రాజులు ఎలా ప్రవర్తిస్తారో ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు కదా? (యథా రాజా తథా ప్రజా) అని రాముడు చెప్పిన ముఖ్యమైన మాటలని హరిదాసు చెప్పలేదు.
4.రాముడు చెప్పిన మరో ముఖ్యమైన మాట ‘లక్ష్మి ఎల్లప్పుడూ సత్యానే్న ఆశ్రయించి ఉంటుంది’ని హరిదాసు చెప్పలేదు.
5.సత్యమనే ఈ ధర్మం సాక్షాత్తు ప్రత్యగాత్మ అని నేను తలుస్తున్నాను అని రాముడు చెప్పాడు. కాని ప్రత్యగాత్మ స్థానంలో పరమాత్మ అనే పదాన్ని హరిదాసు వాడాడు.
*
మీకో ప్రశ్న

గాయత్రి మంత్రంలోని ఎనిమిదవ బీజాక్షరం ‘య’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
*

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

గాయత్రి మంత్రంలోని ఏడవ బీజాక్షరం ‘య’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
అరణ్యకాండ 12-3లో తే వయం వనమ త్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ శ్లోకంలో.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి