S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆహార ఔషధం.. ఆలూ

(గత సంచిక తరువాయ)
జొన్న అన్నంలో 360 కేలరీలు, వండిన వరి అన్నంలో 1528 కేలరీలు, గోధుమ పిండిలో 1419 కేలరీలు ఉండగా, సగటున మనం అన్నంలో తినే ఆలూ దుంపల కూరలో కేవలం 164 కేలరీలే ఉన్నాయి. పిండి పదార్థాలు కూడా వరి, గోధుమ, జొన్నల కన్నా ఆలూ దుంపల్లోనే తక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి ఆలూ దుంపలకన్నా వరి, గోధుమలే ఎక్కువ కేలరీల ఎదుగుదలకు కారణం అవుతున్నాయని అర్థం అవుతోంది. బియ్యం, గోధుమలతో ఆలూ దుంపల్ని కలిపి తిన్నందువలన షుగర్ స్థాయి పెరుగుతోందని మనం గమనిస్తే, ఆలూని ఎలా తినాలనే అంశం మీద ఒక అవగాహన కలుగుతుంది. అందుకని, కేవలం ఆలూ దుంపలతో మాత్రమే వంటకాలు చేసుకో గలిగితే అవి షుగర్‌ని అంతగా పెరగనీయవన్నమాట!
ఆలూదుంపలను సన్నగా తురిమి ఎండించి మర పట్టించి, పిండిని తయారుచేస్తారు. ఈ పిండితో మనకు తోచిన వంటకాలు చేసుకోవచ్చు. కొద్దిగా రాగి లేదా జొన్నరవ్వ కలిపి, ఈ పిండితో ఉప్మా తాలింపు పెట్టుకొన్నా విడిగా తినటానికి రుచిగానే ఉంటుంది. ఆరోగ్యదాయకం కూడా!
ఆలూ పరోటా, ఆలూ చపాతీలు, ఆలూ వడలు, ఆలూ పావ్‌బాజీ, ఆలూ బోండా ల్లాంటి వంటకాలను మనవాళ్లు ఇష్టంగా తింటున్నారు. ఆలూ దుంపలను అధిక ఉష్ణోగ్రత దగ్గర వండటం గానీ వేయించటం గానీ చేసినందు వలన ఎక్రిలమైడ్ అనే విష రసాయనం ఆ వంటకంలో ఏర్పడి అది కేన్సర్ వ్యాధికి దారి తీస్తుంది. సరదాగా సినిమాకు వెళ్లినప్పుడు కొనుక్కొని తినే వంద గ్రాముల ఆలూ దుంపల చిప్సు చాలు కేన్సర్ వ్యాధి రావటానికని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా ఆలూ దుంపల వేపుడు పదార్థాలను అతిగా వాడకుండా ఉండటమే మంచిది. కానె్వంట్ పిల్లల క్యారేజీలు తెరిచి చూడండి. మూడు వంతుల మంది పిల్లల క్యారేజీలలో ఆలూ దుంపల వేపుడు కూరే ఉంటుంది. ఇంతగా పిల్లలకు అన్నంలో ఈ వేపుడు కూరలను పెట్టటం ఎంతవరకూ ఆరోగ్యకరమో ఆలోచించండి. స్కూల్లో క్యాండీబార్లు, ఫైవ్‌స్టార్లూ ఇంకా ఇతర జంక్ ఫుడ్స్ వీటికన్నా ఆలూతో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండిన వంటకాలు పిల్లలకు ఎక్కువ మేలు చేసేవిగా ఉంటాయని అమెరికన్ ఆహార నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు ప్రైవేటు స్కూళ్లలో యాజమాన్యమే సమోసాలు, బజ్జీలు, పునుగులు, హైఫై చాక్లెట్లూ అమ్ముతూ ఉంటే విచిత్రం అనిపిస్తుంది. విధిగా వాటిని కొనుక్కుని తినాలనే వత్తిడి విద్యార్థుల మీద సహజంగా ఉంటుంది. ప్రభుత్వాలకు వీటి మీద నియంత్రణ లేదు.
ఆలూ దుంపలు ఔషధంతో సమానమే! ఔషధాన్ని ఒక మోతాదు ప్రకారం వాడాలి. అతిగా వాడితే మందు వికటిస్తుంది. ఆలూ దుంపలు కూడా వికటిస్తాయి. పరిమితంగా అప్పుడప్పుడూ ఆలూని తినే వారికి ఇనుము, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం జింక్ లాంటివి సమపాళ్లలో శరీరానికి అంది ఎముక పుష్టిని కలిగిస్తాయి. కాల్షియం ఫాస్ఫరస్ ఈ రెండింటి సమన్వయం ఉన్నప్పుడే ఎముక ఆరోగ్యదాయకంగా ఎదుగుతుంది. అతిగా ఫాస్ఫరస్ తింటే ఎముక దెబ్బతింటుంది. అందుకని ఆలూ దుంపల్ని అతిగా తినకూడదు. అలాగని అసలు తినకుండానూ ఉండకూడదు. సమతుల్యత ఉండాలి.
ఆలూ దుంపలు అనగానే మన కళ్లలో షుగర్ వ్యాధి, స్థూలకాయం కనపడుతుంటాయి. అమెరికా ఆహార ప్రణాళికలో ఒక దశలో వారానికి ఒక కప్పు కన్నా ఎక్కువగా ఆలూ దుంపలు తినవద్దని సూచించటం జరిగింది కూడా! కానీ, కేవలం అధిక కేలరీలకు భయపడి దానిలోని ఇతర పోషకాలను కోల్పోవటం కూడా సబబు కాదు కదా అనే పునరాలోచనతో అమెరికా ఆహార ప్రణాళికలో తిరిగి పొటాటోకి ప్రాధాన్యత నిచ్చింది.
ఆలూలోని పొటాషియం వలన బీపీ తగ్గుతుంది. కానీ హార్వర్డ్ మెడికల్ స్కూల్ మసాచూసెట్స్ వారు 2016లో జరిపిన ఒక అధ్యయనంలో వారానికి 5 రోజులు అధిక మోతాదులో ఆలూ తినే వారిలో బీపీ పెరగటాన్ని గమనించినట్టు పేర్కొన్నారు. ఈ పెరుగుదలకు ఆలూయే కారణంగా వారు నిర్ధారించారు. ధూమపానం లాంటి ఇతర దురలవాట్లు, శరీర శ్రమ లేకపోవటం లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ వారు ఈ నిర్ధారణకొచ్చారు. వారానికి ఒకసారి ఆలూ తినే వారిలో బీపీ తక్కువగా ఉండటాన్ని కూడా వీరు పరిగణనలోకి తీసుకున్నారు. ముఖ్యంగా స్ర్తిలలో ఇది ఎక్కువగా గమనించినట్టు ఈ నివేదిక పేర్కొంది. ఆలూ తినటం ఒక రోజు తగ్గించి, బదులుగా పిండి పదార్థాలు తక్కువగా ఉన్న కాకర లాంటి కూరని తినేవారిలో బీపీ, షుగరు కూడా పెరగకుండా ఉన్నాయట. ఇది ఆలూ దుంపల వ్యతిరేక ప్రచారంగా కాక, దాన్ని పరిమితంగా తినటం వలన అటు షుగరు వ్యాధి, ఇటు బీపీ వ్యాధి రెండింటి అదుపునకు సహకరిస్తుంది.
ఆలూ దుంపల్లోని ఆహార పీచు, పొటాషియం, సి విటమిన్, బి6 విటమిన్లు అధికంగా ఉండి, కొవ్వు తక్కువగా ఉన్న ఆహార ద్రవ్యం. గుండెకు మేలు చేసేదిగా ఉంటుంది. ఇందులో కోలీన్ అనే ఒక పోషక పదార్థం ఉంటుంది. ఒక పెద్ద ఆలూ దుంపలో 57 మి.గ్రా. కోలీన్ ఉంటుందని అంచనా! మగవాళ్లకు రోజుకు 550 మి.గ్రా., స్ర్తిలకు 425 మి.గ్రా. కోలీన్ అవసరం అవుతుంది. అంటే సుమారుగా పదవ వంతు కోలీన్ కేవలం ఆలూ ద్వారానే దొరుకుతుందన్న మాట. కండరాలకు మృదుత్వాన్ని సాగే గుణాన్ని ఇది కలిగిస్తుంది. వాపుని తగ్గిస్తుంది. అందువలన ఆలూని కీళ్లవాతం వ్యాధిలో అప్పుడప్పుడూ తినటం అవసరమేనని పరిశోధనలు చెప్తున్నాయి. నరాల పటుత్వానికి, మెదడు పెరుగుదలకు నాడీ స్పందనలు సమర్థవంతంగా జరగటానికి ఆలూ తోడ్పడుతుంది. పిల్లలకు పరీక్షల రోజుల్లో ఆలూ దుంపలు మేలు చేసేవిగా ఉంటాయి.
ఆలూలోని పీచు పదార్థాలు జీర్ణకోశాన్ని బలసంపన్నం చేస్తాయి. అందువలన షుగరు, కొవ్వు వగైరా రక్తంలోకి అతిగా చేరకుండా ఈ పీచు కాపాడుతుంది. కాబట్టి షుగరు పెరుగుదలని కేవలం ఆలూ మీదకే నెట్టడం సరికాదన్నమాట.
వంద గ్రాముల బంగాళా దుంపల్లో 94 కేలరీలున్నాయి. 21.08 గ్రాముల పిండి పదార్థాలు, 2.1 గ్రాముల పీచు, 2.10 గ్రాముల ప్రొటీన్, 10 మి.గ్రా. కాల్షియం, 0.64 మి.గ్రా. ఇనుము, 27 మి.గ్రా. మెగ్నీషియం, 75 మి.గ్రా. ఫాస్ఫరస్, 544 మి.గ్రా. పొటాషియం, 12.6 మి.గ్రా. సి విటమిన్, 0.211 మి.గ్రా బి6 విటమిన్ ఉన్నాయి. కొలస్ట్రాల్ ఒక్క మి.గ్రా. కూడా లేదు. ఇందులో 10 మి.గ్రా. ఉప్పు ఉంది. అందుకని ఆలూ దుంపలతో వంటకాలలో అతిగా ఉప్పు వేయకూడదు. ఆలూ వేపుడు కూరలు, ఆలూచిప్స్ వీటిలో ఉప్పు ఎక్కువగా కలిసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.
ఆలూ దుంపల్ని ఫ్రిజ్‌లో నిల్వబెట్టకూడదు. పొడిగా ఉండే చోట, ఎండ తగలని చోట 2 నెలల వరకూ భద్రపరచుకోవచ్చు. ఆలూని తోలు తీసేయనవసరం లేదు. దానిలో కూడా మంచి పోషకాలున్నాయి. శుభ్రంగా కడిగి తోలుతో సహా వండుకోవడమే మంచిదని అమెరికన్ నిపుణులు చెప్తున్నారు. పుదీనా లేదా కొత్తిమీరతో కూర వండి మిరియాల పొడి చల్లుకుని తింటే ఆలూ కచ్చితంగా మేలుచేసే గొప్ప ఆహార ద్రవ్యం అవుతుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com