S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గోతులు తవ్వేవాడు

జో తవ్వడం ఆపి ఆ గోతి వంక చూశాడు. తూర్పు నించి వచ్చే ఉదయ రేఖల్లో అది లోతుగా కనిపించింది. అతను ఆ గోతిని తవ్వడం అది రెండో రాత్రి. తను కోరుకున్న మేరకి గుంట ఏర్పడిందని అతను సంతోషించాడు. జో కొన్ని సంవత్సరాలుగా ఆ స్మశానంలో తవ్విన వందలాది సమాధుల్లాంటిదే అది కూడా. ఐతే వాటకీ, దీనికీ స్వల్ప తేడా ఉంది. అదే పరిమాణం. అన్ని గోతులూ మూడు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల లోతు ఉంటాయి. ఇది మాత్రం ఆరడుగుల లోతుంది. మిగిలిన గోతులు తవ్వాక అతను ఎప్పుడూ తన సామాను తీసుకుని పికప్ వేన్‌లో స్మశానంలోని గేట్లోంచి వెంటనే బయటకి వెళ్లిపోతాడు. ఈ ఉదయం కానీ, క్రితం ఉదయం కానీ జో అలా వెళ్లలేదు.
తమ ఆ అంతిమ విశ్రాంతి ప్రదేశంలోకి వచ్చే రిడ్జ్ సిటీలోని ప్రముఖుల్లో ఎవరైనా ఒకవేళ జో తవ్విన ఆ గోతిని చూసినా పట్టించుకునేవారు కారు. జోకి గోతులు తవ్వడం సాధారణ పని. తాపీ మేస్ర్తి పనిలా, లేదా గంటకి ఇంతని ఇచ్చే మరో ఇతర పనిలానే జో భావిస్తాడు. ఫారెస్ట్ వ్యూ సెమెట్రీలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం జో ఆ పనిలో చేరాడు. అది సమాధికి ఇంత అని ఇచ్చే పనైనా ఆ ఆదాయంతో అతని కనీస అవసరాలన్నీ తీరుతున్నాయి. జో అవసరాలు తక్కువ.
అతనికి శనివారం రాత్రి షార్కర్స్ బార్‌లో జరిగింది గుర్తొచ్చింది. హెలెన్ కూడా. చాలా మంది ఆడవాళ్లకి అతని వృత్తి గురించి తెలిసాక వాళ్లు అతనికి దూరమయ్యారు. హెలెన్ కాలేదు. ఆ రాత్రి అతనికి ఆమె టోస్ట్ చెప్పింది.
గిల్రాయ్ కూడా. తామిద్దరూ ఎప్పుడు పది మంది ముందు కలిసినా గిల్రాయ్ సూటిగా కాకపోయినా పరోక్షంగా జో వృత్తి మీద వ్యంగ్య బాణాలని విసురుతూంటాడు. శనివారం రాత్రుళ్లు హోడియాక్ బార్‌లో, మిత్రుల ఇళ్లల్లో గిల్రాయ్ తరచు జోకి తారసపడుతూంటాడు.
జో ఓ శనివారం రాత్రి బార్లో ఓ ఆకర్షణీయమైన విధవరాలితో కలిసి తాగుతూంటే గిల్రాయ్ వాళ్లని చూసి చేతిలోని మద్యం గ్లాస్‌తో వారి దగ్గరికి వచ్చి అడిగాడు.
‘జో! నీ కోట్ చాలా ఖరీదైంది. క్రితం వారం నువ్వు గోతిని తవ్వి పాతిపెట్టిన శవం మీది కోటా ఇది? దీన్ని దొంగిలించావా?’
తక్షణం ఆ విధవరాలి కళ్లల్లోని షాక్‌ని జో గమనించాడు. ఆ తర్వాత మళ్లీ ఆమె అతనికి ఫోన్ చేయలేదు. జో చేస్తే ఏవో కుంటి సాకులు చెప్పి తన డేటింగ్‌ని ముగించింది. ఇలాంటి అనేక సందర్భాలలో జోలో గిల్రాయ్ మీద కోపం చెలరేగినా దాన్ని అతను అణచుకుంటూ వస్తున్నాడు. గిల్రాయ్ చెల్లెలు ఆ స్మశానం చైర్మన్ ఫాస్టర్ భార్య. గిల్రాయ్‌తో పోట్లాడితే తన ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని జోకి తెలుసు.
రిడ్జ్ సిటీకి పదహారు మైళ్ల దూరంలోని షార్కర్స్ బార్లో క్రితం శనివారం రాత్రి జో ఉన్నప్పుడు అక్కడికి గిల్రాయ్ వస్తాడని ఎదురుచూడలేదు.
‘హెలెన్. మనం చాలాసార్లు కలిశాం. నువ్వు నాకు నచ్చావు. మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటావు?’ హెలెన్ చేతివేళ్లు, అతని చేతి వేళ్లు పెనవేసుకుని ఉండగా అడిగాడు.
ఆమె సమాధానం చెప్పే లోగానే గిల్రాయ్ జో భుజం మీద గట్టిగా చరిచి చెప్పాడు.
‘జో. నువ్విక్కడా?’
ఆ ఆహ్వానించబడని అతిథి వాళ్ల ముందు కుర్చీలో కూర్చున్నాడు. హెలెన్, జోల చేతివేళ్లని చూసి అడిగాడు.
‘ఇతని జీవితంలోకి నువ్వు వెళ్లాలనుకుంటున్నావా?’
‘ఏం?’
‘ఇతను ఏదో రోజు గొప్ప యురేనియం గని యజమాని అవుతాడు. అది బంగారంకన్నా ఖరీదైంది.’
‘యురేనియం?’
‘అవును. జో వారానికి రెండు, మూడుసార్లు దాని కోసం తవ్వుతూంటాడు. అవునా జో?’ గిల్రాయ్ ఎగతాళిగా నవ్వుతూ అడిగాడు.
గిల్రాయ్‌ని చితకబాదాలన్న కోరికని జో అణచుకున్నాడు.
‘నీకు గనుల మీద ఆసక్తి ఉందని ఎప్పుడూ చెప్పనే లేదే?’ హెలెన్ జోని అడిగింది.
‘అది రహస్యంగా ఉంచడాన్ని నువ్వు తప్పు పట్టకూడదు హెలెన్. అతను తవ్విన గోతుల్లోకి వెళ్లాలని రిడ్జ్ సిటీ
పౌరుల్లోని ప్రముఖులు చచ్చిపోతున్నారు. అవును. చచ్చిపోతున్నారు.’
జో వెంటనే గ్లాస్ ఎత్తి అందులోని కాక్టెయిల్‌ని పూర్తి చేశాడు.
‘జోకి ఏదో రోజు తను వెదికేది దొరికాక ఆ పని మానేస్తాడు. కాని ఫారెస్ట్ వ్యూ సెమెట్రీ నాలుగు అడుగుల లోతులో ఎన్నిచోట్ల తవ్వినా నీకు యురేనియం దొరకదు జో’ గిల్రాయ్ పెద్దగా నవ్వుతూ అతన్ని అవహేళన చేశాడు.
‘నాకు అర్థం కాలేదు’ హెలెన్ చెప్పింది.
‘నిన్ను ఆశ పెట్టడం నా అభిమతం కాదు. కాని జో సమాధులు తవ్వుతూంటాడని నీకు ఇంకా తెలీదా?’
‘సమాధులు తవ్వుతాడా?’ ఆమె జో వంక చచ్చిన ఎలుక వంక చూసినట్లుగా చూస్తూ అడిగింది.
గిల్రాయ్ ఫాస్టర్ బావమరిది అవడం అతన్ని ఎప్పటిలా దెబ్బల నించి కాపాడింది. హెలెన్‌ని మళ్లీ కలుద్దామని జో ఆ తర్వాత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడోసారి ఇక తను కలవనని మర్యాదగా ఫోన్‌లో తిరస్కరించింది.
జో మరోసారి ఆ గోతిలోకి చూశాడు. శవాన్ని దాచడానికి సమాధి గోతికన్నా మంచి ప్రదేశం ఇంకోటి ఏముంటుంది? అది అప్పటికే శవం ఉన్న సమాధి.
అతని మనసు సంతోషంతో గంతులు వేసింది. తనకా ఆలోచన వచ్చినందుకు జో తనని తానే అభినందించుకుని, పరికరాలను వేన్‌లో వేసి, నలభై నిమిషాలలు డ్రైవ్ చేసి తన ఇంటికి చేరుకున్నాడు.
మర్నాడు అతనికి గోతిని తవ్వమని ఫోన్ రాలేదు. ఐనా నిరాశ చెందలేదు. వారంలో ఒకటి, రెండు సార్లు ఆ పని చెప్పే ఫోన్ కాల్స్ తనకి వస్తూంటాయని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు.
మర్నాడు సాయంత్రం అతను ఓ రెస్ట్‌రెంట్‌లో భోజనం చేస్తూ ఈవెనింగ్ పేపర్‌లో లేడి బట్టర్‌ఫీల్డ్ మరణవార్తని చదివాడు. ఆ వింత ఐశ్వర్యవంతురాలైన ఆవిడ గురించి రెండు కాలాలు రాశారు. ఈజిప్ట్ నించి ఆవిడ అనేక పురాతన వస్తువులని తెచ్చిందని గతంలో జో చదివాడు. ఆవిడ తన శవాన్ని ఓ పిరమిడ్‌లో పాతించాలని ప్రయత్నించింది. కాని ఈజిప్షియన్ ప్రభుత్వం అందుకు అంగీకరించమని చెప్పింది. దాంతో ఆవిడ తన ఆఖరి విశ్రాంతి ప్రదేశంగా ఫారెస్ట్ వ్యూ సెమెట్రీనే ఎన్నుకుందని, ఆవిడ అక్కడ అందుకు స్థలం కొన్నదని చదివాడు.
మర్నాడు జో బాస్ ఫ్రెడ్ ఫోన్ చేసి లేడి బట్టర్‌ఫీల్డ్ అంతిమ కార్యక్రమం ఆదివారం జరుగుతుందని, సమాధి గోతిని తవ్వి సిద్ధం చేయమని కోరాడు. జో రిసీవర్ని క్రేడిల్ మీద ఉంచుతూ చాలా రోజుల తర్వాత బయటకి
నవ్వాడు.
శనివారం రాత్రి గిల్రాయ్ ఎప్పటిలానే అనేక బార్లు తిరుగుతూ తలో చోట ఓ పెగ్ తాగాడు. తెల్లారుఝామున అతను పర్వత పాదంలోని తన ఇంటికి ఒంటరిగా తిరిగి వస్తాడని తెలిసిన జో, తన వేన్‌ని కొద్ది దూరంలో పార్క్ చేసి రాత్రి పనె్నండు నించి అతని ఇంటి బయట మెట్ల మీద కూర్చుని ఎదురుచూడసాగాడు.
రాత్రి మూడున్నరకి దూరం నించి వచ్చే కారు హెడ్‌లైట్లు కనిపించాయి. వెంటనే అతను లేచాడు. కారు గేరేజ్ బయట ఆగింది. దాన్లోంచి గేరేజ్ తలుపు తెరవడానికి గిల్రాయ్ దిగాడు. కారు తలుపు తెరిచినప్పుడు వెలిగిన వెలుతురులో కార్లో ఇంకెవరూ లేరని జో గ్రహించాడు. ద్వేషంతో, బలంతో జో వేగంగా పరిగెత్తుకెళ్లి తన తలతో అతని వెనె్నముకని వెనక నించి కుమ్మాడు. దాంతో అతను కిందపడ్టాడు. అతని మెడని వెనక నించి చులాగ్గా పిసికాడు. ఆరడుగుల జో అతనికన్నా బలవంతుడు. కాబట్టి ఐదడుగులు అంగుళం పొడవుండే గిల్రాయ్‌ని ఆట్టే సేపు ఎదిరించలేక పోయాడు.
వెంటనే తన వేన్‌ని తెచ్చి అతని శవాన్ని అందులో ఎక్కించుకుని సరాసరి లేక్‌వ్యూ సెమెట్రీకి చేరుకున్నాడు. దాన్ని గోతిలో వేసి పరికరాలతో గోతి బయట ఉన్న మట్టిని లోపల కప్పెట్టాడు. అతని శవం మీద అడుగు మేరకి మట్టి కప్పాక కొలిచాడు. ఇక సరిగ్గా నాలుగు అడుగుల లోతుంది. లేడీ బట్టర్‌ఫీల్డ్‌కి తెలీకపోయినా గిల్రాయ్ ఆవిడ కింద అడుగు దూరంలో ఆవిడకి శాశ్వత సన్నిహితుడు అవుతాడు.
జో సెమెట్రీ గేట్లని మూసి తాళం వేసి బయటకి వచ్చేసరికి దాదాపు నాలుగు అవుతోంది. శవంతోపాటు తన ఐదేళ్ల అవమానాలని కూడా పాతిపెడుతున్నాను అనుకున్నాడు. ఒకవేళ పోలీసులు తనని అనుమానించినా వాళ్లకి శవం దొరకాలి. అది ఎవరూ ఊహించని ప్రదేశంలో తను దాచాడు.
ఓ పోలీస్ పెట్రోల్ వేన్ అతని వేన్ పక్క నించి వెళ్లింది. స్థానిక పోలీసులు అందరికీ జో వేన్ అనేకసార్లు కనిపిస్తూంటుంది. అతను ఎండలో కాక రాత్రుళ్లు సమాధి గోతులని తవ్వుతాడని వారందరికీ తెలుసు. కాబట్టి అతన్ని వాళ్లు ఎప్పుడూ ఆపరు. అలాగే ఆ తెల్లవారుఝామున కూడా జోని వాళ్లు ఆపలేదు.
ఇంటికి వెళ్లాక స్నానం చేసి, ఎప్పటిలా కాఫీ కలుపుకోలేదు. ఇందుకోసం దాచిన క్వార్టర్ స్కాచ్ బాటిల్‌ని తెరిచి రెండు పెగ్‌ల విస్కీని తాగి పడుకున్నాడు.
* * *
టెలీఫోన్ మోగే ధ్వనికి అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. రిసీవర్ అందుకున్నాడు.
‘ఎక్కడ చచ్చావు?’ అతని బాస్ కంఠం కోపంగా వినిపించింది.
‘ఇంట్లోనే ఉన్నా. కునుకు తీస్తున్నాను’ జో కళ్లు నులుముకుంటూ చెప్పాడు.
‘కునుకా? గంట నించి ఎన్నిసార్లు చేశానో తెలుసా?’
‘బట్టర్‌ఫీల్డ్ సమాధి సిద్ధం చేశాను’
‘అనుకున్నాను. గంట క్రితం ఆవిడ లాయర్ ఫోన్ చేసి పాతిపెట్టే సూచనలు తనకి ఆలస్యంగా అందాయని చెప్పాడు. నువ్వు తవ్విన గోతిలో మార్పులు చేయాలి జో’
వెంటనే అతని మత్తు వదిలి కళ్లు విశాలమయ్యాయి.
‘మార్పులా? ఏం మార్పులు?’
‘ఈజిప్షియన్ రాణుల్లా ఆవిడ పరలోకానికి చేరుకున్నాక తనకి అవసరమయ్యే వస్తువులని ఈజిప్ట్ నించి కొని తెచ్చిందిట. వాటన్నిటినీ తన సమాధిలో పాతమని జాబితాని లాయర్‌కి ఇచ్చిందిట. వాటి సంగతి ఇప్పుడే తెలిసిందని, గంట క్రితం ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా ఇంకో గంటలో ఆవిడ శవాన్ని పాతాలి. లేదా అంతా రసాభాస అవుతుంది. చాలామంది అతిథులు వస్తారు. శవపేటిక పైన ఆహార పదార్థాలని ఉంచాలిట.’
‘పైనా?’
‘అవును. అందుకే నీకు అనేకసార్లు ఫోన్ చేశాను. స్ట్ఫ్ చేసిన తొమ్మిది పెంపుడు పిల్లులు శవపేటిక కిందకి వెళ్లాలిట. ఇంకో మూడు అడుగులు ఎక్కువ లోతు తవ్వాలి’
‘సరే. వెంటనే వెళ్లి ఆ ఏర్పాటు చేస్తాను’ జో చెప్పాడు.
‘నువ్వు వెళ్లక్కర్లేదు. నేను ఆ పని చూడమని టోనీని పంపాను. నిన్న రాత్రంతా నువ్వు అలసిపోయావు కాని పడుకో. పది నిమిషాల్లో టోనీ తవ్వడం పూర్తి చేస్తాడు. స్వర్గానికి తొమ్మిది పిల్లులు, ఆహార పదార్థాలు, డ్రస్‌లతో ఆవిడ నిజంగా వెళ్లగలదేనా? పిచ్చికాకపోతే. అదీ సంవత్సరం అంతా నవ్వుకునే అతి పెద్ద జోక్ అవుతుంది’ ఫ్రెడ్ నవ్వు పెద్దగా వినిపించింది.
‘కాదు. దానికన్నా అంతా నవ్వుకునే ఇంకో జోక్ ఉంది. గిల్రాయ్ శవం బయటపడటం’ అంత భయంలో కూడా జోకి ఆ ఆలోచన స్ఫురించింది.
(శామ్ ఎస్ టైలర్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి