S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 112 మీరే డిటెక్టివ్

దృఢమైన వ్రతం గల భరతుడు తల్లుల్ని అయోధ్యకి చేర్చిన తర్వాత శోకంలో మునిగి వశిష్ఠుడు, మొదలైన గురువులతో ఇలా చెప్పాడు.
‘నేను ఇప్పుడు బయల్దేరి నంది గ్రామానికి వెళ్తున్నాను. మీ అందరికీ వీడ్కోలు చెప్తున్నాను. రాముడు లేకపోవడం వల్ల కలిగిన దుఃఖాన్ని అంతటినీ అక్కడ సహిస్తాను. దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. అన్న అడవిలో ఉన్నాడు. నేను రాజ్యం చేయడానికి తిరిగి వచ్చే రాముడి కోసం అక్కడ వేచి ఉంటాను. గొప్ప కీర్తిగల అతనే రాజు కదా?’
మహాత్ముడైన భరతుడు పలికిన శుభకరమైన ఆ మాటల్ని విని పురోహితుడైన వశిష్ఠుడు, మంత్రులు అంతా ఇలా చెప్పారు.
‘ఓ భరతా! సోదర ప్రేమతో నువ్వు చెప్పిన ఈ మాటలు మెచ్చదగ్గవి. ఇలాంటివి చెప్పడం నీకే తగింది. బంధువుల మీద ప్రేమ కల, స్థిరమైన సోదర ప్రేమ కల, పెద్దల మార్గాన్ని అనుసరించే నువ్వు చెప్పేది ఎవరు ఒప్పుకోరు?’
తన ఇష్టాన్ని ఒప్పుకుంటూ మంత్రులు చెప్పిన ఆ ప్రియమైన మాటలు విని భరతుడు ‘రథాన్ని సిద్ధం చెయ్యి’ అని సారథిని ఆజ్ఞాపించాడు.
శ్రీమంతుడైన భరతుడు సంతోషంగా తల్లులు అందరికీ నమస్కరించాడు. భరత శతృఘు్నలు ఇద్దరూ చాలా ఆనందిస్తూ వేగంగా రథాన్ని ఎక్కి, మంత్రులు, పురోహితులతో కలిసి బయల్దేరారు. గురువులైన వశిష్ఠులు మొదలైన బ్రాహ్మణులు అంతా నందిగ్రామంవైపు వెళ్లారు. భరతుడు వెళ్లగానే అతను పిలువకపోయినా ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండిన సేన, పౌరులంతా అతని వెనుక వెళ్లారు. సోదరుల మీద అత్యధిక ప్రేమగల ధర్మాత్ముడైన భరతుడు రథం ఎక్కి పాదుకల్ని తల మీద ఉంచుకుని నంది గ్రామానికి త్వరగా చేరాడు. అందులోకి వెళ్లాక రథం దిగి గురువులతో చెప్పాడు.
‘నా అన్న ఈ రాజ్యాన్ని నా వద్ద కొంతకాలంపాటు దాచి, దాని యోగక్షేమాలు నిర్వహించడానికి బంగారంతో అలంకరించబడ్డ ఈ పాదుకల్ని స్వయంగా ఇచ్చాడు.’
తర్వాత భరతుడు పాదుకలని తల మీద ఉంచుకుని, దుఃఖంతో బాధ పడుతూ అందరితో చెప్పాడు.
‘వెంటనే దీనికి గొడుగు పట్టండి. ఇవి మా అన్నగారి పాదుకలు. ఈ పాదుకలే రాజ్యంలో ధర్మాన్ని నిర్వహిస్తాయి. నా మీద ఉన్న ప్రేమతో మా అన్న దీన్ని నా దగ్గర ఉంచాడు. ఆయన వచ్చేంతవరకు దీన్ని నేను పాలిస్తాను. రాముడు రాగానే నేను స్వయంగా ఈ పాదుకలని అతని పాదాలకి తొడిగి, పాదుకలతో కూడిన రామపాదాలని చూస్తాను. ఇప్పుడు ఈ రాజ్యభారం నా మీద ఉంచబడింది. రాముడు వచ్చాక నేను ఆయన్ని కలిసి, ఆయనకి ఈ రాజ్యాన్ని సమర్పించి సేవ చేస్తాను. నాకు అప్పగించిన పవిత్రమైన ఈ పాదుకలని, ఈ రాజ్యాన్ని, అయోధ్యనీ కూడా రాముడికి మళ్లీ సమర్పించి నా పాపాలని కడిగేసుకుంటాను. రాముడు అభిషిక్తుడవగానే ప్రజలంతా చాలా సంతోషిస్తారు. అప్పుడు నాకు రాజ్యం వచ్చిన దానికంటే నాలుగు రెట్లు ఆనందం కీర్తి కలుగుతాయి’
ఆ మాటలు విన్న అశరీరవాణి ‘బాగు బాగు’ అని పలికింది.
మహాకీర్తిశాలైన భరతుడు విచారంతో దీనంగా ఇలా విలపిస్తూ నంది గ్రామంలో నివసిస్తూ మంత్రులతో కలిసి రాజ్యాన్ని చేశాడు. వీరుడు, ప్రభువైన భరతుడు సేనాసమేతుడై ఆ నందిగ్రామంలో నివసించాడు. సోదరుడి మీద ప్రేమ గల భరతుడు రాముడి ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తూ, తన ప్రతిజ్ఞని నిర్వర్తిస్తూ, రాముడి పాదుకలకి అభిషేకం చేసి రాముడి రాకకి ఎదురుచూస్తూ ఆ విధంగా నందిగ్రామంలో నివసించాడు. భరతుడు ఆ పాదుకలకి సమస్త రాజకార్యాలని చెప్తూ, వాటికి స్వయంగా గొడుగు పట్టాడు. శ్రీమంతుడైన భరతుడు అన్నగారి పాదుకలకి రాజ్యాభిషేకం చేసి వాటి కింద ఎల్లప్పుడూ బంటులా ఉండి రాజ్యాన్ని చేశాడు.
ఏ కార్యం వచ్చినా, ఏ కానుకని ఎవరైనా సమర్పించినా భరతుడు ముందుగా వాటిని పాదుకలకి చెప్పి తర్వాత తగిన విధంగా చేసేవాడు. ప్రజలు కూడా భరతుడి పాలన రామరాజ్యంలా ఉందని కీర్తించారు.

(అయోధ్యకాండ 115వ సర్గ)

ఇంటి దగ్గర ఆ రెండు కాండలు చదువుకుని వచ్చిన ఆశే్లష అమ్మమ్మ మీనమ్మ వెంటనే హరిదాసుతో చెప్పింది.
‘ఏమయ్యోయ్. ఇవాళ హరికథలో ఐదు తప్పులు చెప్పావు. ఇలా ఐతే ఎలా?’

మీరా తప్పులని కనుక్కోగలరా?

1.భరతుడు రాముడి పాదుకలని తలపైన ఉంచుకుని రథం ఎక్కాడు. ఈ అతి ముఖ్యమైన విషయం హరిదాసు చెప్పలేదు.
2.వారంతా చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణంగా తూర్పు దిక్కు వైపు తిరిగారు. హరిదాసు దాన్ని దక్షిణ దిక్కు అని తప్పుగా చెప్పాడు.
3.రాముడు పాదుకలని తూర్పు దిక్కు వైపు తిరిగి తొడుక్కున్నాడు. హరిదాసు ఉత్తర దిక్కు అని తప్పుగా చెప్పాడు.
4.భరతుడి సేనలో ఒంటెల ప్రస్తావన వాల్మీకి ఈ కాండలో చేయలేదు. కాని అవి ఉన్నట్లుగా హరిదాసు చెప్పాడు.
5.భరతుడు గంగానదిలో స్నానం చేయలేదు. హరిదాసు ఇది తప్పుగా చెప్పాడు.

*
మీకో ప్రశ్న

నందిగ్రామానికి గల మరో పేరేమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

భారతంలోని శంతనుడికి, రామాయణంలోని రాముడికి గల పోలిక ఏమిటి?
- తన తండ్రి శంతనుడికి పెళ్లి కావడానికి భీష్ముడు తన పెళ్లిని మానేశాడు. తన తమ్ముడికి రాజ్యం రావడానికి రాముడు అడవులకి వెళ్లాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి