S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దిశానిర్దేశం-‘ఆనందవాణి’ పిలుపు!

మా ఇంట్లో; మేం 1963లో వింఛిపేట నుంచి సూర్యారావుపేటకి మారిపోయేదాకా, పనమ్మాయి నైజాం నుంచి ఏ నాడో వచ్చిన బుచ్చమ్మే. మరాఠీ స్టయిల్లో కచ్చబోసి, మోకాళ్ల దాకా మాత్రం వచ్చే గళ్ల చీరలు కట్టుకునేది. మోచేతుల దాకా వున్న జాకెట్లు వేసుకునేది. భాష కానీ - యిష్టానిష్టాలు గానీ ఇంత పిసరు మార్చుకోలేదు. ఆమె కూతురు మా చెల్లి ఈడుదే - యశోద. మాకు ఒక రకంగా బుచ్చమ్మ ‘కేర్‌టేకర్’ అన్న మాట. నన్నూ పెద్ద తమ్ముణ్ణీ తప్ప మిగతా అందర్నీ ‘ఖరోడా’ చేసేది. అల్లరి చేస్తే ‘పిర్ర’ మీద, రెండు పీకేది కూడా. అంత బాధ్యత, అంత చనువు. 1960 జూన్‌లో అనుకుంటాను ఓ సాయంకాలం వేళ, నాలుగింటప్పుడు, ముందు వసారాలో కూర్చొని బియ్యం చేటతో చెరుగుతూ, రాళ్లు ఏరుతున్నది. మా ముందు వసారాకి ప్యాకేజీ చెక్కలతో ‘ఫెన్స్’ వేయించాం. దానే్న ‘జ్యాఫ్రీ గది’ అనేవాళ్లం.
ఓ పెద్ద మనిషి - ఎర్రగా, సన్నగా, పొడుగ్గా, హుందాగా వచ్చాడు. డోర్ నెంబరు కోసం చూస్తూంటే - ‘ఎవరు కావాలయ్యా?’ అన్నది బుచ్చెమ్మ చేట ‘లయ’ను ఆపి.
‘వీరాజీ అనీ... అతను కావాలమ్మా. నేను మద్రాసు నుంచి వస్తున్నాను’
‘వీరాజయ్యా! రుూడ ఆ పేరుగలోళ్లు లేరయ్యా...’ అతని చేత ఓ డజను అరటిపళ్లూ, రెండు ఆపిల్ పండ్ల వుండటం గమనించి కూడా - మళ్లీ చేటందుకుని చెరుగుతోందిట. అంతలో మా అమ్మ లోపలి నుంచి వచ్చింది ‘ఆగు బుచ్చెమ్మా’ అంటూ, ‘నమస్కారమమ్మా! వీరాజీ అని కథలు రాసే...’
అమ్మ ప్రసన్నంగా ‘ఔనండీ. మా పెద్దబ్బాయే... రాండి లోపలికి’ అంటూ బుచ్చెమ్మని వారించి, అదే జాఫ్రీగదిలో మూల మీద వున్న కుర్చీని చూపెట్టింది.
‘ఆనందవాణి కాళిదాసు’గా అందరూ రిఫర్ చేసే ఉప్పులూరి కాళిదాసుగారు - వివరంగా అన్నీ మాట్లాడుతూ ‘నేను, మీ వారూ - అవును తను మద్రాసులోనే వున్నాడు. నాకు తెలుసు. కలిశాను. బాల్య స్నేహితులం మాడమ్’ అన్నాడు.
‘ఆనందవాణి కాళిదాసు వచ్చాడు నీ కోసం, వీరాజీ’ అని చెప్పండి. చాలు. ‘్ఫదర్’ అక్కడే ఉంటున్నాడు కనుక తనని పంపించండి - అదే. మీ వారుంటున్న తంబుచెట్టి స్ట్రీట్ వీధిలో, పనె్నండో నెంబర్ ఇల్లు - ఆనందవాణి అంటూ చెప్పండి’ అన్నారుట. పోతూ, మళ్లీ వెనక్కి వచ్చి ‘ఒక్కమాట చెప్పమ్మా, మీవాడికి.. ఆనందవాణి పిలిచిందీ అంటే ఒక భవిష్యవాణి పిలిచిందీ అనే అర్థం అని చెప్పండి. ఇవాళ కాళిదాసు తలుపు తట్టాడూ (నాక్స్ ద డోర్) అంటే, రేపు పెద్ద పెద్ద పత్రికలు ఏరీ, కోరీ వచ్చి ఆహ్వానిస్తాయ్’ అన్నారుట.
అమ్మకి సంభ్రమాశ్చర్యాలు రెండూ కలిగాయిట. ఆడపిల్లగల తండ్రి ఒకరు ఎవరో వచ్చారనుకుందిట (అమాయకురాలు) తిరిగి అంత పెద్దాయన కాళ్చీడ్చుకుంటూ వెళ్లిపోతూ వుంటే - ‘శాస్ర్తీ’ బాబేనా లేడు, స్టేషన్ దాకా వెళ్లి దింపడానికి’ అనుకుందిట వీధికొసకంటా చూస్తూ...
అంతటి అచ్చెరువుతోనూ, మా బుచ్చెమ్మ ‘కిష్టబాబు పేరెట్టి అడిగారేగాదు మళ్ల. అదేదో వీరాజయ్య పేరు సెప్పిండు... గీడ మా కిష్టబాబు, శాత్తరిబాబూ వున్నారయ్యా’ అని సెప్పినా’ - అని వెండి కడియాల చేతులూపుతూ చెప్పింది.
మహీధర నాకు హైదరాబాదు సభల నుండి తెచ్చిన నా ‘విడీవిడని చిక్కులు, వగైరా రాతప్రతులు తెచ్చుకుని తిరిగి వచ్చిన మాకు కూడా చిన్న ‘షాకు’ తగిలింది. ఆనందవాణి పత్రిక తెల్సు కానీ, కథాంజలి, వినోదిని, ఆంధ్ర మహిళ, గృహలక్ష్మి, స్నేహలత, ఢంకా, జమీన్ రైతు వగైరాలలాగా అది రెగ్యులర్ కాదు.
నేను ‘ఆనందవాణి’కి ఏమీ రాయలేదు. కానీ చిన్నప్పుడే విన్నాను. విశాఖపట్నంలో మా పినతండ్రి (బాబాయి) శివప్రసాదరావుగారు (కన్నబాబు) పెళ్లైంది - మా చిన్నప్పుడు. పెళ్లికి ఆరుద్ర(గారు) వచ్చాడు. శ్రీరంగం రమణయ్యగారనే సైకిల్ షాపు రమణయ్యగారి అమ్మాయి మాకు, ‘చిన్నకక్కి’ (చిన్నపిన్ని) అయ్యింది. ఆరుద్ర మా నాయనమ్మ - పిళ్లా సుబ్బమ్మగారికి కూడా చుట్టం. శ్రీశ్రీ కబురెడితే మద్రాసు చేరుకుని, ఆనందవాణి పత్రికను ఎడిట్ చేశాడుట. కానీ సినిమా పిలుపు (ప్రేమలేఖలు హిందీ సినిమా డబ్బింగ్ ఆఫర్) రాగా, అటు దారి మార్చి వెళ్లిపోయాడుట. ‘ఆరుద్ర’కి ఆరుద్ర పురుగులాగా ఎఱ్ఱగా వుంటాడు అంటూ వాత్సల్యంగా అంటారు మా వాళ్లంతా. గానీ, మా బంధుకోటిలో, చాలా గ్లామరుంది. నాకు కూడా అప్పుడు అతని ‘బాల’ పత్రికలో సీరియల్ తెల్సు. ‘చీమల రాజ్యంలో సీత’ అన్నది నాకు చాలా గుర్తు.
బాగా చిన్నప్పుడు మాకు అమ్మతో వైజాగ్ (విశా’పట్నం అంటారు) ట్రిప్పులు బాగా తగిలేవి. నాన్నగారెప్పుడూ వచ్చేవారు కాదు. ఆరుద్ర వాళ్ల పెంకుటిల్లు చెమిటి జమీందారు తోట - వున్న వీధిలో వుండేది. సమీపంలో గోళీలసందా? అదీ?.. అక్కడ వో వాటాల యింట్లో మా బామ్మ అండ్ అంకుల్స్ వుండేవారు. ఆరుద్ర వాళ్ల నాన్నగారు భాగవతుల నరసింహరావుగారు ‘మా’ ఇంటికి వచ్చి మా మామ్మతో కబుర్లు చెప్పేవారు. ‘ఆయన ఆంధ్రపత్రిక వీక్లీలో ‘వారఫలాలు’ రాసేవారు’ అని, అరవైల్లో మా ‘రాధాకృష్ణ’గారు చెబితే తెల్సింది - కానీ, ఆయన ఓసారి నన్ను పిల్చి ‘నీకో అయిడియా యిస్తారు రారా అబ్బారుూ’ అంటూ యిచ్చిన సలహా జ్ఞాపకం వుంది. గొప్ప సలహా అది. ‘నువ్వు ఏ పాఠమైనా పదిసార్లు చదివి, భట్టీయం వెయ్యి. అది వేస్టు. ఒక్కసారి చూసి రాయి. చాలు అది. చూడకుండా నీకు జ్ఞాపకం వుండిపోతుంది. ఇలా చేసి చూడు’ అని. అద్భుతం.
బైది బై, ‘ఆనందవాణి’ పిలుపు కదా నేను నెమరువేసుకుంటున్నాను - కదూ.
ఈలోగా మద్రాసు (అది చెన్నై కాదప్పుడు) నుంచి నాన్నగారు వచ్చారు. అమ్మా, నేనూ ఈ సంగతులు చెప్పాము. అస్సలు కమ్యూనికేషన్స్ లేని రోజులవి. కానీ, మద్రాసులో నాన్నగారి ఆఫీసు - ఆంధ్రా సిమెంట్స్ వారి రిజిస్టర్డ్ ఆఫీస్ వున్న రూమ్ నెంబర్ 19 బై 337 (19/337) బిల్డింగ్ టాప్ ఫ్లోర్‌లో వుంది. దాన్ని మవుంట్ రోడ్‌లోకి షిఫ్టు చేస్తూ రుూ పందొమ్మిది రూమ్ ఆఫీసుని నాన్నగారికి ‘రెసిడెన్స్’గా వుంచేశారు. అందులో ఫోన్, నాన్నగారి బల్ల, కొన్ని లెడ్జర్స్ వున్న బీరువాలు వగైర వున్నాయి. అదో ప్లస్ పాయింట్ అయింది నాకు. అలాగే ఆనందవాణి కార్యాలయం, అదే రోడ్డు మీద ఎదుటి వరుసలో నెం.12గా ఉంది. సరే, మా బిల్డింగ్‌కి ఎదురే ఆంధ్రపత్రిక...
నేను ఆనందవాణిలో ‘ఎడిటింగ్’తో కాలక్షేపం చేస్తున్నప్పుడు అక్కడో ఫోన్ ఉండేది. కాళిదాసుగారు దొడ్డ మనిషి. ‘తాళం వేసి ఉంచు’ అని ఫోన్ ‘కీ’ ఇచ్చారు నాకు. పగలు అక్కడ ఎక్కువగా వుండేవాణ్ని. ఎందుకంటే, నాన్నగారి ఆఫీసు షిఫ్ట్ అవుతూ, అవుతూ వున్నందువల్ల పగలు ఆయనకు, ఒకరు ఇద్దరు స్ట్ఫాకీ పని వుండేది. రూములో ఆనందవాణి కార్యాలయం వున్న ఫ్లోర్‌లోనే - వరండాలో ఎదురుగా వున్న తలుపు తెరిస్తే, అది - నీలంరాజు వెంకట శేషయ్యగారుండే ఇల్లుట. ఆనందవాణి వర్కర్స్ చెప్పేవారు. అది అట్లుండనిండు -
ఆనందవాణికి వెళ్లాలనే అనుకున్నాను. పై కారణాల వల్ల దినపత్రిక ఎలా తయారవుతుందీ? కొంత తెలిసింది - విశాలాంధ్ర చూశానుగా.. అక్కడొక పద్ధతి ఉంది. క్రమశిక్షణ ఉంది. ఒక ఎడిటోరియల్ రాశారూ అంటే దాన్ని సీనియర్లు అంతా కూర్చుని అర్జెంట్‌గా సమీక్ష చేసేవారు. ఈ పద్ధతి మిగతా చోట్ల లేదేమో? ప్రభ దినపత్రిక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్సు విడరాని జంట కనుక దాని కార్యాలయం గాంధీనగర్‌లోని - న్యూ ఇండియా హోటల్ జంక్షన్‌గా పేర్గాంచిన సెంటర్‌ని - ప్రభ సెంటర్‌గా మార్చేసింది. స్ట్ఫా ధర్నాలు గట్రా జరిగేవి...
చిత్రం ఏమిటీ అంటే ఈ ప్రభ ఆఫీసుకు ముందు, అదే కార్యాలయ భవనంలో ‘జార్జ్‌ఓక్స్’ కంపెనీ వారి మోటారు శకటాల ‘షోరూమ్’ ఉండేది. నేను మా వించిపేట నుంచి నైజాం రైల్వేగేటు ప్రక్కగా నడుచుకుంటూ - రామగోపాల్ చౌల్ట్రీ ‘కమాన్’ క్రింద నుంచి రైలు బ్రిడ్జి దాటి, అవతలి తట్టుకి వచ్చి - అక్కడ మూడణాలు (పందొమ్మిది నయాపైసలు) ఇచ్చి - రుూ గాంధీనగరం ఎర్నేనిమాన్షన్ దాకా రిక్షాలో వచ్చేవాణ్ని. అక్కడ సరిగ్గా అద్దాల కార్ల షోరూమ్ దగ్గర, ఆరో నెంబరు బస్సు ఎక్కేవాణ్ని. ‘ఎస్సారార్’ కాలలేజీ ఒక్కటే అప్పుడు. లయోలా మరి రెండేళ్లకి కాబోలు వచ్చింది.
ఈ షోరూమ్ ఇవాళ (నాలుగు సంవత్సరాల తర్వాత) ఆంధ్రప్రభయింది! అంతలేసి అద్దాల గోడల వెనుక ఎడిటోరియల్ సిబ్బంది కూర్చొని, పని చేసుకోడం బయటకి కనబడేది.
చిత్రం ఏమిటంటే, ఇవాళ అది ఐలాపురం హోటలయ్యింది. విశాలాంధ్ర బిల్డింగ్ కృష్ణా రెసిడెన్సీ హోటలయ్యింది. వార్తాపత్రికల కార్యాలయాలు - కళ్యాణ మండపాలు, హోటల్సూ అవడం డెవలప్‌మెంటేనా?
ఈలోగా, నా మునగచెట్టు నవలకి - తిరుమల రామచంద్రగారు ముందు మాటలు రాశారు. అందులో ఆయన నాకు మంచి ‘కితాబు’ ఇచ్చారు.
‘జీవితపు తొలి మలుపులోనే ‘కనువిప్పు’ (నా నవలల పేర్లు)తో ‘పగా ప్రేమా’ కనుక్కొని రాతిమేడలు కట్టిన వీరాజీ కలానికి - అనుక్షణం ఆకులు రాలుస్తూ చీకాకు కలిగించే మునగచెట్టు తగలకపోవడమే ఆశ్చర్యం!’ అన్నారు. నిజమే! మా వించిపేటలో - సాయిబుల ఇండ్లల్లో చదరంత మేర నేల వున్నా మునగచెట్టు, గోరింటాకు చెట్టూ వేసి తీరుతారు. అంచేత అది నన్నాకర్షించలేదూ అంటే నాదే తప్పు. చివరగా తిరుమల సారు, ముక్తాయింపులో ఇలా అన్నారు.
‘వీరాజీ కల్పనా వౌళికతకూ మనస్తత్వ వివేచనా, వివేకానికీ రుూ చిన్ని నవల చాలునంటే - తక్కిన నవలలు, కథలు, కవితలు తార్కాణాలే! ఇలాంటివి యింకా ఎన్నో ఈయన కలం సృష్టిస్తూ పోతుంది’ ముక్తాయింపు ఇచ్చారు.
అట్లా ఆశీర్వదిస్తూ పాఠకులు ‘వీరాజీ వదనంపై మునగపూగుత్తులు లాంటి ముసిముసి నవ్వులు కంటూ మురిసిపోండి’ అన్నారు. మునగపూల గుత్తులను ఇలా ముసిముసి నవ్వులతో పోల్చడం - మహానుభావుడు, బహుభాషా కోవిదుడూ అయిన, ఆయనకే చెల్లింది. అట్లాగా, నాకు నూతనోత్సాహం, ధైర్యం, జీవితం మీద లాలస పెరిగాయి.
* * *
బెజవాడలో కొన్ని చిత్రవిచిత్ర మధుర స్మృతులకు దారి తీసిన సంఘటనలు జరిగేయి. సినిమాలలో - రింగురింగులు వేసి - ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తూ - గత సంఘటనలూ, సన్నివేశాలనూ ‘మాంటేజ్’ చేస్తూంటారు. అట్లా 1961లో సెప్టెంబర్ నెల, 18వ తేదీనాడు నేను - ‘వర్కింగ్ జర్నలిస్ట్’ అన్న ముద్రతో - ఆంధ్రపత్రిక దినపత్రిక హాలులో అడుగుపెట్టేదాకా - విధి విన్యాసాలు నన్నొక ఆట (‘విడుపు’ అనొచ్చు) ఆడించాయి. ఎందుకంటే ‘అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే’ - అని ఓ సినిమా పాటలో అన్నట్లు -నాకు ‘పత్రికా రచన’ అనే ‘ఆలంబనా’ ఆయుధం దొరికాయి. ఇవాళ జ్ఞాపకాల్ని నెమరువేసుకునేదాకా ‘నీ కష్టాలు నువ్వే వుంచుకో - నీ సంతోషాన్ని పదిమందితో పంచుకో’ అన్న సూత్రాన్ని సాధ్యమయినంత పాటించాను.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com