S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బయటి తిండితో కిడ్నీ వ్యాధులు

ప్రశ్న: బజార్లో కారప్పూస, బూందీ లాంటి తినుబండారాలు అనేకం దొరుకుతున్నాయి. అవి నీట్‌గా ప్యాక్ చేసి ఉంటాయి కాబట్టి అంటువ్యాధులు రావని, మంచివేనని చెప్తున్నారు. ప్యాకింగ్‌ని చూసి కొనుక్కోవటం సబబేనా? వాటి మంచీ చెడుల గురించి వివరించండి.
-సామంత రాజేశ్వరరావు (సికిందరాబాద్)
జ: బయటి ఆహార పదార్థాలు తినకూడదని చెప్పటానికి మంచి ప్యాకింగ్‌లో లేకపోవటం అనేది ఒక కారణం మాత్రమే! నీటైన ప్యాకింగ్‌లో ధీటైన ఆహార పదార్థం ఉన్నదనుకోవటం భ్రమే! ఆహార పదార్థాలను కమ్మగా, నాణ్యమైననవిగా వండటం ఒక ఎత్తయితే, వాటిని నిల్వ వుంచటం ఇంకొక ఎత్తు. ఒక ఫ్యాక్టరీలో వండి మార్కెట్‌కు తెచ్చిన వంటకం షాపుల షెల్ఫుల్లో కనీసం 3-6 నెలలైనా నిల్వ ఉండాలి. స్టీల్ ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్ లాంటివి వెన్నపూస మొదలైన ఆహార పదార్థాల నిల్వకు తోడ్పడతాయి. కానీ బూందీ లాంటి వంటకాలను ఫ్రిజ్‌లో నిలవబెట్టేందుకు వీలవదు. కాబట్టి విధిగా వాటిలో నిల్వవుంచే ప్రిజర్వేటివ్ రసాయనాలు కలిపి తీరాల్సి ఉంటుంది. ఈ నిల్వ రసాయనాలు మన ఆరోగ్యానికి ఎలాంటి చెరుపు చేస్తాయనే విషయం మీద మనకు అవగాహన తక్కువ. తరచూ ఇలాంటి బజారు ఉత్పత్తుల్ని తినేవాళ్లు రోజు మొత్తం మీద అనుమతించిన దానికన్నా ఎక్కువ నిల్వ రసాయనాలను తినటం జరుగుతుంది. అవి చివరికి కిడ్నీలు, లివరు, గుండె మొదలైన అవయవాలు దెబ్బతినే వరకూ తీసుకు వెడతాయి. అందుకని సాధ్యమైనంత వరకూ బజారు వంటకాలను వదిలిపెట్టటమే శ్రేయస్కరం.
జంతు మాంసంలోనూ, కోలా లాంటి కూల్‌డ్రింక్స్‌లోనూ, ప్యాక్ చేసి అమ్మే మాంసాహార వంటకాల్లోనూ జీవపరమైన ఫాస్ఫేట్ Inorganic Phosphate ఎక్కువగా ఉంటుంధి. ఇది పరిమితి దాటి కడుపులోకి వెడితే, అనేక రకాలుగా మనిషిని దెబ్బ తీస్తుంది. బైట ఆహార పదార్థాలు ఎక్కువగా తినే వారిలో ఫాస్ఫేట్స్ పెరగటం వలన శరీరాన్ని వ్యాయామం చేయనీయకుండా సోమరితనం, అనుత్సాహం, ఏ పనీ చేయబుద్ధి కాకపోవటం లాంటి లక్షణాలు ఏర్పడతాయని డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ వారు చేసిన తాజా అధ్యయనంలో తేలింది.
అమెరికన్లలో 30% మనుషులు కూడా ఎయిరోబిక్ వ్యాయామం చేయట్లేదట.. ప్రతీ ముగ్గురిలో ఒక్కరు మాత్రమే చేస్తున్నారు. అమెరికన్లలో ఈ సెడెంటరీ ప్రవృత్తి ఎక్కువగా ఉండటానికి కారణం వాళ్లు మాంసం, సోడా, మార్కెట్లో అమ్మే రెడీమేడ్ ఆహార పదార్థాలు ఎక్కువగా తినే అలవాటు కలిగి ఉండటం అని పరిశోధకులు చెప్తున్నారు. ఈ పదార్థాలలో ఉండే ఫాస్ఫేట్స్ వలన ఇలా జరుగుతోందని చెప్తున్నారు. ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ సోమరితనానికి కారణం అవుతాయని దీని సారాంశం.
ఫాస్ఫేట్స్ అనేవి ఫాస్ఫరస్ (్భస్వరానికి) సంబంధించిన పదార్థాలు. ఎముక పుష్టికీ, దంత పుష్టికీ ఈ భాస్వర కణాలు తోడ్పడతాయి. కండరాల సంకోచ వ్యాకోచాలకు ఇవి సహకరిస్తాయి. నరాల పటుత్వానికి కారణం అవుతాయి. అవి శరీరంలో మితిమీరి పెరిగినప్పుడు ప్రాణాంతకం అవుతాయి. డా.వాన్‌‘పెన్‌వోంగ్’ పటనాసిస్ అనే ఆచార్యుడి నాయకత్వంలో జరిగిన అధ్యయనం ద్వారా ఈ ఫాస్ఫేట్స్ అతిగా పెరిగితే కలిగే అనేక అనర్థాల గురించి వెలుగులోకి తెచ్చారు.
రక్తంలో ఎంత ఫాస్ఫేట్స్ ఉండాలో అంతే ఉంచి తక్కిన దాన్ని వడగట్టి మూత్రం ద్వారా విసర్జించే బాధ్యత మూత్రపిండాలకుంది. కానీ ఫాస్ఫేట్స్ శాతం మరీ ఎక్కువగా రక్తంలో చేరినప్పుడు మూత్రపిండాలు అధిక శ్రమకు గురౌతాయి. క్రమేణా పని భారంతో కిడ్నీలు కూడా బలహీనం కావడం మొదలౌతుంది. ఫాస్ఫేట్స్ ఆ విధంగా ఆరోగ్య హానికి కారణం అవుతాయి. గుండెను కూడా బలహీనపరుస్తాయి.
రెడీమేడ్ ఆహార పదార్థాల్లోనూ, కూల్‌డ్రింకుల్లోనూ, బేకరీ ఉత్పత్తుల్లోనూ, మాంసాహార పదార్థాల్లోనూ అవి ఎక్కువ కాలం నిల్వ వుండటానికి, వాటి సువాసన చెడకుండా ఫాస్ఫేట్సుని కలుపుతుంటారు. ఒక విధం గా ఇది ఆహార పదార్థాల్లో కల్తీ కిందకే వస్తుంది. కృత్రిమ ఆహార పదార్థాలను మోజు కొద్దీ తినటం వలన చేజేతులా కిడ్నీలను మనమే బలి చేసుకుంటున్నాం. సాధ్యమైనంత వరకూ బజార్లో ఆహార పదార్థాల్ని ముఖ్యంగా ప్యాక్ చేసి అమ్మే వాటిని కొనకండి. వడియాలూ, అప్పడాల్లాంటి సామాన్యమైన ఆహార పదార్థాలను ఇంట్లోనే తయారుచేసుకోవటానికి ప్రయత్నించండి. టీవీల్లో ప్రకటనలు చూసి కొనే అలవాటు ఎప్పటికైనా కీడు చేసేదే అవుతంది.
డా.వాన్ ‘పెన్‌వోంగ్’ పటనాసిన్ చేసిన పరిశీలన ప్రకారం 25% అమెరికన్లు ముఖ్యంగా వయోజనులు అవసరానికి మించి 3-4 రెట్లు అధికంగా ఫాస్ఫేట్స్ కలిగిన ఆహారం తీసుకుంటున్నారని తేలింది. 12 వారాలు అంటే 3 నెలల పాటు ఈ విధమైన అధిక ఫాస్ఫేట్స్ కలిగిన ఆహారం తీసుకుంటే కిడ్నీలు, గుండె, పేగులకు ముప్పు తప్పకుండా మూడుతుందని ఈ శాస్తవ్రేత్త హెచ్చరిస్తున్నారు.
అధికంగా ఫాస్ఫేట్స్ తీసుకున్నందు వలన శరీరంలో సోమరితనం (sedentarism) పెరుగుతుందనేది ఈ శాస్తవ్రేత్తలు చేసి కనుగొన్న రెండవ వైద్య రహస్యం. రంగుల కోసం, అదనపు రుచి కోసం, కమ్మని సువాసన నిల్వ వుండేందుకోసం ఫాస్ఫేట్స్ ఎంత మోతాదులో కలిపారో దాని లేబిల్ మీద కచ్చితంగా ముద్రించకపోవటం వలన వినియోగదారుడు వివిధ ఆహార పదార్థాల ద్వారా తాను రోజు మొత్తం మీద ఎంత ఫాస్ఫేట్స్ తీసుకుంటున్నారో అంచనా లేకుండా పోతోంది. మన దేశంలో లేబుళ్ల మీద వ్రాసిన సమాచారం అంత నమ్మదగినది కాకపోవచ్చు కూడా!
అతిగా ఫాస్ఫేట్స్ రకంలో చేరుకున్నందు వలన కలిగే పరిస్థితిని హైపర్ ఫాస్ఫేటీమియా అంటారు. మూత్రపిండాలు దెబ్బ తినటం, షుగరు వ్యాధి లక్షణాలు ఎంతకీ అదుపులోకి రాకపోవటం ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. శరీరంలో ఫాస్ఫరస్, కాల్షియం ఈ రెండింటి సమతుల్యతను కాపాడవలసిన బాధ్యత కిడ్నీలదే! ఫాస్ఫరస్ విపరీతంగా పెరిగినందువలన కిడ్నీలు చెడి, ఈ సమతుల్యత దెబ్బతింటుంది. దాని ఫలితంగా కాల్షియం లోపం ఏర్పడి కీళ్లవాతం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఎదిగే పిల్లల్లో ఈ పరిస్థితి త్వరగా ప్రాణాపాయ స్థితి కలగవచ్చు కూడా! పిల్లల్లో ఎముక పుష్టి తగ్గిపోవటం వలన వారిలో ఎదుగుదల తగ్గిపోతుంది. దానికి మూత్రపిండాల సమస్య తోడైతే దానిని రీనల్ రికెట్స్ అనే వ్యాధిగా చెప్తారు.
కాల్షియం వివిధ శరీర ధాతువుల్లో పేరుకుపోయి, రక్తనాళాలను మూసేయటం లాంటివి కూడా జరగవచ్చు. దీన్ని వాస్కులార్ కాల్సిఫికేషన్ అంటారు. దీని వలన గుండెకు అందవలసినంత రక్తం అందకుండా పోయి, చివరికి ప్రాణాపాయ స్థితికి తీసుకు వెడుతుంది. చర్మం గరుకుబారటం, దురదలు, కళ్లలో ఎరుపు, కళ్ల మంటలు ఉన్న వ్యక్తులు తమ రక్తంలో ఫాస్ఫేట్స్, కాల్షియం ఎంతెంత ఉన్నాయో పరీక్ష చేయించుకోవటం మంచిది. ఫాస్ఫేట్స్ పెరిగి, కాల్షియం తగ్గినా ముప్పే!
ఫాస్ఫేట్స్ పెరిగిన వ్యక్తుల్లో షుగరు వ్యాధి అదుపు తప్పే ప్రమాదం ఉంది. శరీరంలో ఇన్సులిన్ బాగా తగ్గిపోతే, కీటోన్లనే విష కణాలు పెరుగుతాయి. షుగరు వ్యాధి వలన ప్రాణాపాయం కలగటానికి ఫాస్ఫేట్స్ పెరగటం కారణం అవుతోంది.
నిజానికి మన శరీరానికి కావలసిన దానికన్నా ఎక్కువ ఫాస్ఫేట్స్ మన ఆహారం ద్వారా మనకు అందుతున్నాయి. రోజుకు 250 మి.గ్రా. కన్నా ఎక్కువ ఫాస్ఫేట్స్ తీసుకుంటే ఈ అపకార లక్షణాలన్నీ కలుగుతాయి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com