S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీ కనులు ‘కెమెరా’గా ఛూడు!

మా చిన్నప్పుడు స్కూల్లో మొట్టమొదటగా ప్రార్థనగా పాడే పాట - ‘నమో హిందు మాతా! మాతా నమో జగన్మాతా’ - ఓ చరణం ఉంది- ‘గోలకొండ నీ రత్నకోశమలు - కోహినీరు నీ జెడలో పువ్వట.. ఆహాహా నీ భాగ్యమె!’ అంటూ కోరస్‌గా పాడించేవారు.
పదహారో శతాబ్దం ఆరంభం దాకా- కులీ కుతుబ్ షాల రాజధాని గోలకొండ కోటే గానీ, అది ‘గొల్లకొండ’. అంటే గోపాలురు గోవుల్నీ, మేకల్నీ మేపుకొనే కొండగా మారింది. ఐతే, ఇది ‘గోల్’ (గుండ్రంగా) వున్న కొండ అని కొందరి వాదన. రచయితలు - చిన్నా పెద్దా చేరిన ఈ బృందం - ఉల్లాసంగా ఎక్కేస్తున్న ఈ కొండ మీదున్న కోట మాత్రం అద్భుతం! ఈ కొండ మీదే ప్రపంచంలో అత్యుత్తమం, అతి ఖరీదుగల కోహినూరు వజ్రం దొరికిందనీ, ‘హోప్’ - వజ్రం కూడా ఇక్కడిదేననీ అంటారు.
మాతోపాటు పెద్దలు - కవి సమ్రాట్ పైడిపాటి సుబ్బరామశాస్ర్తీ గారున్నారు. ఈయనదీ బెజవాడే. బెజవాడ గొప్పదనం ఏమిటీ అంటే - కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మాచవరం కాపురస్థులే! పైడిపాటి వారూ మాచవరంలోనే వుంటారు.
పైలాపచ్చీసు ఆడా, మగా యిలా సాయిలా ఫాయిలా కబుర్లు చెప్పుకుంటూ - గోల్కొండని కబుర్లతో పేల్చి పారేస్తూ వుంటే - ఆయన ‘ఖస్సు’మనేవాడు. నాటకంలో పద్యాలు గొంతెత్తి పాడినట్లు ఆయన పద్యాలు కూడా వినిపించేవారు. వరంగల్ నుంచి ‘బాబూరావు’ అనే యువ కవి వచ్చాడు. వీళ్లంతా నా దృష్టిలో పిల్లలు. నేనేదో చాలా పెద్దవాణ్ణి అనేసుకుంటాను. కానీ, వాళ్లంతా మహా అయితే, రెండు మూడేళ్లు నాకు జూనియర్లు - అంతే. అలాగే చూడసాగారు నన్ను.
బాబూరావు నాకు రైట్‌హ్యాండు అయిపోయాడు. అతనికే నేను - ముఖ్యమంత్రి ప్రభృతి హేమాహేమీలతో మేం దిగిన గ్రూపు ఫొటో కాపీ తెచ్చిస్తానంటే ముప్ఫయి రూపాయలు యిచ్చాను. ఐతే, ఫొటో గీటో ఇవ్వకుండా, ‘అంతే సంగతులు’ చేశాడనుకోండి. కానీ ‘పదండి ముందుకు, పదండి త్రోసుకు’ అని అరవడంలో ఫస్టు. శ్రీశ్రీ భక్తుడు. అతనికి ఈ విద్యార్థినులలో ఒక బంధువు వుండింది. దాంతో, అందరం కలిసిపోయాం. చివరికి రుూ వీరాజీ కూడాను. మళ్లీ ‘గ్యాంగ్ లీడర్’ అయిపోయాను - అబ్బే...!
కవి సమ్రాట్‌కు నేను ‘కవి రాక్షసుడు’ అంటూ బిరుదు కూడా ఇచ్చాను. ఆయాసపడుతూ ఆయన కొంచెం వెనుకబడితే - ‘మన కవి రాక్షసుండు తప్పిపోయినచో మనము బాధ్యులం అవుతాం. కావున ఆగుదమా’ అని ఆగేవాళ్లం. ఈలోగా నేను పొరపాటున బాబూరావు చెయ్యి పట్టుకొని ‘దిగులు చెందకు బాబూ! మార్కులు ఈసారి వస్తాయి. చూడు, యిదుగో నీ చేతిలో ‘పాఠ్యరేఖ’ అంటూ - ‘మూన్ మవుంట్’ ఇదిగో - దీని మీద రేఖ చూడు’ అంటూ చెప్పేసరికి - మొదట ‘ఆరాధన’ చెయ్యి చాపింది.. లేడీస్ ఫస్ట్.
‘సార్! నా చెయ్యి చూడండి ముందు. నేనో ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నాను’ అంది. పైడిపాటి వారు వేళాకోళంగా నవ్వేరు. పెదవి విరిచారు. ఆ నవ్వు నన్ను ఇరిటేట్ చేసింది. చెయ్యి అందుకుని చెప్పడం మొదలెట్టాను. ‘సార్’ మళ్లీ నవ్వాడు.
‘ఆడపిల్లల కుడిచెయ్యి చూడరాదు. సాముద్రిక శాస్తవ్రేత్తకి ఆ మాత్రం తెలియదా?’ అన్నారు. నాకు మళ్లీ మండింది. ‘అది సాముద్రికుల వెర్రితనం. ‘ఖిరో’గారు రెండు చేతులూ చూడమని చెప్పారు.’ అంటూ లెక్చరివ్వబోయాను. అట్లా కొండ దిగేలోగా - కోటంతా చుట్టి వచ్చాం. నాకు అభిమానులు పెరిగారు. పెద్దాయన ‘బెజవాడలో నీ చిరునామా ఏమిటి బాబూ?’ అని అడిగారు. నవ్వేశాను. ‘నా పేరు రాసి, ‘వించిపేట’ విజయవాడ ఒకటి అని రాయండి. మర్నాడు భద్రంగా అందుతుంది మీ ‘అమ్మ’ అన్నాను. నిజం కూడా అంతే.
దీంతో, అందరికీ నా పోస్టల్ అడ్రస్ తెలిసిపోయింది. ‘వించిపేట అన్నది జ్ఞాపకం ఉంటే చాలు’ అన్నాను. తిరుగుదలలో నేను ఒక ఇరానీ హోటల్ దగ్గర ముందనుకున్న ప్రకారమే దిగిపోయాను. అది మా షరీఫ్ చెప్పిన సంకేత స్థలం. షరీఫ్ వాళ్ల ఇంట్లో రాత్రికి మకాం.
‘గులాబమ్మా! కృష్ణమూర్తి కో షర్బత్‌లా. అమ్మా!’ అని చెల్లెల్ని కేకేశాడు. వాళ్ల మమీ జాన్ - ఖానా పఠోస్‌దూం?’ అని అడిగారు. ‘డోంట్‌వర్రీ, నీ కోసం మేం ‘సాల్నా’ చెయ్యలేదు. సలాడ్‌తో పరోటా రెడీ’ అంటూ నవ్వాడు. తేనె కూడా పెట్టారు. ‘తేనెమనసులు ఇలాగే వుంటాయి గులాబమ్మా!’ అన్నాను నేను. ‘్భరుూ జాన్ కొ అవుర్ షహద్ దేదో మా’ అన్నది మమీ జాన్ - ‘గులాబీ బాల - మా చిన్నచెల్లి రుూడుదా?’ అనడిగాను.
షరీఫ్ అన్నాడు. - ‘కరెక్ట్’. అతను, నేను - క్యాంపస్‌లో వున్నప్పుడు - గుంటూరులో చదువుతూ వున్నా - వారం, రెండు వారాలకోమారు మా ఇంటికి వెళ్లి, అమ్మతో, వారి యోగక్షేమాలు మాట్లాడి - నాకు ‘కార్డు’ మీద వివరంగా రాసి పోస్ట్ చేస్తూండేవాడు. మా యిద్దరి ‘టేస్ట్’లూ ఒకటే. ఫుట్‌పాత్ మీద ‘పావలా’ యిచ్చి - రీడర్స్ డైజెస్టు, ‘కోర్నెట్’ లాంటి ఇంగ్లీషు డైజెస్ట్‌లు కొని చదివేవాళ్లం. ‘పాల్‌సన్స్ కాఫీ పౌడరు’ ప్యాకెట్ కొంటే అందులో ‘ఆర్.ఎం.డి.సి.’ అనే పజిల్స్ వుండేవి. అవి పంపితే ‘జెన్‌కిన్స్’ వారి ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్, డిక్షనరీలు వగైరా బహుమతులుగా వచ్చేవి - కాలేజీలో చేరాక ఇద్దరం క్రికెట్ మీద పడ్డాం. అవి ‘జిడ్డాట’ రోజులు.
పంకజ్ రాయ్ రోజంతా బ్యాటింగ్ చేసినా - యాభై.. అలాగ, నేను ఓపెనింగ్ వెళ్లి- ప్రతీ బంతీ‘నొక్కడమే’ ధ్యేయంగా ఆడేవాణ్ని. మా షరీఫ్ స్లో ఆర్‌మ్ బౌలర్. నేలబారున ప్రాకి వచ్చేలాగ యార్కర్‌లు వేసేవాడు. అతని బంతులకి ‘పాములు’ అని పేరెట్టాం.
షరీఫ్ ఎర్రగా, సున్నితంగా వుండి - మెల్లిగా మాటాడుతూండేవాడు. కాలేజీలో అంతా బడా బాయ్స్. డిగ్రీ ఫైనలియర్స్ వారు క్రికెట్ ఆడేవారు. జూనియర్ ఇంటర్ గాళ్లం మేం. డోర్నకల్ రోడ్ గవర్నమెంట్ గెస్ట్‌హౌస్ ప్రక్కనున్న చిన్న మైదానం మీద ఆడుకునేవాళ్లం. అందరికీ నిక్‌నేమ్స్ వుండేవి. ‘స్పూనర్’ ‘వాల్కాట్’ ‘వీక్స్’ ‘పాలీ ఉమ్రీగర్- అంటూ, ఈ కబుర్లతోనే తెల్లారిపోయింది మాకు. మర్నాడు సాలార్‌జంగ్ మ్యూజియం టిప్పు షరీఫ్‌కి అక్కడ - చిన్న బొమ్మ వచ్చి గడియారం గంటలు కొట్టే దృశ్యం ఇష్టం.. అదే స్పెషల్ ఆకర్షణ.
ప్రపంచంలోనే - ఒకే ఒక వ్యక్తి సేకరించి, సంగ్రహించి కూర్చిన మ్యూజియమ్స్‌లో ఇది అత్యుత్తమం. 1914 నుంచీ, మొదటి సాలార్జంగ్ సేకరించిన అమూల్య దంత శిల్పకళాఖండాలకు ప్రసిద్ధి కెక్కిన ఈ అపురూప వస్తు ప్రదర్శనశాలను మూడో సాలార్‌జంగ్ - నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎలా తీర్చిదిద్దాడో - 1951 డిసెంబర్ నుంచీ ‘పబ్లిక్’ చూసే అవకాశం ఎలా లభించిందో - అంతా చెబుతూ, షరీఫ్ ‘పనె్నండు గంటలు కావస్తోంది రా.. జల్దీ కరో’ అంటూ నన్ను పరుగులు తీయించాడు.
రంగురంగుల బొమ్మ వచ్చి, పనె్నండు గంటలు టాంగ్‌టాంగ్ కొట్టడం, మ్యూజియంలో హైలైట్. కాకపోతే, నాడు నేను చూసిన సాలార్జంగ్ మ్యూజియమ్ పాత భవనం, తరువాత అది అధునాతన ‘నిర్మాణం’లోకి మారిపోయింది. కనుక, నాటి మ్యూజియమ్ వర్ణన ఇక్కడ అనవసరం.
తిరుగు ప్రయాణంలో - రైలులో నిలబడటానికి కూడా చోటుండదు. బస్సెక్కిస్తానంటూ షరీఫ్ వచ్చి బస్సెక్కించాడు. హైదరాబాద్ బస్సులలో - ‘ఘోషా పార్శ్వం’ వుంటుంది. సగంలో కర్టెన్ కట్టి ఉంటుంది. రిక్షాలకయితే పరదాలుంటాయి. పైగా ఆ రిక్షాలలో - కుర్చీలోలాగా కూర్చోలేం. మఠం వేసుకుని కూర్చోవాలి. అయితే, ఈ బస్సులో పర్దా లేదు. ఆడా, మగా క్రిక్కిరిసి పోయారు. అమ్మయ్య! అదో రిలీఫ్!
ఆ సాయంకాలం నేనూ, షరీఫ్ ట్యాంక్‌బండ్, పబ్లిక్ గార్డెన్స్ - అన్నీ తిరుగుతూ, మళ్లీ రెడ్డీ హాస్టల్, ‘రచయితల సభ - వెన్యూ’కి వచ్చేశాం. వాలంటీర్లుగా ఉన్న అమ్మాయిలు, రమాపతి, దక్షిణామూర్తి వగైరాలు ప్రాంగణంలో సామాగ్రిని తిరిగి అప్పగించేసే హడావుడిలో వున్నారు. బాబూరావు లేడు.. ‘అయ్యో! ఫొటో ఇస్తానన్నాడు’ అనుకున్నాను. నా వ్రాత ప్రతులూ అవీ మహీధరతో వెళ్లిపోయాయి. డోన్ట్‌వర్రీ. అవి క్షేమం’ అన్నారు మిత్రులు - అక్కిరాజు పోరంకీ...
అంతలో ఆరాధన వచ్చింది. లక్ష్మీకాంతం కూడా వచ్చింది. వాళ్లకి అపురూపమయిన గ్రూప్ ఫొటో - ప్రూఫ్ ఒకటి చిక్కింది. నాడు ఫ్లాష్ కెమేరాలా? పాడా? మూడు కాళ్ల బల్ల మీద కెమేరా పెట్టి నల్లగుడ్డ కప్పుకొని తీసే ఫోటోలే! సాంబశివరావుగారు చూసి ఎన్ని కాపీలు కావాలో చెప్పాలి కనుక రెండు మూడు ప్రూఫ్‌లు (చెత్త కాపీలు) అందించాడు స్టూడియో వాడు. అందులో ఒకటి ఈ స్టూడెంట్ అమ్మాయిలు కొట్టుకొచ్చారు. వర్కింగ్ కమిటీ మెంబర్ కనుక, నాకు ఒక కాపీ పోస్ట్ చెయ్యగలవా? అని అడిగాను ఆరాధనని. అయిదారుగురు అమ్మాయిలు వున్నారు. ‘పోతుకూచి సారుకి చెప్తాం’ అన్నారు కోరస్‌గా. ‘్ఫటో కాపీ పంపించమంటాం’ అని కూడా అన్నారు.
ఇంటర్నెట్ యుగంలో నివసిస్తున్న ఈ తరం వాళ్లకి ఇటువంటి సన్నివేశాలు వూహకి కూడా అందవు. ‘మనుషులు దూరం - మనసులు దగ్గర’ కాలం అది. లక్ష్మీకాంతం అంది - ‘మరో ప్రూఫ్ సరళ దగ్గర ఉందిలే - అది సారుకి రిటన్ చేద్దాం. ఈ ఫొటో వీరాజీగారికి ఇచ్చేద్దాం - ఒక ‘యాద్‌గార్’గా వుంటుంది’ అని.
ఆరాధన ఎగిరి గంతేసి - ఇలా పై ఎత్తి పట్టుకుందా ప్రూఫ్ ఫోటోని. ‘లేలో నా సాబ్.. లేలో’ అంటూ.
ఎగిరి గల్లీలో క్యాచ్ పట్టుకున్నట్లు దాన్ని అందుకున్నాను. షరీఫ్ అన్నాడు. మనం ఎప్పుడైనా ఇలా క్యాచ్ పట్టామా? కృష్ణమూర్తీ? చేపలు పట్టేవాళ్లంగా’ అంటూ నవ్వి. నవ్వుకున్నాం నిండుగా.
అదే ఫొటో కాపీ శిథిలమైనా, పదిలంగా మధుర స్మృతుల మంజూషగా, ఏండ్ల తరబడి మిగిలింది. థాంక్స్ టు ఇంటర్నెట్ యుగం. స్కాన్ చేసి దాన్ని సిస్టమ్‌లో పడేయగలిగాను. హార్డ్‌కాపీ లేదు ఇప్పుడు. జ్ఞాపకం తీసి మన మనసులోని ఒకరి చేతబెట్టలేంగా? అట్లాగాక.. ఫొటో ఉండాలి మరి.
1960, మే నెలలో తొమ్మిది తారీఖు నాటికి తిరిగి బెజవాడ చేరుకునేసరికి విశాలాంధ్ర పబ్లిషింగ్ హవుస్ నుంచి తెచ్చిన ఆరు - ‘తొలిమలుపు’ కాపీలు - ‘స్నేహలత’ అనే పత్రికలో రివ్యూ కాపీ రెడీగా ఇచ్చాడు తమ్ముడు. ‘ఎనిమిది రూపాయలు ఒక ఎం.ఓ., పదిహేను రూపాయలు మరొక ఎంఓ (మనీ ఆర్డర్) అందేయి అన్నయ్యా!’ అని చెప్పాడు - ‘ఓహోయ్’!
‘యువజన’ పత్రికకు కథ పంపమని - ఆ పత్రిక యువ సంపాదకుడు శ్రీకాంత్ నుండి లెటర్ వచ్చింది. ‘రేపు దొరికింది’ అని శీర్షిక పెట్టి. ఆ కాగితం అక్కడ పెట్టి - హైదరాబాద్ కబుర్లు అమ్మకి చెప్పడానికి వంటింట్లోకి పరిగెట్టాను...
‘అజ్‌నబీ మిల్తే హై బి ఛుడ్ జానేకో’ అంటూ పాడుతున్నాడు తమ్ముడు. వాడు స్టేజి మీదికి ఎక్కి కూడా పాడేవాడు పాటలు, ధైర్యంగా.
మే నెల వడగాడ్పులు కూడా చల్లగా తగిలాయి మా ఎదకు. ‘ముందే రాయి, రాత్రికి కథ. నేను పోస్ట్‌లో పడేయడం ఎంతసేపు’ అన్నాడు.
కథ టైటిల్ ‘రేపు దొరికింది’ అది ఇద్దరు ఆడపిల్లల మధ్య జరిగిన సన్నివేశ కల్పన. అది - ఆడపిల్ల ఉద్యోగం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. కనుక విశాలాంధ్ర పెద్దలకి ప్రోగ్రెసివ్ స్టోరీ కింద లెక్క. ఆడపిల్ల చూపు మారుతున్నదిప్పుడు క్రమేపీ...
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com