S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భాగ్యనగర్ ’ జిందాబాద్!

మొట్టమొదటి అఖిల భారత తెలుగు రచయితల మహాసభలు 1960 మే నెలలో హైదరాబాద్ - పోతుకూచి సాంబశివరావుగారు, ఆయనగారి యువ టీము - గొప్ప సమన్వయంగల ఏర్పాట్లు చేశారు. దానికి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఆహ్వాన సంఘ అధ్యక్షులు. మహాసభలకి రాష్ట్రంలో నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో - పాత కొత్త రచయితలు మహదానందంగా తరలి వచ్చారు.
మహాసభలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రారంభించడంతో దానికి మరింత ప్రాముఖ్యత వచ్చింది. నిజంగా అదొక దొడ్డ సభ. తెనుగు భాషకు వనె్నగా - తెనుగు జాతికి సాహితీ సేవలందించి - ఎందరో ‘శిఖర’ రచయితలు హాజరై కళకళలాడిన సభ. ‘శిఖర రచయితలు’ అన్నది డా.సి.నారాయణరెడ్డిగారు తయారుచేసిన మాట. సభకి అధ్యక్షత వహించినదెవరో తెల్సా? బూర్గుల రామకృష్ణరావుగారు.
రెడ్డీ కాలేజి హాస్టల్స్‌ని రచయితలకి బసగా ఇచ్చారు. రామ్మోహనరావుగారి ప్రక్కన వెళ్లానుగా - మంచి రూము దొరికింది. ఈ వైభవోపేతమైన - యింతమంది రచయితలు - స్టార్’ వాల్యూ వున్నవాళ్లంతా ఓ చోట చేరారు. హైదరాబాద్ నగరం మా బెజవాడ, వైజాగ్‌లతో పోలిస్తే - హరికేన్ లాంతరు ప్రక్కన గ్యాస్‌లైట్ (నాటికి ఎల్.ఇ.డి.లు వగైరా లేవు) లాగ వెలిగిపోతూ కనపడ్డది.
అప్పుడు అసలు సభలకి ప్రత్యేక శోభ చేకూరుస్తూ - భారీ హాలులో గ్రంథ, చిత్ర ప్రదర్శన ఏర్పాటు జరిగింది - ‘ఓహో!’మని. నైజాం నవాబుగారి నగల ప్రదర్శన చూడాలనిపించలేదు గానీ - నాకు ఈ అందాల చందాల శోభ నచ్చింది. నా మదిలో - సినిమా భాషలో చెప్పాలీ అంటే - ఏవో వినిపించని రాగాలు చెలరేగాయి. దాన్ని ప్రారంభించాల్సింది బెజవాడ గోపాలరెడ్డిగారు. తలుపులు మూసే వున్నాయి గానీ అక్కడ మొట్టమొదట మంజుశ్రీ (ఆనక డా.అక్కిరాజు రమాపతిగా సుప్రసిద్ధుడైనాడు) తనూ, తన ప్రక్కన వున్న డా.పోరంకి దక్షిణామూర్తి - రుూ అద్భుత ప్రదర్శనలకి కన్వీనర్‌లట. వారి ‘బలగం’ నిండా కాలేజీ పిల్లలు - పిల్లలు అంటే ఆడపిల్లలు అని నా ఉద్దేశం.
మంజుశ్రీ నరసరావుపేట నుంచి బెజవాడ మీదుగా హైదరాబాదు పోయేటప్పుడు మేం కలిసేవాళ్లం- విజయ సాహితీ సభలలో కూడా. ఓసారి అర్ధరాత్రికి ముందు మా ఇంటికి ‘బ్రేక్‌జెర్నీ’ చేశాడు. అమ్మ బలవంతం చేసి - ఆవకాయ వేసి అన్నం పెట్టి - తిన్నాక కానీ పంపించలేదు. తాను ఆ మాటే యాభై సంవత్సరాల మైత్రి తరువాత కూడా మాటల మధ్య గుర్తు చేసుకుంటూ వుండేవాడు.
తనకి అప్పుడు న్యూసైన్స్ కాలేజీలో, అలాగే దక్షిణామూర్తికి అదే కళాశాలలో ఉద్యోగాలొచ్చాయి. ఇకనేం, నాకంటే నాలుగేళ్లు సీనియర్లయినా కూడా ఈ ఇద్దరూ అమిత వాత్సల్యంగా - ‘తొలిమలుపు వీరాజీ’ అంటూ గుండెలకి హత్తుకున్నారు. ఇవాళ్టిదాకా ఆ మైత్రీ, ఆ చనువూ కొనసాగుతూనే వున్నాయి.
గ్రంథ, చిత్ర కళా ప్రదర్శనా ప్రాంగణంలోకి - నాకు ముందే ‘ప్రీవ్యూ’కి అనుమతి లభించింది. దూరిపోయాను. వామ్మో! ఎటు చూసినా కాలేజీ సుందరాంగనలే - షట్ షెల్వార్లు, పంజాబీ దుస్తులూ - పరికిణీ వోణీలు - వాలంటీర్ల వొయ్యార శోభతో దాన్ని ఇనుమడిస్తూ వున్న కుమారి సుభద్ర. రా.మో.గారి పెద్ద అబ్బాయి (అంటే నాకు అన్నయ్య అన్నమాట. చిన్నవాడు మురళీ నా క్లాస్‌మేట్ కదా) నళినీ మోహన్‌కి కాబోయే సహధర్మచారిణికి అంటే - తనకు కాబోయే కోడలికి - మా బుక్స్ ముందే కానుకగా పంపేశారు. అందులో, అయ్యా! వీరాజీ తొలిమలుపు, రాతిమేడా కూడా వున్నాయి అని చెప్పాలా?
చూడండి తమాషా! తంతే బూరెల గంపలో పడ్డాట్ట! అందుకే అంటాను. నవలలో అన్నా - ‘ఇల’లో అన్నా ‘ఖేసరా/ సరా!’ ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది - అని. రేపటి విశ్వవిద్యాలయ విద్యార్థినులు కాబోయే యువతీ యువకులకు నేను ఆ ప్రపంచంలో నుంచి వచ్చిన వింత శాల్తీలాగ అగపడ్డాను అన్న మాట.
ఛార్లెస్ డికెన్స్ గారు - రెండు మహానగరాల కథలో - తొలి వాక్యంలోనే అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ‘ఇట్ వాజ్ ది వర్డ్స్ ఆఫ్ టైమ్స్; ఇట్ వాజ్ ది బెస్ట్ ఆఫ్ టైమ్స్’- అని. అట్లా 1960 నాకు పరమచెత్త సంవత్సరం - మళ్లీ అదే విరోధాభాసగా అత్యుత్తమ కాలం. క్యాంపస్‌లో నాకున్న నిక్‌నేమ్ - ‘స్పయిరల్ స్ప్రింగ్’. ఒత్తయిన నా ఉంగరాల జుత్తు క్రాపింగులో ముందున్న కురులు వంకీల స్ప్రింగ్‌లాగా చుట్టుకుని నుదుటి మీద వ్రేలాడుతూ ఉండేవి. ఫిజిక్స్ లాబ్‌లో - స్పయిరల్ స్ప్రింగ్ ఎక్స్‌పెరిమెంట్లో ఉంటాయి. అది లాగి వదిలితే స్ప్రింగు - స్థితిస్థాపక శక్తి చేత తిరిగి చుట్టుకుని యధాస్థానానికి వస్తుంది. అట్లా - నా వంకీల ముంగురులు - (పిట్టల మధ్య కోడిపుంజు నెత్తి మీద ఎందుకూ కొరగాని కిరీటంలాగా) చిత్రంగా కనపడేది. ఆ వొంకీలు ‘బ్రిల్’ క్రీమ్ వాడినా లొంగేవి కావు. సరే, ప్రదర్శనకి నా రెండు నవలలూ, కవితల క్లిప్పింగ్‌లు అంటించిన కాకీ కాగితాల పుస్తకం ముందే అందేయి. దానికి ‘సారు’ ‘నా విడీవిడని చిక్కుల వ్రాతప్రతీ, ఎదిగీ ఎదగని మనుషులు నవల వ్రాతప్రతినీ ‘పగా-ప్రేమా’ నవల చిత్తుప్రతినీ కూడా చేర్పించారు. ఆ రచనలన్నీ - ‘టీనేజ్ మెరుపులే’ కదా!
మనవాళ్లంటూంటారు. ‘దేనికయినా కాలమే మందు’. అదో - సామెత కూడా. అలా, నిరాశా నిస్పృహల గాయాల్ని, అంతర్దహన యంత్రంలాగా జ్వలించే అసంతృప్తి జ్వాలల్ని ఈ సందడిలో తగ్గాయి. మళ్లీ నాలోని కుర్రతనం లేచి సన్నాయి మ్రోగించింది. అయినా - ‘మేలేమే అకేలా!’ ఈ మహోత్తుంగ సంగీత పరిమళం అనదగ్గ రచయితల సందడిలో కూడా నన్ను అదో ఒంటరితనం - కాలర్ పట్టి వెనక్కి గుంజుతూనే ఉంది..
తెలుగు స్వతంత్రలో ‘కాలాతీత వ్యక్తులు’ అనే సీరియల్ రాస్తున్న శ్రీదేవిగారు, నోరా శాస్ర్తీగారూ కలసి వచ్చారు. ఆటోకి కొంత చిల్లర పైసలు తగ్గాయి కాబోలు దిక్కులు చూశారు. ‘ఇదుగో సార్, ఛేంజ్. ఆనక యిచ్చేద్దురు’ అంటూ ఆఫర్ చేశాను. శ్రీదేవిగారు ఆ నవల పాఠకులకు ఓ కొత్తదనాన్నిచ్చింది. ఆ ఇద్దరూ ముచ్చట్ల మధ్య - ఎందరో రచయితలకి ‘ఇదుగో బెజవాడ ఎండ’ అంటూ నన్ను పరిచయం చేశారు గోరాశా. స్రవంతి పత్రికకి సాహితీ వర్గాలలో పెద్దపీట వుండేది. మొదట దాశరథి, ఆనక సినారే గార్లు దీనికి ఎడిటర్లు. స్కూలు కాలంలోనే నాకు ‘కలం పరిచయం’ వుందా మహాకవులతో - నారాయణరెడ్డి గారు నన్ను భుజం మీద చెయ్యి వేసుకుని కబుర్లు చెబుతూ ‘నుక్కడ్’ (వీధిమొగ) కిల్లీషాపు దాకా నడిపించి - ఉస్మానియా క్యాంపస్ కూడా చూడు ‘మిత్రమా!’ అన్నారు.
చిత్రం ఏమిటీ అంటే, యిట్లా పెద్దాళ్లందరికీ మధ్య - అనగా ‘ఎగ్జాట్లీ’ - వాళ్లతో భుజాలు రాసుకుంటూ కాదుగానీ - వారి సరసన నడుస్తూ - అందాల ‘బాగ్’ల నగరం - భాగ్యనగరం యొక్క వాతావరణం ‘చిత్తు’ చేసింది. ఆ ప్రాంత భాషలో చెప్పాలీ అంటే - ‘ట్యాంక్‌బండ్ షైరుతో’ నేను ఫిదా!
నారాయణరెడ్డిగారు నన్ను భుజం మీద చెయ్యి వేసి హైవే మీదుకి నడిపిస్తున్న దృశ్యం నాకు అప్పుడే - ఎగ్జిబిషన్‌లో పరిచయమయిన పిల్లలందరి మధ్యా మరింత పాపులారిటీని తెచ్చింది. కానీ నేను ఆనాడు అనుకోలేదు. మరి నలభై ఆరు సంవత్సరాల తర్వాత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయిన ఇదే ‘విశ్వంభర’ కవన చక్రవర్తి నా సాహితీ జీవిత స్వర్ణోత్సవాలకు అధ్యక్షత వహించి, నన్నాశీర్వదిస్తూ - తొలిమలుపు నాలుగవ ఎడిషన్ కాపీని - డా.కె.వి.రమణాచారి ఏతుల మీదుగా అందుకుంటారని! తెనుగు నవలా సాహిత్యం మీద పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్న డా.మృణాళిని గారు - తెలుగు నవలా సాహిత్యంలోనే కాదు - మరే, భాషలోనైనా సరే - మొదట క్యాంపస్ నవల’ రాసింది వీరాజీయే అన్నది.
ఆనాటి రాత్రి (సభలలో)శ్రీశ్రీ అధ్యక్షతన కవి సమ్మేళనం అన్నారు. నా పేరుని - వున్నారుగా నా యువ అందాల నేస్తాలు - వాళ్లేగా అక్కడ వాలంటీర్లు -వేదికను ఎక్కే కవుల జాబితాకి ఎక్కించేశారు. ‘ఆరుద్ర’ని నా పదో ఏటనే చూశాను గానీ ‘శ్రీశ్రీ’తో నేరుగా కరచాలనం చెయ్యడం అదే మొదటిసారి. సరే.. అర్ధరాత్రి దాటినా - నా పేరు మీద ‘కేక’ రాలేదు. పగలంతా వూగి, తూగి, వుల్లాసంగా, ఉద్దేలంగా గడిపానేమో- నా పేరు ‘కేకే’ సరికి నిద్రాదేవి ఒడిలోకి జారిపోయి వున్నానుట. మర్నాడు అప్పుడే తొలి పరిచయం అయిన పులికంటి కృష్ణారెడ్డి నవ్వుతూ చెప్పాడు.
మర్నాడు మహీధర - ‘రావోయ్ కృష్ణాపత్రిక ఆఫీస్‌కి వెళ్దాం. నీ ‘ఎదిగీ ఎదగని మనుషులు’ నవల (రాతప్రతిని)ని ‘అట్టుకుని మరీ పద’ అన్నారు. కృష్ణాపత్రిక అప్పుడు వారపత్రిక. దాని ఎడిటర్ ‘శర్మ’గారు కార్యాలయంలో లేరు గానీ శ్రీపతి గారనుకుంటాను ఇన్‌ఛార్జి. రా.మో.గారి శైలిలో చెప్పాలీ అంటే - ఇంచక్కా మాట్లాడేరు. నవలని సీరియల్‌గా వేసుకోడానికి తగునేమో చూడమని శర్మగారికి నా మాటగా చెప్పండని చెప్పి - స్క్రిప్టుని ఇప్పించారు. ఆ ఏరియా మొజంజాహీ మార్కెట్ ప్రాంతం అని విన్నట్లు గుర్తు.
సభల దారి సభలదే. వివిధ ప్రాంతాల యంగ్‌బ్యాచ్ రచయితల ఆటవిడుపు దారి దానిదే. భోజనశాలలో ‘కర్రీ కర్రీ’ అని అన్నాడో రచయిత. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మగారు - ఎక్కణ్ణుంచో ఆడపులిలాగా ‘గాండ్రించింది’ ‘ఎవరయ్యా, నువ్వూ? కూరలు, చారు, మజ్జిగ అని అడగలేవూ? రైస్ రైస్.. అన్నావో’ అంటూ అరిచారామె. హడలి చచ్చాం.. అంతా.
లక్ష్మీకాంతమ్మగారు - నేను బెజవాడ యస్సారావ్ సివిఆర్ కాలేజీలో ఇంటర్‌మీడియెట్ చదువుకుంటున్నాను. మా కాలేజీ వార్షికోత్సవాలకి ‘వక్త’గా వచ్చారు. ఆటల మైదానం ఎదురుగా రేకుల షెడ్ హాలులో మీటింగ్స్ అయ్యేవి. క్లాసులకి కూడా ‘షెడ్’లే వుండేవి. మేము క్రికెట్ ఆడుతున్న కుర్రాళ్ల వేపే చూస్తూ - మైదానంలో గడ్డి మేస్తున్న ఆవులవేపూ, మేకల వేపూ చూస్తూ - మధ్యమధ్య బల్లలు చరిచేవాళ్లం. అప్పుడు నేను కవినీ, రచయితనే గానీ - అభిమానుల్నీ, అమ్మాయిలనీ ఆకర్షించే ‘మూడ్’లో లేను. ‘క్రికెట్ పిచ్చోణ్ని’ అనేవాళ్లు ఫ్రెండ్స్. కానీ ఆ రోజు లక్ష్మీకాంతమ్మగారు మమ్మల్ని అందర్నీ ‘నిందాస్తుతి’ చేస్తూ - ఏకిఏకి వదిలిపెట్టింది. బల్లలు - నేను కూడా చేతులు మండేలాగా చరిచాను. ‘ఇట్లా అదరగొట్టాలి నేను కూడా’ అనుకున్నాను. వేదిక ఎక్కినప్పుడు..
అలాంటి లక్ష్మీకాంతమ్మగారు మళ్లీ నాకు, సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో జరిగిన గుంటూరు ‘రచయిత్రుల’ సభలో కలిశారు. అప్పుడా సభలకి నేను ఆంధ్రపత్రిక - ప్రత్యేక ప్రతినిధిని. స్టార్ భానుమతి - జర్నలిస్ట్ రైటర్ కె.రామలక్ష్మి (ఆరుద్ర) పి.టి.రెడ్డి గారి సతీమణి యశోదా రెడ్డి - మా ఊరి ‘లత’ అందరం కలిసి ‘ఆంటీ’ని ఆట పట్టించాం. ఉన్నమాట చెబుతున్నాను - ఆమె పట్ల గౌరవంతోనే సుమా.. దొడ్డ ఆర్గనైజర్ ఆమె.
మహీధర కోప్పడ్డారు - ‘నా వేలట్టుకు తిరగమాకు. నిన్నొదిలి పోతాననుకోకు’ అంటూ ‘్ఫల్‌ఫ్రీడమ్’ యివ్వడంతో గ్రంథాలయ, చిత్ర కళా ప్రదర్శనలో - మిత్రులు ‘మంజుశ్రీ’, పోరంకీలతో నేనూ ఓ భాగమై పోయాను. ఆ లోపల, నన్ను వెతుక్కుంటూ మా షరీఫ్ వొచ్చాడు. షరీఫ్ నాకు ఇంటర్‌లో క్లాస్‌మేటు, క్రికెట్ టీమ్ ‘మేట్’ కూడాను. ఇస్లాంపేట వాడు. వాల్తేరుకి నేను, గుంటూరుకి తనూ - ఒకే సబ్జెక్టు ఫిజిక్స్ కోసం వెళ్లిపోయాం - కాని నేస్తం కొనసాగింది.
‘సాలార్ మ్యూజియం’ చూడాలి కృష్ణమూర్తీ! మా ఇంటికి పోదాం ఈ రాత్రి. రేపు రాత్రి నేను రైలెక్కిస్తానులే’ అన్నాడు. మా ఇద్దరి ‘కథా’ మరో సందర్భంగా చెబుతాను. వాళ్ల డాడీ కో ఆపరేటివ్ రిజిస్ట్రార్. ‘ఓకే’ అన్నాను నేను. కానీ మర్నాడు పోతుకూచి వారు - ఓ నలభై మందికి ‘డీలక్సు బస్ ఇచ్చి’ - గోల్కొండ, గండిపేట వగైరాల వినోద విహార యాత్ర ఏర్పాటు చేశాడు. గొప్ప డిమాండ్ దానికి - కవి సామ్రాట్ పైడిపాటి సుబ్బరామ శాస్ర్తీగారు ముందే పేరిచ్చేశారు. ఉన్నారుగా నా నేస్తాలు - సెకండ్ ఇయర్ సైన్స్ డిగ్రీ స్టూడెంట్స్ - ఆరాధనా, లక్ష్మీకాంతం, కోటీశ్వరి, సరళ మొదలైన వాళ్లు - వాళ్లదే ఆర్గనైజేషన్. నిజంగా ఈ స్వచ్ఛంద దళం - నవ్య సాహితీ సమితి కార్యవర్గం సభ్యుడు కాలనాదభట్ట వీరభద్ర శాస్ర్తీ లాంటి అనుభవజ్ఞులు - సభల నిర్వహణలాగే - రుూ వినోద యాత్ర కూడా అపశ్రుతుల్లేకుండా ‘మరపురాని మధుర యాత్రా స్మృతి’గా మిగిలిపోయింది.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com